దేవకీ వసుదేవులు సంతోషంగా ఉంటూ ఉండగా వారికి మొట్టమొదట కొడుకు పుట్టాడు. పుట్టిన కొడుకును పుట్టినట్లుగా పట్టుకువెళ్ళి కంసునికి ఇచ్చేశాడు. వసుదేవుని చూసి ‘బావా, చూశావా నువ్వు ఎంత మాట తప్పని వాడవో! పిల్లవాడు పుట్టగానే నీవే తీసుకు వచ్చి ఇచ్చావు. నాకు అందుకే నీవంటే అంత గౌరవం. నువ్వు మాట తప్పని వాడవు. కానీ బావా, ఎనిమిదవ వాడు కదా నన్ను చంపేది! మొదటి వాడిని చంపడమెందుకు? తీసుకువెళ్ళిపో’ అన్నాడు. వసుదేవుడు పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోయాడు. రెండవ కొడుకు పుట్టాడు. ఎనిమిదవ గర్భమును కదా ఇమ్మన్నాడు. అందుకని రెండవ పిల్లవానిని తీసుకు వచ్చి యివ్వలేదు. ఇలా ఆరుగురు పిల్లలు పుట్టారు. ఆ ఆరుగురు పిల్లలతోటి అమ్మకి, నాన్నకి మిక్కిలి అనుబంధం ఏర్పడింది. ఇంత అనుబంధంతో వాళ్ళు సంతోషంగా ఉన్న సమయంలో ఒకరోజున కంసుని దగ్గరికి నారదుడు వచ్చాడు. ఆయన మహాజ్ఞాని. ఎప్పుడు వచ్చినా ఏదో లోకకళ్యాణం చేస్తాడు. కంసుని దగ్గరకు వచ్చి ‘కంసా! ఎంత వెర్రివాడవయ్యా! అసలు నీవు ఎవరిని వదిలిపెడుతున్నావో వారెవరూ మనుష్యులు కారు. నువ్వు క్రిందటి జన్మలో ‘కాలనేమి’ అను పేరు గల రాక్షసుడవు. నిన్ను శ్రీమహావిష్ణువు సంహరించారు. నీ తండ్రి, తల్లి, దేవకీ, వసుదేవుడు, పక్క ఊళ్ళో ఉన్న నందుడు, ఆవులు, దూడలు వీరందరూ దేవతలు. నిన్ను చంపడానికే వచ్చారు’ అని చెప్పి ఆయన హాయిగా నారాయణ సంకీర్తనం చేసుకుంటూ ఊర్ధ్వలోకములకు వెళ్ళిపోయాడు.
ఇపుడు కంసుడికి అనుమానం వచ్చింది. నారదుడు అనవసరంగా అబద్ధం చెప్పడు కదా! వసుదేవుడిని ఆరుగురి పిల్లలను తీసుకురమ్మనమని కబురుచేశాడు. ‘ఎనిమిదవవాడికి వీళ్ళు సహాయ పడితే నా బ్రతుకు ఏమయిపోవాలి? అందుకని ఉన్నవాళ్ళను ఉన్నట్లుగా సంహరించాలి’ అనుకుని పిల్లలను చంపేశాడు. తరువాత తన తల్లిని, తండ్రిని, దేవకిని, వసుదేవుని అందరినీ కారాగారంలో పెట్టి బకుడు, తృణావర్తుడు, పూతన – ఇలాంటి వారినందరినీ పిలిచి వాళ్ళతో స్నేహం చేశాడు. తరువాత వస్తున్న గర్భం ఏడవ గర్భం. కాబట్టి జాగ్రత్త పడిపోవాలని దేవకీ వసుదేవులను అత్యంత కట్టుదిట్టమయిన కారాగారంలో పెట్టాడు. రోజూ తానే వెళ్ళి స్వయంగా చూస్తుండేవాడు. ఇక్కడ మీకు ఒక అనుమానం రావాలి. వసుదేవుని పిల్లలు పసివారు. నారదుడు మహానుభావుడు. లోకకళ్యాణకారకుడు. ‘నారం దదాతి యితి నారదః’ అని ఆయన జ్ఞానం ఇచ్చేవాడు. అటువంటి వాడు ఆరుగురు పిల్లలు చచ్చిపోవడానికి ఎందుకు కారకుడు అయ్యాడు? ఇపుడు వచ్చి ఆయన చెప్పకపోతే వచ్చిన నష్టం ఏమిటి? కంసునితో ఎందుకు అలా చెప్పాడు అని అనుమానం వస్తుంది. భాగవతంలో దీనికి ఎక్కడా జవాబు లేదు. దీనికి పరిష్కారం దొరకాలంటే దేవీభాగవతం చదవాలి. దేవీ భాగవతంలో ఈ రహస్యమును చెప్పారు.
