శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతమునెత్తుట:

ఒకనాడు నందుడు, ఉపనందుడు మొదలైన ఇతర పెద్దలనందరినీ కూర్చోబెట్టుకుని సమాలోచన చేస్తున్నాడు. కృష్ణభగవానుడు ఈవిషయమును తెలుసుకున్నాడు. అంతకుముందు చతుర్ముఖ బ్రహ్మగారికి అహంకారం వచ్చినట్లు ఇంద్రుడికి అహంకారం వచ్చింది. ‘నా అంతటి వాడిని నేను – పరబ్రహ్మమేమిటి – నాకు అధికారం ఇవ్వడం ఏమిటి – నేనే వర్షము కురిపించడానికి అధికారిని’ అని ఒక అహంకృతి ఆయనలో పొడసూపింది. పరమాత్మ ఇంద్రునికి పాఠం చెప్పాలని అనుకున్నాడు. అందుకని ఒక లీల చెయ్యబోతున్నాడు.

తండ్రి దగ్గరకు వెళ్ళాడు. అక్కడ పెద్దలందరూ కూర్చుని సమాలోచనలు చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ‘నాన్నగారూ, పెద్దలయిన వారికి అరమరికలు ఉండవు కదా! వాళ్ళు ఏదయినా మంచి విషయమయినపుడు అది పెద్దలు చెప్పినా చిన్నవాళ్ళు చెప్పినా, వారి సలహాను వింటారు కదా! అందుకని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నాకు చెప్పవచ్చు అని మీరు అనుకుంటే మీరు దేనిగురించి ఆలోచన చేస్తున్నారో నాకు చెప్తారా?’ అని అడిగాడు. అపుడు నందుడు ‘అయ్యో నాన్నా, నీకు తప్పకుండా చెప్తానురా. అది చెప్పడానికి పెద్ద విచిత్రం ఏముంది. రా వచ్చి కూర్చో’ అని ఇలా చెప్పాడు.

‘మనం యజ్ఞం చేస్తే ఆ యజ్ఞము చేత ఆరాధింపబడిన దేవేంద్రుడు ప్రీతిచేంది వర్షమును కురిపిస్తాడు. వర్షం కురిస్తే గడ్డి పెరుగుతుంది.గడ్డి పెరిగితే ఆ గడ్డిని మన పశువులు తింటాయి. బాగా గడ్డి తింటే ఎక్కువ పాలను ఇస్తాయి. ఎక్కువ పాలిస్తే మనకు ఐశ్వర్యం వస్తుంది. దీనికంతటికీ మూలం ఇంద్రునికి యజ్ఞం చెయ్యడంలో ఉంది. ఆ యజ్ఞం చేత ప్రీతిచేంది ఇంద్రుడు వర్షం కురిపించాలి. అందుకని మేము ఇంద్రునికి యజ్ఞం చేద్దామనుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఇలాంటి యజ్ఞం చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా యజ్ఞం చేద్దామని అనుకుంటున్నాము’ అన్నాడు.

