దశమ స్కంధము – ఉత్తర భాగము
ప్రద్యుమ్నకుమార చరిత్ర
పోతనామాత్యుల వారు దశమ స్కంధము ఉత్తర భాగమును ప్రారంభిస్తూ అంటారు
శ్రీకర!పరితోషితరత్నాకర! కమనీయ గుణగణాకర! కారు
ణ్యాకర! భీకరశర ధారాకంపిత దానవేంద్ర! రామనరేంద్రా!!
వారు ఏది ప్రారంభం చేసినా ఒక్కసారి రామచంద్ర ప్రభువును ప్రార్థన చేస్తారు. ‘శ్రీకర’ – సమస్త ఐశ్వర్యములను కటాక్షించువాడా! అపారమయిన కారుణ్యమునకు అవధి అయిన వాడా! శత్రువులను పరిమార్చకలిగిన వాడా! రామచంద్ర ప్రభో! భాగవతం ఉత్తర భాగమును ఆంధ్రీకరణం ప్రారంభం చేస్తున్నాను’ అన్నారు. దీనిలో మనం తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది. మనము ఏ పనిమీద తిరుగుతున్నా భగవంతుని స్మరణ మాత్రం విడిచిపెట్టకూడదు. దేహముతో తాదాత్మ్యత చెందిపోకూడదు. ఏ పని చేస్తున్నా ఈశ్వరుడి పట్ల కృతజ్ఞత భక్తుడయిన వాడికి అలవాటు కావాలి. అందుకని సంతతము ఆ భగవంతుడిని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటాడు. ‘నా అంతటి వాడిని నేను’ అని అనడు. అలా అంటే మీ స్థితి ఏమిటో చూపించడానికి ఈశ్వరుడికి ఒక్క క్షణం చాలు. కానీ ఆయన మహా దయాళువు. అలా చెయ్యడు. ఆయన ఎన్ని ఆగడములనయినా సహిస్తాడు. అందుకనే ఎంత గొప్పమాట అంటారో చూడండి! కమనీయ గుణగణాకర! కారుణ్యాకర!’ మహా కారుణ్యము కలిగినటువంటి వాడా – రామచంద్రప్రభో! అని ప్రారంభం చేశారు. మనం కూడా దీనిని అలవాటు చేసుకోవలసిన అవసరం ఉంటుంది. భాగవతమును వినేవాడు, భాగవతమును చదివేవాడు జీవితములో ప్రత్యేకముగా అస్తమానూ ఈశ్వరుడిని జ్ఞాపకమునకు తెచ్చుకోవడం, కష్టం వచ్చినా సుఖం వచ్చినా దానిని ఈశ్వరునితో అనుసంధానం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. మీకు జీవితంలో ఇంతకన్నా గొప్ప వరం ఉండదు.
రుక్మిణీ కృష్ణుల వివాహం పూర్తయింది. రుక్మిణీదేవికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ పురుటికందుని చూసుకొని ఆమె పరవశించి పోయింది. ఆవిడ ఆదిలక్ష్మి. ఆమె నుండియే మిగిలిన అష్టలక్ష్మిలు వస్తాయి. ఆవిడ ఒక నరకాంతగా ఉన్నప్పుడు ఆవిడ కూడా తల్లి ప్రేమకు అతీతముగా ఉండడానికి యిష్టపడదు. ఆవిడ తల్లి ప్రేమను తల్లి ప్రేమగానే ఉంచుతుంది. అందుకే ఆ పురిటి మంచం మీద బిడ్డడికి పాలు యిచ్చింది.బిడ్డడిని నిద్రపుచ్చి తాను నిద్రపోయింది.
ఆ పిల్లవాడు నిద్రపోతుండగా శంబరాసురుడనే రాక్షసుడు అంతఃపురంలోకి కామరూపియై ప్రవేశించాడు. పురిటి పొత్తిళ్ళలో ఉన్న ప్రద్యుమ్నుడనబడే ఏ చిన్న బిడ్డడిని అపహరించి తీసుకొని వెళ్ళిపోయి ఆ పిల్లవాడిని చంపివేయడానికి ఒక మహాసముద్రంలో పారేశాడు. ఇది మీరు జాగ్రత్తగా గమనించ వలసిన లీల. ఈ లీలను గాని మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోగలిగారంటే ఈశ్వరుని దివ్యమయిన అనుగ్రహం, కారుణ్యం, ఆయన ఎంత లెక్కలు వేసి ఉంచే మనిషి, ఆయన సంకల్పముతో ఎలా ఏమి జరుగుతాయన్నది మీకు అర్థం అవుతుంది. అప్పుడు మీయందు భక్తి ప్రచోదనం అవుతుంది. ఎంత గొప్ప పద్యమును ఇచ్చారో చూడండి!
