శ్రీరామ చరిత్ర
నవమస్కంధములో ఒక గమ్మత్తు చేశారు. నవమి నాడు రామచంద్రమూర్తి పుట్టారు. దశమ స్కంధమును ప్రారంభం చేసేముందు నవమ స్కందములో రామాయణమును చెప్పారు. నవమ స్కందములో రామచంద్ర ప్రభువు సంకీర్తనము విశేషంగా చేయబడింది. ఇక్ష్వాకు వంశములో జన్మించిన దశరథ మహారాజు గారికి సంతానం లేకపోతే పుత్రకామేష్టి చేస్తే, సంతానం కలగడానికి ప్రతిబంధకమయిన పాపము పరిహరింప బడి, యజ్ఞపురుషుని అనుగ్రహము చేత లభించిన పాయస పాత్రలోని పాయసమును తన ముగ్గురు ధర్మపత్నులయిన కౌసల్య, సుమిత్ర, కైకేయిలకు పంచి యిస్తే పుట్టిన రామలక్ష్మణభరత శత్రుఘ్నుల నలుగురు కుమారుల యందు మహాధర్మాత్ముడయిన రామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలనం కోసమని, తాను వివాహం చేసుకున్న సీతమ్మతో కలిసి తండ్రిని సత్య వాక్యమునందు ప్రతిష్ఠితుని చేయడం కోసం, పద్నాలుగు సంవత్సరములు అరణ్య వాసమునకు బయలుదేరి వెళ్ళి అక్కడ శూర్పణఖ ముక్కు చెవులు కోసి మారీచాది రాక్షసుల పీచమడచి, అక్కసుతో రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరిస్తే ఆ తరువాత అరణ్యకాండలో కబంధ వధ జరిగిన తరువాత సుగ్రీవుని జాడ తెలుసుకుని, సుగ్రీవునితో మైత్రి చేసి, వాలిని సంహరించి, హనుమ సహాయంచే నూరు యోజనముల సముద్రమునకు ఆవల దక్షిణ దిక్కున వున్న లంకా పట్టణంలో రావణాసురుని ప్రమదావనంలో బంధింపబడిన సీతమ్మజాడ హనుమ ద్వారా తెలుసుకుని, సముద్రమునకు సేతువు కట్టి, ఆవలి ఒడ్డుకు చేరి, రావణ కుంభకర్ణాది రాక్షసులను తెగటార్చి, తిరిగి సీతమ్మను తాను పొంది పదకొండు వేళా సంవత్సరములు రామచంద్రమూర్తి రాజ్య పరిపాలన చేసి, రామరాజ్యము అని పేరుతెచ్చి, ఎన్నో ఆశ్వమేధములు, వాజపేయములు, పౌండరీకములు మొదలయిన యాగములు చేసి, మనిషి ఎలా ప్రవర్తించాలి అనే దానికి ఒక అద్భుతమయిన కొలమానమును ఏర్పాటు చేసిన విశేషమయిన అవతారము రామావతారము.
ఆ రామచంద్రమూర్తి అనుగ్రహమే పోతనగారియందు ప్రసరించి భాగవతమును ఆంధ్రీకరించుటకు తోడ్పడినది. రాముడు కృష్ణుడు అని యిద్దరు లేరు కనుక ఆ రాముడే కృష్ణకథ చెప్పించాడు.