కృష్ణుడు ఇంద్రునికి బుద్ధి చెప్పాలని కదా అనుకుంటున్నాడు. అందుకోసమే ఆ సమయంలో తండ్రి వద్దకు వచ్చాను. ఇపుడు కృష్ణుడు తండ్రిని మాయచేసి మాట్లాడుతున్నాడు. అపుడు కృష్ణుడు అన్నాడు – నాన్నగారూ, నేను ఇలా చెప్పానని అనుకోవద్దు. ఎవరయినా సరే, వారు చేసిన కర్మలను బట్టి ఆయా స్థితులకు చేరుతారు. ఎవడు చేసిన కర్మ వలన వానికి గౌరవము గాని, సమాజములో ఒక సమున్నతమయిన స్థితి కాని, జన్మ కాని కలుగుతున్నది కదా! అటువంటప్పుడు ఎవరి గొప్పతనమునకు గాని, ఎవరి పట్నామునకు గాని వారు చేసిన కర్మే ఆధారము. ఆ కర్మే ఫలితమును ఇస్తోంది. మనం చేసిన కర్మవలననే మనం ఐశ్వర్యమును పొందగాలిగాము. పశుసంపద మన ఐశ్వర్యం. మనం పశువులను పోషించుకోవడానికి గోవర్ధన గిరి గడ్డిని ఇస్తోంది. ఈ కొండమీద మన పశువులు మేస్తున్నాయి. మన కంటికి కనపడి మనకి ప్రతిరోజూ గడ్డి యిస్తున్నది గోవర్ధన గిరి. మీరేమో కంటికి కనపడని ఇంద్రునికి యజ్ఞం చేస్తానంటున్నారు. మీరు యజ్ఞమును కంటికి కనపడే గోవర్ధన గిరిగి చేయాలి. అందుకని ఇంద్రయాగం వద్దు. మనం గోవర్ధనగిరికి యాగం చేద్దాము’ అన్నాడు.

కృష్ణుని మాటలకు నందుడు ఆశ్చర్యపోయి ‘నీవు చెప్తున్నది నిజమే. కానీ ఏదయినా యాగం చేస్తే దానికి ఋషి ప్రోక్తమైన ఒక కల్పము ఉంటుంది కదా! కానీ నీవు గోవర్ధన గిరి యాగం అంటున్నావు. దానికి పూజ ఎలా చేయాలో నీకు తెలుసా?” అని అడిగాడు. కృష్ణుడు దానికి ‘ఇంద్రయాగమునకు ఏమేమి సరుకులు తెచ్చేవారో ఆ సరుకులనే తీసుకువచ్చి పూర్వం ఏ పదార్థములను వండించారో వాటిని ఈ యాగమునకు కూడా వండించండి. కానీ పూర్వం వీటినన్నిటిని పట్టుకువెళ్ళి ‘ఓం ఇంద్రాయ స్వాహా’ అని అగ్నిహోత్రంలో వేసేవారు. ఇపుడు నేను చెప్పిన యాగంలో ఇవన్నీ తీసుకువచ్చి ముందు బ్రాహ్మణులను కూర్చోపెట్టి ముందుగా వారికీ మధురపదార్థములను పెడతారు. వారు తింటారు. మిగిలిన పదార్ధం బ్రాహ్మణోచ్ఛిష్టము అవుతుంది. అది మనలను రక్షిస్తుంది. అందుకని ఆ మిగిలిన పదార్ధమును మనందరం అరమరికలు లేకుండా తినేస్తాము. ఆ తరువాత కుక్కలు మొదలయిన వాటిని పిలిచి వాటన్నిటికి కూడా పెడతాము. ఆ తరువాత మన పశువులన్నిటికీ మంచి గడ్డి, జనపకట్టలు ఇవన్నీ పెడతాము. అవి వాటిని తింటాయి. అవి వాటిని తిన్న తరువాత వండిన పదార్ధమును కొన్ని కడవల తోటి పక్కన పెడతాము.పిల్ల పిచ్చుక, మేక కుక్క గోపకాంతలు, గోపాలురు, నేను మీరు అని ఏమీ చూసుకోకుండా లేగదూడలతో సహా అందరం గోవర్ధన గిరికి ప్రదక్షిణం చేద్దాము’ అన్నాడు. అపుడు నందాదులు ఇదేదో చాలా బాగుంది అయితే అలా చేద్దాము అన్నారు. అనుకున్నట్లే చేసి గిరికి ప్రదక్షిణం చేయడానికి కిందికి వచ్చి గోవర్ధన గిరికి నమస్కారం చేస్తూ ప్రదక్షిణం చేస్తున్నారు. వెనకాతల పెద్దపెద్ద ఆవులు, దూడలు, ఎద్దులు అన్నీ ప్రదక్షిణం చేస్తున్నాయి. కృష్ణుడు గోపాల బాలురిలో ఒకడిగా ప్రదక్షిణం చేస్తున్నాడు. కానీ తానే గోవర్ధన గిరిమీద ఉన్న గోవర్ధనుడిగా కనపడుతున్నాడు.

