ప్రహ్లాదుడు చెప్తున్న విషయములను విని హిరణ్యకశిపుడు కోపించిన వాడై గురువుల వంక చూశాడు. మేమేమీ చెప్పలేదు మహా ప్రభో అన్నట్లు హడలిపోయి చూస్తున్నారు చండామార్కులు. “ఈ పద్యములన్నీ నీకు ఎక్కడినుంచి వచ్చాయి? శ్రీమన్నారాయణుని సేవించాలని ఎలా చెప్తున్నావు? నీకీ భక్తి ఎలా కలిగింది? వాళ్ళెవరో నాకు చెప్పు. వాళ్ళ సంగతి చూస్తాను” అన్నాడు. ప్రహ్లాదుడు అన్నాడు ‘నాన్నా నీలాంట్ వాడికి శ్రీమన్నారాయణుని గురించి చెప్పిన వాళ్ళు ఉన్నారు అని చెప్పినా నీకు అర్థంకాదు. నీ కళ్ళను మూసుకున్నావు. అజ్ఞానంలో పడిపోయిన వారికి చెపితే తలకెక్కుతుందా! అజ్ఞానావస్థలో కోరికోరి కూరుకుపోతూ సంసారము సత్యమని నమ్మే నీలాంటి అహంకార పూరితమయిన వ్యక్తులకి ఎవరు చెప్పారని చెపితే నీకు అర్థం అవుతుంది?” అని అన్నాడు.
ఈతని మాటలు వినేసరికి హిరణ్యకశిపునికి ఎక్కడలేని ఆగ్రహం వచ్చింది. రాక్షసులను పిలిచి “వీడిని చంపండి. వీడిని తీసుకెళ్ళి మంచులో నిలబెట్టండి, కొన్నాళ్ళు అన్నం ఇవ్వడం మానేయండి. ఆ తరువాత వీడి నవరంధ్రములు మూసేసెయ్యండి. ఆ తరువాత నేను నా మాయను చూపెట్టి భయపెదతాను. మరుగుతున్న నూనెలో వేయండి. పర్వత శిఖరముల మీదనుండి కింద తొయ్యండి. ఏనుగులతో తొక్కించండి. సముద్రంలో పారెయ్యండి” అన్నాడు.
తనని శూలంపెట్టి రాక్షసులు పొడిచేస్తుంటే, పర్వత శిఖరం మీదనుంచి కింద పారేస్తుంటే, సముద్రంలోకి విసిరేస్తుంటే, కిందపడేసి ఏనుగుల చేత తొక్కేస్తుంటే, రాక్షసులలో, తండ్రిలో, అందరిలో, అంతటా, శ్రీమన్నారాయణుని చూసి పొంగిపోతుంటే గుప్తరూపంలో స్వామి లక్ష్మీ సహితుడై వచ్చి ప్రహ్లాదుని పట్టుకున్తున్నాడు. ఇంతమంది కలిసి కుమ్మితే ఏమీ జరగడం లేదు. ఈశ్వరుడిని నమ్ముకున్న వాడికి ఏమి లోటు ఉంటుంది. రాక్షసులు అలా హింసిస్తుంటే ప్రహ్లాదుడు ఎక్కడ ఉన్నవాడు అక్కడే నిలబడి నారాయణ జపం చేస్తుంటే అంతకంతకీ తేజోవిరాజితుడు అయిపోతున్నాడు. హిరణ్యకశిపుడికి ఒక్కొక్క వార్త వస్తోంది. ప్రహ్లాదుడు ప్రకృతికి అతీతమయిన స్థితిని పొందాడు. తన వాడయిన కారణం చేత, తనయందు భక్తి కలిగిన కారణం చేత ఈశ్వరుడు ఆనాడు ప్రహ్లాదుడిని రక్షించుకున్నాడు. హిరణ్యకశిపుడు రాత్రింబవళ్ళు దీనవదనంతో కూర్చుని ఉన్నాడు. ప్రహ్లాదుని చంపడానికి ఎన్ని ఉన్నాయో అన్నింటిని ప్రయోగించాడు. కానీ అతడు చచ్చిపోలేదు. కనీసం నీరసపడలేదు. పైగా తాను ప్రయత్నించే కొలదీ పిల్లవాడు ఎక్కువ తేజమును పొందుచున్నాడు. ఇప్పుడు గురువులు ‘బెంగ పెట్టుకోవద్దు. చావుతో సమానమయిన మందు ఒకటి మావద్ద ఉంది. వీనిని తీసుకువెళ్ళి అది వేసేస్తాము. ఈ పిల్లవాడికి వయస్సు వస్తోంది కాబట్టి చాలా గొప్పగా రకరకాలుగా కామశాస్త్రాన్ని బోధ చేసేస్తాము. వీడు భ్రష్టుడు అయిపోతాడు. సంసరమునండు అనురక్తి కలుగుతుంది’ అని చెప్పి పిల్లవాడిని తీసుకువెళ్ళి అతనికి శాస్త్ర బోధ ప్రారంభించారు. పరమ సంతోషంగా కూర్చుని గురువులు చెప్పినది చక్కగా నేర్చుకుంటున్నాడు.
