కైకేయి ఇచ్చిన ఆ బహుమానాన్ని మంథర తీసుకోకుండా విసిరేసి ఇలా అనింది………
” మూర్ఖురాలా! నేను చెప్పింది నీకు అర్ధం అవ్వడంలేదు, అందుచేత నువ్వు పాముని కౌగలించుకొని పడుకోడానికి సిద్ధపడుతున్నావు. దశరథుడు నీకు ఇష్టమైన పనులే చేస్తాడని అనుకుంటున్నావు. నీకు జెరుగుతున్న అన్యాయాన్ని నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు. రాముడితో పాటు పట్టాభిషేకానికి యోగ్యత ఉన్నవాడు భరతుడొక్కడే. అందుకే రాముడికి భరతుడంటే భయం. అందుకే యువరాజ పట్టాభిషేకం భరతుడు లేకుండా చూసి రాముడు చేసుకుంటున్నాడు.” అనింది.
“చేసుకోని, అందులో తప్పేముంది, రాముడు పరిపాలన చేసిన తరువాత భరతుడు పరిపాలిస్తాడు ” అని కైకేయ అనింది.
అప్పుడు మంథర ” పిచ్చిదానా! నీకు అర్ధం కావడం లేదు, ఒకసారి రాముడికి దశరథ మహారాజు యువరాజ పట్టాభిషేకం చేశాక, ఇక జన్మలో భరతుడు రాజు కాలేడు. రాముడు కొన్ని వేల సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడు, తదనంతరం రాముడి పుత్రులు పరిపాలిస్తారు. నీ కొడుకు ఒక్కనాటికి రాజు కాలేడు. కాని ఒక మాట గుర్తుపెట్టుకో, సుమిత్రకి ఉన్న ఇద్దరు కుమారులలో ఒకడైన లక్ష్మణుడు సర్వకాలములయందు రాముడితోనే ఉంటాడు. అందుకనే రాముడు లక్ష్మణుడిని తన దెగ్గర ఉంచుకున్నాడు, కాని శత్రుఘ్నుడు భరతుడితో ఉంటాడు కనుక శత్రుఘ్నుడిని తన దెగ్గర ఉంచుకోలేదు. ఒక పెద్ద చెట్టుని నరకాలంటే, ముందు ఆ చెట్టు చుట్టూ ఉన్న పొదలని తీసేయ్యాలి, అప్పుడే ఆ చెట్టుని నరకగలము. అలాగే భరతుడిని తీసేయ్యాలంటే భరతుడితో ఉంటున్న శత్రుఘ్నుడిని కూడా తీసెయ్యాలి. అందుకని అవసరం ఉన్నా లేకున్నా శత్రుఘ్నుడిని భరతుడితో పంపించి ఇద్దరినీ లేకుండా చేశాడు రాముడు. అకస్మాత్తుగా యువరాజ పట్టాభిషేకాన్ని తన తండ్రికి చెప్పి ప్రకటించాడు. ఇలాంటి విషయాల్లో రాముడు చాలా తెలివైన వాడు. ప్రజలందరి మద్దత్తు కూడబెట్టుకున్నాడు. వాళ్ళందరితో రాముడు రాజు కావాలని ఆమోదం పొందాడు. భరతుడు ఇక్కడే ఉంటె రోజూ తన తండ్రికి సేవ చేసేవాడు, అప్పుడు దశరథుడికి భరతుడి మీద ప్రేమ పెరిగేది. అలా జెరగకుండా ఉండడానికే భరతుడిని రాజ్యం నుంచి పంపించేసాడు రాముడు. రాముడు రోజూ పితృసేవ, పితృసేవ అని దశరథుడి చుట్టూ తిరిగి పట్టాభిషేకం పొందుతున్నాడు. రాముడికి లక్ష్మణుడితో సమస్యలు ఉండవు, కావున భరతుడిని అయోధ్యకి రాకముందే మట్టుపెట్టేస్తాడు. అందుకని కైకా నా మాట విని నీ కొడుకుని అయోధ్యకి రానివ్వమాకు. అటునుంచి అటు అరణ్యాలకి పారిపొమ్మని చెప్పు. ఒకసారి రాముడికి పట్టాభిషేకం అయితే ప్రజలకి ఆయన మీద ఉన్న నమ్మకం ఇంకా పెరుగుతుంది. ఇంక రాజ్యంలో తనకి శత్రువర్గం అనేది లేకుండా చేసుకుంటాడు.
ప్రాప్తాం సుమహతీం ప్రీతిం ప్రతీతాం తాం హతద్విషం |
ఉపస్థాస్యసి కౌసల్యాం దాసీవత్త్వం కృతాఞ్జలిః ||
ఇన్నాళ్ళు అందగత్తెనన్న అహంకారంతో, భర్తని కొంగుకి ముడేసుకున్నానన్న అతిశయంతో కౌసల్యతో ప్రవర్తించావు. ఇప్పుడు కౌసల్య నీకు పాఠం చెప్పడం ప్రారంభిస్తుంది. కౌసల్య రాజమాత అవుతుంది, నువ్వేమో అడవులు పట్టి పారిపోయిన వాడికి తల్లివి. అప్పుడు నువ్వు దశరథుడికి భార్యగా కాదు కౌసల్యకి దాసిగా బతకాలి. అన్నంకోసం రోజూ కౌసల్య దెగ్గరికి వెళ్ళి వంగి దండం పెట్టాలి ” అని మంథర కైకేయతో అనింది.
