వారు మరికొంత లోపలికి వెళ్ళగా చాణూర ముష్టికులు ఉన్నారు. మనలో ఉన్న కామక్రోధములే చాణూరముష్టికులు. వాళ్ళు మల్లయుద్ధం చేస్తారు. వాళ్ళు పట్టుకు పట్టుకు మనలను పడగొడతారు. ఇప్పుడు కంసుడు చాణూర ముష్టికులను ప్రయోగించాడు. అజ్ఞానము ఎలా ఉంటుందో చూడండి. ముష్టికుడితో బలరాముడిని, కృష్ణుడితో చాణూరుని వేదకమీద మల్లయుద్ధం చేయమన్నాడు. వారిద్దరూ భయంకరమయిన మల్లులు. బలరామకృష్ణులు చిన్నపిల్లలు. వాళ్ళతో ఈ చిన్నపిల్లలకు యుద్ధం ఏమిటని అక్కడ వున్నవారు ఆశ్చర్యపోతున్నారు. వాళ్లకి వచ్చినవాడు పరాత్పరుడు అని తెలిసిపోతోంది. ఇంతమందిని చంపాడు అని తెలిసిపోతోంది. వాళ్ళు అన్నారు – ‘ఇదేమీ వైకుంఠ పురం కాదు, కంసుని సభ. ఇది సంసారమును వదిలి పెట్టేసిన వారి సభ కాదు. ఇది గర్వించి ఉన్న వాళ్ళ సభ. ఇది నారదుడు మీటే వీణ కాదు. ఇది కాలదండము లాంటి నా పిడిగుద్దు. ఇది లక్ష్మీదేవితో పరాచికములు ఆడడం కాదు. పిల్లాడా, మాతోటి యుద్ధం చేస్తావా? నీవు ఎక్కడికి పారిపోతావు? పారిపోవడానికి భక్తుల గుండెలు లేవు – సాగి నీవు నడవడానికి వేదాంత వీధి కాదు. రా, నిన్ను మట్టు పెడతాము’ అన్నారు. చాణూరుడితో కృష్ణుడు, ముష్టికునితో బలరాముడు కలియబడ్డారు. బ్రహ్మాండమయిన మల్లయుద్ధం జరిగింది. గరుడుడు పాములను పట్టుకుని ఎగరేసుకు పోయినట్లుగా వాళ్ళిద్దరూ చాణూరముష్టికులను ఇద్దరినీ సంహరించారు. వీళ్ళిద్దరూ మరణించగానే కంసుని గుండె అదిరిపోయింది. సింహాసనం మీద కూర్చుని ఉన్నవాడు వెంటనే కత్తితీసి భటులను పిలిచి ‘వసుదేవుని సంహరించండి – ఉగ్రసేనుని సంహరించండి – ఈ గోపాల బాలురను మట్టుబెట్టండి’ అని ఉన్మాదంతో కేకలు వేస్తున్నాడు.
అప్పుడు కృష్ణుడు సింహాసనం మీదకి ఒక్క దూకు దూకి కంసుని జుట్టు పట్టుకున్నాడు. అంతే కంసుడు పంచత్వమును పొందేశాడు. వాడు చచ్చిపోయాడు.కంసుని మీదకి కత్తి విసరలేదు.
జరాసంధుడు – కాలయవనుడు – ముచుకుందుడు
తరువాత ఒక ముఖ్యమయిన ఘట్టం జరిగింది. జరాసంధుడు యుద్ధమునకు వచ్చాడు. కంసునికి యిద్దరు భార్యలు. వారు జరాసంధుని కుమార్తెలు. వీళ్ళు వెళ్ళి ‘కృష్ణుడు మా భర్తను సంహరించాడు మాకు వైధవ్యం వచ్చింది’ అని జరాసంధుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. జరాసంధుడికి కోపం వచ్చి ఇరువది మూడు అక్షౌహిణుల సైన్యమును తెసుకొని శ్రీకృష్ణుని మీదకి యుద్ధానికి వచ్చాడు. ఇలా పదిహేడు మార్లు వచ్చాడు. పదేహేడు మార్లూ అనేక అక్షౌహిణుల సైన్యమును కృష్ణుడు చంపాడు. పదునెనిమిదవ మాటు మరల జరాసంధుడు వస్తున్నాడు.ఇప్పుడు కృష్ణుడు ఒక చిత్రమయిన పని చేశాడు. జరాసంధుడు మధురా నగరమును ముట్టడిస్తే అమాయకులమయిన గోపాల బాలురు మరణిస్తారని, తనకి కొంత చోటును యిస్తే అందులో జలదుర్గము కట్టుకుంటానని సముద్రుడిని చోటు అడిగాడు. సముద్రుడు చోటు యిచ్చాడు. ఆనాడు విశ్వకర్మను అడిగి సముద్రగర్భంలో ద్వారకానగర నిర్మాణం చేశాడు. ఆనాడు కట్టిన ద్వారక పరమ సత్యమని ఈనాడు బయటపడిన అవశేషాలు మనకి తెలియజేస్తున్నాయి. ఆ ద్వారకా నగరునకు తన మాయాశక్తితో ఎవరికీ ప్రమాదం రాకుండా ఎవరికీ తెలియకుండా అందరినీ ద్వారకకు చేర్చేశాడు. తాను బలరాముడు మాత్రమే మధురలో ఉన్నారు.
