అక్రూరుడు బృందావనముకు ఏతెంచుట
అక్కడ కంసుడు కృష్ణుడు ఎక్కడ పెరుగుతున్నాడోనని చాలా ఆందోళనలో ఉన్నాడు. ఈలోగా కంసుడు మరణించవలసిన సమయం ఆసన్నమైనదని తెలుసుకున్న నారదుడు వచ్చి ‘కంసా, ఇన్నాళ్ళ నుండి నిన్ను చంపేవాడు ఎక్కడ ఉన్నాడని కదా నువ్వు చూస్తున్నావు? నేను చెప్పేస్తున్నాను. నిన్ను చంపేవాడు వసుదేవుని కడుపునే పుట్టాడు. ఈ వసుదేవుడే కారాగారము తలుపులు తెరుచుకుంటే కృష్ణుని యమునానదిని దాటించి నందవ్రజంలో నందుని దగ్గర పడుకోబెట్టాడు. ఇతని కొడుకే నిన్ను చంపేవాడు అష్టమ గర్భంలో పుట్టాడు’ అని చెప్పాడు. అనగాణే ‘ముందు ఆ వసుదేవుని చంపేస్తాను అని కత్తి తీశాడు కంసుడు. అపుడు నారదుడు ‘ఇప్పుడు నువ్వు వసుదేవుణ్ణి చంపేస్తే నీ మృత్యువు పోదు. ఎందుకు దేవకీ వసుదేవులను చంపడం’ అన్నాడు. అపుడు కంసుడు దేవకీ వసుదేవులను తెచ్చి చెరసాలలో బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు. వారిద్దరినీ తీసుకువచ్చి చెరసాలలో బంధించారు. తరువాత నారదుడు ఒకమాట చెప్పాడు ‘నీవు బంధువులందరి చేత ఎందుకు ద్వేషింపబడుతున్నావో అందుకు సంబంధించిన నీ జన్మరహస్యం చెప్తాను విను’ అన్నాడు.
ఈవిశాయమును మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలామంది ‘మావంశంలో ఒక మహా పురుషుడు పుట్టాలండీ’ అంటూ ఉంటారు. మహాపురుషుడు పుట్టాలని అనుకున్నవాడు. కావలసిన రీతిలో నడవడిని కలిగి ఉండాలి. నారదుడు ఈ రహస్యమును కంసుడితో చెప్తున్నాడు. నీవారు నీకు శత్రువులు. ఎందుకో చెప్తాను విను. నీ తల్లి మహాపతివ్రత. ఆమె ఒకనాటి సాయంకాలం పుష్పవాటికయందు విహరిస్తోంది. ఆవిడకి భర్త్రు సమాగమ కాంక్ష కలిగింది. ద్రవిళుడు అనబడే గంధర్వుడు ఇతరుల మనస్సులను కనిపెట్ట గలిగిన వాడు ఆ సమయంలో అదృశ్య రూపంలో తిరుగుతున్నాడు. వానికి ఇతరుల మనస్సు తెలుసు. నీతల్లి మనస్సును గ్రహించాడు. ఉగ్రసేనుడి రూపంలో వచ్చాడు. ఆ వచ్చిన వాడు తన భర్త కాడేమోనని ఆవిడకి అనుమానం వచ్చింది. ఉత్తరక్షణం వాడు తన నిజస్వరూపంతో నిలబడ్డాడు. ఆవిడ ఆగ్రహించింది. అపుడు వాడు ‘ఇది అలోమ సంపర్కము. ఈ అలోమ విధానంలో నేను గంధర్వుడను, నీవు మనుష్యకాంతవు. గంధర్వులు మనుష్య కాంతలతో సుఖము అనుభవించవచ్చు. దానివలన