బలరామకృష్ణులు చేసిన గొప్ప చేష్టితములను తెలిసికొనివారైన మధురా నగర వాసులు మేడలమీద నిలబడి వారిని చూస్తున్నారు. ఎంతో ఆనందముగా బలరామ కృష్ణులు మధురా నగరం రాజవీధిలో వేడుతున్నారు. కంసుడికి బట్టలు ఉతికే చాకలి వాడు పట్టుబట్టలన్నీ ఉతికి మూటను కట్టుకొని తలమీద పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. కృష్ణుడు అతనిని పిలిచి ‘మేము నంద మహారాజుగారి బిడ్డలము. మాకు కూడా ఒక పట్టుపంచె ఇవ్వు. కట్టుకుంటాము’ అన్నాడు. అపుడు చాకలి కృష్ణుడుతో చాలా పొగరుతనంతో మాట్లాడాడు. ‘ఈవిషయం మా కంసమహారాజు గారికే తెలిస్తే ఎంత ఆగ్రహం వస్తుందో తెలుసా? ప్రాణములు ఉగ్గడించేస్తాడు. మీకు పెరుగులు, నేతులు త్రాగి బాగా కొవ్వు పట్టింది. ఇవి సాక్షాత్తు కంసమహారాజు గారు కట్టుకొనే పంచెలు. ఇవి మీకు కావలసి వచ్చేయా! వెర్రి మాటలు మాట్లాడకండి’ అన్నాడు. వాని మాటలు విని కృష్ణుడు బలరాముని వంక చూసి ‘అన్నయ్యా, ఇంక ఈ పుర్రె మారదు’ అని పిడికిలి బిగించి ఆ చాకలి వాని నెత్తిమీద ఒక గుద్దు గుద్దాడు. వాడు తలబద్దలై చచ్చిపోయాడు.
కృష్ణుడు రజకుడిని ఎందుకు చంపాడో మనం తెలుసుకోవాలి. చాకలి వాణి పుర్రె ఇప్పటిది కాదు. అది త్రేతాయుగం నాటి పుర్రె. అప్పుడు సీతాదేవి మీద నిందవేశాడు. ఆ పుర్రె సీతా పరిత్యాగమునకు కారణమయిన పుర్రె. ఈ పుర్రె ఎప్పటికయినా మారుతుందేమోనని ఈశ్వరుడు అవకాశం ఇస్తూనే ఉన్నాడు. ఈ జన్మలోనయినా ఒక్క మంచి మాట మాట్లాడతాడేమో అనుగ్రహిద్దామని చూశాడు. ఒక్కొక్కడు అవకాశం వచ్చినా అహంకారముతో నాశనం అయిపోతాడు. ఎక్కడ అలా మాట్లాడాలో తెలియక నోటిమాట వలన చెడిపోతాడు. పొగరుగా మాట్లాడాడు. చచ్చి ఊరుకున్నాడు. ఈశ్వరుని క్షమా గుణమును, మనిషి తెంపరితనమును ఈ రజకుని మరణము మనకు ఆవిష్కరిస్తుంది. బట్టలు ఉతకగలిగాడు కానీ తన మనస్సును ఉతుక్కోలేకపోయాడు.
అది దాటి వెళ్ళారు. మరోచోట వృద్ధుడయిన సాలెవాడు ఒకడు పంచెలు నేస్తున్నాడు. ఆయన బలరామకృష్ణులకు ఎదురువచ్చి తీసుకు వెళ్ళి ‘ఇవి నేను కంసుని కోసం నేస్తున్న మెత్తటి పంచెలు. మహానుభావా, మీరీపంచె కట్టుకుని కనపడితే ఎంతో బావుంటారు. కాబట్టి ఈ పంచె కట్టుకోవలసింది’ అన్నాడు. కృష్ణ పరమాత్మ ఆ పంచె కట్టుకొని సాలెవానికి ఇహమునందున్న సమస్త ఐశ్వర్యమును యిచ్చి అంత్యమునందు అతనికి సారూప్యము యిచ్చి తన దగ్గర కూర్చోపెట్టుకొనగలిగిన ఐశ్వర్యమును కటాక్షించాడు.
