పృథు మహారాజు ఎప్పుడయితే పిండుకున్నారో దేవతలు అందరూ పరుగెత్తుకు వచ్చారు. ఇంద్రుడిని దూడగా వదిలారు. అమ్మ వాళ్లకి ‘వీర్యము’, ‘ఓజము’, ‘ఋతము’ అనబడేటటువంటి మూడింటిని విడిచిపెట్టింది.

రాక్షసులు ప్రహ్లాదుడిని దూడగా చేసుకొని లోహ పాత్రలలో మూడు రకముల సుర పిండుకున్నారు. గంధర్వులు అప్సరసలు విశ్వావసుని దూడగా వదిలి పద్మంలోకి సౌందర్యమును మధువును పిండుకున్నారు. అందుకే పద్మము అంత సౌందర్యంగా ఉంటుంది. పితృగణములు అర్యముని దూడగా చేసి పచ్చి మట్టి పాత్రలో దవ్యమును పిండుకున్నారు. సిద్ధులు కపిల మహర్షిని దూడగా చేసి ఆకాశమనే పాత్రలోకి సిద్ధులు పిండుకున్నారు. అందుకే వాళ్ళు ఆకాశగమనం చేయగలుగుతుంటారు. కింపురుషులు మయుడిని దూడగా చేసి యోగమనే పాత్రలోనికి ధారణ అనే శక్తిని పిండుకున్నారు. యక్ష భూత పిశాచాది గణములు రుద్రుడిని దూడగా చేసుకుని కపాలంలోకి రక్తమును పిండుకున్నారు. పాములు తక్షకుడిని దూడగా చెసుకొఇ తమ పుట్టలనబడే పాత్రలలోకి ‘పురువులు’ ‘ఫలములు’ అనే వాటిని పిండుకున్నాయి. వృక్షములు తమ పట్టలలోనికి రసమును పిండుకున్నాయి. అందుకే మనకి అన్ని రకముల రుచులు చెట్లనుండే వస్తాయి. అవి ఆయా రుచులను కలిగి వుంది మనకు రసపోషణం చేస్తున్నాయి. అలా పృథు మహారాజు ఆనాడు ఎవ్వరూ పొందనటువంటి విజయమును సాధించి భూమండలమును అద్భుతముగా పరిపాలన చేస్తున్నాడు. ప్రజలు అందరూ పరమ సంతోషంగా జీవితములను గడుపుతున్నారు. ఇటువంటి స్థితిలో ఆయన నూరు అశ్వమేధ యాగములు చేయాలి అని సంకల్పించాడు. బ్రహ్మావర్తము అని స్వాయంభువ మనువు పరిపాలించిన ప్రాంతమునకు వెళ్ళి ‘సరస్వతి’ ‘తృషద్వతి’ అనబడే రెండు నదుల మధ్య ప్రాంతంలో యజ్ఞశాల కట్టి 99 అశ్వమేధ యాగములు చేశాడు. నూరావడి చేస్తుండగా దేవేంద్రుడు ఒక విచిత్రమైన రూపంతో పెద్ద పెద్ద జటలు కట్టుకుని వచ్చి ఆ యాగాశ్వమును ఎత్తుకు పోతున్నాడు. దానిని అత్రిమహర్షి కనిపెట్టాడు. బాణం వేసి యాగాశ్వమును వెనక్కి తెమ్మన్నారు. పృథు మహారాజు బయలుదేరాడు. కానీ జటలు కట్టుకుని ఋషి వేషధారియై ఉన్న వాడిమీద బాణం వేయడానికి అనుమానపడ్డాడు. అత్రిమహర్షి అన్నారు ‘గుర్రమును ఎత్తుకు పోతున్న వాడు ఇంద్రుడే. నువ్వు నిర్భయంగా అబానం వదిలెయ్యి అన్నాడు. బాణం వదలడానికి పృథు కుమారుడు సిద్ధపడ్డాడు. ఇంద్రుడు భయపడి ఆ రూపమును, అశ్వమును విడిచిపెట్టి పారిపోయాడు. ఇంద్రుడు అపహరించిన గుర్రమును వెనక్కి తెచ్చాడు కాబట్టి అతనికి ‘విజితాశ్వుడు’ అని పేరు పెట్టారు.

