ఒకానొక రోజున కంసుని పనుపున పూతన అనే రాక్షసి అక్కడికి వచ్చింది. ఆవిడ బాలఘాతకి. ఆవిడ శిశువులను చంపగలదు. శిశువులు ఎక్కడ వున్నా తొందరగా పసిగట్టగలదు. ఆవిడ కామరూపిణి. రూపం మార్చుకుంటుంది. మార్చుకుని భవనమునందు ప్రవేశించింది. ఆమె శిశువులను చాలా గమ్మత్తుగా చంపుతుంది. చంపుతున్నప్పుడు చంపుతున్నానని తెలియకుండా చంపుతుంది. విషమును పాలలా ఇస్తుంది. అటువంటి పాలు త్రాగి శిశువులు మరణిస్తారు. అది ఆవిడకు ఉన్న శక్తి. ఆమె చంపేదానిలా కనపడదు. పెంచేదానిలా కనపడుతుంది. ఇపుడు ఆవిడ వచ్చి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయింది. ఆమె ఆకాశం నుండి వస్తున్నప్పుడే నందుని భవనంలో వున్న కృష్ణ పరమాత్మను కనిపెట్టింది. లోపలి ఊయల దగ్గరకు వెళ్ళింది. పర్యంకము దగ్గరకు చేరింది. ఏ భావనతో చేరినా పరమేశ్వరుని దగ్గరకు చేరింది. ఆమె రాశీభూతమయిన పిల్లవాని సౌందర్యమును చూసి ‘నేను సహజంగా రాక్షసిని. చాలా వికృతంగా ఉంటాను. కానీ ఇపుడు నా రూపమును మరుగుపరచి చాలా అందమయిన దానిలా వచ్చాను’. ఈవిడ వస్తుంటే చరాచర ప్రపంచపు ఆంతరము నందంతటా నిండిపోయిన వాడు, బాహ్యమునందు నిండిపోయిన వాడు అయిన పరమాత్మకు, ఈవిడ ఎందుకు వస్తోందో తెలుసు. కాలు చేయి పొట్టకింద పడిపోతే తీసుకోవడం కూడా చేతకాని పిల్లవాడిలా జగత్తునంతా నిండి వుండిన పరమాత్మ ఏమీ తెలియని వాడిలా లోపల నవ్వుకుంటూ ఒక దొంగ గుర్రు మొదలు పెట్టాడు. ఆమె దగ్గరకు వచ్చి చూసి ఎంత రాక్షసి అయినా ఆ బాలుని అందమునకు వశపడిపోయింది. ఆమె తెలియకుండానే ‘నేను నీ అందమును తీసెయ్యడానికి ఇంత అందంగా వచ్చాను. ఇంత అందగాడివి నా పాలు త్రాగితే ఎందుకూ పనికిరాకుండా అయిపోతావు’ అని అంది.
పూతన తెలియకుండా అలానే ‘నళినదళాక్షా’ అని పిలిచింది. ‘తామరరేకుల వంటి కన్నులు వున్న పిల్లవాడా! ఎంత అందంగా ఉన్నావురా! నా పాలు ఒక గుక్కెడు తాగావంటే ఇంత అనడమూ చటుక్కున మాయమయిపోతుంది. నా అందమేమిటో అప్పుడు చూద్దువుగాని! నీ అందానికి సార్థకత వస్తుంది. రా త్రాగు’ అని గబగబా ఉయ్యాలలో వున్న పిల్లవాడిని తీసుకుని ఒళ్ళో పెట్టుకుని స్తనం వాడి నోట్లో పెట్టబోతోంది. ఎక్కడో లోపల పనిచేసుకుంటున్న రోహిణి, యశోదాదేవి వానిని చూశారు. ‘అయ్యయ్యో! అదేమిటి అలా మా పిల్లవానికి పాలు ఇస్తున్నావు! మా పిల్లవాడు అన్యస్త్రీల క్షీరమును స్వీకరించడు. ఆగుఆగు’ అంటున్నారు. ఆవిడ స్తన్యమంతా విషమే. ఒక్కసారి ఆ విషమును నోట్లో పెడితే చాలు అనుకుని గబగబా పిల్లవాడిని తీసి ఒడిలో పెట్టుకుని, వాడి ముఖమును త్రిప్పి, ఎలాగయినా సరే స్తనము నోట్లో పెట్టే ప్రయత్నం చేస్తోంది. కృష్ణుడు ఏమీ తెలియని వాడిలో ఆవులించాడు. ఒకసారి క్రీగంట చోశాడు. మరల నిద్ర వచ్చేసినవాడిలా కళ్ళు మూశాడు. మళ్ళీ కళ్ళు విప్పాడు. ‘పాలు తాగక తప్పదా’ అన్నట్లుగా చూసి విసుక్కుని అయినా పాలను తాగడం అలవాటయిన వాడిలా అమ్మ స్తన్యం త్రాగినట్లే ఆ స్తనమును తన బుజ్జి బుజ్జి వేళ్ళతో పట్టుకుని గుటుకు గుటుకుమంటూ రెండు గుక్కల పాలు త్రాగాడు.