ఒకరోజున గురువులు తమ గృహకార్యములను నిర్వర్తించుటకు లోపలికి వెళ్ళారు. వెంటనే ప్రహ్లాదుడు పిల్లలందరినీ పిలిచి “ఒరేయ్ మీరు ఈ ఆటలు ఎంతకాలం ఆడతారు కానీ నేనుమీకొక విషయం చెప్తాను. మీరందరూ కూర్చోండి. అని మనకి ఆయుర్దాయం నూరు సంవత్సరములు. రాత్రి అయితే నిద్రపోటాము. కాబట్టి ఏభై ఏళ్ళు నిద్రలో పోతుంది. ఇరవై ఏళ్ళు శిశువుగా బాల్యంలో పోతుంది. ఇంకా మిగిలింది ముప్పది ఏళ్ళలో మన కోరికలన్నీ అక్కర్లేని వాటికన్నింటికీ తగుల్కొని అరిషడ్వార్గాలకి లొంగిపోతాయి. నా మాట వినండి. ఈ పంచ భూతములను, మూడు గుణములను, ఇరవై ఏడు తత్త్వములను నిర్మించి మాయచేత పరమాత్మ ఈశ్వర దర్శనం కాకుండా కప్పి ఉంచాడు. ఆత్మ ఒక్కటే స్థిరంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ ఆత్మా దర్శనాభిలాషులు అవండి. నామాట నమ్మండి’ అన్నాడు. వాళ్ళు ‘ఈపాఠం చాలా గమ్మత్తుగా ఉంది. నువ్వు మాతోనే కలిసి ఇక్కడ చేరావు. మాతోనే చదువుకున్నావు. గురువులు మాకేమి చెప్పారో నీకు కూడా అదే చెప్తున్నారు. గురువులు చెప్పని విషయములు నీకు ఎవరు చెప్తే వచ్చాయి?” అని అడిగారు. అపుడు ప్రహ్లాదుడు ‘మహానుభావుడయిన నారదుడు చెప్పాడు’ అని బదులిచ్చాడు. అపుడు వాళ్ళు ‘నారదుని నీవు ఎప్పుడు కలుసుకున్నావు? ఎప్పుడు నేర్చుకున్నావు?’ అని అడిగారు.
హిరణ్యకశిపుడు తపస్సు చేసుకుంటున్నప్పుడు గర్భిణి అయిన లీలావతిని చెరపట్టి ఇంద్రుడు ఈడ్చుకుపోతున్నాడు. నారదుడు ఎదురువచ్చి ‘మహాపతివ్రత అయిన కాంతను ఎందుకు చెరపట్టి తీసుకువెళుతున్నావు” అని అడిగాడు. ఆయన ‘నాకు ఆవిడ మీద క్రోధం లేదు. ఆవిడ గర్భమునందు హిరణ్యకశిపుని తేజం ఉన్నది. వాడు తపస్సుయందు మడిసిపోతాడని మేము అనుకుంటున్నాము. ఈలోగా బిడ్డపుట్టి వాడు కూడా పెరిగి పెద్ద వాడయితే చాలా ప్రమాదం. అందుకని ఆ బిడ్డడు పుట్టగానే సంహారం చేసి ఈమెను విడిచిపెడతాను అన్నాడు. అప్పుడు నారదుడు అన్నాడు ‘నీకేమి తెలుసు! ఆవిడ గర్భంలో మహావిష్ణు భక్తుడయిన వాడు ఉన్నాడు. వాడు జన్మచేత భక్తిజ్ఞాన వైరాగ్యములతో పుడుతున్నాడు. అటువంటి మహాపురుషుని కథ వింటే తరించిపోతాము. అందుకని లీలావతిని నా ఆశ్రమమునకు తీసుకువెడతాను’ అని తీసుకు వెళ్ళి అక్కడ వేదాంత తత్త్వమును ప్రబోధం చేశాడు. చెబుతున్నప్పుడు లీలావతి వింటూ ఉండేది. చిత్రమేమిటంటే విన్న లీలావతి మరిచిపోయింది. కడుపులో వున్న పిల్లవాడికి జ్ఞాపకం ఉండిపోయింది. అలా జ్ఞాపకం ఉండడానికి కారణం తన గొప్పతనమని ప్రహ్లాదుడు చెప్పలేదు. ‘మా అమ్మ మళ్ళీ వచ్చి హిరణ్యకశిపుడితో సంసారంలో పడిపోయి భోగభాగ్యములలో నారడుచు చెప్పిన బోధ మరిచిపోయింది. అందుకు కారణం గురువుల అనుగ్రహం మా అమ్మయందు లేదు. గురువుల అనుగ్రహం, దైవ అనుగ్రహం నాయందు ఉన్నది. అందుకని అమ్మ కడుపులో విన్న నాకు నిలబడిపోయింది. గురువు అనుగ్రహం, దైవానుగ్రహం జ్ఞానం నిలబడడానికి ఎంత అవసరమో చూశారా’ అన్నాడు.