దశమ స్కంధము – పూర్వ భాగము – శ్రీకృష్ణ జననం
భాగవతంలో దశమ స్కంధము ఆయువుపట్టు లాంటిది. ఈ దశమ స్కంధము జీవితంలో తప్పకుండా విని తీరాలి. ఇందులో వ్యాస భగవానుడు కృష్ణ భగవానుని లీలలను విశేషమయిన వర్ణన చేశారు. పోతనగారు దానిని ఆంధ్రీకరించి మనకి ఉపకారం చేశారు. దశమ స్కంధమును ప్రారంభం చేస్తూ ఒకమాట చెప్తారు. పూర్వకాలంలో భూమి గోరూపమును స్వీకరించి బ్రహ్మగారి వద్దకు వెళ్ళి ఏడ్చింది. ‘మహానుభావా! భూలోకంలో ఎందఱో రాజులు భూమి పతులమని పేరు పెట్టుకొని పరమ దుర్మార్గమయిన పరిపాలన చేస్తూ ధర్మమును తప్పి ప్రవర్తిస్తున్నారు. ఎంతోమంది అధర్మాత్ములు ఈవేళ భూమిమీద తిరుగుతున్నారు. వారి భారం నాకు ఎలా తగ్గుతుంది? అటువంటి వారి మదమణచి భూమి భారమును తగ్గించవలసినది’ అని ప్రార్థించింది. భూభారము అనేది తక్కెట్లో పెట్టి తూచే కొలత కాదు. ఎంతమంది బిడ్డలు పుట్టినా తల్లికి ఎప్పుడూ బరువు కానట్లే, ఎన్ని ప్రాణులు వున్నా, భూమికి ఎప్పుడూ బరువు కాదు. కాని ధర్మమూ తప్పి ప్రవర్తించే మనుష్యులను చూసి భూమి భారమని బాధపడుతుంది. అన్నిటిని సృష్టి చేసినది బ్రహ్మగారే కదా! అందుకని బ్రహ్మగారిని అడిగింది. ‘భారము తగ్గించడం, ఉన్నది నిలబెట్టడం స్థితికారకుడయిన శ్రీమహావుష్ణువు అనుగ్రహం కాబట్టి నీవయినా నేనయినా ఆయనను ప్రార్థన చేయాలి’ అని ఆనాడు బ్రహ్మగారు ధ్యాన మగ్నుడై పురుషసూక్తంతో స్వామి వారిని ఉపాసన చేశారు. ఆ ధ్యానము నందు ఆయనకు ఒక వాని వినపడింది. వెంటనే కళ్ళు తెరిచి ఒక చిరునవ్వు నవ్వి బ్రహ్మగారు అన్నారు ‘భూమీ! నీవేమీ బెంగపెట్టుకోవద్దు. స్వామి తొందరలో కృష్ణావతారమును స్వీకరిస్తున్నారు. ఆ అవతారం చిత్రమయిన అవతారం. స్వామి కళ్ళు ఇంకా తెరవడం రాని పిల్లవాడిగా స్వీకరిస్తున్నారు. ఆ అవతారం చిత్రమయిన అవతారం. స్వామి కళ్ళు ఇంకా తెరవడం రాని పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి రాక్షససంహారం ప్రారంభం చేసేస్తాడు. ఎందఱో రాక్షసులు, దుర్మార్గులు మరణిస్తారు. నీకు భారము తగ్గుతుంది. దేవతలను, సుర కాంతలను తమతమ అంశలతో భూమిమీద జన్మించమని స్వామి ఆదేశం యిచ్చాడు. ఆయన యదుకులంలో యాదవుడిగా పశువులను కాసేవాడిగా జన్మించబోతున్నాడు. జగదాచార్యునిగా లోకమునకు జ్ఞానమును ఇస్తాడు’ అని చెప్పాడు. అపుడు భూమాత పరమ సంతోషమును పొంది తిరిగి వెళ్ళిపోయి కృష్ణ పరమాత్మ ఆగమనం కోసమని నిరీక్షణ చేస్తోంది.
ఈలోగా భూలోకంలో యదువంశమునకు చెందిన శూరసేనుడు అనే రాజు మధుర రాజ్యమును పరిపాలిస్తున్నాడు. ఆయన కుమారుడు వసుదేవుడు. భోజవంశామునకు చెందినా వారు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఒకాయన పేరు ఉగ్రసేనుడు. ఒకాయన పేరు దేవకుడు. వీరు ఇద్దరూ అన్నదమ్ములు. ఈ ఇద్దరు అన్నదమ్ములలో దేవకుని కుమార్తె దేవకి. ఉగ్రసేనుని కుమారుడు కంసుడు. అన్నదమ్ముల బిడ్డలు కనుక కంసుని చెల్లెలు దేవకీ దేవి. దేవకీదేవిని శూరసేనుని వసుదేవునకిచ్చి వివాహం చేశారు.
దశమ స్కంధము ఉపనిషత్ రహస్యము. దశమ స్కంధము ప్రారంభంలోనే ఒక లక్ష టన్నుల ప్రశ్న ఒకటి పడుతుంది. ఆ ప్రశ్నకు సమాధానమును తెలుసుకోగలిగారంటే మీ హృదయగ్రంథి విడిపోయినట్లే! కృష్ణ జననం పరమ పవిత్రమయిన ఆఖ్యానం.
దేవకీ వసుదేవులకు వివాహం జరిగిన తర్వాత కొన్ని వందల గుర్రములను, బంగారు ఆభరణములతో అలంకరింపబడిన ఏనుగులను, కొన్ని వేల రథముల నిండా బంగారమును, కొన్ని వందలమంది దాసీజనమును ఏర్పాటు చేసి, మహానుభావుడయిన దేవకుడు తన కుమార్తెను అత్తవారింటికి పంపుతున్నాడు. రాజమార్గంలో కొన్ని వేళా రథములు అనుసరించి వెడుతున్నాయి. దేవకీదేవి రథం బయలుదేరి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. రథమును చోదనం చేయడానికి ఒక సారథి ఉంటాడు. ఇలాంటి సమయంలో అక్కడికి కంసుడు అకస్మాత్తుగా వచ్చాడు. అతనికి చెల్లెలు అంటే మహాప్రేమ. ఆమె తన తండ్రిగారి సోదరుని కుమార్తె అయినా, కంసునికి దేవకీదేవి అంటే చాలా ప్రేమ. ఆయన దేవకీదేవి రథమును నడపడానికి సిద్ధపడ్డాడు. అందరూ చాలా సంతోషించారు. తానే చెల్లెలిని అత్తవారింటిలో దింపుతానని గుఱ్ఱముల పగ్గములు పట్టుకున్నాడు. వెనక దేవకీవసుదేవులు కూర్చున్నారు. రథం వెళ్ళిపోతున్నది.
