బాలకాండ

వాల్మీకి మహర్షి గురించి స్కాంద పురాణంలొ సనత్ కుమారుడు వ్యాస మహర్షికి వివరించాడు. సుమతి – కౌశికి అనే బ్రాహ్మణ దంపతుల కుమారుడి పేరు అగ్నిశర్మ. ఆ అగ్నిశర్మకి చదువు, అనగా వేదములు మొదలైనవి సరిగ్గా అబ్బలేదు. ఆ రాజ్యంలో క్షామం వచ్చి, ఎవరూ ఎవరికీ దానధర్మాలు చెయ్యడం లేదు. కాబట్టి అగ్నిశర్మ తన భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో అరణ్యానికి వెళ్లి, అక్కడ దొరికే కందమూలాలు, తేనె లాంటివి తెచ్చుకొని బ్రతుకుతున్నాడు. చదువు సరిగ్గా అబ్బనందువల్ల అక్కడ ఉండే దొంగలతో స్నేహం చేసి దొంగతనాలు చెయ్యడం ప్రారంభించాడు. ఒకసారి అటుగా వెళుతున్న కొంతమంది మహర్షులను ఆపి మీదెగ్గర ఉన్నది ఇవ్వండి, లేకపోతె చంపుతాను అన్నాడు. ఆ మహర్షులలో ఉన్న అత్రి మహర్షి “నువ్వు ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు” అని అగ్నిశర్మని అడిగారు. నన్ను నమ్ముకున్న నా భార్యని, నా తల్లిదండ్రులని పోషించుకోవడానికి అని చెప్పాడు శర్మ. అలా అయితే, నువ్వు ఇప్పటిదాకా చేసిన ఈ దొంగతనాల వల్ల నీకు కలిగిన పాపాన్ని, నీ కుటుంబ సభ్యులలో ఎవరన్నా పంచుకుంటారేమో అడిగిరా అని అత్రి మహర్షి అన్నారు.

మమ్మల్ని పోషించడం నీ కర్తవ్యం, కాబట్టి నువ్వు మమ్మల్ని పోషించాలి. నువ్వు తెచ్చావు, మేము అనుభవిస్తాము. కాని, ఎలా తెచ్చావు అన్నదానికి ఇచ్చె ఫలితాన్ని నువ్వే అనుభవించాలి అని అన్నారు శర్మ కుటుంబసభ్యులు. చాలా బాధ కలిగి, మళ్ళి ఆ ఋషుల దెగ్గరికి వచ్చి, నా పాపాలను పోగొట్టుకునే మార్గం చెప్పమన్నాడు. ధ్యానం చెయ్యి అని అత్రి మహర్షి చెప్పి వెళ్ళిపోయారు. 13 సంవత్సరాల తరువాత ఆ మహర్షులు ఇదే దారిలో తిరిగొస్తుంటే అక్కడ ఒక పెద్ద పుట్ట కనబడింది. ధ్యానమగ్నుడై ఉన్న అగ్నిశర్మ మీద పుట్టలు పెరిగాయి. తన మీద పుట్టలు(వల్మీకం) కట్టినా తెలియని స్థితిలో ఉన్నాడు కాబట్టి, ఆయనని వాల్మీకి అని పిలిచి, బయటకి రమ్మన్నారు. ఇది ఆయనకి పౌరుష నామమయ్యింది. అప్పుడు ఆ మహర్షులు ఆయనని ఉత్తర దిక్కుకి వెళ్లి భగవంతుడిని ధ్యానం చెయ్యమన్నారు. వాల్మీకి మహర్షి కుశస్థలి అనే ప్రదేశానికి వెళ్లి, పరమశివుడిని ఆరాధన చేశారు. అప్పుడాయనకి విష్ణు కథ రాయగలిగే అదృష్టాన్ని బ్రహ్మగారు ఇచ్చారు. అంటె, ఆయనకి త్రిమూర్తుల అనుగ్రహం లభించిందన్నమాట.

తపస్స్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం |

నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం ||

వాల్మీకి మహర్షి రామాయణంలొ రాసిన మొదటి శ్లోకం. దీని అర్ధం ఏంటంటె, తపస్వి, ముని, గొప్ప వాగ్విదాంవరుడైన నారద మహర్షిని పరిప్రశ్న చేయడానికి తపస్వియైన వాల్మీకి మహర్షి సిద్ధపడుతున్నారు అని. వాల్మీకి మహర్షి నారదుడిని ఏమడిగారంటె…………….

కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ |

ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో ధృఢవ్రతః ||

చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః |

విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చ ఏక ప్రియదర్శనః ||

ఆత్మవాన్ కో జిత క్రోధో ద్యుతిమాన్ కః అనసూయకః |

కస్య బిభ్యతి దేవాః చ జాత రోషస్య సంయుగే ||

ఈ లోకంలొ ఇప్పుడే, ఇక్కడే ఉన్న గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞత భావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, ధృడమైన సంకల్పం కలిగినవాడు, చారిత్రము కలిగినవాడు, అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్ధుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత సౌందర్యం కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటివారిలొ మంచిని చూసేవాడు, అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుగోగలిగినవాడు ఉంటె నాకు చెప్పండి అని అడిగాడు.

నువ్వు చెప్పిన గుణాలన్నీ ఒకే మనిషిలొ ఉండడం కష్టమే, కాని ఒకడు ఉన్నాడు, నీకు ఇప్పుడు అతని గురించి చెప్తాను అని నారద మహర్షి ఇలా అన్నారు……..