కాలయవనుడు అని ఒకాయన ఉన్నాడు. ఆయన పెద్ద జడతో నల్లగా ఉంటాడు. ఆయనకు ఒక వరం ఉంది. యాదవులు ఎవరూ కూడా ఆయనను చంపలేరు. ఆయన దగ్గరకు వెళ్ళి నారదుడు ఒకమాట చెప్పాడు ‘ నీవు అందరి మీదికి యుద్ధమునకు వెడుతుంటావు. అసలు నిన్ను చంపగలిగిన వాడు, నీతో యుద్ధం చేయగలిగిన వాడు, ఒకడు ఉన్నాడు. అతనిని కృష్ణుడు అని అంటారు. మధురలో ఉంటాడు. అక్కడికి వెళ్ళి అతనితో యుద్ధం చెయ్యి’ అన్నాడు. ఆ కాలయవనుడు అతని యవన సైన్యమునంతటినీ తీసుకొని వచ్చాడు. కృష్ణుడితో యుద్ధమునకు శత్రు సైన్యమంతా కోటబయట విడిదిచేసింది. మరునాడు ఉదయం కృష్ణుడి సైన్యం బయటకు వస్తుందని వారు ఎదురు చూస్తున్నారు. కానీ లోపల సైన్యం ఎవరయినా ఉంటె కదా! లోపల బలరామ కృష్ణులు మాత్రమే ఉన్నారు. కృష్ణుడు చాలా నిశ్శబ్దంగా రెండు చేతులు వెనక్కు పెట్టుకొని నెమ్మదిగా కాలయవనుడి దగ్గరకు వస్తున్నాడు. అలా వస్తున్నా వానిని చూసి కాలయవనుడు ఆశ్చర్యపోయాడు. కృష్ణుడిని గుర్తు పట్టి కృష్ణా, నీకోసమే వచ్చాను ఆగు’ అన్నాడు. కృష్ణుడు పరుగెత్తడం మొదలుపెట్టాడు. కృష్ణుడు పారిపోతున్నాడని భావించి కాలయవనుడు గుర్రం మీద కృష్ణుని వెంబడించాడు. కృష్ణుడు కాలయవనుడికి దొరకకుండా పరుగెత్తి పరుగెత్తి ఒక కొండగుహ లోనికి దూరిపోయాడు. గుర్రమును వదిలివేసి కాలయవనుడు కూడా ఆ కొండ గుహలోనికి ప్రవేశించాడు. కొండగుహలో దుప్పటి ముసుగు పెట్టుకొని ఒకాయన పడుకుని వున్నాడు. కాలయవనుడు అక్కడ కృష్ణుడే దుప్పటి కప్పుకుని నిద్రిస్తున్నవాడిలా నటిస్తున్నాడని భావించి అతనిని కాలితో ఒక్క తన్ను తన్నాడు. ‘ఎవడురా నన్ను నిద్రలేపిన వాడు’ అని ఆ ముసుగులో పడుకున్న ఆయన లేచాడు. లేచి ఆయన తీవ్రంగా చూసేసరికి కాలయవనుడు కిందపడిపోయి బూడిద యిపోయాడు. అపుడు పరీక్షిత్తు ఆ దుప్పటి కప్పుకుని పడుకున్నవాడు ఎవరు?” అని శుకమహర్షిని అడిగాడు. శుకుడు దానికి జవాబు చెప్పాడు.