ఆ రెండు గుక్కలలో ఆమె గుండెలలో ప్రాణముల దగ్గరనుంచి ఆవిడ శరీరంలో వున్న శక్తినంతటిని లాగేశాడు. ఇప్పటి వరకు ‘తాగు తాగు’ అనడమే తప్ప ‘వదులు వదులు’ అనడం తెలియదు. ‘వదలరా బాబోయ్ అంటోంది పూతన. ఆయన పట్టుకుంటే వదులుతాడా? ఆయన తాగేశాడు. ఆయన పాలు తాగెయ్యగానే ఆమె కామరూపం పోయింది. పోయి ఒక్కసారి గిరగిరగిర తిరుగుతూ నెత్తురు కక్కుతూ భయంకరమయిన శరీరంతో క్రిందపడిపోయింది. 13కి.మీ దూరం ఎంత ఉంటుందో అంట పెద్ద శరీరంతో నెత్తురు కక్కుతూ నేలమీద పడిపోయింది. పడిపోయేటప్పుడు ఒక గమ్మత్తు జరిగింది. స్తన్యపానం చేస్తున్న కృష్ణుడు ఆవిడ గుండెలమీద ఉన్నాడు. ఆ గుండెల మీద వున్న కృష్ణుడిని అలాగే చేతులతో పట్టుకొని గిరగిరతిరిగి పడిపోయింది. ఆమె కోరలు నాగటి చాళ్ళలా ఉన్నాయి ముక్కు రంధ్రములు పెద్ద కొండగుహల్లా ఉన్నాయి. ప్రవత శిఖరములు ఎలా ఉంటాయో అటువంటి స్తనములు. పూతన కళ్ళు చీకటి నూతుల్లా ఉన్నాయి. ఆమె శరీరం చుట్టూ గోపగోపీ జనమంతా నిలబడి ‘ఎంత పెద్ద రాక్షసి’ అంటున్నారు. కృష్ణుడు ఆమెమీద ఉన్నాడని వాళ్ళకి తెలియదు. అక్కడ కృష్ణుడు ఉన్నాడనే విషయం యశోదా రోహిణులకు మాత్రమే తెలుసు. అయ్యో పిల్లాడు అయ్యో పిల్లాడు అని పూతన భుజములమీద నుండి పర్వతమును ఎక్కినట్లు ఎక్కారు. పసికూన అయిన కృష్ణునికి ప్రమాదం జరిగి ఉంటుందని వాళ్ళు అనుకున్నారు. కానీ కృష్ణుడు చక్కగా నవ్వుతూ హాయిగా ఆవిడ గుండెల మీద పడుకుని, ఏమీ తెలియని వాడిలా బోసి నవ్వు నవ్వుతూ ఉన్నాడు. వాళ్ళు అబ్బో ఎంత అదృష్టమో పిల్లవాడు బ్రతికి వున్నాడు అని పిల్లాడిని ఎత్తుకుని భుజంమీద పెట్టుకొని ఇంత పెద్ద శరీరంతో ఈ రాక్షసి క్రింద పడిపోతే పిల్లవాడు భయపడి ఉంటాడని అనుకున్నారు. ఆయనకా భయం? ‘భయకృద్భయనాశనః’ అని ఆయనకు పేరు. గోపికలు అనుకుంటున్నారు. వీళ్ళదీ పరమభక్తి అంటే! వాళ్లకి కృష్ణుని గొప్పతనం తెలియదు. అయినా వారు కృష్ణుని ప్రేమించారు.
ఇప్పుడు ఆ పిల్లవాడికి రక్ష పెట్టాలనుకుని గబగబా ఆవు దగ్గరకి తీసుకు వెళ్ళారు. ఆవుతోక పిల్లవాడి చుట్టూ తిప్పి, ఆవు మూత్రము ఆయన మీద చల్లి, ‘నీ శిరస్సును కేశవుడు రక్షించుగాక, కంఠమును హృషీకేశుడు రక్షించుగాక, హృదయమును వామనుడు రక్షించుగాక, గర్భమును మాధవుడు రక్షించు గాక, తొడలను ముకుందుడు రక్షించుగాక’ అంటూ పరమాత్మ పన్నెండు నామములు పెట్టి బాలుని శరీరంలోని ప్రధానమయిన అన్గాములకు పేడ పూస్తూ రక్షపెట్టారు. ‘ఏమి భక్తిరా వీళ్ళది?’ అని ఆయన మనస్సులో నవ్వుకుంటున్నాడు. ఇంతలో ఒక చిత్రమయిన గమ్మత్తు జరిగింది.