ఈ చప్పుళ్ళు ఇంద్రునికి వినపడ్డాయి. బృందావనంలో ఏమి జరుగుతున్నదని సేవకులను ప్రశ్నించాడు. అపుడు భటులు ‘అయ్యా, మీరు కోపం తెచ్చుకోనంటే ఒక మాట చెపుతాము. ప్రతి ఏడాది గోపాలురు వానలు పడాలని మీకు పెద్ద యాగం చేస్తూ ఉంటారు. ఈ ఏడాది నుంచి వాళ్ళు ఈవ్రతమును మార్చేశారు. మీకు చెయ్యడంలేదు. వాళ్ళందరూ గోవర్ధనగిరికి చేస్తున్నారు. వాళ్ళకి ఆ గోవర్ధన గిరియే పశువులు తినడానికి గడ్డి ఇస్తోందట. అందుకని వారు గోవర్ధన గిరికే యాగం చేస్తున్నారు’ అని చెప్పాడు. వారి మాటలు వినేసరికి ఇంద్రునికి ఎక్కడలేని కోపం వచ్చింది. ‘నాకు యాగం చేయవద్దని చెప్పిన వాడెవడు?గోపాల బాలురు పెరుగు నెయ్యి, తాగి వీళ్ళకి కొవ్వు పట్టింది. నేను ఒకనాడు పర్వతములకు ఉండే రెక్కలను నా వజ్రాయుధంతో తెగనరికాను. అటువంటి వజ్రాయుధమును ఆయుధముగా కలిగిన వాడిని. నన్ను పురందరుడు అని పిలుస్తారు. కృష్ణుడు చెప్పడం వాళ్ళు వినడం ఆయన ఏమయినా ఋషియా లేక దేవుడా? వీళ్ళ సంగతి చెప్తాను చూడండి’ అని మేఘమండలము నంతటినీ పిలిచి వీళ్ళు వర్షం కురియడం వలన వచ్చిన ఐశ్వర్యమదముతో నన్ను మరచిపోయారు. కాబట్టి మీరు వెంటనే వెళ్ళి బృందావనం అంతా చీకటి అయిపోయేటట్లుగా కంమేయండి. పిడుగులు కురిపించండి. మెరుపులు మెరిపించండి. ఆ దెబ్బలకు గోవులు చచ్చిపోవాలి. జనులు చచ్చిపోవాలి. భూమికి, ఆకాశమునకు తేడా తెలియకూడదు. అంతంత వడగళ్ళు పడాలి. ఏనుగు తొండములంత లావు ధారలు పడిపోవాలి. భూమి అంటా జలంతో నిండిపోవాలి. ప్రాణులు అన్నీ అందులో కొట్టుకు పోవాలి. నేను వజ్రాయుధమును పట్టుకుని ఐరావతమును ఎక్కి వెనకాతల వస్తాను.మీరు వెళ్ళండి’ అన్నాడు.