పూర్వం మరీచి, ఊర్ణాదేవి అని యిద్దరు ఉండేవారు. వాళ్ళిద్దరికీ ఆరుగురు పిల్లలు పుట్టారు. వాళ్ళు పుట్టుకతో బ్రహ్మజ్ఞానులు. వీళ్ళు ఆరుగురు ఒకసారి చతుర్ముఖ బ్రహ్మగారి సభకు వెళ్ళారు. వాళ్ళు నిష్కారణంగా బ్రహ్మగారు కూర్చుని ఉండగా ఒక నవ్వు నవ్వారు. అపుడు బ్రహ్మగారు ‘మీరు రాక్షసుని కడుపునా పుట్టండి’ అని శపించారు. అందువలన వారు ఆరుగురు క్రిందటి జన్మలో ‘కాలనేమి’కి కుమారులుగా జన్మించారు. అలా కాలనేమి పుత్రులుగా కొంతకాలం బ్రతికి తదనంతరం హిరణ్యకశిపుని కడుపునా పుట్టారు. అప్పటికి వాళ్ళకి వున్న రజోగుణ తమోగుణ సంస్కారం తగ్గింది. మరల బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. బ్రహ్మగారు వారికి దీర్ఘాయుర్దాయమును ప్రసాదించారు. ఈవిశాయమును వారు తండ్రి అయిన హిరణ్యకశిపునకు చెప్పారు. అపుడు హిరణ్యకశిపునికి కోపం వచ్చింది. ‘నేను యింకా తపస్సు చేసి దీర్ఘాయుర్దాయమును పొందలేదు. మీరు అప్పుడే పొందేశారా?కాబట్టి మిమ్మల్ని శపిస్తున్నాను. మీరు దీర్ఘనిద్రలో ఉండి మరణించండి. అంతేకాకుండా వచ్చే జన్మలో పుట్టినప్పుడు గతజన్మలో తండ్రి ఆ జన్మలో మిమ్మల్ని చంపుతాడు’ అన్నాడు. వాళ్ళు దీర్ఘ నిద్రలో ఉండి చచ్చిపోయారు. మరుజన్మలో మరీచి ఊర్ణల కొడుకులు ఇప్పుడు దేవకీదేవి కడుపునా పుట్టారు. వాళ్ళ శాపం ఈజన్మతో ఆఖరయిపోతుంది. వీళ్ళు యిప్పుడు గతజన్మలోని తండ్రి చేతిలో చచ్చిపోవాలి. గతజన్మలో వీరి తండ్రి కాలనేమి. కాలనేమి యిపుడు కంసుడిగా ఉన్నాడు. కాబట్టి వేరు కంసుడి చేతిలో మరణించాలి. వారికి ఆ శాప విమోచనం అయిపోయి వారు మరల బ్రహ్మజ్ఞానులు అయిపోవాలి. అందుకని నారదుడు వచ్చి వాళ్ళు శాప విమోచనం పొందేలా చేశాడు. అదీ నారదుని రాకలో గల కారణం. ఇది దేవీ భాగవతాంర్గతం.