అపుడు అశరీర వాణి కొన్ని మాటలు పలికింది. ‘అశరీరవాణి’ చాలా గమ్మత్తయిన మాట. శరీరము వుంటే వాణి ఉంటుంది. వాణి ఉన్నది అంటే అది శరీరంలోంచి వస్తున్నదని గుర్తు. కనీసంలో కనీసం ఎదురుగుండా నామ రూపములతో ఏదో ఉండాలి. మనుష్యుడు లేకుండా మాట ఉండదు. కానీ యిక్కడ శరీరము లేదు కానీ మాట వినబడుతున్నది అంటున్నారు. అదీ చిత్రం. అశరీర వాణి ఏమని పలికిందంటే ‘’తలోదరి’ అంటే పైకి కనపడని కడుపు కలది. కొంతమందికి కడుపు కనపడదు. అసలు కడుపు ఉన్నదా లేదా అనే అనుమానం ఉన్నట్లు ఉన్నవాళ్ళని ‘తలోదరి’ అంటారు. అసలు కడుపు లేనట్లుగా శుష్కించిన కడుపులా కనపడుతోంది. ఈ కడుపులో ఎనమండుగురు పుట్టబోతున్నారు. వారిలో ఎనిమిదవ వాడు కంసుడిని చంపబోతున్నాడు. ఆవిడ చక్కగా వసుదేవుడిని వివాహం చేసుకుని రథం ఎక్కి వెళ్ళిపోతోంది. ‘ఆవిడ మెచ్చుకోవాలని చెల్లెలి సంతోషం కోసం పిచ్చివాడా, రథము నడుపుతున్నావు! కాని ఈమె ఎనిమిదవ గర్భము నిన్ను చంపేస్తుంది’ అని అశరీర వాణి పలికింది.
ఇప్పటి వరకు కంసుడు పరమప్రేమతో ఉన్నాడు. ఆకాశంలోంచి ఈమాట వినపడగానే వెంటనే రథమును ఆపాడు. క్రిందికి దిగాడు. కళ్ళు ఎర్రబడిపోయి గుడ్లు తిరుగుడు పడ్డాయి. అపారమయిన కోపం వచ్చేసింది. తన ఎడమ చేతితో చెల్లెలి కొప్పు పట్టుకొని రథములో నుండి క్రిందకు లాగేశాడు. ఒరనుండి కరవాలమును తీసి ఆమెను నరికివేయడానికని సిద్ధపడుతున్నాడు. ఆసమయంలో వాసుదేవుడు మాట్లాడాడు. ఇది చాలా గమ్మత్తయిన సన్నివేశం. ఇలా జరుగుతుందని కూడా ఎవరు ఊహించరు. రథం నడుపుతున్న వాడు బావమరిది, తన చేల్లెలినే లాగేసి చంపేస్తాడని కాని, అశరీరవాణి పలుకుతుందని గాని వసుదేవుడు కల గనలేదు. ఇలాంటప్పుడు కూడా ఏమీ కంగారు పడకుండా, ధర్మం తప్పకుండా చాలా పెద్దమనిషిగా తాను అప్పుడు మాట్లాడిన మాట తాను తప్పలేని మాట అయ్యేటట్లుగా మాట్లాడగలగడం అంటే దానికి ఈశ్వరానుగ్రహం ఉండాలి. ఈశ్వరానుగ్రహం లేనివాడు అలా మాట్లాడలేడు. ఆయన ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి.