మరల యజ్ఞం జరుగుతోంది. ఒకరోజు ఇంద్రుడు తన శక్తితో చీకట్లు కమ్మేటట్లు చేశాడు. గాఢాంధకారంలో ఉండగా మరల యాగాశ్వమును అపహరించి తీసుకు వెళ్ళిపోయాడు. ఈసారి మరల అత్రి కనిపెట్టాడు. ఈసారి ఇంద్రుడు ఖట్వాంగము చేతితో పట్టుకుని దానిమీద ఒక పుర్రె బోర్లించి వెళ్ళిపోతున్నాడు. అటువంటి వాడు సాధారణంగా మాంత్రిక శక్తులను కలిగినటువంటి వాడు, కొంచెం సాధన చేసిన వాడు అయి ఉంటాడు. లేదా బ్రహ్మహత్యా పాప విముక్తి కోసం వెడుతున్న సాధు పురుషుడు కూడా అయి ఉంటాడు. కాబట్టి అతనిని వధించాలా వద్దా అని పృథువు అనుమాన పడుతున్నాడు. అపుడు అత్రి ‘నీవేమీ బెంగ పెట్టుకోనవసరం లేదు. అతడు ఇంద్రుడే. బాణం వెయవలసింది’ అని చెప్పాడు. పృథువు బాణం తీశాడు. అపుడు ఇంద్రుడు ఆ రూపమును, గుర్రమును అక్కడ వదిలిపెట్టి పారిపోయాడు. ఇంద్రుడు వదిలిపెట్టిన రూపమునకు ‘పాఖండరూపము’ అని పేరు. పాఖండము అంటే పాప ఖండము. అందులోంచి పాషండులు పుట్టారు. వాళ్ళు పైకి చూడడానికి వేదమును అంగీకరించి యజ్ఞయాగాది క్రతువులను చేసేవారిలా కనపడతారు. కానీ వాళ్ళు వేదం విరుద్ధమయిన మార్గంలో ప్రయాణిస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల ధర్మం గతి తప్పిపోతుంది. రెండుమార్లు యాగాశ్వమును అపహరించాడనే కోపంతో పృథువు యజ్ఞం పాడయిపోతే పాడై పోయిందని లేచి నిలబడి ధనుస్సు పట్టుకుని బాణమును సంధించి ఇంద్రుని మీదకి వదలడానికి సిద్ధపడ్డాడు. అపుడు ఋషులు ‘నీవు యజమానివి. నీవు ఎందుకు బాణం వదలడం? నీవు చేస్తున్న నూరవ యజ్ఞం పాడుచేశాడు కనుక మా మంత్రశక్తి చేత ఈ హోమంలో ఇంద్రుడిని పారేస్తాము’ అన్నారు.

