అష్టమ స్కంధము – గజేంద్రమోక్షం
గజేంద్రమోక్షం సన్నివేశం చాలా ఆశ్చర్యకరమైన ఘట్టం. ‘గజ’ అనే అక్షరములను కొంచెం అటూ ఇటూ మారిస్తే ‘జగ’ అవుతుంది. ‘జ’ అంటే ‘జాయతే’. ‘గ’ అంటే ‘గచ్ఛతే’. ‘జాయతే’ అంటే వెళ్ళిపోవడం. ‘గచ్ఛతే’ అంటే రావడం. వచ్చి వెళ్ళిపోయేది ఏది ఉన్నదో దానిని ‘జగము’ అంటారు. శాశ్వతంగా ఉండిపోయేది ఉండదు. అలా ఏదయినా ఉండిపోయేది ఉన్నట్లయితే దానిని ఈశ్వరుడు అని పిలుస్తాము. ఈ జగము కథ ఇప్పుడు గజముగా చెప్పాలి. అదే గజేంద్రమోక్షంలో ఉన్న రహస్యం.
గజముగా ఎందుకు చెప్పాలి? అంటే ఈ ప్రపంచంలో ఏనుగు ఒక్కదానికి మాత్రమే ఒక బలహీనత ఉంది. భూమినుండి చాలా తక్కువ ఎటు మాత్రమే ఎగరగలిగిన ప్రాణి ఏనుగు ఒక్కటే. ఏనుగు పైకి ఎగరలేక పోవడానికి దాని శరీరబరువే దానికి అడ్డు వస్తుంది. మనిషి ఈశ్వరుడి వైపుకి ఊర్ధ్వ గతికి ఎందుకు నడవలేడు? అతని సంసారమే అతనికి బరువై ఉంటుంది. మగ్నత పెంచుకుంటున్న కొద్దీ సంసారం బరువైపోతూ ఉంటుంది. నిజమునకు అది ఏనుగు కథా లేక మన కథా? నిజంగా మీరు ఏనుగు కథగా విన్నా కూడా గజేంద్రమోక్ష కథను వింటే విశేషమయిన శుభ ఫలితం కలుగుతుందని ఆఖరున ఫలశ్రుతిలో చెప్తారు. నిత్య పారాయణము చేయవలసినది అని నిర్ణయింపబడిన కథ గజేంద్రమోక్ష కథ. అలాంటి గజేంద్రమోక్షం జీవితంలో ఒక్కసారి విన్నా చాలు. వారికి అపారమయిన ఫలితం కలుగుతుంది. సాధారణంగా ఫలశ్రుతిని ఎవరు గ్రంథమును రచించారో వారు చెబుతారు. గజేంద్రమోక్ష సన్నివేశంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఫలశ్రుతిని చెప్పారు. ఈ గజేంద్రమోక్ష కథా శ్రవణము ఒక పూజకాదు, ఒక కర్మ కాదు.
పరీక్షిత్తుతో శుకుడు ఏమన్నాడంటే ‘ఒకానొక మన్వంతరంలో శ్రీహరి ఒక ఏనుగును ఒక మొసలి పట్టుకుంటే ఆ ఏనుగు ప్రార్థన చేస్తే ఆయన వైకుంఠము నుండి కదలివచ్చి రక్షించాడు’ అని తరువాతది చెప్పబోతున్నారు. అప్పుడు పరీక్షిత్తు ‘స్వామీ, ఏమిటా కథ? అంత విచిత్రంగా చెప్పారు” అన్నాడు. అపుడు శుకబ్రహ్మ పరీక్షిత్తు ఆర్తికి సంతోషించి గజేంద్రమోక్ష కథను చెప్పడం ప్రారంభించారు.