ఇక్ష్వాకువంశములొ రాముడని పేరుగల ఒక వ్యక్తి జన్మించాడు. ఆయనకి నువ్వు అడిగిన 16 గుణాలు ఉన్నాయి అని చెప్పి ఒక 100 శ్లోకాలలో సంక్షిప్త రామాయణాన్ని వాల్మీకి మహర్షికి నారదుడు చెప్పాడు.

చెప్పిన తరవాత నారదుడు వెళ్ళిపోయాడు. విన్న వాల్మీకి మనస్సు చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు మధ్యాన సమయంలొ సంధ్యావందనం చెయ్యడానికి తమసా నది తీరానికి భారద్వాజుడు అన్న శిష్యుడితో వెళ్లారు. అదే సమయంలో ఒక చెట్టు మీద సంభోగం చేసుకుంటున్న రెండు క్రౌంచ పక్షులని చూశారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక బోయవాడు పాపనిశ్చయుడై మిధున లక్షణంతో ఉన్న ఆ మగ క్రౌంచ పక్షి గుండెల్లో బాణం పెట్టి కొట్టాడు. కిందపడిన ఆ మగ పక్షి చుట్టూ ఆడ పక్షి ఏడుస్తూ తిరుగుతుంది. అప్పటిదాకా మనసులో రామాయణాన్ని తలుచుకుంటున్న వాల్మీకి మహర్షికి ఈ సంఘటన చూసి, బాధ కలిగి ఆయన నోటివెంట అనుకోకుండా ఒక మాట వచ్చింది………..

మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః|

యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్||

ఓ దుర్మార్గుడైన బోయవాడా! మిధున లక్షణంతో ఉన్న రెండు క్రౌంచ పక్షులలొ ఒక క్రౌంచ పక్షిని కొట్టినవాడ, నీవు చేసిన పాపమువలన నీవు ఎక్కువ కాలం జీవించి ఉండవుగాక, అని శపించాడు.

ఆయన స్నానం ముగించి ఆశ్రమానికి బయలుదేరారు, కాని ఆయన నోట్లో ఈ మాటలు తిరుగుతూనే ఉన్నాయి, మనసులో ఆ క్రౌంచ పక్షులే కనిపిస్తున్నాయి. అలా ఆయన శిష్యులు కూడా ఈ మాటలని ధారణ చేశారు, అలా అది శ్లోక రూపం దాల్చింది. ఇంతలో చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆశ్చర్యపోయిన వాల్మీకి మహర్షి బ్రహ్మగారిని ఆశ్రమంలోకి తీసుకెళ్ళి కుర్చోపెట్టారు. అప్పుడు బ్రహ్మగారు అన్నారు “ఓ బ్రాహ్మణుడా! నీ నోటివెంట వచ్చిన ఆ శ్లోకమే రామాయణ కథ.” అన్నారు. ఆ శ్లోకానికి అర్ధం చూడండి……

“నిషాద” అంటె బోయవాడు అని ఒక అర్ధం, అలాగే సమస్త లోకములు తనయందున్న నారాయణుడు అని ఒక అర్ధం. “మా” అంటె లక్ష్మి దేవి. “మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః”, అంటె లక్ష్మిని తనదిగా కలిగిన ఓ శ్రీనివాసుడా నీ కీర్తి శాశ్వతముగా నిలబడుగాక. ” యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్”, కామము చేత పీడింపబడి, బ్రహ్మగారు ఇచ్చిన వరముల చేత అహంకారము పొంది, కామమే జీవితంగా జీవిస్తున్న రాక్షసుల జంట అయిన రావణ-మండోదరులలో, రావణుడు అనే క్రౌంచ పక్షిని నీ బాణంతో కొట్టి చంపిన ఓ రామ, నీకు మంగళం జెరుగుగాక, అని ఆ శ్లోక అర్ధం మారింది.

బ్రహ్మగారు అన్నారు, “నా శక్తి అయిన సరస్వతి అనుగ్రహం చేత నువ్వు ఈ రోజు రామాయణాన్ని పలికావు. నాయనా, నేను నీకు వరం ఇస్తున్నాను ” నువ్వు కూర్చొని రామాయణం రాద్దామని మొదలెడితే, రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ, రాక్షసులు మొదలైన వాళ్ళు మాట్లాడినదే కాదు, వాళ్ల మనస్సులో అనుకున్న విషయాలు కూడా తెలుస్తాయి. ఈ భూమి మీద నదులు, పర్వతాలు ఎంత కాలం ఉంటాయో అంత కాలం రామాయణం ఉంటుంది. ఇందులో ఒక్క మాట అబద్ధం కాని, కల్పితం కాని ఉండదు. నువ్వు ఇంక రామాయణం రాయడం మొదలపెట్టు” అని వరం ఇచ్చి వెళ్ళిపోయారు. వాల్మీకి మహర్షి ధ్యానం చేసి కూర్చోగ ఆయనకి బ్రహ్మ గారి వరం వల్ల జెరిగిన రామాయణం అంతా ఆయనకి కనబడసాగింది. ఆయన రామాయణం రచించడం ప్రారంబించారు. మొత్తం 24,000 శ్లోకాలు, 6 కాండలు, 6 కాండల మీద ఒక కాండ, 500 సర్గల రామాయణాన్ని రచించడం ప్రారంభించారు.