ఇక్కడ గోపకులు గిరిప్రదక్షిణం పూర్తిచేసుకొని వచ్చారు. ఆవులు దూడలు ఇంకా ఇంటికి వెళ్ళలేదు. ఈలోగానే బృందావనం అంతా గాఢాంధకారం అయిపొయింది. ఇంతకుముందు ఎన్నడూ వినని రీతిలో పిడుగులు పడిపోతున్నాయి. ఆకాశం అంతా మెరుపులు ఆ మెరుపులలో వచ్చే కాంతిని అక్కడి గోవులు, ఎద్దులు దూడలు తట్టుకోలేక పోతున్నాయి. అవి ఎక్కడివక్కడ కూలబడిపోయాయి. ఇపుడు గోపకులు కృష్ణా, నీవు రక్షించాలి, మిగిలిన ప్రాణాలు అన్నీ మరణించక ముందే కాపాడు’ అన్నారు. పరమాత్మ ఒక్క క్షణం ఆలోచించలేదు. కృష్ణుడు అక్కడ వున్న గోవర్ధన పర్వతమును అవలీలగా, అమాంతం పైకి ఎత్తి తన చిటికిన వేలు మీద పట్టుకున్నాడు. చిరునవ్వు నవ్వుతూ, ఏమీ కష్టపడకుండా ఒక పెద్ద గొడుగును పట్టినట్లు ఆ మహా శైలమును పట్టుకున్నాడు. ఆవులు, దూడలు, ఎద్దులు, గోపకాంతలు, గోపకులు, గోపాల బాలురు అందరూ ఆ గోవర్ధన గిరి కిందకు వచ్చేశారు. కృష్ణుడు హాయిగా నవ్వుతూ ఆ గోవర్ధన గిరిని ఎత్తి పట్టుకున్నాడు. అందరూ దానికింద నిలబడ్డారు. ఆయన పట్టుకున్న గోవర్ధనగిరి అనబడే గొడుగుకి సాక్షాత్తు శ్రీమన్నారాయణుని చిటికిన వేలు కర్ర. ఆయన భుజ మూపురమే దానికి ఉన్న వంపు తిరిగిన మూపు. దానికి అన్నివైపుల నుండి జాలువారుతున్న నీటి దారలో ముత్యములతో కట్టిన అలంకారములు. దానికింద నిలబడి ‘మమ్మల్ని ఇంద్రుడు ఏమి చేస్తాడ’ని నవ్వుతున్న గోపకాంతల నోళ్లలోంచి వస్తున్న కాంతులు అక్కడ పట్టిన రత్నదీపములు. రత్న నీరాజనములు. ఆయన వారిని ఏడురాత్రులు ఏడు పగళ్ళు ఏడేళ్ళ వయసులో తన చూపులతో పోషించాడు.

కృష్ణుడు గోవర్ధన పర్వతమును పట్టుకుని అలా నిలబడితే కొంతమంది పర్వతము క్రిందకు రావడానికి భయపడ్డారు. అపుడు కృష్ణుడు

బాలుం డీతఁడు; కొండ దొడ్డది; మహాభారంబు సైరింపఁగాఁ

జాలండో; యని దీని క్రింద నిలువన్ శంకింపఁగాబోల; దీ

శైలాంభోనిధి జంతు సంయుత ధరాచక్రంబు పైఁబడ్డ నా

కేలల్లాడదు; బంధులార! నిలుఁ డీ క్రిందం బ్రమోదంబునన్!!

‘వీడు చిన్నపిల్లాడు పెద్ద గోవర్ధన గిరిని పట్టుకున్నాడు.ఏమో తొందరపడి క్రిందకు వెళితే పిల్లవాడు కొండను వదిలేస్తే ప్రమాదం వస్తుందేమోనని బయట నిలబడతారేమో! నన్ను నమ్మండి. ఈ సమస్త బ్రహ్మాండములు వచ్చి ఈ గోవర్ధన గిరి మీద పడిపోయినా సరే ఈ కొండ కదలదు. మీకు రక్ష. నేను చెప్తున్నాను. వచ్చి ఈ కొండ క్రింద చేరండి. మిమ్మల్ని నేను రక్షిస్తాను’ అన్నాడు. అందరూ వచ్చి కొండ క్రింద చేరారు. అలా ఏడురోజులు మీనాక్షీతత్త్వంతో పోషించాడు.