తామరసాక్షునంశమున దర్పకుఁ డీశ్వరుకంటిమంటలం
దా మును దగ్ధుఁడై; పిదపఁ దత్పరమేశుని దేహలబ్ధికై
వేమఱు నిష్ఠఁ జేసి హరి వీర్యమునం బ్రభవించె రుక్మిణీ
కామిని గర్భమం దసురఖండను మాఱట మూర్తియో యనన్!!
ఒకానొకప్పుడు పరమశివుడు తపస్సు చేస్తున్నాడు. పార్వతీదేవి ఆయనకు ఇల్లాలు కావాలి. లేకపోతే తారకాసుర సంహారం జరగదు. పరమశివుని కుమారుడు మాత్రమే తారకాసురుని నిర్జించగలడు. ఆ మేరకు తారకాసురుడు వరమును పొంది వున్నాడు. అందుకని పార్వతీ పరమేశ్వరులను కలపడం కోసమని మన్మథుడు బయలుదేరాడు. మన్మథుడు శ్రీమహావిష్ణువు కుమారుడు. శ్రీమహావిష్ణువు అందం అంతా మన్మథునికి వచ్చింది. మన్మథుడు అనగా మనస్సులను మథించగలిగిన వాడు అని అర్థం. ఆయన పుష్ప బాణుడై అవతలవారి మనస్సులను కదుపుతాడు. ఇంద్రుడు అడిగితే అతడు పరమశివుని మీదకు బాణ ప్రయోగం చేయబోయాడు. ఇంతలోనే శివునిలో చిన్న మార్పు వచ్చింది. ఆయన అనుమానం వచ్చి చూశాడు. పొదలో కూర్చుని వింటినారి సారిస్తున్న మన్మథుడు కనపడ్డాడు. అంతే! మూడవకన్ను తెరిచాడు. కాముడు భస్మమయిపోయాడు. అతను హర తేజస్సుచేత కాల్చబడ్డాడు. అది మామూలు అగ్నిహోత్రం కాదు. మూడవకంటి మంట. ఇంక డానికి ఎదురులేదు. అటువంటి మంటయందు మన్మథుడు దగ్ధమయి పోయాడు. శివుడికి ఉన్న మూడు నేత్రములే సూర్యచంద్ర అగ్నిహోత్రములు. అటువంటి అగ్నిహోత్రముచేత కాలి బూడిదరాశియై పడిపోయాడు.
మన్మథుడు కాలిపోవడం పరమశివునకు విజయము. ఎందుకనగా ఆయన కామదహనం చేశాడు. కామునికి లొంగడు. కాని మన్మథుడు దహింప బడడం వలన రతీదేవికి అపకారం జరిగింది. రతీదేవికి భర్త పోయాడు. ఇపుడు ఆమెకు ఎవరు అయిదవతనమును ఇవ్వడంలో సమర్థులో, ఎవరిని పరమశివునితో చేర్చడం వలన వాళ్ళిద్దరికీ కలిగిన కుమారుడి వలన దేవతలు ప్రయోజనము పొండుతారనే భావనచేత మన్మథుడు బానప్రయోగం చేశాడో, అటువంటి భర్తను తనకు యిమ్మనమని పార్వతీదేవిని, పార్వతీ పరమేశ్వర కళ్యాణం తరువాత రతీదేవి అడిగింది. అందువలన పరమేశివుని మంట చేత కాలిపోయిన మన్మథుని మరల పార్వతీదేవి బ్రతికించినది. అమ్మవారి శక్తికి పరిమితి లేదు. అందువలననే కాలి బూడిద అయిపోయిన వానిని తిరిగి బ్రతికించగలిగినది. ఆవిడ ఏదయినా చేయగలదు. అటువంటి శక్తి స్వరూపం ఆవిడ! ఆమె రతీదేవికి ఒక వరం యిచ్చింది. నీ అయిదవతనమునకు భంగం లేదు. నీ భర్త అనంగుడు అవుతాడు. శరీరం ఉండదు. కానీ నీకు కనపడతాడు. పైన ఎవ్వరికీ కనపడడు. నీకు మాత్రం కనపడతాడు’ అని వరం యిచ్చింది. రతీదేవికి తన పతిని శరీరముతో చూడాలని కోరిక కలిగింది. అపుడు పరమశివుడు మన్మథునితో అన్నాడు ‘వచ్చేసారి శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడిగా అవతరించినపుడు నీవు ఆయనకు కుమారుడిగా జన్మించెదవుగాక! అప్పుడు రతీదేవి నిన్ను శరీరంతో చూడగలదు’ అని వరం ఇచ్చాడు.
