స్యమంతక మణి ఉపాఖ్యానము

ఒకనాడు శ్రీకృష్ణ పరమాత్మ బలరామునితో కలిసి అంతఃపురంలో కూర్చుని ఉండగా సత్రాజిత్తు ద్వారక నగరమునకు విజయం చేశాడు. ఆయనను చూసి ద్వారకా నగరంలో ఉండే గోపాలురందరూ కూడా సూర్యనారాయణుడే నడిచి వస్తున్నాడని భ్రమపడ్డారు. ఎందఱో మహర్షులు, తపశ్శాలురు, తేజోమూర్తులు దేవతలు కృష్ణుడి దర్శనమునకు వస్తూ ఉండడం అక్కడ రివాజు. కాబట్టి సూర్యనారాయణుడే నడిచి వస్తున్నాడని వాళ్ళు అనుకున్నారు. అనుకుని పరుగు పరుగున వెళ్లి కృష్ణ భగవానుడికి చెప్పారు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఒక చిరునవ్వు నవ్వి ఆ వస్తున్నవాడు సూర్య భగవానుడు కాదు. సత్రాజిత్తు అనే రాజు. ఆరాజు సూర్య నారాయణ మూర్తికి చేసిన ఆరాధనకు ప్రసన్నుడయిన పరమాత్మ ఆయనకు స్యమంతక మని అనబడే మణిని బహూకరించారు. ఆ స్యమంతకమణిని ధరించి సత్రాజిత్తు నడిచి వస్తుంటే ఆయనను చూసి మీరు సూర్య నారాయణుడే అని భ్రమపడ్డారు’ అని చెప్పాడు.

సత్రాజిత్తు ధరించిన మణికి ఒక ప్రత్యేకత ఉన్నది. సాధారణంగా మణులు ఏడో అలంకార ప్రాయమై మేడలో వేసుకునేందుకు పనికి వస్తాయి. కానీ ఈ స్యమంతకమణి ఒక విచిత్రమైన లక్షణం కలిగి ఉంది. ఎక్కడ స్యమంతక మణి ఉంటుందో అక్కడ దుర్భిక్షము రాదు. అక్కడ రోగములు రావు. అక్కడ ఉన్నటువంటి వారు ఏ విధమయిన మానసికమయిన పీడలు పొందకుండా ఉండగలరు. ఇన్ని లక్షణములతో పాటుగా ఆ స్యమంతక మణికి ఒక శక్తి ఉంది. అది ప్రతిరోజూ తెల్లవారే సరికి ఎనిమిది బారువుల బంగారమును పెడుతుంది. ఆమణిని ధరించి మణులలో కెల్లా మణి అయినవాడు ఎవడు ఉన్నాడో అట్టి కృష్ణ పరమాత్మ దగ్గరకు వస్తున్నాడు. ఈ వార్త ముందే కృష్ణునకు చేరింది. వస్తున్నవాడు సత్రాజిత్తు అని తెలుసుకున్నాడు. సత్రాజిత్తు స్యమంతకమణితో వచ్చి కృష్ణ దర్శనం చేశాడు.

కృష్ణ పరమాత్మ నోరువిప్పి మాట్లాడుతున్నాడు. ఆయనకి లేక కాదు! ఆయనకు చేత కాక కాదు! కేవలం తన మాయాశక్తి చేత ఎక్కడో మథురలో ఉండే కొన్ని లక్షలమంది ప్రజలను సముద్రంలో ద్వారకానగర నిర్మాణం చేసి జరాసంధునికి దొరకకుండా, ఒక్క ఆవు కూడా మరణించకుండా అందరినీ తీసుకువచ్చి ద్వారకా నగరమునకు చేర్చిన మహా పురుషుడికి సత్రాజిత్తు దగ్గర ఉన్న మణి అడిగితే తప్ప ఆయనకు ఐశ్వర్యం ఉండదా? ఆయన మాధవుడు. లక్ష్మీపతి. లక్ష్మీదేవి ఆయనకోసం రుక్మిణిగా నడిచి వచ్చింది. ఆయనకు ఉన్న ఐశ్వర్యంలో సత్రాజిత్తుకు ఉన్న ఐశ్వర్యం ఏపాటి! సత్రాజిత్తును చూసి కృష్ణ పరమాత్మ ఈ మణిని నీవు ఉగ్రసేనుడికి ఇచ్చేస్తే బాగుంటుంది. ఈ మణి రాజు దగ్గర ఉంటే కొన్ని ప్రయోజనములు ఉంటాయి. రాజ్యమునందు ఏ విధమయిన అరిష్టము ప్రబలదు. నీ ఒక్కడి దగ్గర ఉండడం వలన అది నీకు కొంత యిబ్బంది కలిగించవచ్చు. కాబట్టి ఆ స్యమంతకమణిని ప్రభువుకి బహూకరించు అని కృష్ణ పరమాత్మ అన్నారు.

