తదనంతరం కుంతీదేవి స్తోత్రం చేసింది. ఆవిడ ఆదినారాయణా అని ప్రారంభించింది. కృష్ణా నాభక్తి ఇంకా పండలేదు. పరీక్షిత్తు పుట్టబోతున్నాడు. మనవడు పుట్టబోయే ముందు పరమాత్మను ఎఆంటి మాట అడగాలో అలాంటి మాటను ఈవేళ కుంతీదేవి అడుగుతోంది. ‘పాండురాజు కుమారులయిన ఈ పంచపాండవుల యందు నాకు మోహవిచ్ఛేదనము చేయవలసింది.

స్వామీ నీయందు నా నమస్సు రమించిపోవాలి. పూజామందిరంలోనే కాదు. నేను ఏపని చేస్తున్నా నువ్వు నాకు జ్ఞాపకానికి వస్తూ ఉండాలి. నీ నామస్మరణము నుండి నా మనస్సు ఆగకూడదు. నీవు ఈశ్వరుడవు, నీవు సర్వ జగన్నియామకుడవు. నీవు తలచుకుంటే ఏమి ఇవ్వలేవు! అందుకని కృష్ణా, నాకు అటువంటి భాగ్యమును కటాక్షించవా! నాకు ఆ మోహమును తెంపి అవతల పారవేయవలసింది. సంసారమనే లతలు నన్ను చుట్టేస్తున్నాయి. వాటిని గండ్ర గొడ్డలితో తెంపి అవతల పారేయి’ అని అడిగింది అమ్మ.

అంట కృష్ణ పరమాత్మ కూడా ఆ కుంతీదేవి స్తోత్రం చూసి మురిసిపోయాడు. పొంగిపోయి ‘ అప్పుడే ఎలా కుదురుతుందిలే, ఇంకా మనవడు పుట్టాలి, నువ్వు సంతోషించాలి’ అనే భావం వచ్చేట్లుగా హేలగా చూసి, ముగ్ధ మనోహరంగా ఒక్క చిరునవ్వు నవ్వాడు. అంటే! మాయ ఆవరించింది. ఇంత స్తోత్రం చేసిన ఆవిడని కూడా ఆ మందహాసపు కాంతులలో మైమరచిపోయేటట్లు చేసేశాడు. ఆయన దర్శనానికి ఉండే శక్తి అటువంటిది. అందుచేత ‘స్వామీ నిరంతరమూ నీ గురించి భావన చేసే అదృష్టమును ప్రసాదించవలసింది’ అని కుంతీదేవి అడిగితే స్వామి చిరునవ్వు చిందించి బయలుదేరి ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు.

వెళ్ళిపోయిన తరువాత పదినెలలకు ఉత్తర గర్భమునుండి పరీక్షిన్మహారాజు ఉడాయించారు.

భీష్ముని చరిత్ర:

కుంతీదేవి ప్రార్థన తరువాత ధర్మరాజుగారు కురుక్షేత్ర సంగ్రామంలో నేను ఎందఱో రాజులను తెగటార్చాను. దానివలన నాకు కలిగిన పాపం ఏవిధంగా పోతుంది’ అని బాధపడుతున్న సమయంలో, ‘ధర్మసూక్షములు తెలుసుకోవడం కోసమని కురుక్షేత్రంలో అంపశయ్యమీద పడుకుని ఉన్నాడయ్యా మహానుభావుడు భీష్ముడు – అక్కడికి వెడదాం పద’ అని మహానుభావుడు కృష్ణభగవానుడు ధర్మరాజును తీసుకొని వెళ్ళినప్పుడు, భీష్ముడు ధర్మరాజుకు ధర్మములను ఉపదేశించి తదుపరి ఆయన అనంత బ్రహ్మమునందు కలిసిపోయిన సంఘటనను మాత్రమే వివరించారు. అప్పుడు భీష్ముడు కృష్ణ భగవానుని చేసిన స్తోత్రం భాగవతంలో వివరించ బడింది.

