నృగమహారాజు చరిత్రము:
కృష్ణ పామాత్మ అంతఃపుర ఉద్యానవనంలో ఒక లోతయిన నుయ్యి ఉంది. ఆ ఉద్యానవనంలో కృష్ణ పరమాత్మ కుమారులయిన ప్రద్యుమ్నుడు, సాంబుడు మొదలయిన వారందరూ విహరిస్తున్నారు. వాళ్లకి అలసట కలిగింది. అలసట తీర్చుకోవడం కోసమని కాసిని నీళ్ళు తాగాలని అనుకున్నారు. అక్కడ వున్నా నూతి దగ్గరకు వచ్చి నూతిలోకి చూశారు. అందులో పెద్ద ఊసరవెల్లి పది ఉంది. దానిని చూసి వాళ్ళు తెల్లపోయారు. దానిని పైకి తీద్దామనుకున్నారు. పెద్ద తాళ్ళు తెచ్చి దానికి కట్టి దానిని పైకి లాగడానికి ప్రయత్నించారు. కానీ ఆ ఊసరవెల్లిని పైకి తీయలేకపోయారు. వెంటనే వారు పరుగుపరుగున లోపలికి వెళ్ళి కృష్ణపరమాత్మకు చెప్పారు. అపుడు కృష్ణ పరమాత్మ బయటకు వచ్చి నూతిలోకి వంగి తన ఎడమ చేతితో ఊసరవెల్లిని పట్టుకుని చాలా సులువుగా ఒక గడ్డిపరకను పైకెత్తినట్లు నూతిలోంచి తీసి బయట పడేశాడు. సర్వజ్ఞుడు అయిన పరమాత్మ సాంబుడు మొదలయిన వారిని అడ్డుపెట్టి లోకమునకు ఒక గొప్ప ధర్మమును ఉపదేశం చెయ్యాలని అనుకుని ఊసరవెల్లిని ‘నీవు ఎందుకు ఎంత పెద్ద ఊసరవెల్లి స్వరూపమును పొందావు? ఎందువలన నీకీ జన్మ వచ్చింది?’ అని అడిగారు. ఊసరవెల్లి ఆయనకు నమస్కారం చేసి ‘మహానుభావా, నేను ఇక్ష్వాకువంశంలో జన్మించిన నృగ మహారాజుని’ అని చెప్పాడు. నృగుడు రామచంద్రమూర్తి జన్మించిన వంశంలో జన్మించిన వాడు.
నృగ మహారాజుగారు రాజ్యమును పరిపాలిస్తున్న రోజులలో పరమ ధర్మాత్ముడు. ఆయన చేయని పుణ్యకార్యం లేదు. ఆయన ఒకచోట భాగవతంలో చెప్పుకున్నారు ‘నా గురించి నేను చెప్పుకుంటే ఆత్మహత్య చేసిన పాపం వస్తుంది. కాబట్టి నేను చెప్పుకోకూడదు. కానీ, కృష్ణా ఈ భూమి మీద రేణువులను లెక్కపెట్టవచ్చునేమో కానీ, నేను చేసిన దానములు లెక్కపెట్టలేరు. నేను చెయ్యని దానములు లేవు. ఒకనాడు నేను ఒక గోవును కశ్యపుడు అనే బ్రాహ్మణునకు దానం యిచ్చాను. ఆ కశ్యపుడు ఆ గోవును తీసుకువెళ్ళి తన పెరటిలో కట్టుకున్నాడు. మరునాడు ఆ గోవును పచ్చిగడ్డి మేయడం కోసమని వదిలాడు. ఆ గోవు తప్పించుకుని అలవాటు ప్రకారం ఇంతకు పూర్వం తాను ఉండే మహారాజుగారి ఆలమందలోకి వెళ్ళిపోయింది. రాజు తాను దానం ఇచ్చేసిన గోవు తిరిగి మళ్ళీ వచ్చి తన మందలో కలిసిపోయింది అనే విషయమును గుర్తించలేక అదే ఆవును వేరొక బ్రాహ్మణునకు దానం చేశాడు. వేరొక బ్రాహ్మణుడు ఈ ఆవును తోలుకుని వెళ్ళిపోతున్నాడు. కశ్యపుడికి తాను దానం పుచ్చుకున్న ఆవు ఒకేఒక జీవనాధారమై ఉన్నది ఇపుడు ఆ ఆవు