అనగానే వచ్చిన సత్రాజిత్తు మనస్సులో ఒక ఆలోచన బయలుదేరింది. ఆమణిని యాదవ విభునకీయవలసినదని కృష్ణుడు చెప్తే సత్రాజిత్తు ధనేచ్ఛచేత ఆ మణిని యివ్వడానికి అంగీకరించలేదు. మణిని యివ్వకపోతే కృష్ణుడు తనను ఏమీ చేయలేడని భావించాడు. కోట్లాది రూపాయలు మీ దగ్గర ఉన్నప్పటికీ ఈశ్వరానుగ్రహం కొద్దిగా పక్కకి తొలగినట్లయితే ఉపద్రవం మిమ్మల్ని సముద్రం ముంచెత్తినట్లు ముంచెత్తేస్తుంది. కొద్దిగా ఈశ్వరానుగ్రహం కలిగిందంటే ఎంతటి ప్రమాదము కూడా వానిని ఏమీ చేయదు. ప్రమాదము తప్పుకుంటుంది. కృష్ణుడు ‘నేను చెప్పాను. వినలేదు. నీవే పర్యవసానమును తెలుసుకుంటావు’ అని మనసులో అనుకున్నాడు. సత్రాజిత్తు తన గృహమునకు వెళ్ళిపోయాడు. కృష్ణుడంతటి వాడు తనను మణి అడిగాడని చెప్పుకోవడానికి సత్రాజిత్తుకు అవకాశం దొరికింది. కృష్ణుడు ఎందుకు అడిగాడు అన్నది మరిచిపోయాడు. కృష్ణుడు అడిగాడని మాత్రం ప్రచారం చేసుకుంటున్నాడు. ఒకరోజున సత్రాజిత్తు తమ్మునికి ఒక చిత్రమయిన కోరిక పుట్టింది. ఆయన పేరు ప్రసేనుడు. తాను ఆ మణిని ధరించి వేటకు వెడతానని అన్నగారిని అడిగాడు. అందుకు సత్రాజిత్తు అంగీకరించాడు. అపుడు ప్రసేనుడు మణిని మెడలో ధరించి వేటకు వెళ్ళాడు. వాని మెడలో ఉన్న మణిని ఒక సింహము చూసి మాంస ఖండం అనుకోని అమాంతం వచ్చి ప్రసేనుడి మీదకి దూకి అతనిని సంహరించి అతని మెడలోని మణిని తీసుకుని నోట కరుచుకుని వెళ్ళిపోతోంది. అటునుండి జాంబవంతుడు వస్తున్నాడు. జాంబవంతుడు ఆనాడు రామావతారంలో వరం అడిగాడు. కానీ ఆ కోరిక కృష్ణావతారంలో తీరుతోంది. సింహము మణిని పట్టుకు పోతుంటే జాంబవంతుడు చూశాడు. సింహంతో యుద్ధం చేసి సింహమును చంపి జాంబవంతుడు తన గుహలోకి వెళ్ళిపోయాడు. అది తినే పదార్ధం కాదని కేవలం ఒక మణి అని జాంబవంతునికి తెలుసు. జాంబవంతునికి కొడుకు పుట్టి ఉన్నాడు. ఆకొడుకు ఆడుకోవడానికి ఉయ్యాల పైభాగంలో ఈ మణిని కట్టాడు. ఆ పిల్లవాడు దానితో ఆడుకోవడం ప్రారంభించాడు.