మంథర చెప్పిన ఈ మాటలు విన్న కైకేయ మనసులో దురాలోచన ప్రవేశించింది. ఆమె వెంటనే మంథరతో……” నేనూ నా కొడుకు ఈ ఉపద్రవం నుంచి బయటపడాలంటే ఏమి చెయ్యమంటావు ” అని అడిగింది. అప్పుడు మంథర ఏమి చెప్పిందంటే………………
అద్య రామమితః క్షిప్రం వనం ప్రస్థాపయామ్యహం | యౌవరాజ్యే చ భరతం క్షిప్రమేవాభిషేచయే ||
” ఏ రాముడు తన గుణములు చేత, పితృవాక్య పరిపాలన చేత, తండ్రిని సేవించడం చేత రాజ్యాన్ని పొందుతున్నాడో, ఆ రాముడిని పధ్నాలుగు సంవత్సరాలు జటలు కట్టుకొని, నారచీరలు కట్టుకొని దండకారణ్యానికి పంపాలి. నీ కొడుకుకి అదే ముహూర్తానికి పట్టాభిషేకం చేయించాలి. రాముడు పధ్నాలుగు సంవత్సరాలు అరణ్యాలకి వెళ్ళడం వల్ల నీ కొడుకు సింహాసనం మీద కూర్చొని ప్రజలందరిలోను మంచి మద్దత్తు సంపాదిస్తాడు. నీ కొడుకు ప్రజల గుండెల్లో బాగా పాతుకుపోతాడు. తరువాత రాముడు తిరిగొచ్చినా తనకి ఎదురుతిరగకుండా తప్పిస్తాడు. కాబట్టి రాముడిని పధ్నాలుగు సంవత్సరాలు అరణ్యాలకి పంపడం, నీ కొడుక్కి పట్టాభిషేకం చేయడం, ఈ రెండు వారాలని అడుగు ” అని చెప్పింది.
“మంథరా! నా కొడుక్కి యువరాజ పట్టాభిషేకం, రాముడికి అరణ్యవాసం ఎలా కలుగుతుంది ” అని కైకేయ మంథరని అడిగింది. అప్పుడా మంథర………….
” ఆ, నీకు తెలీదా ఏంటి, నా నోటితో చెప్పించాలని చూస్తున్నావు. ఒకనాడు ఇంద్రుడికి వైజయంత నగరంలోతిమిధ్వజుడు(శంబరాసురుడు) అనే రాక్షసుడితో యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో ఇంద్రుడు ఒక్కడే గెలవలేక దశరథుడి సహాయం అడిగాడు. అయితే దశరథుడు అన్ని విద్యలు తెలిసున్న నిన్ను కూడా తనతో పాటు తీసుకెళ్ళాడు. ఆ తిమిధ్వజుడు దశరథుడిని బాగా కొట్టేసరికి, భర్తని రక్షించుకోవడం కోసం సారధ్యం చేస్తున్న నువ్వు దశరథుడిని రాక్షసుల నుంచి తప్పించి దూరంగా తీసుకెళ్ళావు. అక్కడ సేదతీరుతున్న మీ మీద రాక్షసులు మళ్ళి దాడిచెయ్యగా, నువ్వు వాళ్ళనుంచి తప్పించుకొని మళ్ళి వేరొక చోటికి తీసుకెళ్ళావు. అలా రెండుసార్లు రక్షించడం వల్ల దశరథుడు నీకు రెండు వరాలిస్తాను కోరుకోమన్నాడు. కాని అప్పుడు నువ్వు ఏమి కోరికలు లేవని అడగలేదు, అవసరమైనప్పుడు అడుగుతానన్నావు. నువ్వు మరిచిపోయావేమో, ఈ విషయాలని నాకు చెప్పింది నువ్వే. ఎప్పుడైనా అడుగుతానన్నావుగా, ఇప్పుడు సమయం వచ్చింది, ఆ రెండు వరాలు అడుగు. నువ్వు అడిగితే ధర్మానికి కట్టుబడే దశరథుడు మాట తప్పడు.” అని చెప్పింది.
ఈ మాటలు విన్న కైకేయ పరమసంతోషంతో ” ఓ మంథరా! నువ్వు గూనితో ఒంగి, తలూపుతూ మాట్లాడుతుంటే గాలికి కదులుతున్న తామర పువ్వులా ఉన్నావే. భరతుడికి పట్టాభిషేకం అవ్వగానే నీ గూనికి బంగారు తొడుగు చేస్తాను, బంగారపు బొట్టు చేయిస్తాను, రాజుల బుర్రల్లో ఎన్ని ఆలోచనలు, తంత్రాలు ఉంటాయో అవన్నీ నీ గూనిలో ఉన్నాయి ” అనింది. అప్పుడా మంథర…………..నాతో మాట్లాడడం కాదమ్మా, నువ్వు పెట్టుకున్న ఆభరణాలు, కట్టుకున్న పట్టుచీర అవతల పారేసి, ఒక ముతక వస్త్రం కట్టుకొని కోపగృహంలో నేల మీద పడుకో, అప్పుడు దశరథుడు వచ్చి నీకు వజ్రాలు, ముత్యాలు, రత్నాలు ఇస్తానంటాడు. ఆయన మాటలకి నువ్వు లొంగిపోకు, మంకుపట్టు పట్టి రెండు వరాలు ఇస్తావా చస్తావ అని నిలదియ్యి అని అనింది. అయితే కోపగృహం నుంచి ఆనందంతో వస్తున్న కైకేయనో, లేకపోతే నా శవాన్నో చూస్తావు నువ్వు అని ఆ కైకేయ అలంకారాలన్నీ తీసేసి లోపలికి వెళ్ళి పడుకుంది.