చాలా తేజస్సు కలిగిన కుమారుడు జన్మిస్తాడు. నేను నీకు ఒక గొప్ప వరం ఇస్తున్నాను. నీకు గొప్ప పరాక్రమము కలిగిన వాడు బుద్ధి కలిగిన వాడు అయిన కుమారుడు జన్మిస్తాడు’ అని యింకా ఏదో చెప్పబోతున్నాడు. అపుడు ఆవిడ ‘పరమ దుర్మార్గుడా నా మనస్సులో భర్త్రు సమాగమ కాంక్ష తెలుసుకుని నా భర్తరూపంలో వచ్చి నా పాతివ్రత్యం చెడకుండా నాకు కొడుకును ఇస్తావా? నువ్వు ఎన్ని మాటలు చెప్పినా వెయ్యి మంది సుపుత్రులు కలిగే కన్నా స్త్రీకి శీలమే గొప్ప. నీవు యిటువంటి దుర్మార్గమయిన పని చేశావు కనుక’ అని అంటూ ద్రవిళుడిని శపించబోయింది. తనని శపిస్తుందేమోనని వాడు గజగజలాడుతూ నిలబడ్డాడు. అపుడు ఆమె ‘నీ వలన నాకు పుట్టబోవు కొడుకు దుర్మార్గుడు అగుగాక! ఋషులను ద్వేషించుగాక! పరమ కిరాతకుడు అగుగాక! వానిని పదికాలముల పాటు రాక్షసునిగా చెప్పుకొనెదరు గాక’ అంది. అపుడు వీడు తానుకూడా శాపిస్తేనే ఆవిడ సంతోష పడుతుందని ‘అతడు తనవారి చేత తాను ద్వేషింపబడుగాక’ అని అన్నాడు. అందుకని నీవారి చేత నీవు ద్వేషింపబడతావు. నీతల్లి నీవు పుట్టగానే వరం ఇస్తూనే శపించింది. ద్రవిళుడు కూడా శపించాడు. అందుకే నీ బ్రతుకు ఇలా అయిపొయింది. అందుకే నీవారు అన్నవారు నిన్ను ద్వేషిస్తారు’ అన్నాడు.
నారదుడు అలా అనగానే కంసుడు తన బంధువులనందరినీ తెచ్చి కారాగారంలో పడేశాడు. ‘వీళ్ళందరూ నన్ను చంపేవాళ్ళే, వీళ్ళని నేను చంపేస్తాను’ అని అక్రూరుని పిలిచాడు. ‘అక్రూరా నీకు తెలుసు నేను బ్రతకాలి అనుకుంటున్నాను. కృష్ణుడు నన్ను చంపాలని అనుకుంటున్నాడు. అందుకని నీవు వెంటనే బృందావనం వెళ్ళి కృష్ణుడిని తీసుకురా. నీ మేనమామ కంసుడు ధనుర్యాగం చేస్తున్నాడు. చూడడానికి నీవు బయల్దేరి రావలసింది అని ఆహ్వానించి తీసుకురా. ధనుర్యాగం మిష పెట్టి ఆ పిల్లవాడు మధురా నగరంలోకి రాగానే ఏదోరకంగా చంపేస్తాను. మన దగ్గర కువలయాపీడము అనే ఏనుగు ఉంది. ఆ ఏనుగుతో తొక్కించేస్తాను. చాణూర ముష్టికులనే యిద్దరు మల్లులు ఉన్నారు. వాళ్ళతో మల్లయుద్ధం పెట్టి చంపించేస్తాను. ఒకవేళ తప్పుకుంటే నేను చంపేస్తాను. కాబట్టి బెంగలేదు. ఎలాగయినా సరే మామయ్యా పిలుస్తున్నాడని తీసుకురా’ అన్నాడు. అక్రూరుడు కృష్ణుడి దగ్గరకు బయలుదేరుతున్నాడు.