సత్రాజిత్తు మణి గురించి ఎంతమంది సైన్యమునో పంపించాడు. ఎన్నోచోట్ల వెతికించాడు. అసలు ప్రసేనుడు చచ్చిపోయిన చోటుకాని, గుర్రం కాని కనపడలేదు. కృష్ణుడే ప్రసేనుడిని సంహరించి ఆ మణిని అపహరించాడు’ అని ప్రచారం చేశాడు. ఇపుడు కృష్ణుడు తనమీద వచ్చిన అపనింద పోగొట్టుకోవాలని అనుకున్నాడు. ప్రసేనుడు వేసుకుని వెళ్ళాడు అని తెలుసుకుని బంధుమిత్రాదులను తీసుకుని మణిని వెదకడానికి అడవిలోకి బయలుదేరాడు. అడవిలో ఒకచోట ప్రసేనుడి గుఱ్ఱము, అతని కళేబరము కనపడ్డాయి. ప్రసేనుడిని ఎవరో చంపి ఉండాలని గ్రహించి వెతకగా సింహం అడుగుజాడలు కనపడ్డాయి. వాటి దగ్గర భల్లూకపు అడుగుజాడలు కనపడ్డాయి. అంటే సింహమును భల్లూకం చంపి ఉంటుందని భావించారు. ఈసారి భల్లూకం వెళ్ళిన వైపు వెళ్ళగా గుహలో ఉయ్యాలమీద మణి వ్రేలాడుతోంది. కృష్ణుడు ఆ మణిని తీసుకుని వెళుతుండగా జాంబవంతుడు వచ్చాడు. ఆకార స్వరూపముల చేత కృష్ణుడు తన స్వామియే అని గుర్తించలేకపోయాడు. వారిరువురి మధ్య భయంకరమయిన యుద్ధం జరిగింది. జాంబవంతుడు కృష్ణునితో యుద్ధం చేసి డస్సిపోయి ఒంటిలోంచి రక్తం కారుతుండగా క్రింద పడిపోయాడు. తనని ఓడించినది ఎవరా అని చూడగా ఈ కృష్ణుడు ఆ రాముడు ఒక్కడే అని తెలుసుకుని ఆయన పాదముల మీద పడి స్తోత్రం చేసి మణిని, జాంబవతి అనే కుమార్తెను కృష్ణునికి ఇచ్చి వివాహం చేసి పంపించాడు.

తరువాత బలరాముడు మొదలయిన వారందరితో సభాచేసి సత్రాజిత్తును పిలిచి అందరూ చూస్తుండగా నేను అపహరించాను అన్నావు. దీనిని జాంబవంతుడు తీసుకు వెళ్ళాడు. నీ మణిని నీవు తీసుకో’ అని మణిని ఇచ్చివేశాడు. మణిని తీసుకొని ఇంటికి వచ్చేశాడు సత్రాజిత్తు. కొన్నాళ్ళకి సత్రాజిత్తులో కృష్ణుని అనవసరంగా నిందించాననే భావన ఏర్పడి జాంబవంతుడు ఏం చేశాడో తాను కూడా అదే చేయాలనుకున్నాడు. సత్యభామ రాజనీతిజ్ఞురాలు, యుద్ధ నీతిజ్ఞురాలు. ఆమెకు ఎన్నో విద్యలు తెలుసు. అన్నిటికీ మించి సౌందర్యాతిశయములు కలిగినటువంటి స్త్రీ. శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు వెళ్లి సత్యభామను మణిని స్వీకరించమని అడిగాడు. శ్రీకృష్ణుడు సత్యభామను వివాహం చేసుకుని మణిని నిరాకరించాడు. కొన్నాళ్ళు అయిపొయింది. కృష్ణుడు ద్వారకలో లేని సమయం చూసి సత్రాజిత్తును చంపి స్యమంతకమణిని ఎత్తుకు రావడానికి శతధన్వుడు సత్రాజిత్తు అంతఃపురమునకు వెళ్ళాడు.సత్రాజిత్తు గాఢనిద్రలో ఉన్నాడు. శతధన్వుడు సత్రాజిత్తును చంపివేసి మణిని తీసుకుని పారిపోయి కృతవర్మ, అక్రూరుల వద్దకు వెళ్ళగా ఇద్దరూ కృష్ణుడు నిన్ను వదలడు, ఎప్పుడూ మా దగ్గర కనపడకు అన్నారు. శతధన్వుడు తెల్లబోయాడు. మణి దగ్గర ఉన్నదంటే దానినుండి ప్రకాశం వచ్చే ప్రకాశం వల్ల ఎక్కడ వున్నా తన ఉనికిని పట్టేస్తారు. అందుకని మణిని అక్రూరుని యింట్లో పడవేసి శతధన్వుడు పారిపోయాడు. సత్రాజిత్తు మరణ వార్తవిని కృష్ణుడు వెంటనే వచ్చి అంత్యేష్టి సంస్కారమును చేశాడు. సత్రాజిత్తు చివరకు ఆ మణి వలననే చచ్చిపోయాడు.