ఈ పుట్టిన మన్మథుడు రాక్షస సంహారమునకు శ్రీమన్నారాయణుడే మరొక అవతారం ఎత్తాడా అన్నట్లుగా ఉన్నాడు. అప్పుడు హరుని కంటిమంటచేత కాలిపోయిన వాడు యిప్పుడు శ్రీకృష్ణ పరమాత్మకు కుమారుడిగా జన్మించాడు. భూదేవి వెళ్లి ప్రార్థన చేస్తే శ్రీమన్నారాయణుడు ‘తాను రాక్షస సంహారం చేసి భూభారమును తగ్గిసాను’ అని అభయం యిచ్చాడు. ఇప్పుడు ఆయన ఒకటి, ఆయన కుమారుడు ఒకటి కాదుకదా! ఈయన కూడా రాక్షస సంహారం చేయవలసి ఉంది. ఈయన పుట్టగానే ఈయన వలన మరణించేవాడు ఒకడు ఉన్నాడు. అతను శంబరాసురుడు అనే రాక్షసుడు. వానికి ఈ విషయం తెలుసు. తన మృత్యువునకు ఏది కారణమని భావించాడో దానిని తీసివేసే ప్రయత్నం చేశాడు. అందుకని శంబరాసురుడు ప్రద్యుమ్నుడిని సముద్రంలోకి విసిరేశాడు. పిల్లవాడు చచ్చిపోయి ఉంటాడని భావించి తన గృహమునకు వెళ్ళిపోయాడు.
కానీ ఈశ్వర సంకల్పం చేత ఆ బాలుడు బ్రతికాడు. విచిత్రం ఏమిటంటే ఆ పిల్లవాడు శంబరాసురుని ఇంటికే వెళ్ళాడు. శంబరాసురునిచే విసిరి వేయబడిన వాడిని ఒక చేప మింగేసింది. ఆ చేపను జాలర్లు వలవేసి బయటకు తీసి ఒడ్డుకు వచ్చి రంపముతో దాని కడుపు కోయగా కడుపులో చంటి పిల్లాడు కనపడ్డాడు. ఆశ్చర్యపోయారు. ఆ పిల్లవాడిని కానుకగా ప్రభువుకు ఇద్దామని వాళ్ళ ప్రభువు అయిన శంబరాసురుని వద్దకు వెళ్లి జరిగింది చెప్పారు. శంబరాసురుడు మాయకు వశుడయ్యాడు. ఈలోగా రతీదేవి తన భర్త మన్మథుడు కృష్ణ పరమాత్మకు కొడుకుగా, ఈ మాంస నేత్రముతో చూడగలిగే వానిగా పుడతాడని ఎదురుచూస్తోంది. అందుకని రతీదేవి మాయాదేవి అనే పేరుతొ శంబరాసురుని వంటశాలలో ఉంది. ఈమె శంకరాసురుని వద్దకు వెళ్లి ఆ పిల్లవాడిని తనకివ్వమని, వానిని తాను పెంచుకుంటానని చెప్పింది. ఆ పిల్లవాడిని ఆమెకు ఇచ్చేశాడు.
ప్రపంచంలో ఎవరయినా తన భర్తను భర్తగా మాత్రమె చూడగలరు. కానీ భర్తను పసిపిల్లవానిగా రతీదేవి సాకింది. ఈయన పెరిగి పెద్దవాడయ్యాడు. రతీదేవి తన భర్త అనే భావనతోనే పెంచి పెద్ద చేసింది. ఆయనకు తాను మన్మథుడనని తెలియదు. రతీదేవికి తెలుసు. ప్రద్యుమ్నుడికి యౌవనము వచ్చిన తరువాత ఈమె ప్రవర్తనయందు చేష్టితములను కనిపెట్టాడు. ఈమె ప్రవర్తనయందు దోషమును కనిపెట్టి ‘నీవు మాతృత్వమునకే కళంకం తెస్తున్నావు. నీ ప్రవర్తన యందు దోషం కనపడుతోంది. ఎందుకు నీయందు ఈ విధమయిన విచిత్రమయిన ప్రవర్తన జరుగుతోంది?’ అని అడిగాడు. అపుడు ఆవిడ జరిగిన విషయమును తెలియజెప్పి ఆ అమ్మకు వున్నా కష్టమును పరిమార్చి నీవు మరల అమ్మవద్దకు చేరవద్డా’ అని అడిగింది. ఆయనలో వున్న మాతృ భావమును ఎవరి వైపుకి తిరగాలో వారి వైపుకి తిప్పింది. అవతార ప్రయోజనమును పూర్తి చేయిస్తోంది.
