దేవహూతి కర్దమ ప్రజాపతిని సేవిస్తోంది. ఆయన తపస్సు పాటిస్తున్నాడు. నియమములు పాటిస్తున్నాడు. భర్త ఏమి చేస్తున్నాడో భార్య కూడా అదే చేస్తోంది. ఆయనకు బాహ్యస్మృతి లేదు. ఒకనాడు దేవహూతి చూడడానికి ఎంత అందంగా ఉండేదో, ఇప్పుడు అంత శుష్కించి పోయింది. ఆమె పార్వతీదేవి పరమశివుని సేవించినట్లు కర్దముని సేవించింది. కొంతకాలానికి ఒకరోజు కర్దముడు తపస్సులోంచి ఎందుకో ఒకసారి దేవహూతి వంక చూసి ఆశ్చర్యపోయాడు. నేను ఒకనాడు ఈమె సౌందర్యమును వర్ణన చేశాను. నాకోసం తపించడంలో, పరిశ్రమించడంలో ఇన్ని ఏర్పాట్లు చేయడంలో ఈవిడ ఇలా అయిపొయింది’ అనుకోని దేవహూతీ, నీ సేవలకి నేను సంతోషించాను. నీకు నావలన తీరవలసిన కోరిక ఏమి?’ అని అడిగాడు.

ఒక సౌశీల్యవంతురాలయిన స్త్రీ భర్తవలన తాను సంతానవతియై తల్లి కావాలని కోరుకుంటుంది. ఆవిడ అంది ‘ఈశ్వరా, మీరు నాకు పతిదేవులు. మీరు నన్ను కరుణించి నేను తల్లినయ్యే అదృష్టమును నాకు కటాక్షించండి’ అని కోరింది. అంటే అప్పుడు ఆయన ‘తప్పకుండా కటాక్షిస్తాను’ అని ఒక అందమైన మాట చెప్పాడు. ‘నీకు నేను చూడడానికి ఇలా ఒక ఆశ్రమంలో జటలు కట్టుకుని, ఉరఃపంజరము పైకి వచ్చేసి ఒక నారపంచె కట్టుకుని ఎప్పుడూ దండకమండలములు పట్టుకుని చాలా వెర్రివాడిలా, తపస్సు చేసుకుంటున్న వాడిలా ఏ భోగ భాగ్యములు లేని వాడిలా, ఇంకా చెప్పాలంటే ఎప్పుడూ భూషయనం చేసే వాడిలా కనపడుతున్నాను కదా! నాకు ఉన్న భోగములు ఎటువంటివో తెలుసా? ఈ భూమియందు సార్వభౌములమని సమస్త భూమండలమును ఏలగలమన్న చక్రవర్తులకు లేని భోగములు నాకున్నాయి.

నేను నిరంతరమూ శ్రీమన్నారాయణుని సేవించాను. అపారమయిన భక్తితో యోగమును అవలంబించాను. గొప్ప తపస్సు చేశాను. దానిచేత ఈశ్వరానుగ్రహంగా యోగశక్తి చేత కల్పింపబడవలసిన భోగోపకరణములు ఉన్నాయి. అవి సామాన్యులకు దొరికేవి కావు. వాటిని నేను నా తపశ్శక్తితో సృజిస్తున్నాను. అవి ఇతరులకు కనపడవు. వాటిని చూడడానికి వీలయియా దివ్యదృష్టిని నీకు ఇస్తున్నాను. భోగోపకరణములను చూడవలసినది’ అని దివ్యదృష్టిని ఇచ్చాడు.

ఆవిడ తెల్లబోయింది. ఒక పెద్ద భవనం వచ్చింది. ఆ భవనములో గొప్ప గొప్ప శయ్యా మందిరములు ఉన్నాయి. ఆ శయ్యా మందిరములకు ఏనుగుల దంతములతో చేయబడిన కోళ్ళు, కట్టుకోవడానికి వీలుగా వ్రేలాడుతున్న చీనీ చీనాంబరములు – బంగారము, వెండితో చేయబడిన స్తంభములు, వజ్రవైడూర్య మరకత మాణిక్యములు వాటికి తాపడం చేయబడ్డాయి. లోపల శయనాగారములు, బయట విశాలమయిన ప్రాంగణములు.