శతధన్వుడి వల్ల సత్రాజిత్తు మరణించాడని తెలుసుకున్న కృష్ణ పరమాత శతధన్వుడు ఎక్కడ ఉన్నా చంపేస్తానని ప్రతిజ్ఞ చేసి బయలుదేరాడు. కృష్ణుడితో పాటు బలరాముడు కూడా బయలుదేరాడు. శతధన్వుడు మిథిలానగరం వరకు వెళ్ళిపోయాడు. కృష్ణ పరమాత్మ చక్రమును ప్రయోగించాడు. శతధన్వుడు మరణించి గుర్రం మీద నుంచి క్రింద పడిపోయాడు. వాని దగ్గర వెతకగా మణి కనపడలేదు. బలరాముడు వీడు ఖచ్చితంగా తన స్నేహితులయిన వారి యింట్లో ఆ మణిని పెట్టి ఉండవచ్చు అన్నాడు. కృష్ణుడు వచ్చి అక్రూరా నీవు స్యమంతకమణిని తీశావా అని అడుగుతాడేమోనని భావించి మణిని తీసుకుని అక్రూరుడు ఊరు విడిచి వెళ్ళిపోయాడు. అక్రూరుడు ఇలా చేస్తాడని మనం ఊహించం. ఎందుకు అలా చేశాడో మనం తెలుసుకోవాలి. సత్రాజిత్తు మా పరమాత్మ మీద యిన్ని నిందలు వేస్తారా అని కడుపులో ఆగ్రహం పెంచేసుకుని ఎలాగైనా సత్రాజిత్తును చంపించాలని కృష్ణుడు లేని సమయం చూసి శతధన్వుని రెచ్చగొట్టారు. వాళ్ళు అనుకున్న పని పూర్తయిపోయింది. కృష్ణుడితో వైరం వాళ్ళకి అక్కరలేదు. శతధన్వుడు చచ్చిపోయాడు. కానీ మణి అక్రూరుని చేరి ఉంది. మణి ఉన్నదని తెలిస్తే కృష్ణ పరమాత్మ అడుగుతారేమో నని వారికి పశ్చాత్తాపం కలిగింది. భగవంతునికి దూరం అయిపోయారు. అతి భక్తితో చేసిన తప్పిదములు ఈశ్వరునికి దూరం చేస్తాయి. అతిభక్తి పనికిరాదు. ఎంత దూరమయినా వారిద్దరికీ కృష్ణుడి మీద గొప్ప భక్తి ఉన్నది. అక్రూరునిలో మూడు లక్షణములు కలిసి వచ్చాయి. ఒకటి అతడు జన్మతః సాధించుకున్న ఫలితం, రెండు మహాపురుషుని తేజస్సు, మూడు అలవిమీరిన కృష్ణ భక్తి. ఈశ్వరుడే అక్కడ వున్నా భక్తుడు వెళ్ళిపోవడం వలన ద్వారకలో వర్షములు కురవడం ఆగిపోయాయి. ఈవిషయం కృష్ణుడు తెలుసుకున్నాడు. అటువంటి మహాత్ముడు ఊరు విడిచిపెట్టి వెళ్ళడానికి వీలులేదు. మీరు వెళ్లి కృష్ణ భగవానుడు పరమ సాదరంగా తీసుకు రమ్మంటున్నాడు అని అక్రూరునికి చెప్పి తీసుకురండి’ అని తన సేవకులకి ఆజ్ఞాపించాడు. వాళ్ళు వెళ్లి అక్రూరుడికి స్వాగతం చెప్పారు. తాను తెలిసో తెలియకో ఆగ్రహంతో కృష్ణ భక్తిలో పొరపాటు చేశానని అక్రూరుడు పశ్చాత్తాపపడ్డాడు. భక్తి సంయమనం ఎంత అవసరమో స్యమంతకోపాఖ్యానం నిరూపణ చేస్తుంది. కృష్ణ పరమాత్మ అక్రూరునికి స్వాగతం చెప్పి కూర్చోపెట్టి