భీష్ముని చరిత్ర మహాభారతము, దేవీ భాగవతము ఇత్యాది గ్రంథాలలో చెప్పబడింది. భీష్ముని జీవితం అంట తేలికయిన విషయం కాదు. ఆయనను అర్థం చేసుకోవడం చాలా కష్టమయిన విషయం. భాగవత అంతర్భాగం కానప్పటికీ అవగాహన కొరకు భీష్ముని గురించి మనం కొంత తెలుసుకోవడం మంచిది.

ఒకానొకప్పుడు బ్రహ్మగారు ఒక పెద్ద సభనొక దానిని తీర్చారు. ఆ సభకు ఋషులు ప్రజాపతులు మొదలయిన వారందరూ విచ్చేశారు. వారు ఆ సభయందు కూర్చుని ఈ లోకములో కళ్యాణము జరిగేటట్లు చూడడం ఎలాగా, భగవంతునియందు భక్తి కలిగేటట్లుగా ప్రవర్తించడం ఎలాగా అని చర్చ చేస్తున్నారు. ఈశ్వరుని గుణములను ఆవిష్కరించి ప్రజలలో భక్తి పెంపొందితే ఆ భక్తి వలన వారికి కావలసిన సమస్త కామములు చేకూరుతాయి. అంతేకాక వారు నడవవలసిన పథంలో నడిచినవారు అవుతారు. అందుచేత వీళ్ళందరికీ ఏవిధంగా కళ్యాణమును సాధించిపెట్టాలి అని సభ జరుగుతోంది.

ఆ సభ జరుగుతున్న సమయంలో ఒక విచిత్రమయిన సంఘటన జరిగింది. సభలోకి గంగాదేవి ప్రవేశించింది. గంగమ్మ పరమ పవిత్రురాలు. ఆమె హిమవంతుని పెద్దకూతురు. సహజంగా ఆవిడ చాలా సౌందర్యరాశి. పార్వతీదేవికి తోబుట్టువు కనుక విశేషమయిన అందగత్తె. మహాసౌందర్యరాశి అయిన గంగ అక్కడ ఉండగా చతుర్ముఖ బ్రహ్మగారి సభలో వాయువు వీచింది. ఒక పెద్దగాలి వచ్చింది. ఆ గాలికి గంగాదేవి పమిట తొలగింది. ఇటువంటి సంఘటనలు అనుకోకుండా జరిగినవి కావు. వీటి వెనుక ఆదిపరాశక్తి అయిన అమ్మవారి ప్రణాళిక ఏదో ఉంటుంది.

గంగాదేవి పమిట తొలగగా బ్రహ్మగారి సభలో వున్న అందరూ తలలు వంచుకుని కూర్చున్నారు. కాని ఆ సభలో కూర్చున్న గోభిషుడు అనే ఒక రాజర్షి మాత్రం తదేక దృష్టితో గంగమ్మను చూస్తున్నాడు. ఆశ్చర్యకరంగా గంగమ్మ కూడా రాజర్షి వంక తదేక దృష్టితో చూస్తోంది. వారిద్దరి యందు కామము అతిశయించింది. వారిరువురు కూడా తాము చతుర్ముఖ బ్రహ్మగారి సభయందు ఉన్నామన్న విషయమును మరచిపోయారు. ఈ సంఘటన వెనుక ఏదో పెద్ద ప్రణాళికా నిర్మాణం జరిగిందని మీరు అర్థం చేసుకోవాలి. ఈ సంకల్పములు మనకి అర్థం అయ్యేవి కావు. కథ నడిస్తే మనకి అర్థం అవుతుంది.

అపుడు బ్రహ్మగారికి వారి ప్రవర్తనను చూసి ఆశ్చర్యం వేసింది. బ్రహ్మగారి సభలోకి వచ్చి గంగమ్మ ఇలా ప్రవర్తించడమేమిటి, రాజర్షి అలా ప్రవర్తించడమేమిటా అని అనుకున్నారు. అనుకుని వారిద్దరినీ శపించారు. ‘ఇలా సమయాసమయములు లేకుండా కామ ప్రచోదనం కలిగి ప్రవర్తించావు కాబట్టి నీవు భూలోకమునందు జన్మించెదవు గాక’ అని రాజర్షిని శపించారు. గంగమ్మను ‘నీవు కూడా ఆ రాజర్షికి భార్యవై కొంతకాలం భూలోకమునందు జీవించెదవు గాక’ అని శపించారు. తదనంతరం ‘శరీరం విడిచిపెట్టిన తరువాత మరల స్వర్గలోకమునకు వస్తావు’ అని శాపవిమోచనం చెప్పారు. ఆకారణం చేత రాజర్షి తానూ ఎవరి కడుపున జన్మించాలి అని చూస్తున్నాడు.