మదురానగరంలో కంసుని రాజ్యంలో ఉంటున్న అక్రూరుడికి కృష్ణుడి మీద యింత భక్తి ఎలా ఏర్పడింది? అక్రూరుని తల్లిదండ్రులు గాందిని, శ్వఫల్కుడు. గాందిని తండ్రిగారికి ఒక కోరిక ఉండేది. తన పిల్లల కడుపున ఒక మహాపురుషుడు జన్మించాలని ఆయన కోరుకునే వాడు. ఆయన ఒక వ్రతం చేశాడు. ఆ వ్రతంలో మూడువందల అరవై అయిదురోజులు ‘ప్రతిరోజూ నేను ఒక ఆవును దానం చేస్తాను’ అని మూడువందల అరవై అయిదు రోజులు దానం చేశాడు. ఆడపిల్ల తండ్రి ప్రతిరోజూ ఒక ఆవు చోపున సంవత్సరం పాటు దానం చేశాడు. ఆ దానం చేసిన ఫలితం చేత ఆయన కుమార్తె అయిన గాందినికి అక్రూరుడు జన్మించాడు. ఈ అక్రూరుడు జన్మతః విశేషముగా కృష్ణ భక్తి కలిగినవాడు. ముందుతరం కాక ఆ ముందుతరం వాళ్ళు చేసిన గోదాన ఫలితం నుండి యిటువంటి మహాపురుషుడు పుట్టాడు. అక్రూరుని వంటి మహాపురుషుని వలన ఆ వంశం తరిస్తోంది. పుట్టుకచేత యింతభక్తి గతంలో చేసిన పుణ్య వలన వచ్చింది. కాబట్టి ప్రయత్నపూర్వకంగా మనిషి పుణ్యమును చేసి తీరాలి. అలా చేస్తే ఉద్ధరించగలిగిన మహాపురుషుడు ఆ వంశంలో జన్మిస్తాడు అని మనకు అక్రూరుని జీవితం తెలియజేస్తుంది.
అక్రూరుడు ఏమి నా అదృష్టం అని పొంగిపోతూ బలరామకృష్ణులను తీసుకురావడానికి వెళ్ళాడు. అందుకే నమస్కారమునకు అక్రూరుని చెపుతారు. అలా వెళ్తూ ఒకసారి భూమిమీదకి చూశాడు. అక్కడ దివ్యరేఖలతో కూడిన చిన్నిచిన్ని పాదముద్రలు కనిపించాయి. అనగా ఆలమందతో కృష్ణుడు అటుగా వెళ్ళి ఉంటాడని భావించాడు. ఆయన కృష్ణుడు నడిచిన భూమి మీద తాను రథం మీద వెళ్ళడమా! అనుకోని ఒక్కసారి రథమును ఆపాడు. ఒళ్ళంతా ఆనందముతో పొంగిపోయింది. కన్నులవెంట భాష్పదారాలు కారుతుండగా స్వర్ణదండము రథము నుండి కిందపడిపోతే ఎలా పడిపోతుందో అలా రథమునుండి క్రిందపడిపోయాడు. తన స్వామి నడిచిన చోట తాను క్రింద పడ్డాను అనుకుని దోర్లేశాడు. ఆ ధూళి అంతా ఒంటిమీద పోసేసుకుని నందుడు ఉండే యింటి దగ్గరకు వెళ్ళాడు.
ఆవుల మందలో ఒక ఆవు పొదుగు దగ్గర కూర్చుని అంతటా వ్యాప్తి చెందినా నారాయణ తత్త్వము నందుని యింట్లో పాలు పితుకుతోంది. ‘రాశీభూతమైన పరబ్రహ్మమును నా మాంస నేత్రములతో చూస్తున్నాను. నా జన్మ ధన్యమయిపోయింది’ అనుకుని వెళ్ళి కృష్ణుడికి బలరాముడికి నమస్కరించి మానవ జన్మ ఎత్తినందుకు మీ యిద్దరిని చూసి ధన్యత చెందాను’ అన్నాడు.బలరాముడు అక్రూరుడిని గబగబా తీసుకువెళ్ళి ఉచితాసనం మీద కూర్చోపెట్టారు. కాళ్ళు కడిగి ఆ నీళ్ళని తనపై చల్లుకున్నాడు. అర్ఘ్యం ఇచ్చాడు. పాద్యం ఇచ్చాడు. మంచి భోజనం పెట్టాడు. మధుపర్కం ఇచ్చాడు. ఒక గోవును దానం చేశాడు. తాంబూలం ఇచ్చాడు. బలరామకృష్ణులు వచ్చి అక్రూరుని ప్రక్కన కూర్చున్నారు. భక్తికి ఈశ్వరుడు ఎంత వశుడు అవుతాడో చూడండి! అక్రూరా, మధురలో అందరు కుశలమా అని అడగబుద్ధి వేయలేదు. ప్రభువు ధూర్తుడయిన చోట క్షేమం ఎక్కడ ఉంటుంది? కంసుడు పరిపాలిస్తుండగా మధురలో ప్రజలు క్షేమంగా ఎలా ఉంటారు? ఏ పనిమీద మీరు యింత దూరము వచ్చినారో చెప్పవలసినది’ అన్నారు.
అపుడు అక్రూరుడు ‘మహానుభావా, మీకు తెలియని విషయం కాదు. కంసుడు ధనుర్యాగము అనే మిషతో మల్లయుద్ధములను ఏర్పాటు చేశాడు. మేనల్లుళ్ళు కాబట్టి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. కానీ అంతరమునందు కోర్కె వేరు. మీ యిద్దరిని చంపడం కోసం మధుర పిలుస్తున్నాడు. దానికి నన్ను నియోగించాడు. మీ శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు. మీరు దీపముల వంటి వారు. మీమీద పడిన మిడతలు కాలిపోతాయి. కాబట్టి ఈ రీతిగా నయినా మిమ్మల్ని సేవించుకుందామని నేను వచ్చాను’ అన్నాడు. వెంటనే కృష్ణ పరమాత్మ అక్కడ వున్న పెద్దలను పిలిచి ‘మీ అందరూ కూడా పాలు, వెన్న మొదలయిన భాండములను సిద్ధం చేయండి. రేపటి రోజు ఉదయం నేను బలరాముడితో కలిసి అక్రూరుడితో మధురా నగరమునకు వెడతాము. కంసమామ మమ్మల్ని యాగమునకు పిలిచాడు. వెడతాము’ అన్నారు. ఈవార్త బృందావనంలో గుప్పుమంది. కృష్ణునితో గోపకాంతలు విపరీతమయిన అనుబంధం పెంచుకున్నారు. ఇపుడు వారందరి కోపం అక్రూరుడి మీదకు మళ్ళింది. ఇతని పేరు అక్రూరుడా! ఇతని పేరు క్రూరుడు. అని కృష్ణుని రథమునకు ఆడ్డుపడ్డారు. దామోదరా! గోవిందా! కేశవా! నువ్వు వెళ్ళడానికి వీలులేదు. నిన్ను మేము విడిచిపెట్టి ఉండలేము. నీవు వెళ్ళిపోతే ప్రాణములు లేని శరీరములులా పడిపోతాము’ అన్నారు.