ఆ తర్వాత ఇంద్రుడు చూశాడు. కృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తి పట్టుకున్నాడు. వర్షమును, ఉరుములను, పిడుగులను ఆపించివేశాడు. వర్షం ఆగిపోయింది. ఇంద్రుడికి అనుమానం వచ్చింది. ఇంత చిన్న పిల్లాడేమిటి, గోవర్ధన గిరి ఎత్తడమేమిటి? దానిని ఏడు రాత్రులు, ఏడు పగళ్ళు పట్టుకుని ఉండడం, ఏమిటి? వీళ్ళందరూ వెళ్ళి దానిక్రింద చేరడమేమిటి? ఇది నిజమా? లేకపోతె ఆ పిల్లాడి రూపంలో పరబ్రహ్మము ఉన్నాడా? అని అనుమానించాడు. ఇప్పుడు తన పదవి ఎగిరిపోతుంది అని భయపడ్డాడు. గోవర్ధన గిరి వద్దకు వచ్చి చూసేసరికి ఒక్కసారికి మహానుభావుడయిన పరమాత్మ దర్శనం ఇచ్చాడు. ఇచ్చేసరికి ఇంద్రుడు ‘నన్ను కన్న తండ్రీ! పరబ్రహ్మమా పొరపాటు అయిపొయింది. మహానుభావా, అహంకారమునకు పోయాను. నా అహంకారమును తీసివేయడానికి గోవర్ధనోద్ధరణము చేశావని గుర్తించలేకపోయాను. ఈశ్వరా, క్షమించు’ అన్నాడు. అపుడు కృష్ణ పరమాత్మ ‘సరే, నీ తప్పును నీవు అంగీకరించావు కాబట్టి నీవు ఇంద్రపదవిలోనే ఉండు, కానీ అంతటి వాడినని ఆహంకరించకు. నీపైన వున్నవాడు, నీయందు అంతర్యామిగా ఉన్నవాడు నీకు అధికారం యిస్తే నీవు వర్షం కురిపించావు. తప్ప నీ అంత నీకుగా ఈ అధికారం లేదు. నేను యిచ్చాను కాబట్టి నీవు దానిని పొందగలిగావు అని గుర్తుపెట్టుకో’ అన్నాడు. ఒక ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. కామధేనువు స్వర్గలోకం నుండి పరుగుపరుగున వచ్చి ఈశ్వరా నోరువున్న మనుష్యులు కష్టం వస్తే ఎక్కడయినా దాక్కుంటారు. కానీ మా ఆవులు, ఎద్దులు దూడలు నోరులేని జీవములు. వాటిని బయట కట్టేస్తారు. కానీ నీవు జగద్భర్తవు, జగన్నాథుడవు, విశ్వేశ్వరుడవు, మా కష్టం నీకు తెలుసు. అందుకని ఈవేళ గోవులను కాపాడావు. కాబట్టి నిన్ను ‘గోవిందా’ అని పిలుస్తూ ‘నీకు నమస్కారం చేస్తున్నాను’ అంది.

ఐరావతం పరుగుపరుగున వెళ్ళి ఆకాశగంగలో వున్నా నీళ్ళను బంగారు కలశములలో తెచ్చి అభిషేకం చేసింది. కామధేనువు యిచ్చిన అవుపాలతో దేవేంద్రుడు స్వహస్తాములతో కలశాములతో కృష్ణుడికి అభిషేకం చేశాడు. దేవతలు నాట్యం చేశారు. అప్సరసలు నృత్యం చేశారు. పుష్పవృష్టి కురిసింది. భగవానుడు గోవిందుడు అయ్యాడు. ఎవరయినా ఏడు రాత్రులు, ఏడు పగళ్ళు మాత్రమే బ్రతుకుతారు. అందుకని బ్రతికి ఉన్నన్నాళ్ళు కష్టం లేకుండా ఉండాలంటే గోవింద నామమును ఆశ్రయించి తీరాలి. ఈ గోవిన్దనామము ఎంత గొప్పతనమును వహించినది అంటే ఇప్పటికీ వేంకటాచలంలో శేషాద్రి శిఖరం మీద వెలసిన స్వామి గోవిందనామంతో ప్రతిధ్వనించి పోతూ, పద్మావతీ దేవిని వక్షఃస్థలంలో పెట్టుకొని కారుణ్య మూర్తియై పద్మపీఠం మీద నిలబడి మనకి దర్శన ఇస్తున్నాడు.