అపుడు పిల్లలందరూ లేచి నారాయణ భజన చేయడం మొదలు పెట్టారు. లోపలనుంచి గురువులు బయటకు వచ్చారు. ప్రహ్లాదుడిని పట్టుకుని జరజర ఈడుస్తూ హిరణ్యకశిపుని వద్దకు తీసుకువెళ్ళి ‘అయ్యా, తులసివనంలో గంజాయి పుట్టినట్లు రాక్షస వంశంలో నీ కొడుకు పుట్టాడు. వీడికి పాఠం చెప్పడం దేవుడెరుగు, వీడు రాక్షస బాలకులనందరిని పాడుచేసేశాడు. అందరిని నారాయణ భక్తులుగా చేసేస్తున్నాడు’ అన్నారు. ఇలా అనేసరికి హిరణ్యకశిపుడు ‘ఎవరి దిక్కు చూసూకుని ఎవరి బలం చూసుకొని నీవు ఇలా ప్రవర్తిస్తున్నావు’ అని కుమారుని చూసి అడిగాడు.
బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకున్!
బలమెవ్వడు ప్రాణులకును బలమెవ్వండట్టి విభుడు బలము సురేంద్రా!!
‘నాన్నా, నీలో బలానికి కారణమెవడో వాడే నాలో బలమునకు కూడా కారణం. బలహీనుడయిన వానిలో వున్న కొంచెం బలానికి కారణం ఎవరో లోకములను సంపాదించిన మహాబలవంతుల బలమునకు కారణమెవడో వాడు నాకు దిక్కు’ అన్నాడు. ‘ఏమిరా, వాడు దిక్కు దిక్కు అంటున్నావు కదా, వాడు ఎక్కడ ఉన్నాడో చెప్పగలవా?’ అని హిరణ్యకశిపుడు అడిగాడు. ‘నాన్నా, ఎక్కడ ఉన్నాడో చెప్పమని అడుగుతావేమిటి? ఇదొక వెర్రి ప్రశ్న.
ఇందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుం
డెందెందు వెదకి చూసిన నందందే కలడు దానవాగ్రణి వింటే!!
జ్ఞాననేత్రంతో చూసే దంతి కనపడదు. దారువు కనపడుతుంది. ఆభరణం కనపడదు. స్వర్ణం కనపడుతుంది. పాత్ర కనపడదు. మట్టి కనపడుతుంది. జ్ఞాన నేత్రంతో చూడు. ఉన్నది నారాయణుడు ఒక్కడే. అంతటా స్వామి ఉన్నాడు. నువ్వు చూడడానికి ప్రయత్నం చెయ్యి’ అన్నాడు. ఒక ప్రక్క తండ్రి ఆగ్రహంతో ఉంటే అంతటా నారాయణుడు ఉన్నాడని చెప్పడానికి ఆనంద పారవశ్యం వచ్చేసి పొంగిపోతూ ప్రహ్లాదుడు నాట్యం చేస్తూ
కలడంబోధి, గలండు గాలి, గలడాకాశంబునం, గుంభినిం
గల, డగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలం
గల, డోంకారమునం ద్రిమూర్తుల ద్రిలింగ వ్యక్తులం దంతటం
గల, దీశుండు గలండు, తండ్రి! వెదకంగా నేల నీ యా యెడన్!!
నాన్నా, ఈశ్వరుడు ఎక్కడలేడు అని అడుగు. ఈశ్వరుడు లేని ప్రదేశం లేదు. రాత్రులందు పగలందు, ఆకాశమునందు పైన మధ్యలో సర్వభూతములయందు అగ్నియందు ఓంకారము నందు సమస్త ప్రపంచమునందు నిండి నిబిడీ కృతమై ఉన్నాడు. ఆయనలేని ప్రదేశం లేదు’ అనేసరికి హిరణ్యకశిపునికి చెప్పలేనంత ఆగ్రహం వచ్చింది.