సుదాముడు అనబడే మాలాకారుడు ఉన్నాడు. ఆ మాలాకారుడి దగ్గరకు వెళ్ళారు. ఆయన కంసునికి పుష్పమాలలు కడుతూ ఉంటాడు. ఆ మాలాకారుడు వీరికి ఎదురువచ్చి లోపలికి తీసుకువెళ్ళి కూర్చోపెట్టి అర్ఘ్య పాద్యాదులను ఇచ్చాడు ‘కృష్ణా, నా జన్మ ధన్యమయింది. ఏమి అదృష్టం! మీరిద్దరూ ఇవాళ నా దగ్గరకు విచ్చేశారు. దయచేసి నేను యిస్తున్న ఈ పుష్పమాలను అలంకారం చేసుకొనవలసింది’ అని పుష్పమాలలు ఇచ్చాడు. అపుడు పరమాత్మ పొంగిపోయి నీకు ఏమి కావాలో అడుగు ఇచ్చేస్తాను’ అన్నాడు. ఆనాడు మాలాకారుడు మనం అందరం పూజలో చెప్పవలసిన దానిని అడిగాడు.
నీ పాదకమల సేవయు, నీ పాదార్చకుల తోడి నెయ్యమును నితాం
తాపారభూత దయయును, దాపస మందార! నాకు దయసేయ గదే!!
కేవలం బ్రతికేయడం కాదు తండ్రీ! ప్రతిక్షణం నీ పాదకమలముల సేవ నేను చేసుకోగలగాలి. ఎవరెవరు నీ పాదములు పట్టి పూజచేసే మహాభక్తులు ఉన్నారో వాళ్ళతో నాకు స్నేహము కావాలి. ఏ పదార్థము చూసినా అది ఈశ్వరుడే అని నేను భావించి ప్రేమించగలగాలి. దానికి ఎల్లలేదు. పూర్నమై ఉండాలి. ఈశ్వరా, నాకు అటువంటి భక్తిని ప్రసాదించవలసినది’ అని అడిగాడు. అపుడు కృష్ణుడు పొంగిపోయి ఆ మాలాకారుడికి ఆలింగన సౌఖ్యమునిచ్చాడు.
తదనంతరము ఆ ప్రదేశమును దాటి ముందుకు వెడుతున్నాడు. వెడుతుంటే ఒక కుబ్జ ఎదురువచ్చింది. ఇవి అన్నీ దశమ స్కందములో గొప్ప రహస్యములు. ఇవి మనం తెలుసుకోవలసిన ఘట్టములు. ఎదురువచ్చిన కుబ్జ త్రివక్ర. గూని వలన ఆమెకు శరీరంలో మూడు వంకరలు ఉన్నాయి. ఆవిడ ఎదురుచూస్తోంది. కృష్ణ పరమాత్మ ఆవిడ వంకచూశారు. కుబ్జ అందంగా ఉండదు కదా! ఆవిడ కృష్ణుని వంక చూసి
అయ్యా! నన్ను కుబ్జ అంటారు. ఊళ్ళో వాళ్ళందరూ త్రివక్ర అని పిలుస్తారు. నీవు చూస్తే చాలా అందంగా ఉన్నావు. నీకు దృష్టి తీతలా నీ ఎదురుగుండా నేను నిలబడ్డాను. నేను గంధపు చెక్కలమీద గంధం తీస్తూ ఉంటాను. పరిమళ ద్రవ్యములు సిద్ధం చేస్తాను. వాటిని కంస మహారాజుకి పట్టుకు వెడతాను. ఆయన వాటిని తన ఒంటికి రాసుకుంటాడు. అసలు అందం అంటే ఏమిటో ఇవాళ నీలో చూశాను. నీవు ఈ గంధమును రాసుకుంటే ఈ గంధమునకు అందం వస్తుంది. ఈశ్వరా, కొద్దిగా ఈ గంధం రాసుకుంటావా!’ అంది. కుబ్జ కొద్దిపాటి గంధము యిచ్చినందుకు ఈశ్వరుడు ఆమెకు ఎవ్వరికీ దొరకనని విచిత్రమయిన సౌఖ్యమును ఇచ్చాడు. కుబ్జ పాదమును తన కుడి పాదముతో తొక్కేడు. తన చేతి రెండు వేళ్ళను కుబ్జ గడ్డం క్రింద పెట్టి పైకి ఎత్తాడు. అలా ఎత్తేసరికి కుబ్జ మూడు వంకరలు పోయాయి. ఆమె అందమయిన సౌందర్యరాశి అయిపొయింది.