కనపడడం లేదు. ఆ ఆవుకోసమని వెతుకుతున్నాడు. దానిని వేరొక బ్రాహ్మణుడు తీసుకువెడుతున్నాడు. కశ్యపుడు దానిని చూసి ఆ బ్రాహ్మణుడు దగ్గరికి వెళ్లి ‘అది నా ఆవు. నృగ మహారాజు గారు దానిని నాకు దానం చేశారు’ అని చెప్పాడు. అపుడు ఆ బ్రాహ్మణుడు ‘నేను యిప్పుడే పుచ్చుకున్నాను. నేను గోచౌర్యం చేసిన వాడిని కాదు. నేను యిప్పుడే రాజు దగ్గర ఈ గోవును దానం పుచ్చుకుని తీసుకువెడుతున్నాను’ అన్నాడు. ‘లేదు ఈ గోవు నాది’ అన్నాడు కశ్యపుడు. ‘కాదు ఈ గోవు నాది’ అన్నాడు బ్రాహ్మణుడు. వాళ్ళిద్దరి మధ్య పెద్ద రభస బయలుదేరింది. ఇద్దరు కలిసి నృగ మహారాజు దగ్గరికి వెళ్ళారు. ‘అయ్యా, ఈ గోవును యింతకు పూర్వం నాకు దానం యిచ్చావు. అదే ఆవు నీ మందలో కలిసిపోయింది. నీవు మరల ఈ ఆవును వేరొక బ్రాహ్మణునకు దానం యిచ్చావు. కాబట్టి నా అవును నాకు యిప్పించు’ అని రాజును కశ్యపుడు అడిగాడు. అపుడు రాజుగారు రెండవ బ్రాహ్మణునితో ‘నా వల్ల పొరపాటు జరిగింది. నీకు దానం యిచ్చిన గోవు ఇంతకు పూర్వం కశ్యపునకు దానం యిచ్చేసిన గోవు. కాబట్టి ఆ గోవును నీవు యిచ్చేసినట్లయితే ఆ గోవును కశ్యపునకు యిచ్చేస్తాను. అన్నాడు. అపుడు రెండవ బ్రాహ్మణుడు తనకు ‘ఆ ఆవే కావాలి’ అని తన దగ్గర ఉన్న ఆవును తిరిగి ఇవ్వడానికి అంగీకరించలేదు. అపుడు రాజుగారు ‘నీకు లక్ష గోవులను యిస్తాను. ఈ గోవును విడిచిపెట్టు’ అన్నాడు. ‘నాకు ఎన్ని గోవులు యిచ్చినా అక్కర్లేదు. నాకు ఈ గోవే కావాలి’ అని రెండవ బ్రాహ్మణుడు ఆ గోవును పట్టుకుని వెళ్ళిపోయాడు.
అపుడు రాజు కశ్యపుని చూసి ‘నీకు నా రాజ్యంలోని భాగమును ఇమ్మంటే ఇస్తాను. లేదా నీకు ఎన్ని వేల గోవులు కావాలంటే అన్ని వేల గోవులను యిస్తాను. తీసుకువెళ్ళు’ అన్నాడు. అపుడు కశ్యపుడు ‘నేను అడిగిన గోవును ఇవ్వలేక పోయావు. ఇంక నాకు యివ్వవలసినది ఏమీ లేదు’ అని వెళ్ళిపోయాడు. కొంతకాలం అయిపోయింది. నృగ మహారాజుగారి శరీరం కూడా పతనం అయిపొయింది. ఈయనను స్వర్గలోకమునకు తీసుకువెళ్ళబోతున్నారు.అపుడు దూతలు మీరు అనుభవించవలసిన చిన్న పాపఫలితం ఒకటి ఉంది. అది అయిపోయిన తరువాత మిమ్ములను స్వర్గ లోకమునకు తీసుకు వెళతాము. ఆ పాపఫలితం పూర్తి అయిపోయే వరకు పెద్ద ఊసరవెల్లియై నూతిలో పడి ఉండండి’ అన్నారు. అపుడు నృగ మహారాజు తాను చేసిన పాపమేమిటని వారిని ప్రశ్నించగా వారు ‘నీవు ఒక బ్రాహ్మణుడికి దానం యిచ్చిన గోవును వేరొక బ్రాహ్మణునకు దానం యిచ్చావు. కాబట్టి ఊసరవెల్లివై పడి ఉండు’ అన్నారు.