అపుడు ఇంద్రుని మీద క్షాత్ర శక్తి, తపశ్శక్తి రెండూ కలిసిపోయాయి. అపుడు చతుర్ముఖ బ్రహ్మ గారు పరుగెత్తుకుంటూ వచ్చారు. ఆయన అన్నారు ‘మీరిద్దరూ పొరపాటు పడ్డారు మీకింత తపశ్శక్తి ఉన్నది ఇంద్రుడిని అగ్నిహోత్రంలో పారెయ్యడానికా! పృథూ నీకింత క్షాత్ర శక్తి వున్నది ఇంద్రుడిని బాణం వేసి సంహరించడానికా! మీరు ఇద్దరు చేసింది పొరబాటే’ అన్నారు. అదే సమయానికి ఆశ్చర్యకరంగా సభలోనికి పూర్ణాంశతో శ్రీమహావిష్ణువు వచ్చారు. పృథువు స్తోత్రం చేసి నమస్కరించాడు. స్వామి గరుడవాహనం దిగి ‘పృథూ, ఇప్పటికి నీవు 99 అశ్వమేధ యాగములు చేశావు. ఇంకొకటి చేస్తే ఏమవుతుంది? సంఖ్య పెరుగుతుంది. ఇలా జరిగిపోతుంటే ఈ కర్మకు అంతమేమయినా ఉందా? 99 అశ్వమేధ యాగములు చేసి నీవు ఏమి తెలుసుకున్నావు? ఏమీ తెలియలేదు. ఇంద్రుడు అడ్డు వచ్చాడు కాబట్టి ఆయనను చంపి అవతల పారేస్తాను అంటున్నావు. అనగా నీకు దేహాత్మాభిమానము ఉండిపోయింది. ఇంద్రుడిని విడిచిపెట్టి ఉండి ఉంటే నీవు బ్రహ్మజ్ఞానివి అయిపోడువు. ఇంద్రుడి మీద బాణం వేయడంలో దేహాత్మాభిమానంతో క్రిందికి జారిపోయావు. అతడు అలా ఎందుకు చేశాడో నీవు గురించావా? నీయందు జ్ఞానము కలగాలని అది జరిగింది తప్ప ఇంద్రుడు నీయందు అమర్యాదగా ప్రవర్తించలేదు. కానీ అతని చర్య పైకి దోషంగా కనపడుతోంది. ఇందుకని నీవు బాణం వెయవలసింది ఇంద్రుని మీద కాదు. నేకు బోధ చేయడం కోసం ఇంద్రుడు విడిచిపెట్టినటువంటి రూపం నుండి అప్పుడే పాషండులు పుట్టి పాషండ మతవ్యాప్తి చేతున్నారు. వారి మాటలను విని సంతోషపడి పోయి వేలకొద్దీ జనం పాషండులు అయిపోతున్నారు. ఇపుడు నీవు నీ బాణం పట్టుకుని ఈ పాషండ మతమును నాశనం చెయ్యి’ అని చెప్పాడు. వెంటనే పృథువు ఇంద్రునితో స్నేహం చేశాడు.

పృథు మహారాజులో ఉన్న గొప్పతనం కేవలం భూమిని గోవుగా చేసి పితకడం కాదు. మనకి నవవిధ భక్తులు ఉన్నాయి.

శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం!

అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం!!

ఇందులో అర్చన భక్తికి పృథు మహారాజు గొప్పవాడు. పృథు మహారాజు జీవితంలో ఈ ఘట్టములను వింటే సంతానము లేని వాళ్లకు సంతానము కలుగుతుంది. ఇప్పుడు శ్రీమహా విష్ణువు ‘పృథూ, నీకేమి వరం కావాలో కోరుకో’ అన్నాడు. అడిగితే పృథు మహారాజు ‘స్వామీ, నన్ను మరల మోహపెడదామని అనుకుంటున్నావా! నాకెందుకు స్వామీ వరాలు. నాకు అక్కర్లేదు. నాకు ఏ వరం కావాలో తెలుసా! నీ పాదారవిందములను గూర్చి వర్ణన చేసి, నీ గురించి స్తోత్రం చేస్తుంటే, నీ కథలు చెపుతుంటే అలా విని పొంగి పోయేటటువంటి స్థితి నాకు చాలు. మోక్షం వస్తే నీలో కలిసిపోవడం వలన మరల నాకు ఆ శ్రవణానందం దొరకదు. ఈశ్వరుడి కథలు చెపుతుంటే విని పొంగిపోయే అదృష్టం ఉండదు. అందుకని నాకేమీ వరం అక్కర్లేదు. నీ కథలు వినగలిగినటువంటి అదృష్టమును నాకు కలిగించు’ అన్నాడు. ఇదీ పృథు మహారాజు గారి పూజా నిష్ఠ అంటే. అందుకే మనకి షోడశోపచారములు వచ్చాయి. ఇటువంటి అర్చనను చేశాడు పృథువు. అలా అర్చన చేస్తే ఈశ్వరుడు ఆయనపట్ల విశేషమయిన ఆనందమును పొందాడు.