నంద వ్రజమునకు పూతన రావడానికి పూర్వము నందుడు మధుర వెళ్ళాడు. కంసరాజుకి ఈయన సామంతుడు. కాబట్టి ప్రతియేడాది కప్పం కట్టాలి. కప్పం కట్టడం కోసమని ధనమును తీసుకువెళ్ళి కంసుడికి కప్పం కట్టేసి, మధురలోనే ఉన్నాడు కదా అని వసుదేవుని చూడడానికి వెళ్ళాడు. వసుదేవుడు ఎదురువచ్చి కౌగలించుకొని ‘నందా, నిన్ను కలవడం చాలా సంతోషం. నీకు కొడుకు పుట్టాడని విన్నాను. ఎంత ఐశ్వర్యము వున్నా పిల్లలు లేని ఇల్లు అసలయిన ఐశ్వర్యము లేని ఇల్లే కదా! అందుకని నీవు గొప్ప ఐశ్వర్యమును పొందావు. నేను చాలా సంతోషిస్తున్నాను’ అన్నాడు. అపుడు నందుడు ‘నిజమేనయ్యా, నువ్వు చాలా గొప్ప మాట మాట్లాడావు. నేను కప్పం కట్టడానికి వచ్చి నిన్ను చూసిపోదామని వచ్చాను. నీకూ ఆరుగురు కుమారులు పుట్టారు. కానీ ఆ ఆరుగురినీ దుష్టుడై కంసుడు సంహరించాడు. వసుదేవా నీవేమీ బెంగ పెట్టుకోవద్దు. నాకొడుకు నీ కొడుకే’ అని అన్నాడు. నిజమునకు కృష్ణుడు వసుదేవుడి కొడుకేగదా! వసుదేవుడు త్రికాల వేది. అపుడు వసుదేవుడు ‘నందవ్రజంలో ఉత్పాతములు జరగబోతున్నాయి. నీవు తొందరగా బయలుదేరి నందవ్రజమునకు వెళ్ళిపో’ అన్నాడు. ఎందుకంటే కంసుడు కృష్ణుడిని పరిమార్చాలని ప్రయత్నిస్తున్నాడు అని తెలుసు.
నందుడు గబగబా బయలుదేరి తిరిగి వచ్చేస్తున్నాడు. దారిలో పడివున్న రాక్షసి శరీరమును చూశాడు. వసుదేవుడు చెప్పినది యధార్థమని గ్రహించారు. ఆ శరీరమునంతటినీ ఊరికి దూరంగా తీసుకువెళ్ళి పెద్ద కుప్ప వేసి అగ్నిహోత్రమును వెలిగించారు. ఆవిడ రాక్షసి. శరీరం కొవ్వుతో నిండిపోయి ఉంది. కాబట్టి అది కాలిపోతున్నప్పుడు దుర్వాసన వస్తుంది అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. అగరువత్తులు కాలిపోతుంటే ఎటువంటి వాసన వస్తుందో పూతన కాలిపోతుంటే అటువంటి సువాసన వచ్చింది. కృష్ణుడు పూతన పాలు తాగేటప్పుడు పాలతో పాటు ఆమె శరీరంలో వున్న పాపమును కూడా త్రాగేశాడు. పుణ్యమే మిగిలిపోయింది. అందుచేతనే ఆ శరీరం కాలిపోతుంటే అగరువత్తుల వాసన వచ్చింది. కృష్ణుడి కాళ్ళు చేతులు తగిలినంత మాత్రం చేత నిజంగా శ్రీమన్నారాయణునికి తల్లి వుంటే ఏ లోకములకు వెళుతుందో ఆ లోకములకు పూతన వెళ్ళిపోయింది. మరి అ ‘పిల్లవాడు నా కొడుకు’ అనే ప్రేమతో పాలిచ్చిన తల్లి ఏ స్థితికి వెళుతుందో! వాళ్ళు వెళ్ళే స్థితిని నేను చెప్పలేను అన్నారు పోతనగారు.