ఇళ్ళు లేని వాళ్ళని పూర్వం పాంథులు అనేవారు. అలాంటి వారందరూ పూర్వం సైరంధ్రి యింట్లో వుండేవారు. సైరంధ్రి పురుషులు అడగడమే తడవు వారికి కావలసిన సౌఖ్యమును కూడా కటాక్షిస్తుంది. కుబ్జ సౌందర్య రాశి అయిపోగానే ‘నేను సైరంధ్రిని, నాకు యింత సౌందర్యమును ఇచ్చావు. నీవు ఒకసారి మా యింటికి వచ్చి నేను యిచ్చే ఆనందమును అనుభవించి అని ఆయన మీద వున్నా ఉత్తరీయమును పట్టుకొని లాగింది. అపుడు కృష్ణ పరమాత్మ తప్పకుండా నేను మీ యింటికి వస్తాను. కాని యిప్పుడు కాదు. కంస సంహారము అయిన తరువాత వస్తాను’ అన్నాడు. ఇది మనకు చిత్రంగా తోస్తుంది. త్రివక్రకు కృష్ణ దర్శనం అయిన తరువాత ఆయన పాదంతో తోక్కాక కూడా ఆమెలో యిటువంటి వాంఛ ఉండిపోయిందా అనిపిస్తుంది. మీరు భాగవతమును చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. త్రివక్రం అంటే మనసులో ఒకమాట, శరీరంతో ఒకటి చేయడం, నోటితో ఒకటి చెప్పడం. మూడింటియందు మూడు వంకర్లు. ఈ మూడు వంకర్లు తీసివేయడమే కుబ్జ తనమును తీసివేయడం. అవి పోయి ఏకత్వం వచ్చేసిందంటే ఈశ్వర స్పర్శ కలిగిన వాడు ఎప్పుడూ ఈశ్వర సేవే కావాలని అడుగుతాడు. ఆ సేవకి వేళాపాళా ఉండదు. త్రివక్రకు తన వంకర్లు పోగానే ఆవిడ ఈశ్వరుని కైకర్యము అడుగుతోంది. అందుకు తన యింటికి రమ్మంటోంది. పరమాత్మ కంసవధ అయిన తరువాత వస్తానంటున్నాడు. అనగా అజ్ఞాన సంహారం పూర్తయిపోవాలి. అందుకని అప్పుడు వస్తానని మాట యిచ్చాడు. తప్ప ఆమెయందు మీరు దోషమును పట్టకూడదు. ఆయన ఒక చిత్రమయిన మాట అన్నాడు ‘నేను పాంథుడను’ అన్నాడు. పాంథుడు అనగా ఇల్లు లేనివాడు. ఆత్మకి యిల్లెమిటి? అది అంతటా పరివ్యాప్తమై ఉంటుంది. కానీ అది అప్పుడప్పుడు ఇంట్లోకి వచ్చి ఉంటూ ఉంటుంది. అందుకని అది శరీరంలోకి వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది.