త్రేతాయుగంలో ఇక్ష్వాకు వంశంలో మాంధాత కుమారుడు ముచుకుందుడనేవాడు ఒకడు ఉండేవాడు. ఆటను మహా తేజోసంపన్నుడు. గొప్ప భక్తుడు. రాక్షససంహారమునకు ఒకసారి దేవేంద్రుడు సహాయం అడిగితే వెళ్ళాడు. కుమారస్వామి సర్వసైన్యాధిపత్యం స్వీకరించే వరకు రాత్రింబగళ్ళు యుద్ధం చేసి అనేకమంది రాక్షసులను సంహరించాడు. ఆఖరుకి కుమారా స్వామివారికి దేవసేనాధిపత్యం ఇచ్చాక దేవతలు ఇతనిని ఏమి కావాలో కోరుకొనమని అడిగారు. అపుడు ఆయన ‘నాకు నిద్రపోవాలని ఉంది. నన్ను ఎవరూ నిద్రాభంగం చేయకుండా నేను కొంతకాలం ఎక్కడ నిద్రపోవాలో చెప్పండి’ అన్నాడు. వాళ్ళు ఈ గుహ చూపించి అందులో పడుకోమన్నారు. ‘నీకు ఎవరయినా నిద్రాభంగం చేస్తే నీవు వాడికేసి చూసిన తక్షణం వాడు బూడిద అయిపోతాడు’ అని చెప్పారు. కృష్ణుడికి ఈ రహస్యం తెలుసు. అందుకని కాలయవనుడిని అక్కడికి తీసుకెళ్ళాడు. కాలయవనుడు యాదవుల చేతిలో మరణించడు కదా! ఈవిధంగా ముచుకుందుడి వలన కాలయవనుడు మరణించాడు.
ఇపుడు పదునెనిమిదవ సారి జరాసంధుడు వచ్చాడు. బలరామ కృష్ణులిద్దరూ కోటలోనుండి బయటకు వచ్చి మరల పరుగు మొదలుపెట్టారు. జరాసంధుడు వారివెంట పడ్డాడు. ప్రవర్షణ పర్వతమనే పెద్ద పర్వతమును ఎక్కి బలరామకృష్ణులు అక్కడి పొదలలోకి దూరిపోయారు. అక్కడ ఇంద్రుడు వర్షములను ఎక్కువగా కురిపిస్తూ ఉంటాడు. చెట్లన్నీ చీకటితో ఉంటాయి. వాళ్లకి బలరామకృష్ణులు కనపడలేదు. అపుడు జరాసంధుడు ఆ పర్వతము నంతటినీ తగల పెట్టెయ్యమణి తన సైనికులను ఆజ్ఞాపించాడు. వాళ్ళు మొత్తం పర్వతమంతా తగులపెట్టేశారు. అపుడు అగ్నిహోత్రుని కాంతులు ఆకాశమునకు అంటుకున్నాయి. బలరామకృష్ణులిద్దరూ కూడా నిశ్శబ్దంగా పర్వతం మీదనుండి సముద్రంలోనికి దూకేసి ఈదుకుంటూ ద్వారకానగరమునకు వెళ్ళిపోయారు. కృష్ణుడు, బలరాముడు యిద్దరూ మరణించి ఉంటారనుకుని జరాసంధుడు వెళ్ళిపోయాడు. కృష్ణబలరాములు మాత్రం క్షేమంగా ఉన్నారు.
ఇందులో మీరు తెలుసుకోవలసిన గొప్ప రహస్యం ఉంది. ‘సంధి’ అనగా సగము. సంధికాలము వచ్చింది. యుగ సంధి వచ్చింది అంటారు. మనం ఎవరినయినా ఆశీర్వచనం చేస్తే ‘శతమానం భవతి శతాయు పురుషశ్శతేంద్రియఆయుషేవేంద్రియే ప్రతితిష్ఠతీ’ అంటూ నూరు సంవత్సరములు జీవించు అంటాము. నూరు సంవత్సరములలో సగము ఏభై. మీరు ఈశ్వరారాధన ఈ ఏభై లోపల చెయ్యాలి. ఏభై తరువాత చేసే ఆరాధన మానసికమయినది. ఏభై తరువాత అంత కలివిడిగా శరీరముతో ఈశ్వర సేవ చేయడం కష్టం. మనం చేసే పెద్ద పెద్ద యాత్రలన్నీ ఏబది సంవత్సరముల వయసు లోపల పూర్తి అవాలి. జరాసంధుడు పట్టుకోవడం అంటే వృద్ధాప్యం రావడం. వృద్ధాప్యం వస్తే కాలయవనుడు తరుముతాడు. మృత్యువు వస్తుంది. ఇక్కడ కృష్ణుడు గుహలోకి దూరిపోయాడు. అనగా హృదయగుహలోకి వెళ్ళిపోయాడు. ముచుకుందుడు నిద్రలేచాడు. హృదయంలోకి వెళ్ళిపోయి ఆత్మస్థితి గతుడయిపోయిన వాడికి మరణం ఉండదు. కాలయవనుడు పోయాడు తప్ప ఈయనకి వచ్చిన నష్టం ఉండదు. జరాసంధుని తప్పుకోవడానికి ప్రవర్షణ పర్వతమును ఎక్కాడు. అలా చేయడం అనగా నిరంతరమూ భక్తితో ఉండడం. పరమభక్తితో ఉంటే మృత్యువు మిమ్ములను ఏమీ చేయలేదు. అపుడు యమధర్మరాజు గారు మీ దాపులకు రాడు. పరమభక్తుడయిన వాడిని తీసుకు వెళ్ళడానికి నారాయణుని పార్షదులు వస్తారు. శివుని పార్షదులు వస్తారు. యమదూతలు రారు. ప్రవర్షణ పర్వతం అంతా కాలిపోయింది. సముద్రాంతర్గతమయిన ద్వారకను అనగా ఈశ్వర స్థానమునకు చేరుకున్నాడు. ఈవిధంగా లోకమున కంతటికీ జీవయాత్రను ఈశ్వరుడు ఇలా బ్రతకడం నేర్చుకో అని నిరూపించి చూపించాడు.