ఇది పూతన సంహార ఘట్టము. ఈ ఘట్టమును తాత్త్వికంగా పరిశీలించాలి. భాగవత దశమ స్కంధము ఉపనిషత్ జ్ఞానము. ఆవిడ పేరు పూతన. అమరకోశం ‘పునాతి దేహం పూతన’ అని అర్థం చెప్పింది. దేహమును పవిత్రముగా చేయుడానికి పూతన అని పేరు. మనకి సంబంధించిన ఒక వస్తువును చూపించి ఎవరిదీ అని ప్రశ్నిస్తే నాది అని చెపుతాము. అయితే ఇప్పుడు నేను అనబడే నువ్వు ఎవరు? దానికి జవాబు మనకే తెలియదు. అదే పెద్ద అజ్ఞానము. ‘నేను నేను’ అంటున్నది ఏది? అంటే తెలియక ఆ ‘నేను’ని చీకటితో, అజ్ఞానముతో కప్పివేశాము. అదే పూతన. అవిద్య. ‘నేను’కు ‘నాది’ తోడవుతుంది. నేను అనేది అబద్ధము. ఈ అబద్ధామునకు నాది అనే మరియొక అబద్దం తోడవుతుంది. దీనికి అస్తిత్వం లేదు. ‘నా’ అన్నప్పుడల్లా ఒక పాశం వేసుకుంటున్నాడు. ఎన్ని వేసుకుంటే అంత పశువు అవుతున్నాడు. పశువుకి అజ్ఞానం, అవిద్య ఉంటాయి. ‘నేను, నాది’ అనే రెండు పూతన రెండు స్తనములు. ఇందులోంచి విషయములను ఇస్తుంది. విషయమే విషము. దేహము ఎప్పుడూ సుఖమునే కోరుతుంది. కానీ దేహసంబంధమయిన సుఖములు విషముతో సమానమయినవి. అవి ఎప్పటికీ దేహి సూక్ష్మరూపమును తెలియనివ్వవు. అలా తెలియకుండా జీవుడు ఈ అబద్ధంలోనే చచ్చిపోతాడు. దీనిని ఏమయినా చేయగలమా? ఏ పని చేసినా దానిని భగవత్ ప్రసాదమని భావించాలి. భగవదర్పణ చేసి సుఖములను అనుభవిస్తే అవి మనపట్ల విషములు కావు అమృతములు అయిపోతాయి. భగవంతుని అర్పించడం వలన లోపల శుద్ధి జరుగుతోంది. శుద్ధి లేకుండా తింటే విషం అయిపోతుంది. పూతన కృష్ణునికి విషపూరిత స్తన్యమును ఇచ్చింది. విషము అమృతము అయిపోయింది. మీకు కూడా అన్నింటినీ ఈశ్వరుడికి చెప్పి తినడం అలవాటు అయితే అది అమృతం అవుతుంది. మనస్సును దేహమును కూడా శౌచపరచగలదు. ఈశ్వరుని వైపు తిప్పగలదు. ఈ రహస్యమును ఆవిష్కరించడమే పూతన సంహారమునందు ఉన్న పెద్ద ప్రయత్నము.
ప్రకృతి వికారమయిన శరీరం పైకి అందంగా ఉన్నట్లు ఉంటుంది. కానీ దీనియందే ఉండిపోతే అసత్యమయిన ‘నేను’నందు మీరు ఉండిపోతే అది అమృతత్వమును యివ్వదు. అసత్యమయిన ‘నేను’ సత్యమును తెలుసుకోవడానికి ప్రసాద బుద్ధితో భక్తి వైపు వెళ్ళినట్లయితే ఈ భక్తి ఒకనాడు జ్ఞానము అవుతుంది. జ్ఞానము ఎప్పుడు కలిగేదీ మనం చెప్పలేము. మిమ్మల్ని మీరు సంస్కరించుకోవాలంటే ముందు భక్తితోనే ప్రారంభించాలి. అది ఎప్పుడో జ్ఞానం అవుతుంది. జ్ఞానమును అగ్నిహోత్రంతో పోలుస్తారు. మీకు తెలియకుండానే ఒకరోజున ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. అపుడు అసలు ‘నేను’ను తెలుసుకుంటారు. అది తెలుసుకోవడానికి భక్తి నుండే వెళ్ళాలి. అదే పూతన సంహారఘట్టం. అందుకనే కృష్ణుని మొదటి లీల పూతన సంహారంతో మొదలవుతుంది. ఇది దేహమును పవిత్రం చేసింది. అపవిత్రమయినది పవిత్రం అయింది. పవిత్రము అవగానే లోపల వున్న వస్తువును తెలుసుకోవడానికి ఇది ఉపకరణంగా మారిపోతుంది. మారిపోయి అసలు ‘నేను’ను పసిగట్టగలిగిన స్థితికి తీసుకు వెళుతుంది. ఈ ఘట్టమును పరమోత్కృష్టమయిన పరమ పావనమైన ఘట్టంగా పెద్దలు ఆవిష్కరిస్తారు.