ఈ మాటలు చెప్పి ఇంకా కొద్ది ముందుకు వెళ్ళాడు. ధనుర్యాగం జరిగే చోటును అడిగి తెలుసుకున్నాడు. ఆయాగం జరిగేచోట ఒక పెద్ద ధనుస్సు నిలబెట్టబడి ఉంది. కృష్ణ పరమాత్మ ఆ ధనుస్సును తీసుకొని సంధించారు. అది రెండుగా విరిగిపోయింది. ఆ ధనుస్సు రెండు ముక్కలను బలరామ కృష్ణులు చేత్తో పట్టుకుని అక్కడ వున్నా కంసుని సైన్యమునంతటినీ సంహారం చేసి ముందుకు వెడుతుంటే కంసుని గుండెలు అదిరిపోయాయి. ఇక కృష్ణుడు తనను చంపివేస్తాడని భావించాడు. కువలయా పీడము అనే పెద్ద ఏనుగు ఒకటి కంసుని వద్ద ఉంది. ఆ ఏనుగును కృష్ణుని మీదకి తోలించాడు. కృష్ణుడు మరణించేలా దానిన్ కృష్ణుని మీదకి తోలవలసిందని మావటి వానికి చెప్పాడు. అక్కడ ఉన్న ద్వారపాలకుడు మావటి కలిసి కృష్ణుని మీదికి ఆ ఏనుగును నడిపించారు. అప్పుడు ఆ ఏనుగు వచ్చి ఆయనను గట్టిగా చుట్టుచుట్టింది. అప్పుడు కృష్ణుడు దాని తొండములో నుండి జారిపోయి నాలుగు కాళ్ళ మధ్యలో దూరాడు. అది తన రెండు కాళ్ళ మధ్యలో తొండం పెట్టి కృష్ణ పరమాత్మ కోసం వెతుకుతోంది. ఆయన దొరకకుండా వెనక కాళ్ళ మధ్యనుండి బయటకు వచ్చి దాని తోక పట్టుకొని దానిని నూరు ధనుస్సుల దూరం వెనక్కి ఈడ్చేశారు.సమస్త బ్రహ్మాండములను తన బోజ్జయండు ఉంచుకున్న వాడికి దిక్కుమాలిన ఏనుగును లాగడం పెద్ద కష్టమా! గిరగిర త్రిప్పి విసిరేశాడు. అపుడు మావటి వాడు పరుగెత్తుకు వెళ్ళి ఆ ఏనుగును మరింత ప్రచోదనం చేశాడు.
యుద్ధంలో అన్నిటికన్నా అత్యంత ప్రమాదకరమయినది ఏనుగు. గుఱ్ఱము తనమీద కూర్చున్న వీరుడిని తీసుకుని పరుగెడుతుంది. కానీ యుద్ధమునకు తీసుకు వెళ్లేముందు ఏనుగుకు నల్లమందు పెడతారు. దానికింకా అస్సలు ఒళ్ళు తెలియదు. ఒళ్ళు తెలియని స్థితిలో ఏనుగు నడుస్తూ శత్రు సంహారం చేస్తుంది. ఏనుగు వెళ్ళిపోతూ దానికి అడ్డు వచ్చిన వాళ్ళని తొండముతో లాగి కింద పడేసి కాళ్ళతో తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది. అది తొక్కుతుంటే చచ్చిపోతారు. తొండము పెట్టి కొడితే చచ్చిపోతారు. దంతము పెట్టి పొడిస్తే చచ్చిపోతారు. అది ఎవడి మీదయినా పడితే చచ్చిపోతారు. కాబట్టి ఏనుగు అలా యుద్ధం చేయగలదు. అటువంటి ఏనుగును కృష్ణుని మీదికి పురిగొల్పాడు. అది చిన్నికృష్ణుని మీదికి పరుగెట్టుకు వస్తోంది. కృష్ణుడు ఒక్కసారి తనకాలితో దాని కాలు తొక్కేటప్పటికీ ఆ ఏనుగు మొర్రో అని ఘీంకరిస్తూ వంగింది. అలా వంగేసరికి కృష్ణుడు దాని రెండు దంతములు ఊడబెరికేశాడు. అరచేత్తో దాని కుంభస్థలం మీద ఒక దెబ్బ కొట్టారు. దాని కళ్ళల్లోంచి నోట్లోంచి నెత్తురు కక్కుతూ కింద పడిపోయింది. అది కింద పడిపోయిన తరువాత దాని దంతములను పెట్టి అక్కడ వున్న యితర వీరులను మావాటిని సంహరించాడు. కృష్ణుడు లోపలికి వెళ్ళేటప్పుడు ఆ ఏనుగు దంతములు రెండింటిని భుజముల మీద వేసుకున్నాడు.