వీటన్నింటినీ చూసి ఆమె అలా నిలబడిపోయింది. ఈ స్థితిలో వున్న దేవహూతికి ఉత్తరక్షణంలో ఇవన్నీ కనబడ్డాయి. అపుడు కర్దమ ప్రజాపతి “దేవహూతీ, అదిగో బిందు సరోవరము. అందులో దిగి స్నానం చేసి బయటకు రా’ అన్నాడు. వచ్చేసరికి ఇంతకు పూర్వం దేవహూతి ఎంత సౌందర్యంగా ఉండేదో దానికి పదివేల రెట్లు అధిక సౌందర్యమును పొందింది. అక్కడ ఒక వేయిమంది దివ్యకాంతలు కనపడ్డారు. వాళ్ళు ఆమెకు పట్టు పుట్టములు కట్టి, అంగరాగముల నలది ఆమె చక్కటి కేశపాశమును ముడివేసి అందులో రకరకములయిన పువ్వులు పెట్టి ఒక నిలువుతడ్డంపట్టుకువచ్చి ఆవిడ ముందుపెట్టి సోయగమును చూసుకోమన్నారు. అద్దంలో తన సోయగమును చూసుకుని, వెంటనే తన భర్తను స్మరించినది. ఉత్తరక్షణం కర్దమ ప్రజాపతి ప్రత్యక్షం అయ్యాడు. మనం ఎవరూ అనుభవించని భోగాలు అనుభవిద్దాం, రావలసింది’ అని విమానం ఎక్కించాడు. ఈ విమానం సమస్త లోకముల మీద ఎవరికీ కనపడకుండా తిరగగలిగిన విమానం. అటువంటి విమానంలో వాళ్లు తిరుగుతున్నారు. భోగములను అనుభవిస్తూ ఇద్దరూ ఆనందంగా క్రీదిస్తూ వుండగా ఆ విమానం మేరు పర్వత శిఖరముల మీద దిగింది. వారు మేరు పర్వత చరియలలోకి వెళ్ళారు. అక్కడ గంధర్వులు యక్షులు కిన్నరలు కిపురుషులు దేవతలు ఉన్నారు. గ్రహములన్నీ ఆ మేరు పర్వతమును చుట్టి వస్తుంటాయి. ఆ మేరు పర్వత చరియలలో దేవహూతితో కలిసి కొన్ని సంవత్సరములు అలా భోగములను అనుభవిస్తూనే ఉన్నాడు. అలా భోగములను అనుభవిస్తూ ఉండగా వారికి తొమ్మండుగురు ఆడపిల్లలు పుట్టారు. తొమ్మిదవ పిల్ల పుట్టిన తరువాత కర్దమ ప్రజాపతి ‘మనం ఎన్నాళ్ళ నుండి భోగం అనుభవిస్తున్నామో నీకు గుర్తుందా దేవహూతీ?’ అని అడిగాడు. ఆవిడ ‘అయ్యో, తొమ్మండుగురు ఆడపిల్లలు జన్మించారు. పెద్దపిల్ల పెళ్ళి ఈడుకు వచ్చేస్తోంది. జ్ఞాపకమే లేదు. కాలము క్షణంలా గడిచిపోయింది’ అంది.

ఆయన ఇన్ని భోగములను అనుభవిస్తూ ఇవి భోగములు కాదని మనసులో నిరంతరమూ తలుచుకుంటున్నాడు. వైరాగ్యము బాగా ఏర్పడుతోంది. వైరాగ్య భావన మనస్సులో ఉండాలి. అది పండు పండిన నాడు భార్యకు చెప్పి వెళ్ళిపోవాలి. అందుకని దేవహూతీ, నేను సన్యాసం తీసుకుని వెళ్ళిపోతున్నాను”. అన్నాడు. అప్పుడు దేవహూతి ‘నిన్ను ఆపాను, నువ్వు పండడమే నాకు కావాలి. గృహస్థాశ్రమంలోకి వచ్చినందుకు నువ్వు పండాలి. కానీ నాది ఒక్క కోరిక. నాకు తొమ్మండుగురు ఆడపిల్లలను ఇచ్చావు. ఇప్పుడు వీరికి యోగ్యమైన వరుడిని తేవాలి. నేను ఆడదానిని ఏమీ తెలియవు. అందుచేత ఇంటికి రక్షణగా నాకు ఒక కొడుకును ప్రసాదించి వెళ్ళు. ఆ కొడుకు మరల నన్ను సంసార లంపటమునందు తిప్పేవాడు కాకూడదు. ఆ కొడుకు నన్ను ఉద్ధరించే వాడు కావాలి. నన్ను కూడా జ్ఞానము వైపు తిప్పేవాడు కావాలి. అటువంటి వాడు కూతుళ్ళను గట్టెక్కించగలవాడు అయిన ఒక కొడుకును ఇచ్చి వెళ్లవలసినది’ అని అడిగింది.

అపుడు ఆయన ‘సెహబాష్! గొప్ప కోరిక కోరావు. నీకు ఒక కుమారుడిని ఇవ్వడానికి నేను అంగీకరిస్తున్నాను’ అన్నాడు. తదుపరి కర్దమ ప్రజాపతి తెజస్సునండు శ్రీమన్నారాయణుడు ప్రవేశించాడు. పిమ్మట దేవహూతి గర్భములోనికి ప్రవేశించి ఆయన కుమారుడయి కపిల భగవానుడు అని పేరుతో బయటకు వచ్చాడు.