ఒకానొకప్పుడు క్షీరసాగరం ఉన్నది. అందు త్రికూటాచలం అనే పెద్ద పర్వతం ఉంది. ఆ పర్వతమును మూడు శిఖరములు ఉన్నాయి. ఒక శిఖరము బంగారముతోను, మరొక శిఖరము వెండితోను, మూడవది ఇనుముతోను చేయబడ్డాయి. అందు ఎన్నో రకముల వృక్షములు, తీగలు పెరుగుతూ ఉండేవి. ఈ పరిసరములలో ఎన్నో రకములయిన జంతువులు ఉండేవి. ఏనుగులు పెద్ద పెద్ద మందలుగా వెళ్ళిపోతూ ఉండేవి. ఆ ఏనుగులు బయటకు వస్తే అరణ్యంలో ఒక్క పులి మిగలదట. చామరీ మృగములు ఏనుగుల గుంపు చుట్టూ నిలబడి వాటి తోకలనే చామరములతో ఏనుగులకు విసిరేవి. ఆ ఏనుగులు ఎంత గొప్ప సేవలు అందుకున్నాయో చూడండి. అటువంటి ఏనుగులకు అధినాయకుడు ఒకాయన ఉండేవాడు. నాయకత్వం వహించే ఏనుగు కొన్ని ఏనుగులతో కలిసి దారి తప్పాడు. ఆ ఏనుగు ఆ మందకు రాజు. దానికి గల భార్యల సంఖ్య పదిలక్షల కోట్లు. జీవుడు ఒక్కడే కానీ ఎన్ని శరీరములో. ఈ పరివారంతో తిరుగుతున్నాడు. సంసారంలోకి ఎందుకు వచ్చాడో మరిచిపోయాడు. చాలా దూరం తిరిగాడు. నీటికోసం చాలా చోట్ల వెతికాడు. చిట్టచివరకు ఒక సరోవరం కనపడింది. అద్భుతమైన సరోవరం – అదే సంసారం. దీని ఒడ్డున వుంది నీరు త్రాగాలి. ఎందుకు అక్కడికి వచ్చాడో గుర్తు పెట్టుకోవాలి. కానీ ఈయన పొంగిపోయి అబ్బ! ఈ సరోవరం ఎంత బాగుందో అనుకుని తన భార్యలతో అ నీళ్ళలోకి దిగాడు. మిగిలిన పరివారం అంతా నీళ్ళలోకి దిగింది. ఇప్పుడు ఆయనకు ఒక కోరిక పుట్టింది. తానెంత మొనగాడో తన భార్యలందరికీ చూపించాలనుకున్నాడు.
తాగడానికి వెళ్ళినవాడు నీళ్ళు తాగడం మానివేసి గట్టిగా పాదములను ఊన్చుకుని నిలబడిన వాడై విపరీతమయిన శక్తితో తొండం నిండా నీళ్ళు లాగాడు. ఆ నీటివేగంతో లోపలి చేపలు వెళ్ళిపోయాయి. మొసళ్ళు వెళ్ళిపోయాయి. ఎండ్రకాయలు వెళ్ళిపోయాయి. ఒకసారి భార్యల వంక చూశాడు. నీటిని తొండంలో నిలబెట్టాడు. ఇప్పుడు ఊన్చుకుని తొండమును పైకెత్తి ఆ నీళ్ళను ఆకాశం మీదకి విసిరాడు. ఇలా పైకి చిమ్మేసరికి లోపల ఉన్న గాలి శక్తితోటి తొండంలో వున్న చేపలన్నీ వెళ్ళిపోయి మీనరాశిలో పడిపోయాయి. అందులో ఉన్న ఎండ్రకాయలన్నీ కర్కాటక రాశిలో పడిపోయాయి. మొసళ్ళు అన్నీ మకరరాశిలో పడిపోయాయి. అలా మూడు రాశులలో పడేటట్లు కొట్టాడు. ఇది చూసి ఆకాశంలో తిరుగుతున్న దేవతలు ఆశ్చర్యపోయారు.