మార్గశీర్ష మాసంలో మనవాళ్ళు తిరుప్పావైని చదువుతుంటారు. అందులో నీలాదేవికి మంచం చేయించవలసి వస్తే కువలయా పీడము నుంచి లాగేసిన దంతముల తోటే ఆయన ఆవిడకు మంచమును చేయించాడు. ఏనుగుకు కువలయా పీడము అనే పేరు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ‘కు’ అంటే భూమి. ‘వలయము’ అంటే భూమండలము. కువలయా పీడము అనగా భూమండలమును పీడించునది అని అర్థము. పృథివీ వికారమయిన మనము పూజ చేద్దామని భూమి మీద వుండి కూర్చుందామని అనుకుంటే ముందు మనలని దేహాత్మాభిమానము అడ్డుతుంది. ఈ శరీర అహంకారమే మనలను పాడుచేసేస్తుంది. ‘అమ్మో, ఈవేళ అంతసేపు కూర్చోవాలా’ అంటుంది. కువలయా పీడము అనేది దేహమునకు సంబంధించిన అహంకారము. శాస్త్రములో దీనిని ‘అన్న వికారము’ అని పిలుస్తారు. అన్న వికారము అంటే ఈ పృథివిలో పండినవి ఎన్నో తినేశావు. వాటినన్నిటిని తినడం వలన యింత శరీరం తయారయింది. ఈ అన్న వికారమయిన శరీరం ఏమవుతుంది? ఇందులో వున్న రక్తము భూమిలోకి యింకిపోతుంది. యిందులో వున్న మాంసము కాలిపోతుంది. లేదా పురుగులు తినేస్తాయి. శరీరం పృథివిలో కలిసిపోతుంది. వెంట్రుకలు మాత్రం వెళ్ళి చెట్ల మొదళ్ళ ను పట్టుకుంటాయి. ఈపాటి శరీరమును చూసుకుని మనం ఎంతో పొగరుతో ప్రవర్తిస్తాము. రెచ్చిపోతూ ఉంటాము. అహంకారంతో ప్రవర్తించి లేనిపోని పాపములను మూట కట్టుకుంటూ ఉంటారు. ఎందుకు వచ్చిన భ్రాంతి! కాబట్టి దీనిని భాగవతంలో కువలయా పీడము అంటారు. జ్ఞానము లేనివాడికి యిది వాడిని వాడు పీడించుకోవడానికి పనికొస్తుంది. పాపం బాగా మూట కట్టుకోవడానికి పనికొస్తుంది. ఒక మహా పురుషునికి యిది పుణ్యం చేయించడానికి, వినయముతో నమస్కారం చేయడానికి ఈశ్వరుని ఆరాధించడానికి తాను యిక్కడ వున్నన్నాళ్ళు హాయిగా వుంది సంతోషంగా ఉంది గట్టెక్కడానికి పనికివస్తుంది. కంసునియందు వున్న కువలయాపీడము పాడుచేయడానికి పనికివస్తుంది. దానికి లోపల ఆ జ్ఞానము వుంది. ఈ కువలయాపీడమును కృష్ణుడు సంహరించాలి. కాబట్టి కువలయాపీడమును ఆయన సంహరించాడు.