ఒకనాడు సత్రయాగం చేసి అందరికీ బ్రాహ్మణుడు ఎలా జీవించాలో, క్షత్రియుడు ఎలా జీవించాలో, భూమిని ఎలా రక్షించాలో వారి వారి విధులను గూర్చి ప్రసంగం చేశాడు. ఇపుడు కర్మయందు శుద్ధి కలిగి భక్తికి దారి తీసింది. అపారమైన భక్తి వైరాగ్యమునకు దారితీసింది. ఒకరోజు సత్రయాగం జరుగుతుండగా సనకసనందనాది మహర్షులు క్రిందికి దిగారు. మహా పురుషులయిన వారు లేచి నడిచి వస్తున్నప్పుడు అంత తేజస్సు లేనివాడు కూర్చుంటే ఆయుర్దాయం తగ్గిపోతుంది. ప్రాణములు తమ తమ స్థానములలోంచి లేస్తాయి. అందుకని లేచి నిలబడితే అవి కుదురుకుంటాయి. అందుకని పెద్దలు వచ్చినపుడు నిలబడతారు. సనక సనందనాదులు రాగానే పృథువు లేచి నిలబడ్డాడు. వారిని అర్చించాడు. వారిని ఉచితాసనమున కూర్చోబెట్టి ‘స్వామీ, మేము సంసారమునందు వున్న తిన్గారులము. మేము ఎలా తరిస్తాము? మేము తొందరగా తరించడానికి ఏదయినా మార్గం ఉన్నదా? మాకు కృప చేయండి’ అని ‘బాహ్యమునందు ఒక వ్యక్తి చాలా ఐశ్వర్యవంతుడిలా కనిపించవచ్చు. ఒకడు దరిద్రుడిలా కనిపించ వచ్చు. కానీ అంతరమునందు ఒకడు ఈశ్వరుని దృష్టిలో గొప్ప ధనవంతుడు. వేరొకడు కటిక దరిద్రుడు. ఏకారణము చేత’ అని అడిగితె సనక సనందనాదులు ‘ఎవరు మహా పురుషుడిని ఇంటికి తీసుకువెళ్ళి ఆతిథ్యం ఇచ్చి గడప దాటించి వారి పాదములకు వంగి నమస్కరించి తన ఇంటిలో వున్న తృణమో పణమో వారికి సమర్పించి గృహస్థాశ్రమము సన్యాసాశ్రమమునకు భిక్ష పెట్టడానికి ఉపయోగిస్తున్నాడో అటువంటి వాడు ఈశ్వరుని దృష్టిలో అపారమైన ఐశ్వర్యవంతుడు’ అని చెప్పారు. వాళ్లు ఇంకా ఇలా అన్నారు ‘గృహస్థాశ్రమంలో ఉంది చాలా కాలం పాపకర్మల యందు మగ్నుడై ఈశ్వరుని వైపు తిరగని వాడు జీవితం తరించదానికి చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటో తెలుసా? భగవంతుని పాదములు పట్టి నమస్కరించ గలిగియా నిపుణత కలిగిన ఒక మహాభక్తునితో సేహం పెట్టుకో. మెల్లగా భగవంతునితో అనుబంధమును పెంచుకునేలా చేస్తారు. అటువంటి వారితో కలిసి తిరిగి సంబంధం ఏర్పరచుకుంటే ఆ భక్తి క్రమంగా నిష్కామ యోగమునకు దారితీసి ఉన్న ఒకే మట్టి ఇన్ని పాత్రలుగా కనపడుతోందన్న అనుభవం లోపల సిద్ధించి ఆ జ్ఞానమునండు నిలబడిపోయిన తరువాత ఘటము పగిలిపోతే కుండలో వున్న ఆకాశము అనంతాకాశంలో కలిసినట్లు నీవు మోక్ష పదవిని అలంకరిస్తావు. సుఖదుఃఖములను దాటి ఉపాధిని విడిచిపెట్టి జ్ఞానముచేత ఈశ్వరునిలో కలిసిపోతావు. సాయుజ్యము కలుగుతుంది’ అన్నారు.