ఈమాటలు నృగ మహారాజు కృష్ణ పరమాత్మకు చెప్పాడు. పరమాత్మ చేతి స్పర్శ తగిలినంత మాత్రం చేత ఆ ఊసరవెల్లి తాను చేసిన పాపమును పోగొట్టుకొని ఊర్ధ్వలోకముల నుండి వచ్చిన రథమును ఎక్కి నృగమహారాజు కృష్ణ పరమాత్మకు నమస్కరించి ఊర్ధ్వ లోకములకు వెళ్ళిపోయారు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ‘బ్రాహ్మణులకు చెందిన ధనమును తెలిసి కాని, తెలియక గాని ఎవరయినా అపహరిస్తే, అలా అపహరించిన కారణం చేత ఆ బ్రాహ్మణుడి కంటివెంట నీటిబిందువు కిందపడితే అది ఎన్ని భూరేణువులను తాకుతుందో అన్ని కోట్ల జన్మలు వాడు రౌరవాది నరకములను అనుభవిస్తాడు. నా భక్తుడిగా ఉండాలనుకున్న వాడు బ్రాహ్మణ ద్రవ్యమును కాజేయడానికి వీలులేదు. ఎవరు బ్రాహ్మణ ద్రవ్యము మీద ఆశ పెట్టుకున్తాడో వాడిని ఎప్పటికీ నా భక్తునిగా నేను చేరనివ్వను. బ్రాహ్మణుల పట్ల నాకు వున్న భక్తి అటువంటిది’ అన్నారు.
ఇక్కడ మనకి కొన్ని సందేహములు కలుగుతాయి. నృగుడు బ్రాహ్మణునకు లక్ష గోవులను యిస్తానన్నాడు. ఆ బ్రాహ్మణుడు ఆ గోవును కశ్యపునకు వదిలివేయవచ్చు కదా! ఆ బ్రాహ్మణునకు అంత మౌడ్యమేమిటి? పోనీ బ్రాహ్మణుడు మూడుడై ఉండవచ్చు. కశ్యపునకు గోవు కాకపొతే రాజ్యం యిస్తానన్నాడు. కానీ కశ్యపుడు తనకి ఆ గోవే కావాలని రాజ్యం కాని, యితర గోవులు కాని అక్కర్లేదని వెళ్ళిపోయాడు. ఏదయినా పొరపాటు జరిగితే దిద్దుకోవలసిన అవసరం బ్రాహ్మణులకు లేదా? బ్రాహ్మణుడయిన వాడు యితరులు చేసిన తప్పుడు దిద్ది దానివలన అవతలి వాడికి పాపం రాకుండా ప్రయత్నం చేయాలి. అది అతని బాధ్యత. అటువంటప్పుడు ఆ బ్రాహ్మణులిద్దరూ అలా ప్రవర్తించవచ్చునా? కృష్ణుడు కూడా కొందరి పట్ల పక్షపాతంతో ఉంటాడా? ఇవీ యిక్కడ మనకు కలిగే సందేహములు. వీటికి సమాదానములను కొందరు పెద్దలు వివరణ యిచ్చారు. బ్రాహ్మణుడు అనగా ఎవరు?
ఓక్ గడ్డి పరక మాత్రమే దొరికితే ఈశ్వరానుగ్రహం చేత తనకి అంత ఐశ్వర్యం లభించిందని తనకు ఉన్న దానిచేత ఎప్పుడూ తృప్తిపడిపోయి ఎవరు పరిపూర్ణమయిన సంతృప్తితో ఉంటాడో, ఎవడు తనకు యింకా ఏదో రాలేదని ఏడవకుండా ఉంటాడో వాడికి బ్రాహ్మణుడని పేరు. బ్రాహ్మణుడు దొరికిన దానితో తృప్తిని పొంది ఉండాలి తప్ప దొరికిన దానిని అడ్డుపెట్టుకుని చాలా సంపాదించెయ్యాలని అనుకుంటే బ్రాహ్మణ్యం పోతుంది. కశ్యపునికి ఆవుకి బదులుగా ఏదయినా యిస్తానన్నా ఆయన ఆశ పొందలేదు. దానిని అంగీకరించలేదు. రాజు నావలన మహాపరాధం జరిగింది నన్ను మన్నించండి అని ఒక మాట అని బ్రాహ్మణుల పాదములు పట్టుకుని ఉండాలి. కానీ ఇక్కడ రాజు అవతలి వారియందు వున్న తృప్తిని గమనిన్చాలేకపోయాడు. బేరం పెట్టాడు. వాళ్ళిద్దరూ తమకి అక్కరలేదని తమ బ్రాహ్మణ్యమును నిలుపుకున్నారు. బ్రాహ్మణ్యము అనేది అపారమయిన తృప్తితో పొందవలసిన లక్షణము. దానము చేయబడిన ఆవు తిరిగి తన మందలో కలవకుండా చూసుకోవడంలో రాజు ఏమరుపాటు పొందాడు. కాబట్టి తప్పును రాజు ఖాతాలో వేశారు. దానికి ప్రాయశ్చిత్తం ఆ పాపఫలితమును అనుభవించడమే. కాబట్టి కృష్ణ పరమాత్మ యింకా పరివేదన చెందకుండా పైకెత్తారు తప్ప ఊసరవెల్లి జన్మ రాకుండా చేయలేకపోయారు.