పరమాత్మ వాళ్ళతో మాట్లాడలేదు. ‘వాళ్ళని ప్రక్కకి తొలగమనండి ఇది నా ఆజ్ఞ. నేను మధురకు బయల్దేరుతున్నాను’ అన్నాడు. పక్కకి తొలిగారు. రథము వెళ్ళిపోతోంది. పాపం యశోదాదేవి దుఃఖమునకు అంతేలేదు. ప్రతిక్షణం ఆ కృష్ణుడిని తలుచుకోవడం తప్ప అసలు ఆవిడకి జీవితమే లేదు. అంత ప్రేమించిన తల్లి. అక్కడ కంసుని వలన ఏ ప్రమాదము వస్తుందోనని ఆమె బెంగపెట్టుకుని ఉంది. దూరంగా రథం వెళ్ళిపోయి ఆ ధూళి రేగుతుండగా పతాకం కనిపించినంతసేపు ఉండి తిరిగి యిళ్ళకు వచ్చేశారు. అల వెళుతుండగా అక్రూరుడు ఒక చిత్రమయిన పని చేశాడు. రథమును యమునా నది ఒడ్డున ఆపి ‘ఒక్కసారి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని వస్తాను కృష్ణా’ అన్నాడు. చేసుకురావయ్యా అన్నారు. ఆయన నీటి దగ్గరకు వెళ్ళి ప్రణవమును జపించి ఒకసారి ఆ యమునా నది వంక కళ్ళు విప్పి చూశాడు. యమునా నది నీటిమీద బలరామ కృష్ణులు కనపడ్డారు. ఆశ్చర్యపడ్డాడు. ఇదేమిటి, రథం మీద నుండి దిగి నీటిమీద నిలబడ్డారు అని మళ్ళీ వెనక్కి తిరిగి చూశాడు. రథంలోనే కనపడ్డారు. అలా కనపడడం ఈశ్వరుని దివ్యశక్తి అనుకుని యమునానదీ స్నానం చేద్దామని మునకవేశాడు. ఎవ్వరికీ ఇవ్వని దర్శనము పరమాత్మ అక్రూరునికి యిచ్చాడు. అంతేకాకుండా అక్రూరుడు యమునలో మునిగేటప్పటికి సనక సనందనాది మహర్షులు మొదలగువారు అందరూ స్తోత్రం చేస్తుండగా క్షీరసాగరము నందు ఆదిశేషుని మీద అలవోకగా పవళించిన ఆదితత్త్వమయిన ఆదినారాయణుని దర్శనమును పొందాడు. అపుడు అక్రూరుడు పరమాత్మను అద్భుతమయిన స్తోత్రం చేశాడు.
మనం అటువంటి మూర్తినే తిరుపతిలోని గోవింద రాజస్వామి వారి ఆలయంలో దర్శనం చేస్తాము. గోవిందరాజస్వామి పెద్ద పాముచుట్ట మీద తలవెనుక పెద్ద సొల పెట్టుకొని పడుకుని ఉంటాడు. నాభికమలము నందు చతుర్ముఖ బ్రహ్మగారు, కాళ్ళ దగ్గర శ్రీదేవి, భూదేవి, మధుకైటభులానే రాక్షసులతో సహా మనకి దర్శనం యిస్తారు. ఆయన పొట్టమీద అడ్డంగా తులసిమాలలు వ్రేలాడదీయబడి వుండగా కన్నులు మూసుకుని నిద్రిస్తూ ఉన్నట్లుగా మనకు దర్శనం యిస్తాడు. అపుడు మనము అక్రూరుని మనసులో తలుచుకుని అక్రూరుడు దర్శించిన శ్రీమన్నారాయణ తత్త్వము యిక్కడ కనపడుతోందని గోవింద రాజస్వామిని దర్శించవచ్చు. అటువంటి దర్శనమును పొంది అక్రూరుడు సాయంకాలం చీకటి పడుతుండగా బలరామకృష్ణులతో కలిసి మధురా నగరమును చేరుకున్నాడు. కృష్ణుడిని తన యింటికి వచ్చి ఆనాటి రాత్రి విడిది చేయవలసినదని కోరాడు. అపుడు కృష్ణుడు నేను యిప్పుడు రానుల్ రాక్షస సంహారము పూర్తయిపోయి కంసుని సంహరించిన తరువాత యోగ్యమయిన కాలమునందు వచ్చ్చి నీయింట నేను తప్పకుండా ఆతిత్యమును స్వీకరిస్తాను’ అని మాట యిచ్చి బలరామకృష్ణులు ఊరిబయట పడుకున్నారు. మరునాటి ఉదయం మధురా నగర ప్రవేశం చేశారు.