జనక మహారాజుగారి ఆహ్వానం మేరకు విశ్వామిత్రుడు రామలక్ష్మణ సమేతంగా రాజసభకి చేరుకున్నారు. అప్పుడు విశ్వామిత్రుడు జనకుడితో ఇలా అంటాడు…….వీళ్ళ ఇద్దరికీ నీ దెగ్గరున్న శివ ధనుస్సుని చూపిద్దామని తీసుకొచ్చాను, నువ్వు ఒకసారి ఆ శివ ధనుస్సుని చూపిస్తే వీళ్ళు చూసి సంతోషించి తిరుగు ప్రయాణం చేస్తారు అని అన్నాడు. అప్పుడు జనకుడు తనకి ఈ శివ ధనుస్సు ఎలా వచ్చిందో చెప్పడం ప్రారంభించాడు.
పూర్వం దక్ష ప్రజాపతి శివుడికి హవిస్సులు ఇవ్వని యాగం ప్రారంభించాడు. శివుడులేని చోట మంగళం ఎలా ఉంటుందని దక్షుని కుమార్తె అయిన సతీదేవి(పార్వతీదేవి) యోగాగ్నిలో శరీరాన్ని వదిలింది. ఆగ్రహించిన శివుడు రుద్రుడయ్యాడు. అసలు ఇలాంటి యాగానికి దేవతలు ఎందుకు వెళ్ళారని ఆయన ధనుస్సు పట్టుకున్నాడు, వెంటనే దేవతలు ప్రార్ధించగా ఆయన శాంతించాడు.
ఆ ధనుస్సుని జనక మహారాజు వంశంలొ పుట్టిన దేవరాతుడు అనే రాజు దెగ్గర న్యాసంగా( అంటె కొంతకాలం ఉంచారు) ఉంచారు. అప్పుడా దేవరాతుడు ఆ ధనుస్సుని ఒక మంజూషలొ(పెద్ద పెట్టె) పెట్టాడు. చక్రాలున్న ఆ మంజూషలొ శివ ధనుస్సు ఉండగా తొయ్యాలంటే దాదాపు 5000 మంది కావాలి. అలా ఆ విదేహవంశీయులు ఆ శివ ధనుస్సుని రోజూ పూజిస్తూ, పరమ పవిత్రంగా చూసుకుంటూ ఉన్నారు.
అథ మే కృషతః క్షేత్రం లాంగలాత్ ఉత్థితా మమ |
క్షేత్రం శోధయతా లబ్ధ్వా నామ్నా సీతా ఇతి విశ్రుతా ||
అలాగే నేను ఒకప్పుడు యజ్ఞం చేద్దామని భూమిని దున్నుతున్నాను. అలా దున్నుతున్నప్పుడు నాగటి చాలుకి తగిలి ఒక బాలిక తనంత తానుగా పైకి లేచింది. నాగటి చాలుకి తగిలి పైకి వచ్చింది కనుక, అలాగే భూమికి ఉన్నంత ఓర్పు ఉన్నది కనుక ఆమెని సీతా అని పిలిచాము(జనకుని కూతురు కనుక జానకి, మిథిలా నగరంలో పుట్టింది కనుక మైథిలి, దేహం మీద భ్రాంతిలేని విదేహ వంశంలో పుట్టింది కనుక వైదేహిఅని సీతమ్మకి పేర్లు). ఆమె అయోనిజ, ఒక స్త్రీ కడుపులో గర్భవాసం చేసి పైకి వచ్చినది కాదు. ఆమె అద్భుతమైన సౌందర్యరాశి. ఆమెని చూసిన దేవతలు, రాక్షసులు, యక్షులు మొదలైన వాళ్ళందరూ ఆమెని తమ భార్య చేసుకుందామన్న వ్యామోహం పొందారు. అందుకని నేను ఆమెని వీర్య శుల్కగా( అంటె పరాక్రమము చేత గెలుచుకోబడవలసినది) ప్రకటించి, శివ ధనుస్సుని ఎక్కుపెట్టిన వాడికి ఇస్తాను అన్నాను. అలా ఎందరో రాజులు వచ్చారు శివ ధనుస్సుని ఎక్కుపెట్టడానికి, కొంతమంది ఆ ధనుస్సుని చూడగానే పడిపోయారు, ఎవరూ కనీసం దాన్ని కదపలేకపోయారు. వచ్చిన వాళ్ళందరూ భగ్నహృదయాలతో వెనుదిరిగేవాళ్ళు.
ఈ జనకుడు పెట్టిన పరీక్షలో ఎవరమూ గెలవలేము, ఆ ధనుస్సుని ఎవరమూ ఎక్కుపెట్టలేము, కనుక మనందరమూ ఒకటై, జనకుడి మీదకి యుద్ధానికి వెళదాము అని నిర్ణయించుకున్నారు. అందరూ కలిసి మా రాజ్యం మీదకి యుద్ధానికి వచ్చారు. అప్పుడు మా రాజ్యం చుట్టూ ఒక పెద్ద అగడ్త(భుమిని తవ్వి దానిని నీళ్ళతో నింపుతారు) తవ్వి, ద్వారాలు మూసేశాము. ఒక సంవత్సరం పాటు యుద్ధం జరిగాక మా దెగ్గరున్న ఆహార నిల్వలు క్షీణించిపోయాయి. అప్పుడు నేను తపస్సు చేశాను. నా తపస్సుకి మెచ్చిన దేవతలు తమ సైన్యాన్ని నాకు కటాక్షించారు. ఆ దేవతా సైన్యంతో నేను ఆ రాజులని ఓడించాను అని జనకుడు చెప్పుకున్నాడు.
అప్పుడు జనకుడు ” ఒకవేళ ఈ రాముడు శివ ధనుస్సుని ఎక్కుపెట్టగలిగితే, నేను నా కూతురు సీతని కన్యాదానం చేసి ఇస్తాను” అన్నాడు.