ఈ ఆఖ్యానం వినడానికి చాలా చిన్నకతలా ఉంటుంది. కానీ యిందులో మనకి గొప్ప ధర్మం తెలుస్తుంది. దానం చేసేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో మనకు ఈ కథ నేర్పుతుంది. మీరు దానం చేసేటప్పుడు చూపే వినయం వలన ఈశ్వరుడు ప్రీతి చెంది ఆ దానమునకు ఫలితమును ఇస్తాడు. దానం చేసేటప్పుడు శ్రద్ధ చాలా అవసరం. శ్రద్ధ లేకపోవడం వలననే రాజును పాపం అనుభవింప జేసింది. నేను యిస్తున్నాను అనే అహంకారం ఉండకూడదు. శ్రీమన్నారాయణుడు తన ఎదుట నిలబడి దానం పుచ్చుకుని అనంతమయిన ఫలితమును యిచ్చి ఉత్తర జన్మలో నేను అనుభవించ గలిగిన శుభ ఫలితములను యివ్వడానికి దానం పుచ్చుకున్నాడు నేను మిక్కిలి ధన్యుడను అని భావిస్తూ దానం పుచ్చుకున్న వాడికి నమస్కరించాలి. ఈ కథ అంత విశేషమయిన స్థితిని అవిష్కరిస్తుంది.
పౌండ్రక వాసుదేవుడు
పూర్వం కరూషదేశమును పౌండ్రక వాసుదేవుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన పెరిగి పెద్దవాడయిన తరువాత ఆయనకు ఎవరో ‘అయ్యా మీపేరు ఉన్నవాడు మరొక ఆయన ఉన్నాడు. ఆయన వసుదేవుని కుమారుడు. అసలు వాసుదేవుడు ఆయనే అని లోకం నమ్ముతున్నది’ అని చెప్పారు. ఈ విషయం చెప్పగానే ఈయన కూడా తెల్లటి శంఖం ఒకదానిని కొనుక్కున్నాడు. ఒక చక్రమును, గదను, ధనుస్సు చేయించుకున్నాడు. ఎప్పుడూ పట్టు పీతాంబరము కట్టుకోవడం ప్రారంభించాడు. ఆవిధంగా అతను వాసుదేవుని అనుకరిస్తూ తాను పౌండ్రక వాసుదేవుడనని మురిసిపోయేవాడు. ఒక రాయబారిని పిలిచి నీవు వెళ్లి కృష్ణుడికి ఒక సందేశం చెప్పు అని ఒక లేఖ రాసి యిచ్చి పంపించాడు. ఆ రాయబారి కృష్ణ భగవానుని దగ్గరకు వెళ్ళాడు. ఆ సమయంలో కృష్ణుడు నిండు సభలో కూర్చుని ఉన్నాడు. ఈ రాయబారి వెళ్లి ‘అయ్యా పౌండ్రక వాసుదేవుడు మీకీ రాయబారం పంపించాడు’ అని చెప్పాడు. ఆ పత్రికలో “నేను ఎటువంటి అలంకారములను ధరించి ఉంటానో, అలా నీవు కూడా పెట్టుకుంటావని తెలిసింది. నాకు అర్థం కానిది ఒకటే. నాకూ వాసుదేవుడు అనే పేరు ఉంది. నీకూ వాసుదేవుడు అనే పేరు ఉంది. దీనివలన యిబ్బంది వస్తోంది. కాబట్టి నీ అంతట నీవు మర్యాదగా ఈ చిహ్నములన్నిటిని వదిలి పెట్టెయ్యాలి. వాసుదేవుడు అన్న పేరును వదిలి పెట్టెయ్యాలి. లేకపోతె యుద్ధమునకు వచ్చి నీ శరీరమును మట్టుపెట్టవలసి ఉంటుంది. ఏది కావాలో అడుగు’ ఇదీ రాయబారం లోని సారాంశం.