ఆ కాలంలో భారత వర్షంలో ప్రతీపుడు అనే గొప్ప మహారాజు భరతవంశంలో జన్మించాడు. మహాధర్మమూర్తి. బిడ్డలు లేరు. ప్రతీపుడిని చూసి ఆయనకు కుమారుడిగా జన్మించాలి అని నిర్ణయం తీసుకున్నాడు. ఆయన ఆ నిర్ణయం తీసుకొని ప్రతీపుడి కుమారుడిగా జన్మిద్దామని భూలోకంలో ప్రవేశించే సమయంలో గంగమ్మ బ్రహ్మలోకం నుంచి దిగి క్రిందికి వస్తోంది. ‘అయ్యో నేనెంత పొరబాటు చేశాను. నేనయినా ఆ సమయంలో పమిట సర్దుకుని సరిగా ప్రవర్తించి ఉంటే పాపం ఆ రాజర్షికి అన్ని ఇబ్బందులు వచ్చి ఉండేవి కావు. నేను చాలా పొరపాటుగా ప్రవర్తించాను. నేను చేసిన పొరపాటు పని సరిదిద్దుకోవాలంటే బ్రహ్మగారు ఇచ్చిన శాపం వలన మర్త్యలోకంలో జన్మించి ఆ రాజర్షి ఎవరిగా జన్మిస్తున్నాడో ఆయన భార్యగా కొంతకాలం ఉండాలి’ అనుకుంది. ఈ సంకల్పం చేసి వస్తున్నప్పుడు అష్ట వసువులు ఆమెకు రోదన చేస్తూ కనపడ్డారు. ఆవిడ వారిని చూసి ‘మీరు ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు అంత బాధగా ఉన్నారు’ అని అడిగింది. అపుడు వాళ్ళు ఒక చిత్రమయిన విషయమును ప్రతిపాదన చేశారు. ‘మేము అష్టవసువులము. భార్యలతో కలిసి ఆకాశమార్గములో వెళ్ళిపోతున్నాము. అలా వెళ్తూ వశిష్ఠ మహర్షి ఆశ్రమం మీదుగా మేము ప్రయాణం చేస్తున్నాము. మేము వసిష్ఠ మహర్షి ఆశ్రమమును చూశాము. అందులో ‘నందిని’ అనే కామధేనువు ఉంది. అది తెల్లని పర్వతాకారంలో ఉండి మెరిసిపోతూ మిక్కిలి ప్రకాశంతోనూ, తేజస్సుతోనూ ఉంది. దానిని ‘దయు’ అనబడే వసువు భార్య చూసి ‘అది మామూలు ఆవేనా’ అని భర్తను అడిగింది. అపుడు ఆయన అది మామూలు ఆవు కాదు – దానిని కామధేనువు అంటారు – దాని పాలు త్రాగితే ఎటువంటి కోరికయినా తీరుతుంది’ అని చెప్పాడు. అపుడు ‘ద్యు’ భార్య అంది –‘నాకు ‘ఉసీనర’ అనే స్నేహితురాలు వుంది. ఆమె కొద్దిగా రోగగ్రస్తయై వార్ధక్యమును పొందింది. ఆవిడకు మరల యౌవనం వస్తే నాతోపాటు సంతోషంగా గడుపుతుంది. అందుకని మనం ఈ కామధేనువుని అపహరిద్దాం. వశిష్ఠుడు ఆశ్రమంలో లేడు. కామదేనువును అపహరించి తీసుకువెళ్ళి దానిపాలు ఉసీనరకి పట్టిద్దాము’ అంది. భార్య మాట కాదనలేక తోటి వసువులతో కలిసి ‘ద్యు’ ఆ కామదేనువును అపహరించి తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ సమయంలో వశిష్ఠమహర్షి సాయంకాలం పూజకోసమని దర్భలు మొదలయినవి సేకరించదానికని వెళ్ళారు. వారు తిరిగివచ్చి ఆశ్రమంలో చూశారు. నందినీధేనువు కనపడలేదు. అంతటా వెతికారు. వెతికి ఒకసారి తపోనిష్ఠలో కూర్చుని ఆచమనం చేసి దివ్యదృష్టితో చూశారు. అష్టవసువులు కామదేనువును అపహరించినట్లు తెలుసుకున్నారు. ఆయన అష్టావసువులను మీరు భూలోకమునందు జన్మించెదరు గాక’ అని శపించారు. ఈ వార్తా తెలిసి అష్ట వసువులు పరుగు పరుగున వచ్చి వశిష్ఠమహర్షి పాదాలమీద పడి మీరు మాయందు అనుగ్రహించి మాకు శాపానుగ్రహమును తగ్గించేతట్లు చేయండి’ అని ప్రార్థించారు. అపుడు ఆయన అన్నారు – ‘మీరు ఎనమండుగురు వసువులు. మీ ఎనమండుగురిలో ఏడుగురియందు పాపము తీవ్రత తక్కువగా ఉన్నది. వారు కేవలం ‘ద్యు’కి సహకరించారు. కానీ అపహరించడానికి ప్రధానమయిన కారణము ‘ద్యు’. అందుచేత మీరు ఏడుగురు పుట్టినటువంటి వెంటనే మరణిస్తారు. నరులుగా జన్మిస్తారు. కానీ జన్మించిన కొద్ది గంటలలో శరీరం వదిలిపెట్టేస్తారు. అలా వదిలి పెట్టేసి వసువులు అయిపోతారు. కానీ ప్రధాన పాత్ర పోషించిన ‘ద్యు’ మాత్రం పరాక్రమవంతుడై, కనీవినీ ఎరుగని చరిత్రను సృష్టించి భూలోకము నందు కొంతకాలము ఉండి తరువాత తిరిగి బ్రహ్మైక్యమును పొందుతాడు. అందుకని ‘ద్యు’ మాత్రము కొంతకాలము భూలోకము నందు ఉండవలసినదే’ అని ఆయన శాపవిమోచానమును కటాక్షించారు.