రుక్మిణీ కళ్యాణం:
భాగవతంలో దశమస్కంధము ఆయువుపట్టు. ఈ దశమ స్కంధమును పూర్వోత్తర భాగాములని మరల రెండుగా విభజించారు. పూర్వభాగమును రుక్మిణీకళ్యాణం దగ్గర పూర్తి చేస్తారు. భాగవతంలో రుక్మిణీ కళ్యాణం విన్నంత మాత్రం చేత, రుక్మిణీ కళ్యాణం చేసినందు వలన, చూసినందు వలన, వినినందు వలన, చదివినందు వలన కలిగే ఫలితం చెప్పడానికి మాటలు చాలవు. రుక్మిణీ కళ్యాణం చదివితే ఖచ్చితంగా యోగ్యుడయిన వరుడు కన్యకు వచ్చి తీరుతాడు. రుక్మిణీకళ్యాణ ఘట్టమును ప్రారంభం చేస్తూ పోతనగారు
వినుము విదర్భదేశమున వీరుఁడు కుండినభర్త భీష్మకుం
డను నొక దొడ్డరాజు గలఁ; డాతని కేవురు పుత్రు లగ్రజుం
డనయుఁడు రుక్మినాఁ బరఁగు; నందఱకుం గడగొట్టు చెల్లెలై
మనుజవరేణ్య! పుట్టె నొక మానిని రుక్మిణినాఁ బ్రసిద్ధయై.
విదర్భ దేశమును భీష్మకుడు అనే దొడ్డ రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు అయిదుగురు కుమారులు. వాళ్ళ పేర్లు రుక్మి, రుక్మబాహువు, రుక్మకేశుడు, రుక్మనేత్రుడు, రుక్మరథుడు. వీరికి చిట్టచివర ఒక ఆడపిల్ల జన్మించింది. ఆ ఆడపిల్ల రుక్మిణీదేవి.అయిదుగురి చెల్లెలయిన రుక్మిణి పెరిగి పెద్దది అవుతోంది.
పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు నబలలతోడ వియ్యంబు లందు;
గుజ్జెనఁ గూళులు గొమరొప్ప వండించి చెలులకుఁ బెట్టించుఁ జెలువు మెఱసి;
రమణీయ మందిరారామ దేశంబులఁ బువ్వుఁ దీగెలకును బ్రోది చేయు;
సదమల మణిమయ సౌధభాగంబుల లీలతో భర్మడోలికల నూఁగు
బాలికలతోడఁ జెలరేగి బంతు లాడ శారికా కీర పంక్తికిఁ జదువుఁ జెప్పు
బర్హి సంఘములకు మురిపములు గరపు మదమరాళంబులకుఁ జూపు మందగతులు.
ఆతల్లి చిన్నప్పటినుంచి కూడా బొమ్మల పెళ్ళిళ్ళు చేస్తూ ఉండేది. రుక్మిణీ దేవి అంతఃపురము నుండి ఎప్పుడూ డోలు, సన్నాయి వినబడుతూనే ఉండేవి. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే కదా ఒక కన్నెపిల్ల సువాసిని అయ్యేది. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే స్త్రీకి పసుపుకుంకుమలు నిలబడతాయి. ఆవిడ గుజ్జనగూళ్ళను ఒండించి వచ్చిన వాళ్ళందరికీ బొమ్మల పెళ్ళిళ్ళు చేసి పెడుతూ ఉండేది. ఆడవాలు చేసే పనులు పరమ సౌకుమార్యంతో ఉంటాయి. ఆవిడ లతలకు, తీగలకు చక్కగా పందిరి వేసేది. ఎప్పుడూ ఊయలలు ఊగుతూ ఉండేది చిలుకలకు పలుకులు నేర్పుతుండేది. హంసలకు నడకలు నేర్పేది. ఇటువంటి తల్లి శ్రీకృష్ణ భగవానుని వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది.