శంతన మహారాజు పెరిగి పెద్దవాడయిన తరువాత అతనికి ప్రతీపుడు పట్టాభిషేకం చేసి ఒకమాట చెప్పాడు. ‘నేను ఒకప్పుడు గంగాతీరమునందు తపస్సు చేస్తూ ఉండగా నాకొక స్త్రీ కనపడింది. ఆమె నా కుడి తొడమీద కూర్చుని నన్ను భర్తగా పొందాలని అనుకుంది. నిన్ను నా కోడలిని చేసుకుంటాను అని ఆమెకు మాట ఇచ్చాను. అందుకని గంగాతీరములో మెరుపు తీగవంటి ఒక కన్య కనపడుతుంది నీవు ఆ కన్యను భార్యగా స్వీకరించు’ అని చెప్పి ఆయన తపోభూములకు వెళ్ళిపోయాడు.

శంతన మహారాజు గారికి వేట అంటే చాలా ఇష్టం. ఒకనాడు వేటాడదానికి వెళ్ళాడు. వెళ్ళి తిరిగి వస్తూ విశ్రాంతికోసమని గంగాతీరంలో కూర్చున్నాడు. అక్కడ ఆయనకు గంగమ్మ కనపడింది. కనపడితే తన తండ్రిగారు చెప్పిన స్త్రీ ఈమెయే అనినమ్మి ఆవిడను వివాహం చేసుకోవదానికని ప్రయత్నించి ఆవిడతో మాట కలిపాడు. బిడ్డలు పుట్టినప్పుడు వెంటనే వాళ్ళు శరీరం వదిలిపెట్టేటట్టు చూస్తానని ఆవిడ వసువులకి మాట ఇచ్చి ఉన్నది. ఇప్పుడు రేపు భర్త అడ్డుగా నిలబడితే వాళ్లకి తానిచ్చిన మాట నిలబెట్టుకోవడం కుదరదు. అందుకని ఆవిడ అంది – ‘నేను నీకు భార్యను అవుతాను. కానీ నాదొక షరతు’ అంది. ‘ఏమీ నీ షరతు’ అని అడిగాడు శంతనుడు.

నే ఏపని చేసినా ఆడ శుభం కావచ్చు, అశుభం కావచ్చు. నేను ఏది మాట్లాడినా నువ్వు దానికి ఎదురు చెప్పకూడదు. నేను ఏ పనిచేసినా నువ్వు అంగీకరించాలి. నువ్వు ఏనాడు నాకు ఎదురుచేపుతావో ఆనాడు నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను. అలాగయితే నేను నిన్ను వివాహం చేసుకుంటాను’ అంది.

శంతనమహారాజు బాహ్యసౌందర్యమును చూసి ప్రేమించాడు. వివాహం చేసుకున్నాడు. మొట్టమొదట కొడుకు కలిగాడు. కొడుకు పుట్టగానే ఆయన స్థితి మారింది తండ్రి అయ్యాడు. కాబట్టి ఆయన ప్రేమంతా కొడుకు మీదకు వెళ్ళింది కొడుకు బహు అందగాడు. అందునా పెద్దకొడుకు. మొట్టమొదట పుట్టిన వాడు. కొడుకులు లేక తన తండ్రి ఎంత బాధపడ్డాడో తనకి తెలుసు. కొడుకు పుట్టాడు. పుట్టీ పుట్టగానే నెత్తురుతో ఉన్న బిడ్డను రెండు చేతులతో పట్టుకుని గంగమ్మ వెళ్ళి గంగలో వదిలి పెట్టేసింది. అనగా ఆవిడ ఇచ్చిన మాట అటువంటిది. ఏడుగురు వసువులకి ఆవిడ మరల స్వస్తితిని కల్పించాలి. అందుకని పుట్టిన బిడ్డను నీటిలో విదిచిపెట్టేసింది. శంతనుడు గంగంమకి వరం ఇచ్చాడు కాబట్టి ఏమీ అనలేకపోయాడు. ఊరుకున్నారు.

అలా ఒకసారి రెండుసార్లు మూడుసార్లు కాదు ఏడు సార్లు అయిపొయింది. ఏడుగురు కొడుకులను తీసుకువెళ్ళి గంగలో కలిపేసింది. ఎనిమిదవసారి మహా తేజోవంతమయిన కుమారుడు జన్మించాడు. ఎనిమిదవ మారు ఆ బిడ్డను తీసుకుని గంగవైపు వెళ్ళిపోతోంటే ఆయన అన్నాడు – ‘ఛీ రాక్షసీ! ఎవరయినా మాతృత్వమును కోరుకుంటారు. నీవేమిటి ఎంతమంది కొడుకులు పుట్టినా గంగలో పారేస్తూ ఉంటావు. ఇప్పడు ఈ పని ఎనిమిదవ మాటు చేస్తున్నావు. ఇంక నేను సహించను. నువ్వు ఆ పని చేయడానికి వీలులేదు’ అన్నాడు.

అప్పుడు గంగమ్మ నవ్వి అంది – ‘నువ్వు నేను చేసినపనికి ఎప్పుడు అడ్డుపెడతావో అప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతానని ముందరే చెప్పాను. ఇవాళ నువ్వు అడ్డుపెట్టావు. అందుకని నేను వెళ్ళిపోతాను’ అంది. ‘నీవు వెడితే వెళ్ళిపో. నా కొడుకును నాకు ఇచ్చి వెళ్ళు’ అన్నాడు. అంటే ఆవిడ అంది – ‘అది కుదరదు. నీకొడుకు కాదు. అతడు నాకు కూడా కొడుకే. పిచ్చి మహారాజా! నేను ఏదో చేసేశానని అనుకుంటున్నావు. నేను ఏడుగురు వసువులకి సహజస్తితిని ఇచ్చాను. వీడు ఎనిమిదవవాడు. వీడు బతకాలి. వీనిని తీసుకువెళ్ళి వసిష్ఠమహర్షి దగ్గర పరశురాముడి దగ్గర అస్త్ర విద్యనంతటినీ నేర్పి అపారమయిన ధనుర్విద్యా ప్రావీణ్యము వచ్చిన తరువాత తెచ్చి నీకు కొడుకుగా అప్పజెప్పుతాను. అప్పటి వరకు వీనిని నాదగ్గర ఉంచుకుంటాను’ అని చెప్పి కొడుకును తీసుకుని గంగమ్మ గంగాలోకి వెళ్ళిపోయింది.

తరువాత శంతన మహారాజు ఒక్కడే ఉండేవాడు. రాజ్యం ఎలుతున్నాడు. వేటకి వెడుతున్నాడు. అలా కొంతకాలం గడిచిపోయింది. గంగమ్మ చెప్పిన మాట మరచిపోయాడు.

ఒకనాడు గంగాతీరంలో తిరుగుతున్నాడు. అక్కడ మంచి యౌవనంలో వున్న వ్యక్తి అద్భుతంగా బాణ ప్రయోగం చేయడం చూశాడు. ఆ పిల్లవాడిని చూడగానే పితృప్రేమ పరవళ్ళు తొక్కింది. ‘నాకొడుకు కూడా వుంటే ఈ పాటికి ఇదే వయస్సులో ఉంటాడు’ అని బాబూ నీవెవరు ఏమిటి’ అని ఆరా తీశాడు. అపుడు గంగమ్మ వచ్చి ఈయనకు దేవవ్రతుడు అని పేరు పెట్టాను. ఈయన గాంగేయుడు. గంగాసుతుడు కనుక గాంగేయుడు. ఈయన వశిష్ఠమహర్షి దగ్గర పరశురాముడి దగ్గర ధనుర్విద్య, ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు. అన్ని విధములుగా రాశీ భూతమయిన రాజనీతిజ్ఞుడు. ధర్మమూ తెలిసి ఉన్నవాడు. పైగా విలువిద్యా నేర్పరి. నీ కొడుకును నీకు అప్పజెప్పుతున్నాను’ అని ఆ కొడుకును ఆయనకు అప్పజెప్పి ఆవిడ తిరిగి వెళ్ళిపోయింది.

అప్పటికి శంతనుడు వార్ధక్యంలోకి వచ్చేశాడు. కొడుకు దొరికినందుకు ఏంటో సంతోషంతో ఉన్నాడు. సభచేసి ఆ కొడుకును పరిచయం చేశాడు. ఆనందంగా రోజులు గడిచిపోతున్నాయి.

ఒకరోజు శంతనుడు మరల వేటకు వెళ్ళాడు. అక్కడ యోజనగంధి కనపడింది. సత్యవతీ దేవి యోజనగంధి. అంతకుముందు ఆవిడ దగ్గర చేపల కంపు వచ్చేది. వ్యాసమహర్షి జన్మించినపుడు పరాశర మహర్షి ఆమెకు వరం ఇచ్చాడు. ఆవిడ నిలబడిన చోటునుండి ఒక యోజన దూరం కస్తూరి వాసన వస్తుంది. ఆవిడ గంగాతీరంలో పడవమీద అందరినీ అటూ ఇటూ చేరుస్తూ ఉంటుంది.

శంతనుడు సత్యవతీ దేవిని చూసి వివాహం చేసుకోమని అడిగాడు. ఆవిడ అంది – ‘ నేను స్వేచ్ఛా విహారిణిని కాను. నా తండ్రి దాశరాజు ఉన్నాడు. నువ్వు నా తండ్రిని అడుగు. నా తండ్రి సమ్మతిస్తే నన్ను చేపట్టు. నా తండ్రి అంగీకరించకపోతే అప్పుడు నన్ను రాక్షస వివాహంలో పాణిగ్రహణం చేసి తీసుకు వెడుదువుగాని. నా తండ్రి అనుమతి తీసుకోనవలసినది’ అని చెప్పింది.

అప్పుడు శంతన మహారాజు గారు దాశరాజు దగ్గరకు వెళ్ళాడు. శంతనుని చూసి దాశరాజు వంగివంగి నమస్కారములు చేసి ‘అయ్యా, మీకు నేను ఏమి చేయగలవాడను’ అన్నాడు. అపుడు శంతనుడు ‘నీ కన్యకా రత్నమును నాకు ఈయవలసింది’ అన్నాడు. అప్పుడు దాశరాజు – ‘నాకూతురు సత్యవతిని నీకిచ్చి వివాహం చేస్తాను. కానీ రేపు పొద్దున్న నా కూతురు కడుపు పండి కొడుకు పుడితే ఆ కొడుక్కి రాజ్యం ఇస్తావా?” అని అడిగాడు. అపుడు శంతనుడికి దేవవ్రతుడు ఒక్కసారి మనస్సులో మెదిలాడు. పెద్దకొడుకు ఉన్నాడు. అతడు మహానుభావుడు. ధర్మజ్ఞుడు. గొప్ప విలువిద్యా విశారదుడు. అటువంటి కొడుక్కి రాజ్యం ఇవ్వకుండా ఇంత ముసలితనంలో ఈ సత్యవతీ దేవి కోసం తను కొడుకును ఎలా విడిచి పెట్టేసుకుంటాడు? మాట ఇవ్వలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు.

కానీ శంతనుడికి సత్యవతీ దేవి మీద మనస్సు ఉండిపోయింది. సరిగా నిద్రపట్టడం లేదు. ఆహారం తీసుకోవడం లేదు. అస్థిమితంగా తిరుగుతున్నాడు. కుమారుడు వెళ్ళి ‘నాన్నగారూ ఏమయింది’ అని అడిగాడు. ఈ విషయమును సూచాయిగా చెప్పాడు. మహానుభావుడు దేవవ్రతుడు తండ్రిగారి పరిస్థితిని గురించి మంత్రులను అడిగాడు. అడిగితె ‘మీనాన్న గారికి ఈ వయస్సులో మరల వివాహం మీదికి మనస్సు మళ్ళింది. సత్యవతిని వివాహం చేసుకోవాలనుకుంటున్నారు. కానీ దాశరాజు ఒక నియమం పెట్టాడు’ అని ఆ విషయములను తెలియజేశారు.

అపుడు దేవవ్రతుడు దాశరాజు దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి ‘అయ్యా మీ కుమార్తె అయిన సత్యవతీ దేవిని మా తండ్రిగారికి ఇచ్చి వివాహం చేయండి’ అని అడిగాడు. అడిగితె దాశరాజు అన్నాడు – తప్పకుండా చేస్తాను. కానీ నా కుమార్తెకు పుట్టే కొడుక్కి శంతన మహారాజు గారి రాజ్యం వస్తుందా?’ అని అడిగాడు. అప్పుడు దేవవ్రతుడు ‘ తప్పకుండా వస్తుంది. అసలు రాజ్యం నాకు కదా రావాలి. నేను రాజ్యమును పరిత్యాగం చేసేస్తున్నాను. నేను రాజ్యం తీసుకొను. మానాన్నగారి కోర్కె తీరడం కోసం నీ కుమార్తెను ఆయనకిచ్చి వివాహం చేయండి’ అన్నాడు. అపుడు దాశరాజు ‘ఇప్పటివరకు బాగుంది. కానీ రేపు నీకొక కొడుకు పుడతాడు. నువ్వు సహజంగా చాలా పరాక్రమ వంతుడవు. నీకు పుట్టే కొడుకు చాలా పరాక్రమవంతుడు అవుతాడు. అంట పరాక్రమ వంతుడయిన నీ కొడుకు సత్యవతీ దేవికి పుట్టిన కొడుకు రాజ్యపాలన చేస్తే ఊరుకుంటాడా? అందుకని భవిష్యత్తులో నీ కొడుకు నుంచి ప్రమాదం రాదనీ ఏమిటి హామీ?” అని అడిగాడు.

అపుడు దేవవ్రతుడు ప్రతిజ్ఞచేశాడు. ‘నీకు ఆ అనుమానం ఉన్నది కనుక తండ్రి మాట నిలబెట్టి, తండ్రి గౌరవమును, తండ్రి కోరుకున్న కోర్కెను తీర్చలేని కొడుకు ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత! మా తండ్రిగారి కోసం నేను భీష్మమయిన ప్రతిజ్ఞ చేస్తున్నాను’ అన్నాడు. అది సామాన్యమయిన ప్రతిజ్ఞకాదు. వృద్ధుడయిన తండ్రికోసం ఇటువంటి ప్రతిజ్ఞచేశాడు. ఈ ప్రతిజ్ఞ చేసేసరికి దేవదుందుభులు మ్రోగి పైనుంచి పుష్ప వృష్టి కురిసింది. భీష్మించి ప్రతిజ్ఞచేశాడు కనుక ఆ రోజునుంచి ఆయనను భీష్ముడు అని పిలిచారు. ఆచరించి చూపించాడు కనుక ఆయనను భీష్మాచార్యుడు అని పిలిచారు.

ఈ విషయమును తండ్రిగారయిన శంతన మహారాజు విని తెల్లబోయాడు. ‘నీవు నాగురించి ఏంటో త్యాగం చేశావు. అందుకని నీకు రెండు వరములను ఇస్తున్నాను. ఒకటి – యుద్ధభూమిలో నీవు చేతిలో ధనుస్సు పట్టుకుని ఉండగా నిన్ను దేవేంద్రుడు కూడా ఓడించలేడు. రెండు – నీకు మరణము లేదు. స్వచ్ఛంద మరణమును నీకు ప్రసాదిస్తున్నాను. మరణము నీవు కోరుకుంటే వస్తుంది, లేకపోతే రాదు’ అని.