ఆ ఎనమండుగురు ఇపుడు భూలోకంలో జన్మించాలి. అందుకని వాళ్ళు బాధపడుతూ వస్తున్నారు. వారికి గంగమ్మ ఎదురయింది. ‘అమ్మా నీవు భూలోకమునకు ఎందుకు వెడుతున్నావు’ అని అడిగారు. అపుడు గంగమ్మ జరిగిన విషయం వారికి చెప్పి – ‘రాజర్షి ఎక్కడ జన్మిస్తాడో అక్కడ ఆయన భార్యను కావాలని వెళుతున్నాను’ అంది. అపుడు వాళ్ళు –‘అయితే అమ్మా, మాకు ఒక ఉపకారం చేసిపెట్టు. నీవు ఎలాగూ భూలోకం వెళుతున్నావు కనుక నీకడుపున మేము ఎనమండుగురం పుడతాము. నువ్వు మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుని శాపవిమోచనం కోసం మాకొక సహాయం చేసిపెట్టాలి. భూలోకంలో ఏ తల్లి కూడా పుట్టిన బిడ్డలను చంపదు. కన్నతల్లికి ఉండే మమకారం అటువంటిది. మాకు శాపవిమోచనం కలగాలి. మేము నీకు బిడ్డలుగా జన్మిస్తాము. నీవు మాయందు అనుగ్రహించి పుట్టిన వెంటనే మేము వసువుల స్థానమును అలంకరించడానికి వీలుగా ఆ శరీరం విడిచి పెట్టేటట్లుగా మమ్మల్ని కటాక్షించు’ అని కోరారు. అపుడు గంగమ్మ ‘తప్పకుండా అలాగే చేస్తాను’ అని వారికి అభయం ఇచ్చింది. కాబట్టి గంగమ్మ ఎవరిని వివాహం చేసుకుంటుందో చూసి ఆవిడ కడుపులోకి వద్దామని వసువులు ఎదురు చూస్తున్నారు.