ముందు కంసుని అనుగ్రహం కోసమని బ్రతిమలాడాడు. ప్రపంచంలో పరమపవిత్రమయిన సంబంధములలో ‘అన్న’ అనిపించుకున్న రక్తసంబంధం ఒకటి. అన్నగా పుట్టిన వాడికి ఒక మర్యాద ఉంటుంది. ఎప్పుడూ కూడా తన బావగారు బ్రతికి వుండాలని కోరుకోవాలి. ‘బావమరిది బ్రతక కోరతాడు’ అని ప్రపంచంలో ఒక సామెత ఉంది. నీవు అన్నవి. కాబట్టి రథం తోలడానికి వచ్చావు. కాబట్టి నీ చెల్లెలిని సంతోష పెట్టాలి. చక్కని మాటలు నాలుగు మాట్లాడాలి. కానీ నువ్వు చంపేస్తాను అంటున్నావు. గాలి మాటలు నమ్మి చెల్లెలిని చంపేస్తావా! రేపు ప్రపంచం నిన్ను ఏమంటుంది? అరివీర పరాక్రమము కలిగినవాడు భోజవంశంలో పుట్టినవాడు అయిన కంసుడు ఒక చెల్లెలి ఎనిమిదవ గర్భము వలన చాచ్చిపోతాననే గాలిమాట విని, ఇంకా పాదముల పారాణి ఆరని ఆడపిల్లను చంపేశాడని లోకం చెప్పుకుంటుంది.. అది ఎంత మహాపాపం. అందుకని తొందరపడి చంపకు. నిన్ను అభ్యర్థిస్తున్నాను’ అన్నాడు.
అపుడు కంసుడు ‘అది మిన్నులమోతో, అధికారిక వాక్యమో నాకు అనవసరం.ఈమె కడుపున పుట్టిన ఎనిమిదవ పిల్లాడి వలన నాకు ప్రాణహాని అని నాకు వినపడింది. అందుకని నేను చంపేస్తాను’ అన్నాడు.
అపుడు వసుదేవుడు ‘నీ అదృష్టం కొద్దీ నీ చావుకు ఒక కారణం తెలిసింది. ఒకవేళ నీవు ఈమెను చంపివేశావనుకో నీకు చావు రాకుండా ఉంటుందా? చెల్లెలిని చంపిన పాపమునకు అధోగతికి వెళ్ళిపోతావు. కాబట్టి నీ చెల్లెలిని విడిచిపెట్టెయ్యి’ అన్నాడు. ఎంత గొప్ప వేదాంతమును చెపితే మనసు మారే అవకాశం ఉంటుందో దానిని చెప్పాడు. ఏడురోజులు వినేది శుకబ్రహ్మ పరీక్షిత్తుకు చెప్పారు. ఏడు క్షణములలో వినేది వసుదేవుడు కంసునికి చెప్పాడు. కానీ వాని మనస్సు మారలేదు. అపుడు కంసుడు ‘నేను అలా విడిచిపెట్టను. నువ్వు చాలా తేలికగా మాట్లాడుతున్నావు. నేను మరణమును అంగీకరించను. దేవకిని చంపేస్తాను’ అన్నాడు. ఇపుడు వసుదేవుడు ఆలోచించాడు. ఉన్నదున్నట్లు చెపితే కంసుని తలకెక్కదని భావించాడు. ఇపుడు తానొక ధర్మము నిర్వర్తించాలి. తన భార్యను రక్షించుకోవాలి. జ్ఞాన బోధ చేస్తే వీని బుద్దకు ఎక్కదు. అలాగని ఎలాగయినా తన భార్యను రక్షించుకోవాలని అసత్యమును చెప్పకూడదు. సత్యమే చెప్పాలి. కానీ అది కంసుని మనస్సుకు నచ్చేది అయి ఉండాలి. ముందు అసలు నేను తక్షణం చేయవలసిన పని దేవకీదేవి ప్రాణములను రక్షించడం అనుకుని ‘బావా, అయితే నీకొక మాట చెబుతాను. నీ చెల్లెలికి పుట్టిన ఎనిమిదవ వాని చేత కదా నీవు మరణించగలనని అనుకుంటున్నావు. కాబట్టి ఈ దేవకీ దేవి గర్భమునుండి పుట్టిన ప్రతి పిల్లవాడిని, పుట్టీ పుట్టగానే తీసుకువచ్చి నీకు యిచ్చేస్తాను. వాడిని నువ్వు చంపెయ్యి. అపుడు నీకు మృత్యువు రాదు కదా! అంతేకానీ నీ చెల్లెలిని చంపడం ఎందుకు? పాపకర్మ కదా! నీ మృత్యుహేతువును నువ్వు చంపినట్లయితే ప్రపంచం నిన్ను తప్పు పట్టదు. నువ్వూ ధర్మం తప్పనక్కరలేదు. నేనూ ధర్మం తప్పనక్కరలేదు. ఆమెను విడిచి పెట్టు’ అన్నాడు.
అపుడు కంసుడు ‘ఇదేదో బాగానే చెప్పాడు’ అనుకుని మీ యిద్దరు హాయిగా అంతః పురమునకు వెళ్ళిపొండి’ అని ఆ రథమును వదిలిపెట్టేశాడు. దేవకీ వసుదేవులు ఎంతో సంతోషంగా ఉన్నారు.