కుండలోపల వెలుగుతున్న దీపంలా లోకములనన్నింటినీ తన కడుపులో పెట్టుకున్న శ్రీమహావిష్ణువుని తనకడుపులో మోయవలసినటువంటి దేవకి కంసుని కారాగారమునందు మగ్గుతున్నది. ఈ స్థితిలో ఒక చిత్రం జరిగింది. శ్రీమన్నారాయణుడు తాను అవతరించాలని అనుకున్నాడు. తనకన్నా ముందు శేషుడు బయలుదేరుతున్నాడు. ఆదిశేషుడు ముందు అన్నగారుగా పుట్టాలి. అందుకని యోగమాయను పిలిచి ఒకమాట చెప్పాడు. ‘నీవు భూమి మీదకి వెళ్ళు. అక్కడ కంసుని కారాగారంలో దేవకీ వసుదేవులు ఉన్నారు. కంసుడు వసుదేవుని భార్యలందరినీ ఖైదు చేశాడు. ఒక్క రోహిణి మాత్రం నందవ్రజంలో నందుని దగ్గర ఉంది. ఇప్పుడు వసుదేవుని తేజస్సు దేవకీదేవిలో ఏడవ గర్భంగా ఉన్నది. అందులో శేషుని అంశ ఉన్నది. అందుకని ఎవరికీ తెలియకుండా ఆ గర్భస్థమయిన పిండమును వెలికి తీసి దానిని తీసుకు వెళ్ళి నందవ్రజంలో ఉన్న రోహిణీ గర్భమునందు ప్రవేశపెట్టు. గర్భస్రావం అయిందని అందరూ అనుకుంటారు. అప్పుడు యిక్కడ జారిపోయిన పిండము అక్కడ పెరుగుతుంది. పెరిగి అక్కడ వర్ధిల్లుతాడు. శేషుడు బలరాముడన్న పేరుతొ జన్మిస్తాడు. నన్ను సేవించాలని కోరుకుంటున్నాడు. అందుకని నీవు వెళ్ళి ఆపని చేయవలసినది’ అని చెప్పాడు. వెంటనే యోగమాయ బయలుదేరి వచ్చింది. ఏడవ గర్భంలో దేవకీదేవి గర్భము నిలిచి సంతోషంగా ఉన్న సమయంలో ఆమె కడుపులో ఉన్న పిండమును బయటికి లాగి నందవ్రజంలో నందుని దగ్గర వున్న రోహిణి గర్భంలోకి ప్రవేశపెట్టింది.
ఇవాళ భాగవతమును వింటున్నప్పుడు యిది జరుగుతుందా అని మనమెవ్వరమూ సందేహించనవసరం లేదు. ఇప్పుడు యిటువంటివి ప్రపంచంలో జరుగుతున్నాయి కదా! ఇప్పుడు మనవాళ్ళు చేసే పనిని అప్పుడు భాగవత కాలంలోనే మహర్షులు చేశారు. చాలా బలవంతుడయిన వాడు కాబట్టి ఆయనకు ‘బలభద్రుడు’ అని పేరు. లోకముల నన్నింటిని ఆనందింప చేస్తాడు కాబట్టి రామ శబ్దమును ప్రక్కన పెట్టి ‘బలరామా’ అని పిలిచారు. ఈ అమ్మ కడుపులోంచి లాగబడి వేరొక అమ్మ కడుపులోకి ప్రవేశ పెట్ట బడ్డాడు అందుకని ‘సంకర్షణుడు’ అని పేరు వచ్చింది. ఈవిధంగా బలరాముని ఆవిర్భావం జరిగింది. తదనంతరం కృష్ణపరమాత్మ ఆవిర్భవించాలి. శ్రీమన్నారాయణుని పూర్ణమయిన తేజస్సు బయలుదేరి వసుదేవుడిని ఆవహించింది. వసుదేవుడి లోంచి ఆ తేజస్సు దేవకీ గర్భంలోనికి ప్రవేశించింది. కృష్ణ పరమాత్మ దేవకీదేవి గర్భంలో పెరుగుతున్నాడు. ఈ గర్భంలోకి ముప్పది కోట్ల మంది దేవతలు బ్రహ్మగారితో కలిసి వచ్చి దేవకీదేవి కడుపులోకి వెళ్ళి నిలబడ్డారు. ఇదీ గర్భశుద్ధి అంటే. వారందరూ మహానుభావా! నీవు మాయందు అనుగ్రహించాలి. కంసాదులు రాజ్యం చేస్తూ భక్తులయిన వారిని నిగ్రహిస్తున్నారు. కాబట్టి ముకుందా నీవు అమ్మ గర్భంలోనుండి బయటకు రావసింది అని పరమాత్మను స్తోత్రము చేస్తున్నారు.