గజేంద్రుడు అలా చేసేసరికి దీనిని చూసి ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు చాలా సంతోషపడిపోయారు. అందరూ సరోవరంలో దిగి నీళ్ళు తాగేస్తున్నారు, చిమ్మేస్తున్నారు, తొండంతో కొట్టేస్తున్నారు. కనపడిన చిన్న మొసళ్ళను తొక్కి చంపేస్తున్నారు. పావుగంట అయేసరికి నీరు బురద అయిపోయి అంతా కల్మషం అయిపొయింది. ఇంత అల్లరి చేస్తుంటే, ఇన్ని ప్రాణులు చచ్చిపోతుంటే ఒకరు చూశారు. గ్రహణంలో సూర్యుడిని పట్టినట్లు ఆ నీటిలో ఉన్న పెద్ద మొసలి చూసింది. ఈ ఏనుగులు చాలా అల్లరి చేస్తున్నాయి. ఈ అల్లరికి ఈ నాయక ఏనుగే ప్రధాన కారణము. దీనిని పట్టుకోవాలి అనుకుని తలపైకెత్తి చూసింది. భుగ భుగమనే చప్పుళ్ళతో పెద్ద పెద్ద బుడగలను పుట్టించి నీటిని జిమ్మీ తోక కొట్టి దూరం నుంచి చూసి నీటిలో మునిగి ఏనుగుకాలు ఎక్కడ ఉంటుందో పట్టేసుకుంది. మొసలి నీటి అడుగునుంచి పట్టుకోవడం అంటే సంసారం ఇంద్రియములు పట్టుకోవడం ఒక లక్షణం. కాలము నడిచి వెళ్ళిపోతుంటుంది. కాలాంతర్గతంగా మృత్యువు వస్తుంది. కాబట్టి మృత్యువు కాలును పట్టింది. ఇహ కదలడు. పట్టు విడిపించుకుందామని చూస్తోంది. ఇపుడు మిగిలిన కోరికలన్నింటినీ పక్కన పెట్టేసినట్లయితే ఏనుగుకి వున్న కోరిక ఒక్కటే. ఆ మొసలి పట్టు తప్పించుకుని గట్టు ఎక్కేద్దామని ఏనుగు చూస్తోంది. ఏనుగు గట్టెక్కకుండా నీళ్ళలోకి లాగేద్దామని మొసలి చూస్తోంది. ఇప్పడు గజరాజుతో కూడివున్న మిగిలిన పరివారం ఏమి చేస్తున్నారు?
మకరితోడ బోరు మాతంగ విభుని నొక్కరుని దించి పోవ గాళ్ళు రాక
కోరి చూచుచుండె గుంజరీ యూధంబు మగలు దగులు గారే మగువలకును!!
ఈ పద్యం ఒక్కటి రోజూ స్మరణ చేసుకుంటే చాలు. వైరాగ్యం వస్తుంది. ఆయన మాతంగ విభుడు. గొప్ప ఏనుగు. ఈయన నీళ్ళల్లో యుద్ధం మొదలు పెట్టినప్పుడు ఒడ్డున చాలామంది ఉన్నారు. కానీ వీళ్ళందరూ రాజుగారు యుద్ధంలో నెగ్గి బయటకు వచ్చేస్తాడని గట్టుమీద వుండి చూస్తున్నారు. గజేంద్రుడు అలా ఎంతకాలం యుద్ధం చేశాడంటే వెయ్యేళ్ళు యుద్ధం చేసింది. అలా పట్టుకున్న మొసలి పట్టు తప్పుకోలేక అప్పుడు ఏనుగు అనుకుంటుంది “అయ్యో! భూమేమీద ఉంటే నాకు బలం. నిష్కారణంగా నీళ్ళలోకి ప్రవేశించాను. ఈ నీళ్ళలోకి ప్రవేశించిన తరువాత ‘నావారు’ అనుకున్న వారు వెళ్ళిపోయారు. ఒక్కడినే సరోవరంలో నిలబడిపోయాను. ఇప్పుడ నన్ను రక్షించే వారు ఎవరు?’ అని ఆ ఏనుగు అనుకుంటూ ఉండగా ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఇంతకూ పూర్వం అతడు చేసిన పుణ్యం పూజ వలన ఆ స్థితిలో జ్ఞాపకమునకు వచ్చింది.
పూర్వ జన్మలలో చేసుకున్న పుణ్యముల వల్ల ఈనాడు స్మ్రుతిలోకి వచ్చిన జ్ఞానము నొకదానిని ఏనుగు ప్రకటన చేస్తోంది.
ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై;
యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం
బెవ్వఁ; డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు; సర్వముఁ దానయైనవాఁ
డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్!!