అప్పుడు ప్రద్యుమ్నుడు ‘ఉత్తర క్షణం నేను ణా తల్లిని చేరుకోవాలనుకుంటున్నాను. కాబట్టి నేను వెంటనే శంబరాసురుణ్ణి చంపేస్తాను’ అన్నాడు అపుడు ఆమె ‘నీవు అంత తొందరగా వాడిని చంపలేవు. వాడి దగ్గర గొప్ప మాయలు ఉన్నాయి. ఆ మాయలను నిర్జించడం ఎవరివల్లా కాదు. కాబట్టి నీకిప్పుడు ఒక మంత్రోపదేశం చేస్తాను. ఒక విద్యను నీకు ఉపదేశిస్తాను. ఆ విద్యపేరు మహామాయా విద్య’ అని ఆ విద్యను బోధచేసింది. అమ్మవారికి పన్నెండు మంది ఉపాసకులను చెపుతారు.
మనుశ్చంద్ర కుబేరస్య లోపాముద్రాచ మన్మథః అగస్తీరగ్నిసూర్యశ్చ
ఇంద్రస్కంధశ్శివస్తథా క్రోధభట్టారకోదేవ్య ద్వాదశాని ఉపాసకాః!!
అను ఈ పన్నెండుమంది అమ్మవారి ఉపాసకుల గురించి విన్నా, వాళ్ళ గురించి చెప్పినా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారు పరమ ప్రీతి చెందుతుంది. అందుకే రుక్మిణీ కళ్యాణం ప్రక్కనే ప్రద్యుమ్నోపాఖ్యానమును ఇచ్చారు. స్త్రీలు పెళ్ళి అయిన తరువాత మాతృత్వమును కోరుకుంటారు. ఆ మాతృత్వం నిలబడడానికి మహామాత అనుగ్రహం కలగాలి. అందుకని రుక్మిణికి ప్రద్యుమ్నుడు పుట్టడమును అడ్డుపెట్టి అమ్మవారి అనుగ్రహమును పోతనగారు కథలోకి తీసుకువచ్చారు. చూడండి ఆయన ఉపకారం. ప్రద్యుమ్నుడు మహా మాయా తత్త్వమును పొంది శంబరాసురుని మీదికి యుద్ధమునకు వెళ్ళాడు.
వాడికి ఈ సత్యం తెలియగానే తోక త్రొక్కిన త్రాచులా లేచి ప్రద్యుమ్నుడితో యుద్ధమునకు బయలుదేరాడు. ప్రద్యుమ్నుడు తనకు ఉన్నటువంటి మహా మాయాశక్తి చేత అన్ని అస్త్రశస్త్రములను అణచివేసి తరువాత కత్తిలో శంబరాసురుని కుత్తుక ఖండించివేశాడు. ఎవరిచేతిలో శంబరాసురుద్ చచ్చిపోవాలని ఈశ్వరుడు సంకల్పం చేశాడో వానిచేతిలోనే శంబరాసురుడు చచ్చిపోయాడు. అలా చంపివేసిన తరువాత ఒక చిత్రం జరిగింది. వెంటనే ప్రద్యుమ్నుడు అమ్మని చూడడానికి వెళ్ళాలి కదా! ఇక్కడ జరుగుతున్న విషయములన్నీ కృష్ణుడికి తెలుసు. కానీ ప్రద్యుమ్నుడి జాడ తెలియనట్లు ఊరుకున్నాడు. శంబరాసుర సంహారం జరగాలని ఆయనకి తెలుసు. అందుకే కృష్ణ పరమాత్మ చెప్పింది మాత్రమే మనం చెయ్యాలి తప్ప ఆయన చేసింది మనం చేయకూడదు. కృష్ణుడిది పరిపూర్ణావతారం. కృష్ణుడిని అనుకరించకూడదు.