కపిల మహర్షి జన్మిస్తే, సంతోషమును ప్రకటించడానికి మరీచి మొదలగు మహర్షులతో బ్రహ్మగారు వచ్చారు. ‘కర్దమా, నిన్ను నేను సృష్టించి ప్రజోత్పత్తి చేయమని చెప్పాను. నీవు కేవలము ప్రజోత్పత్తి చేస్తూ ఉండిపోలేదు. గృహస్థాశ్రమము లోనికి వెళ్ళి, ప్రజోత్పత్తి చేసి ధర్మబద్ధమయిన భోగమును అనుభవించి వైరాగ్యమును పొంది, వైరాగ్యము వలన సంయసిన్చుటకు సిద్ధపడి, భార్య కోర్కె తీర్చడానికి ఈశ్వరుడిని కొడుకుగా పొందావు. కపిలుడిని సేవించి నీ భార్య దేవహూతి మోక్షమును పొందుతుంది. సన్యాసాశ్రమమునకు వెళ్ళి నీవు మోక్షం పొందుతావు’ అన్నాడు. ఇదీ గృహస్థాశ్రమంలో ప్రవర్తించవలసిన విధానం.

చతుర్ముఖ బ్రహ్మ గారు వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిన తరువాత కర్దమ ప్రజాపతి తన కుమార్తెలను ఎవరికీ ఇచ్చి వివాహం చెయ్యాలా అని ఆలోచించారు. ఇంటి పెద్ద, తండ్రిగారయిన చతుర్ముఖ బ్రహ్మగారు ఉన్నారు. ఆయన నిర్ణయం చేయాలి. బ్రహ్మగారు ‘నీకు కలిగిన తొమ్మండుగురు పిల్లలను తొమ్మండుగురు ఋషులకు ఇచ్చి వివాహం చేయి’ అని చెప్పారు. ఆయన సూచన ప్రకారం తన కుమార్తె ‘కళ’ను మరీచి మహర్షికి, అత్రి మహర్షికి ‘అనసూయ’ను, అంగీరసునకు ‘శ్రద్ధ’ను, పులస్త్యునకు ‘హవిర్భువు’ అనే అమ్మాయిని, పులహునకు ‘గతి’ ని, క్రతువునకు ‘క్రియ’ను భృగువునకు ‘ఖ్యాతి’, వసిష్ఠునకు ‘అరుంధతి’, అధర్వునకు ‘శాంతి’ – అలా తొమ్మండుగురు ఋషులకు, తొమ్మండుగురు కన్యలు ఇచ్చి కన్యాదానం చేశాడు. చేసిన తరువాత తను సన్యసించి వెళ్ళిపోయే ముందు లోపలికి వెళ్ళాడు. చంటి పిల్లవాడయిన కపిలుడు పడుకొని ఉన్నాడు. ఆయన ఎవరో కర్దమునికి తెలుసు. చంటి పిల్లవానిగా వున్న పిల్లాడి ముందు తండ్రి నమస్కరించి స్తోత్రం చేశాడు. ‘మహానుభావా, మీరు ఎందుకు జన్మించారో నాకు తెలుసు. మీరు శ్రీమన్నారాయణులు. నన్ను ఉద్ధరించడానికి జన్మించారు. కొడుకు పుట్టకపోతే నాకు పితృ ఋణం తీరదు. అందుకని కొడుకుగా పుట్టి పితృ ఋణం నుండి నన్ను ఉద్దరించారు. అసలు మీ సౌజన్యమునకు హద్దు లేదు. తండ్రీ, మీకు నమస్కారము. అన్నాడు. అపుడు ఆయన అన్నాడు ‘ఇంతకుపూర్వం నేను ఈ భూమండలం మీద జన్మించి సాంఖ్యమనే వేదాంతమును బోధ చేశాను. తత్త్వము ఎన్ని రకాలుగా ఉంటుందో సంఖ్యతో నిర్ణయించి చెప్పడమును సాంఖ్యము అంటారు. కానీ లోకం మరిచిపోయింది. మళ్ళీ సాంఖ్యం చెప్పడం కోసం నీకు కొడుకుగా పుట్టాను. నీకు కొడుకుగా పుడతాను అని మాట ఇచ్చాను, తప్పలేదు, పుట్టాను. నాయనా, నువ్వు సన్యసించి వెళ్ళిపో. నీవు మోక్షమును పొందుతావు’ అన్నాడు.

అపుడు కర్దమ ప్రజాపతి ‘నా భార్య నీకు తల్లి అయిన దేవహూతిని నీవు ఉద్ధరించాలి’ అన్నాడు. ‘తప్పకుండా ఉద్ధరిస్తాను’ అన్నారు స్వామి.