ఎవరు సృష్టికర్తో, ఎవరు స్థితి కార్తో, ఎవరు ప్రళయ కర్తో, లోకములన్నిటిని ఎవరు సృష్టించారో, ఎవరు యందు లోకములు ఉన్నాయో. లోకములు ఎవరియందు పెరుగుతున్నాయో, లోకములు ఎవరి యందు లయము అయిపోతున్నాయో. ఎవరు అంతటా నిండి నిబిడీ కృతమై ఉన్నాడో, ఎవరి మాయ చేత ఇది జగత్తుగా కనపడుతున్నదో అటువంటి వాడు నన్ను రక్షించుగాక!’ అని స్తోత్రం చేస్తోంది. ఏనుగు చేసిన ప్రార్థనకు ముప్పది మూడుకోట్ల దేవతలు లేచి నిలబడ్డారు.
లోకంబులు లోకేశులు
లోకస్థులుఁ దెగినఁ తుది నలోకం బగు పెం
జీకఁటి కవ్వల నెవ్వఁడు –
నేకాకృతి వెలుఁగు నతని నే సేవింతున్!!
లోకములు, దీనిని పరిపాలిస్తున్నామని అనుకుంటున్న రాజులు, దేవతలు, ఈ లోకంలో ఉన్నామని అనుకున్న వాళ్ళు, ప్రళయం వచ్చి ఇవన్నీ ఒక్కటై పోయి నీరై పోయి ముద్దయి పోయి, గాడాంధకారం కమ్మేస్తే ఈ గాడాంధకారమునకు అవతల తానొక్కడే పరంజ్యోతి స్వరూపమై వెలిగిపోతున్నాడు.
ఎటువంటి మహాపురుషుడయిన వాడు, తానొక్కడే వుంది అనేకులుగా కనపడుతున్న వాడెవడో అలాంటి వాడిని ఎవరూ స్తుతి చెయ్యలేరో, ఆయన చేసే పనులను ఎవరు గుర్తుపట్టలేరో ఎవారూ చెప్పలేదో అటువంటి వాడు నన్ను రక్షించుగాక!” దేవతలు ఎవరి మటుకు వాళ్ళు ఏనుగు తమను ప్రార్థించడం లేదని కూర్చున్నారు. దేవతలు అలా కూర్చోవడంలో ఒక రహస్యం కూడా ఉన్నది. ఇప్పుడు ఏనుగు అడుగుతున్నది రక్షణ. మొసలిని చంపి రక్షించాలి. అంటే రక్షణ చేసేవాడు స్థితికారుడై ఉండాలి. స్థితికారుడు శ్రీమహావిష్ణువు. కాబట్టి అందులో రక్షణ అంతర్లీనంగా ఉంది. కాబట్టి అందరూ దేవతలు ఎవరి మానాన వాళ్ళు కూర్చున్నారు. ఏనుగు ఎంత స్తోత్రం చేసినా మరి భగవంతుడు ఎందుకు రాలేదు? ఏనుగు ఇన్నీ చెప్పి చివర ఒకమాట అంది
కలడందురు దీనులయెడ గలడందురు పరమయోగి గణముల పాలం
గలడందు రన్ని దిశలను గలడు కలండనెడి వాడు గలడో లేడో!
ఇంతా చెప్తోంది కానీ దానికో అనుమానం. నిజంగా దీనులయిన వారు పిలిస్తే వస్తాడా? అంతటా ఉన్నాడు అని అంటారు. కానీ అలా ఉన్నాడని చెప్పబడుతున్న వాడు కలదు కలండనెడివాడు కలడో లేడో! అంది. ఆ ఏనుగుకి ఇంత అనుమానం ఉన్నప్పుడు తానెందుకు రావడం అని పరమాత్మ ఊరుకున్నాడు.
లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యెఁ బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను మూర్చ వచ్చెఁ దనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్
నీవే తప్ప నితఃపరం బెఱుఁగ మన్నింపందగున్ దీనునిన్
రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా!!
నీవు తప్ప నాకిప్పుడు దిక్కులేదు. నేను దీనుడిని. నా తప్పులన్నీ క్షమించు ఈశ్వరా! వరములను ఇచ్చేవాడా నీవు రావాలి. వచ్చి ఓ భద్రాత్మకుడా నన్ను రక్షించు అని పిలిచి స్పష్టమయిన శరణాగతి చేసింది. ఏనుగు శ్రీమన్నారాయణుని ప్రార్థన చేస్తున్న సమయంలో పరమాత్మ తనను తాను మరిచిపోయి రావాలని ప్రార్థించింది. వైకుంఠము నుండి రావాలి.