ప్రద్యుమ్నుడు రతీదేవితో కలిసి ఆకాశమార్గంలో రుక్మిణీదేవి అంతఃపురమునకు వెళ్ళాడు. అక్కడ ఒక ఆశ్చర్యకర సంఘటన జరిగింది. కృష్ణుడు ఎలా ఉంటాడో ప్రద్యుమ్నుడు కూడా ముద్ర గుద్దినట్లు అలానే ఉంటాడు. అంతఃపుర పరిచారికలు అచ్చం శ్రీకృష్ణునిలా ఉన్న ప్రద్యుమ్నుని చూసి కృష్ణుడే వస్తున్నాడని ఎక్కడి వాళ్ళు అక్కడే స్తంభముల చాటుకి తప్పుకున్నారు. కొందరు కృష్ణుని కొడుకులా ఉన్నాడు అనుకున్నారు. రుక్మిణీదేవి మందిరం ఎక్కడ ఉన్నదా అని అమ్మ గురించి వెతుకుతున్నాడు ప్రద్యుమ్నుడు. పరిచారికలు రుక్మిణీదేవి వద్దకు వెళ్లి ‘అమ్మా, ఎవరో ఆకాశమునుండి మన మందిరంలోకి దిగారు. అచ్చం కృష్ణుడి లాగానే ఉన్నారు. మీరు చూడవలసినది’ అని చెప్పారు. వెంటనే రుక్మిణీదేవి గబగబా మేలిముసుగుతో వచ్చి చూసింది. ఆవు దూడను చూసినప్పుడు ఎలా ఉంటుందో ఆమె చూపు అలా అయిపొయింది. ఆమెలో పుత్రవాత్సల్యం తన్నుకు వచ్చి ఆమె స్తన్యములలో పాలు చేపునకు వచ్చాయి. ఆవిడ అంది “ఈపిల్లవాడు చాలా అందంగా ఉన్నాడు. నా కొడుకు బ్రతికి ఉన్నట్లయితే యిప్పటికి యింత అయి ఉండేవాడు. ఈతడు నా కొడుకే అయివుండాలి’ అనుకుంది. అమ్మ యిరువది అయిదేళ్ళ తరువాత తన కుమారుని గుర్తు పట్టేసింది.
ఈలోగా అక్కడికి కృష్ణ భగవానుని తీసుకువచ్చారు. ఆయన మహా మాయావి. ఆయన వచ్చి ఒకసారి రుక్మిణి వంక, ఒకసారి ప్రద్యుమ్నుని వంక చూసి ప్రద్యుమ్నుని ‘నీవు ఎవరు?’ అని ప్రశ్నించారు. ప్రద్యుమ్నుడు సమాధానం చెప్పేలోపల అక్కడికి మహా జ్ఞాని అయిన నారదుడు వచ్చాడు. ‘అయ్యా! నీకు తెలియని విషయమా! ఆనాడు మన్మథుడు కాలి బూడిద అయిపోతే వరం యిచ్చారు కదా! దాని ప్రకారం మన్మథుడు ప్రద్యుమ్నుడిగా జన్మించాడు. చిన్నతనంలో శంబరాసురుడు అపహరించాడు. తరువాత యితడు శంబరాసురుణ్ణి సంహరించాడు. ఈనాడు రతీదేవితో కలిసి వచ్చాడు. నీ యింటికి కొడుకు కోడలు కూడా ఈశ్వర వరంగా వచ్చారు. ఇది ప్రద్యుమ్నుడు ఎంచుకుని చేసుకున్న పెళ్ళి కాదు. ఇది జన్మజన్మాంతర సుకృతం. ఇలాంటి కొడుకు కోడలు సృష్టిలో ఉండరు. పుట్టిన పిల్లవాడిని పెంచి పెద్ద చేసుకొని తన భార్యత్వమును నిరూపించుకొని, భర్తను తీసుకుని వచ్చి తల్లికి అప్పజెప్పిన కోడలు! అత్తగారియందు అంత గౌరవమును చూపించిన కోడలు! యింక యింతకన్న నీకు ఏమికావాలి?’ అని చెప్పాడు.
రుక్మిణీదేవి గబగబా వచ్చి ప్రద్యుమ్నుడిని, రతీదేవిని ఆప్యాయతతో కౌగలించుకుంది. కృష్ణుడు సంతోషించాడు. అంతఃపురం అంతటా భేరీలు మ్రోగాయి.
చచ్చిపోయాడని మనం అనుకున్న పిల్లవాడు బతికి వచ్చాడు. ఆహా! రుక్మిణీ దేవి ఎంత తపస్సు చేసినదో! మరల కొడుకు యింతవాడయి కనపడ్డాడు’ అని గోపకులందరూ ఆనందముతో వసంతములు జల్లుకుని పొంగిపోతుంటే రుక్మిణీ కృష్ణులు పొంగిపోతూ కొడుకునూ కోడలినీ యింట్లోకి తీసుకువెళ్ళి పెద్ద సంబరములు చేసుకున్నారు.