ఇక్కడ కంసుని పరిస్థితి దారుణంగా ఉంది. దేవకికి అష్టమ గర్భం వచ్చేసింది. నెలలు పెరుగుతున్నాయి. తొమ్మిదవ నెల వచ్చేసింది. స్పష్టంగా తేజస్సు కనపడుతోంది. ఆ అష్టమ గర్భంలో పుట్టేవాడు తనను చంపేస్తాడని భయం. జ్ఞానము చేత లోకమంతా ఒక ఈశ్వరుడు కనపడ్డట్టే కంసునికి కూడా కనపడుతోంది. అందుకనే నారదుడు ధర్మరాజు గారితో ‘కొందరు వైరముతో కూడా ఈశ్వరుని పొందుతున్నారు’ అన్నాడు. కంసుడు ఎవరిని చూసినా శ్రీహరే కనపడుతున్నాడు. కృష్ణుడు ఆవిర్భవించే సమయం ఆసన్నమవుతోంది. శ్రావణ మాసంలో అర్థరాత్రి పన్నెండు గంటలకి ఆకాశం మబ్బులు పట్టి వర్షం పడుతుంటే శ్రీకృష్ణ భగవానుని ఆవిర్భావం జరిగింది. అప్పుడు ఆకాశం అంతా మబ్బులు పట్టి ఉంది. కంసుడు గాఢనిద్రలో ఉన్నాడు. భటులను పెట్టాడు. తలుపులు దగ్గరికి వేసి వాటికి యినుప గొలుసులు వేశాడు. వాటిలో మేకులు దింపాడు. తాళములు వేశాడు. తాళం చెవులు బొడ్డులో పెట్టుకున్నాడు. వసుదేవుడు ఏమయినా చేస్తాడేమోననే అనుమానంతో వసుదేవుని కాళ్ళకు చేతులకు యినుప సంకెళ్ళు వేశాడు. ఆనాడు దేవకీ ప్రసవ సమయమందు సహాయం చేసిన వారు లేరు. ఆతల్లి అంత బాధపడింది. అటువంటి స్థితిలో అర్థరాత్రి పన్నెండు గంటల వేళయింది.
మహానుభావుడు శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు. నాలుగు బాహువులతో, నల్లటి మబ్బు వంటి కాంతితో, పట్టు పీతాంబరము కట్టుకుని, శంఖ చక్ర గదా పద్మములను పట్టుకొనిన వాడై, మహానుభావుడు వజ్ర వైడూర్యములు పొదగబడిన కిరీటముతో, నల్లటి కుంతలములతో, చెవులకు పెట్టుకొనబడిన కర్ణాభరణముల కాంతి గండ స్థలములయందు ప్రకాశిస్తూ ఉండగా, మెడలో కౌస్తుభమనే రత్నమును ధరించి, శ్రీవత్సమనే పుట్టుమచ్చతో, సమస్త లోకములు కొలిచే పాదపద్మములతో, చంటిపిల్లవాడిగా వసుదేవునికి దర్శనం యిచ్చాడు. అటువంటి పిల్లవానిని చూసి సంకెళ్ళలో ఉన్న వసుదేవుడు పొంగిపోయాడు. అన్ని లోకములను కాపాడేవాడు ఈవేళ నాకు కొడుకుగా పుట్టాడు. మామూలుగా కొడుకు పుడితేనే గోదానం, వస్త్రదానం, హిరణ్యదానం చేస్తారు. నాకు శ్రీమన్నారాయణుడు కొడుకుగా పుట్టాను నేను ఎన్ని దానాలు చెయ్యాలి. కానీ కొడుకు పుట్టినప్పుడు సచేల స్నానం చేయాలి. కానీ నేను చెయ్యడానికి కూడా లేదు. ‘కృష్’ అనగా నిరతిశయ ఆనందరూపుడు. ఆ కృష్ణ దర్శనంతో కలిగిన ఆనందములో ఆయన స్నానం చేసేశాడు. తరువాత ఒక్కసారి నీళ్ళు ముట్టుకున్నాడు. మానసికముగా పదివేల మంది బ్రాహ్మణులకు పదివేల గోవులను దానం చేశాడు. ‘నేను కారాగారమునుండి బయటకు వచ్చిన తరువాత తీర్చుకుంటాను’ అనుకుని పిల్లవాడుగా ఉన్న స్వామిని చూసి దేవకీ వసుదేవులు నమస్కరించారు. అపుడు కృష్ణ పరమాత్మ దేవకీ వసుదేవుల వంక చూసి నవ్వుతూ ‘భయపడకండి. అసలు నేను ఇలా ఎందుకు జన్మించానో రహస్యం చెపుతాను వినండి.