ఇది ఇలా జరిగితే గంగాతీరము నందు భారతవంశములో జన్మించిన ప్రతీపుడు అనే చక్రవర్తి పుత్రార్థియై తపిస్తున్నాడు. ఆయనకీ సామ్రాజ్యం ఉంది. సత్యం ఉంది, ధర్మం ఉంది. అన్ని భోగములు ఉన్నాయి. కానీ సంతానము లేదు. ఈశ్వరానుగ్రహమును ఆపెక్షించి ఆయన గంగాతీరంలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు. ఈయనను గంగమ్మ చూసింది ప్రతీపుడే తాను ఇంతకుపూర్వం బ్రహ్మసభలో చూసిన వ్యక్తి ఆయనే ఈ జన్మ తీసుకున్నాడు అనుకుంది. ఆయనను వివాహం చేసుకోవాలని అనుకుంది. ఆయన తపస్సులో కళ్ళు మూసుకుని ఇంద్రియములను వెనక్కు తీసుకుని తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. గంగమ గబగబా బయటకు వచ్చి ఆయన కుడి తొడమీద కూర్చుంది. ఎంత ఆశ్చర్యకరమయిన విషయమో చూడండి. కూర్చుంటే ఆయనకు బాహ్యస్మృతి కలిగింది. తన తొడమీద కూర్చున్న స్త్రీ ఎవరా అని చూశాడు. ఆ కూర్చున్న ఆమె గొప్ప సౌందర్యరాశి. ఆయన అన్నాడు – అమ్మా నీవు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎందుకు ఇలా నా కుడి తొడమీద కూర్చున్నావు అని అడిగాడు. ఆవిడ అంది – నన్ను గంగ అంటారు. నేను గంగానదికి అధిష్ఠాన దేవతను. నీకు భార్యను కావాలని వచ్చాను. అందుకని నీ ఒళ్ళో కూర్చున్నాను అంది. అపుడు ఆయన అన్నాడు. నీవు నా భార్యవి కావాలని అనుకున్నావు. క్షత్రియులను, విశేషించి రాజులను దక్షిణ నాయకులు అంటారు. దక్షిణ నాయకునికి ఒకరికంటే ఎక్కువమంది భార్యలు ఉంటారు. నీవు నన్ను భర్తగా పొందాలని వచ్చావు. కానీ ఒక పొరపాటు చేశావు. వచ్చి నా కుడి తొడమీద కూర్చున్నావు. కుడి తొడమీద కూర్చునే అధికారం ఒక్క కూతురికి కోడలికి మాత్రమే వుంది. ఎప్పుడయినా భార్య కూర్చోవలసి వస్తే భర్త ఎడమ తొడమీద కూర్చోవాలి. కానీ ఇపుడు నీవు వచ్చి నా కుడి తొడమీద కూర్చున్నావు. ఇపుడు నీవు నా కోడలితో సమానం లేక నా కూతురితో సమానం. నిన్ను నా కూతురితో సమానం అనడానికి వీలులేదు. నీవు నన్ను భర్తగా పొందాలని అనుకున్నావు. కాన నాతొ సామానమయిన వాడు నా కొడుకు. ‘ఆత్మావై పుత్రనామాసి’ నా తేజస్సు నా కుమారునియందు ఉంటుంది. అందుకని నీవు నా కుమారుడికి భార్యవు అవుదువు గాని. అలా నీకు వరం ఇస్తున్నాను అన్నాడు.

ఇప్పుడు ఆ పైనుంచి వస్తున్నా గోభిషుడు అనే రాజర్షి చూశాడు. ఇప్పుడు నాకు అవకాశం దొరికింది. గంగమ్మను భార్యగా పొందాలి కాబట్టి నేను ఈ ప్రతీప మహారాజుగారి కుమారుడిగా జన్మిస్తాను’ అని ఆయన తెజస్సులోకి ప్రవేశించి శంతన మహారాజు అనే పేరుతొ జన్మించాడు.