అప్పుడు విశ్వామిత్రుడు,……..నేను నీకు మెడలో బంగారు తాడులున్న పద్నాలుగు వేల ఏనుగులనిఇస్తాను, ఎనిమిది వందల బంగారు రథాలని ఇస్తాను, ఆ ఒక్కో రథానికి స్వర్ణాభరణములతో అలంకరింపబడ్డ నాలుగు గుర్రాలు ఉంటాయి, అలాగే గొప్ప గొప్ప జాతులకి చెందిన పదకొండు వేల గుర్రాలు ఇస్తాను, ఒక కోటి గోవుల్ని ఇస్తాను, బంగారము, వెండి ఎంత కావాలో నువ్వే అడుగు, నేను ఇచ్చేస్తాను అన్నాడు. ఇవన్నీ విన్న వశిష్ఠ మహర్షి, నేను ఇంక ఏమి మాట్లాడను అన్నారు.
ఆగ్రహించిన విశ్వామిత్రుడు, ఈయన ఇవ్వడమేంటి నేను పుచ్చుకోవడమేంటి, అడిగినకొద్ది బెట్టు చేస్తున్నాడు, ఈ రత్నం నాకు చెందినది అని ఆ శబళ మెడలో తాడు కట్టి, సైనికులకిచ్చి తీసుకెళ్ళమన్నాడు. వాళ్ళు దాన్ని ఈడ్చుకెళుతుంటె ఆ శబళ ఏడ్చింది. ఇంత జెరుగుతున్నా వశిష్ఠుడు మాత్రం అలానే నిశబ్దంగా ఉన్నారు. అప్పుడా శబళ……..ఇంతకీ నన్ను వశిష్ఠుడు వదిలేశాడ, లేకపోతే విశ్వామిత్రుడు తీసుకెళుతున్నాడ, వశిష్ఠుడు నన్ను ఇవ్వను అంటె విశ్వామిత్రుడు నన్ను తీసుకెళ్ళగలడా, వశిష్ఠుడు నన్ను వదిలేశాడంటే నేను ఏదో పాపం కాని, పొరపాటు కాని చేసి ఉండాలి, ఒకవేళ నేను ఏదన్నా పాపం చేసి ఉంటే వశిష్ఠుడికి క్షమార్పణ చెప్తాను, ఆయన బ్రహ్మర్షి కనుక నన్ను తప్పకుండా క్షమిస్తారు అని తాడు విడిపించుకొని వశిష్ఠుడి దెగ్గరికి పరుగుతీసి వెళ్ళింది.
అప్పుడు వశిష్ఠుడు…….
న త్వాం త్యజామి శబలే న అపి మే అపకృతం త్వయా |
ఏష త్వాం నయతే రాజా బలాత్ మత్తః మహాబలః ||
శబళా! నేను నిన్ని విడిచిపెట్టలేదు. విశ్వామిత్రుడే నిన్ను బలాత్కారంగా తీసుకెళుతున్నాడు. ఆయన ఈ భూమికి ప్రభువు, కాని నేడు తప్పు ద్రోవలొ వెళుతున్నాడు, అతను దోషం చేస్తే, ఆ దోషం అతనిని కాలుస్తుంది. నిన్ను ఈడ్చుకెళ్ళి దోషం చేశాడు, ఇక ఆయన అపరాధమే ఆయనని కాలుస్తుందని చెప్పాడు.
అయితే నన్ను నేను రక్షించుకోనా అని శబళ అడుగగా, తప్పకుండా రక్షించుకో అని వశిష్ఠుడు చెప్పాడు.
అప్పుడా శబళ గట్టిగా అంబా అని అరిచి శూలాయుధధరులైన పహ్లవులు కొంతమందిని సృష్టించింది. వాళ్ళు విశ్వామిత్రుడి సైన్యాన్ని నాశనం చెయ్యడం మొదలుపెట్టారు. ఇది గమనించిన విశ్వామిత్రుడు కత్తి పట్టుకొని యుద్ధరంగంలోకి వెళ్ళి చాలామంది పహ్లవులని సంహరించాడు. ఆ శబళ పహ్లవులతో పాటుయవనులని సృష్టించింది, వాళ్ళందరూ కలిసి విశ్వామిత్రుడి సైన్యాన్ని తుడిచెయ్యడం ప్రారంభించారు. అప్పుడా శబళ వశిష్ఠుడితో……..చూశార! ఆయన నాకు ఎదురుతిరిగాడు, ఇప్పుడు ఓటమి అంచులలో ఉన్నాడు అని అన్నది. అయితే నువ్వు ఇక యదేచ్ఛగా సైన్యాన్ని సృష్టించు అని వశిష్ఠుడు అన్నాడు.
అప్పుడా శబళ సూర్యుడి ప్రకాశంతో సమానమైన కాంభోజ వంశీయులని, తన పొదుగు నుండి కొన్ని వేల పహ్లవులని, యోని నుండి యవనులని, గోమయం పడే స్థానం నుంచి శకులు, రోమకుపాల నుండిహారీతులు మరియు కిరాతకులని సృష్టించింది. వీరందరూ కలిసి ఆ విశ్వామిత్రుడి సైన్యాన్ని సమూలంగా తుడిచిపెట్టారు. రథం నుండి కిందకి దిగి తన సైన్యాన్ని చూసిన విశ్వామిత్రుడు నిస్తేజుడయ్యాడు. ఇది కదా శబళ గొప్పతనం అనుకొని తన 100 కుమారుల వైపు చూశాడు. తమ తండ్రిని బాధపెట్టిన వశిష్ఠుడిని చంపెయ్యాలని అందరూ కత్తులు పట్టుకొని ఆయన మీదకి పరుగుతీసారు.
కూర్చుని ఉన్న వశిష్ఠుడు తన మీదకి వస్తున్న ఆ నూరుగురు పిల్లల్ని చూసి గట్టిగా “ఆ……” అని హుంకారం చేశారు, ఆ నూరుగురు పిల్లలు భస్మరాసులై కిందపడిపోయారు. ఇది చూసిన విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయాడు.
ఇది కదా బ్రహ్మర్షి యొక్క గొప్పతనం అంటె, ఆయన “ఆ….” అంటె వందమంది బూడిదైపోయారు, ఆ ఆవు తలుచుకుంటె గొప్ప సైన్యాన్ని, అమోఘమైన భోజనాన్ని సృష్టించింది. రాచరికం కన్నా తపఃశక్తి చాలా గొప్పది, ఈ వశిష్ఠుడిని నాశనం చెయ్యాలంటే నాకున్న శక్తి సరిపోదు. కావున నాకు ధనుర్వేదంలోని సమస్తఅస్త్ర-శస్త్రాలు తెలియాలి అనుకొని ఒక కుమారుడిని సింహాసనం మీద కూర్చోబెట్టి, రాజ్యపాలన చెయ్యమని చెప్పి తాను తపస్సు చేసుకోడానికి హిమాలయ పర్వతాలకి వెళ్ళాడు.