కృష్ణుడు అన్నారు “ఈ చిహ్నములు నాకు సహజములు. నేను వీటిని వదిలిపెట్టడం కుదరదు. కాబట్టి అతడు కోరుకున్న రెండవ కోరికను నేను అంగీకరిస్తున్నాను అని చెప్పు. యుద్ధభూమిలో కలుసుకుందాం’ అని పంపించివేశాడు. పౌండ్రక వాసుదేవునకు కాశీరాజు మద్దతు పలికాడు. ఇద్దరు కలిసి కృష్ణ పరమాత్మ మీద యుద్ధం మొదలుపెట్టారు. అసలు ఈ పౌండ్రక వాసుదేవుడు ఎలా ఉంటాడో చూడాలి అనుకున్నాడు కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ ఎలా ఉన్నాడో పౌండ్రక వాసుదేవుడు అలాగే ఉన్నాడు. కృష్ణుడు వానిని రథం మీద చూసి ఆశ్చర్యపోయి పకపకా నవ్వి యుద్ధం ప్రారంభించాడు. కొంతసేపు వారిద్దరి మధ్య యుద్ధం జరిగింది. చివరికి పౌండ్రక వాసుదేవుడు కృష్ణుడి చేతిలో చచ్చిపోయాడు. అపుడు చిత్రమైన సంఘటన జరిగింది. ఆ చచ్చిపోయిన వానిలో ఉన్న తేజస్సు పైకి లేచి కృష్ణ పరమాత్మలో కలిసిపోయింది. ఇది వినగానే పరీక్షిత్తు తెల్లబోయాడు. ‘ఆయనలో తేజస్సు ఈయనలో ఎలా కలిసింది”’ అని శుకమహర్షిని అడిగాడు. శుకుడు అతనికి సందేహం తీరేలా సమాధానం చెప్పాడు. పౌండ్రక వాసుదేవుడు ఎ పని చేసినా అచ్చం కృష్ణుడిలా ఉన్నానా లేనా అని ఎల్లవేళలా కృష్ణుడినే తలచుకుంటూ ఉండడం వలన మనస్సునందు కృష్ణ ధ్యానమును పొంది ఉన్నాడు. కాబట్టి వాడు ఎ కారణం చేత తలచినా సంతతము తలచినది ఆ వస్తువునే కాబట్టి చివరకు ఆ వస్తువులోనే కలిసిపోయాడు. పౌండ్రక వాసుదేవుని వృత్తాంతం నుంచి మనం ఒక్కటి తెలుసుకోవాలి. మనం ఎప్పుడూ భగవంతుని పేరుతోటి ఆయన లీలల తోటి ఈశ్వరుని అనుకరించే ప్రయత్నములు చేయకూడదు. అటువంటివి ధూర్త చేష్టితములు అయిపోతాయి. అక్కడ యుద్ధం జరిగినపుడు కాశీరాజు తల కూడా తెగిపడిపోయింది. కానీ కాశీరాజు తేజస్సు కృష్ణ పరమాత్మలో చేరలేదు.
కాశీరాజు కొడుకు కృష్ణుడి మీద అభిచారిక హోమం చేశాడు. కృష్ణుడు దానిని ఒక చక్రంతో తోసి అవతలకి పారేశాడు. ఇది అనవసర విషయముల జోలికి వెళ్ళి మద్దతులు ప్రకటించడం, తిరగడం మొదలయిన ఇబ్బందులు తీసుకువస్తాయని భగవంతుని సాత్త్వికమయిన మూర్తులను ఆరాధన చేసి మనస్సును సత్త్వ గుణంతో ఉంచుకుని, భగవంతుని చేరే ప్రయత్నం చేయాలి తప్ప, లేని పోని భేశాజములు అంత మంచివి కావు అని హెచ్చరిక చేసే అద్భుతమయిన లీల.