సనక సనందనాదుల బోధ చేత జ్ఞానమును పొందిన వాడై కొడుకులకి రాజ్యం ఇచ్చేసి ఉత్తర దిక్కుకు ప్రయాణించి ఆశ్రమ వాసం చేసి, తపస్సు చేసి, ఇంద్రియములను గెలిచి, అంత్యమునందు తన గుదస్థానమునందు ఉన్న వాయువును ప్రేరేపించి పైకి కదిపి షట్చక్రభేదనం చేసి తనలో వున్న పృథివీ తత్త్వమును బ్రహ్మాండములో వున్న పృథువికి కలిపి జలమును జలమునకు కలిపి, ఆకాశమును ఆకాశమునకు కలిపి, తనలో వున్న తేజస్సును ఊర్ధ్వ ముఖం చేసి పునరావృత్తి రహిత విష్ణు సాయుజ్యము కొరకు బ్రహ్మాండమంతా ఆవరించివున్న విష్ణుశక్తి వ్యాపకత్వమునందు కలిపి వేశాడు. ఈవిధంగా పృథు మహారాజు పునరావృత్తి రహిత మోక్షమును పొందాడు. పిమ్మట ఆయన భార్య అర్చిస్సు వెంటనే భర్తకి తర్పణం విడిచి తలస్నానం చేసి అగ్నిహోత్రమునందు ప్రవేశించి శరీరమును విడిచి పెట్టి భర్తృ ధ్యానం చేతూ భర్త ఏ లోకమునకు వెళ్ళిపోయాడో ఆవిడ కూడా ఆలోకమునకు వెళ్ళిపోయి ఆయనతో పాటు నారాయణ శక్తియందు లీనమయింది.

ఇంత పరమ పవిత్రమయిన ఈ ఆఖ్యానమును వినినా చదివినా అత్యంత శుభాఫలితం కలుగుతుంది. సంధ్యావందనం చేయడం మానివేసిన వాడు కూడా పృథు మహారాజుగారి చరిత్ర వింటే ఆ దోషం నివారణ అయి బ్రహ్మ వర్చస్సును పొందుతాడు. క్షత్రియుడు తనకు ఫలానా రాజ్యం కావాలని పృథు మహారాజు చరిత్ర విని యుద్ధమునకు వెడితే జగత్తునంతటిని గెలిచి సార్వభౌముడు అవుతాడు. వైశ్యుడు పృథు మహారాజు చరిత్ర వింటే అతనికి వ్యాపారంలో అనేకమయిన లాభములు కలిగి ధన సంపత్తిని పొందుతాడు. ఇతరములయిన వారు పెద్దలను సేవించే తత్త్వము ఉన్నవారు పెద్దల అనుగ్రహమును పొంది వారి కుటుంబములు వృద్ధిలోకి వస్తాయి. ఏమీ తెలియని వాడు కూడా ఇటువంటి పృథు చరిత్ర వింటే సర్వ సిద్ధులను పొంది సర్వ పాపములు నశించి శ్రీకృష్ణ పరమాత్మ పాదారవిందముల యందు భక్తిని పొంది ఇహమునందు పొందవలసినవి పొంది అంత్యమునందు మోక్ష స్థితిని పొందడానికి కావలసిన జ్ఞానము వాడికి ఈ జన్మలో బోధ జరిగేటటువంటి అదృష్టమును పొంది ఆ అర్హతను పొందుతున్నాడు అని వేదవ్యాసుడు ఈ పురాణాంతర్గతం చేస్తే మనమీద అనుగ్రహంతో మహాపురుషుడయిన పోతనామాత్యుడు ఆంధ్రీకరించారు.