అర్ఘ్యపాద్యాదులిచ్చి భోజనం పెట్టి నిండు కొలువుచేసి అక్రూరునితో ఒక మాట అన్నారు. ‘మహానుభావా, నీవు చాలా గొప్పవాడివి, గొప్ప భక్తుడివి. నీవు వెళ్ళిపోతే యిక్కడ వర్షములు పడలేదు. మణి నీ దగ్గరే ఉంది. మణిని నేను అపహరించలేదు అనే విషయం మా అన్నయ్యకు తెలియాలి. లేకపోతే మా అన్నయ్యకు అనుమానం వస్తుంది. నిన్ను శిక్షించి తేవడం ణా అభిమతం కాదు. ఎందుకనగా నీవు నా భక్తుడవు. నీ అంత నీవుగా యిచ్చివేయడమే న్యాయంగా ఉంటుంది. నీ తప్పు దిద్దుకోవడం అవుతుంది. పశ్చాత్తాపం అవుతుంది. నా అన్నగారి పట్ల నేను దోషం లేని వాడనై నిలబడినట్లు ఉంటుంది’ అన్నాడు.

అంతకుమించి అక్రూరుని నిగ్రహించలేదు. వెంటనే అక్రూరుడికి కన్నుల వెంట నీరు కారుతుండగా నా వలన నా స్వామికి నింద రావడమా అని తన బట్టల్లో దాచుకున్న మణిని తీసి ఇచ్చివేశాడు. కృష్ణుడు దానిని సభలోని వారందరకూ చూపించి అక్రూరునికి ఇచ్చి వేశాడు. దానిని అక్రూరుడు తీసుకువెళ్ళి తన యింటిలో బంగారు వేదిక మీద పెట్టాడు. అది రోజూ ఎనిమిది బారువుల బంగారమును పెట్టేది. దానితో అక్రూరుడు ప్రతిరోజూ చక్కగా యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ భగవంతుడికి స్మరిస్తూ కాలం గడిపాడు. జీవితాంతం అలా సేవించుకోగలిగిన ఫలితమును కృష్ణ పరమాత్మ అక్రూరునికి యిచ్చాడు. ఇప్పుడు ఆ స్యమంతక మణి ఈశ్వరార్చనకు ఉపయోగపడింది. ఈశ్వరార్చనకు దగ్గర పెట్టుకున్న వానికి మణి బరువు కాదు. అక్రూరుడు చేసే యజ్ఞ యాగాదుల వల్ల చక్కగా వర్షములు పడేవి. దానివల్ల అందరూ శోభిల్లుతూ ఉండగా ఈ మణి అక్రూరుని వద్ద శాంతించినది. పరమోత్క్రుష్టమయిన ఈ ఆఖ్యానమును ఎవరు వింటున్నారో వారందరికీ ఒక దివ్యమయిన ఫలితం వస్తుందని చెప్పబడింది. చాలాకాలము నుండి తను చెయ్యని నేరమునకు తనమీద అపనిందతో ఉన్నవాడు ఎవరయినా ఉన్నట్లయితే తన మీద వున్నా అపనింద తాను తొలగించుకోలేకపోతే ఈ ఉపాఖ్యానమును చదివినా విన్నా, మనస్సులో ఒక్కసారి తలచుకున్నా వారికి ఉత్తర క్షణం ఆ అపనింద పోయే అవకాశం కలుగుతుంది. మహా భక్తుడయిన అక్రూరుని చరిత్ర అంతర్లీనంగా వెళ్ళింది కాబట్టి వారికి ఉన్నటువంటి పాపరాశి ధ్వంసం అయిపోతుంది. ఇది జరగాలి అంటే భగవంతుని మీద మనకు అత్యంత విశ్వాసం ఉండాలి. దీనిని మాత్రం మనం మరచిపోకూడదు.