కొంతసేపటికి దశరథుడికి తెలివి వచ్చాక కైకేయ ఇలా అనింది ” ఏమయ్యా! ఇక్ష్వాకువంశములొ జన్మించానంటావు, సత్య-ధర్మములు పాటిస్తున్నానంటావు, రెండు వరాలు ఇచ్చానన్నావు, ఆ రెండు వరాలు నేను అడిగే సరికి నీకింత కష్టం కలిగిందా. ఎవరైనా వచ్చి రాముడేడని అడిగితే దండకారణ్యానికి పంపించానని చెప్పలేను అని అంటున్నావు కదా, మరి ఆనాడు నేను నీకు రెండుసార్లు ప్రాణబిక్ష పెడితే బతికినవాడివి, అలాంటి బతుకిచ్చిన కైకేయకి రెండు వరాలివ్వడం మానేసి అమాయకురాలిని చేసి వంచించినవాడ అని లోకం పిలవదా. వరాలు ఇవ్వడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నావు.
నీ వంశంలోని వాళ్ళు ఉత్తమ గతులకి వెళ్ళాలా, ఒకనాడు డేగ రూపంలో ఉన్న ఇంద్రుడు పావురం రూపంలో ఉన్న అగ్నిని తరుముతూ రాజు దెగ్గరికి వచ్చారు. ఆ పావురం రాజు కాళ్ళ మీద పడితే, రాజు ఆ పావురానికి శరణిచ్చాడు. ఆ పావురానికి శరణిచ్చావు బాగానే ఉంది, మరి నా ఆహారం సంగతేంటని అడిగాడు డేగ రూపంలో ఉన్న ఇంద్రుడు, ఆ రాజు యొక్క ధర్మనిష్ఠ తెలుసుకుందామని. నీకు పావురం మాంసం కావాలి కనుక ఆ మాంసం నేనిస్తాను అని, పావురాన్ని తక్కెటలో ఒక పక్క పెట్టి, మరొకపక్క తన శరీరం నుండి కోసిన కొంత మాంసాన్ని పెట్టి, ఆ మాంసాన్ని ఇచ్చినవాడు నీ వంశంలో పుట్టిన శిబి చక్రవర్తి. అలాగే ఒకనాడు అలర్కుడి దెగ్గరికి ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి నిలబడితే, నీకేమి కావాలో కోరుకోమన్నాడు రాజు. అయితే నీ కళ్ళని ఇచ్చేస్తావ అన్నాడు ఆ బ్రాహ్మణుడు. ఇస్తానన్నాడు కాబట్టి తన రెండు కళ్ళని తీసి ఇచ్చాడు అలర్కుడు. అలాంటి వంశంలో పుట్టి రెండు వరాలు భార్యకి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా తప్పించుకు తిరగడానికి నీకు సిగ్గుగా లేదా.
దుర్మతే! ధర్మాన్ని వదిలేసి, రాముడికి పట్టాభిషేకం చేసేసి నువ్వు కౌసల్యతో రోజూ కులుకుదామని అనుకుంటున్నావా. నీ బతుకేంటో నాకు తెలీదనుకున్నావా. నాకు రెండు వరాలు ఇచ్చి తీరాల్సిందే. నువ్వు రాముడికి పట్టాభిషేకం చేస్తే, కౌసల్య రాజమాత అయితే, నేను కౌసల్యకి నమస్కారం చేస్తానని అనుకుంటున్నావా, ఒక్కనాటికి అది జెరగదు. నేను ప్రాణాలైనా విడిచిపెడతాను కాని ఒక్కనాటికి కౌసల్యకి నమస్కారం చెయ్యను. నా రెండు వరాలు నాకు ఇవ్వాల్సిందే ” అని అనింది.
అప్పుడు దశరథుడు ” ఒకవేళ ఇదే నీ పట్టుదల అయితే, నువ్వు నేలమీద పడి ముక్కలయిపో, నువ్వు నిలువునా మండిపో, సర్వనాశనమయిపో నీ కోరిక మాత్రం నేను తీర్చను, ఎందుకంటే నువ్వు ధర్మబద్ధమైన కోరిక కోరలేదు. లోకమంతా ఎవరిని రాజుగా కోరుకుంటుందో, ఎవరిమీద లోకమంతా ఒక అపవాదు వెయ్యలేదో అటువంటి మహాత్ముడిని ఎటువంటి కారణం లేకుండా అరణ్యాలకి పంపమంటున్నావు. నువ్వు నాశనమయిపోయినా సరే, నేను మాత్రం నీ కోరిక తీర్చను ” అన్నాడు.
అలా కైకేయతో ఏడ్చి ఏడ్చి మాట్లాడుతూ దశరథుడు అప్పటికి 15 సార్లు స్పృహతప్పాడు. అలా ఏడుస్తూ కైకేయతో……
” రాముడు దండకారణ్యానికి వెళితే ఎంత కష్టమొస్తోందో, ప్రజలు ఎంత తల్లడిల్లిపోతారో నువ్వు ఊహించలేకపోతున్నావు. నేను అదృష్టవంతుడిని అయితే, అసలు రాముడిని అరణ్యాలకి వెళ్ళు అన్న మాట అనకుండా ఇప్పుడే మరణించాలని కోరుకుంటున్నాను. మరొక్కసారి నీ పాదాలు పట్టుకుంటాను ” అని మళ్ళి కైకేయ పాదాల మీద పడబోగా, ఆవిడ మళ్ళి తప్పుకుని ఇలా అనింది………….
త్వం కత్థసే మహా రాజ సత్య వాదీ ద్ఋఢ వ్రతః |
మమ చ ఇమం వరం కస్మాత్ విధారయితుం ఇచ్చసి ||
” సత్యం, ధర్మం అని అంటావు, సత్యానికి ధర్మానికి కట్టుబడ్డానంటావు, రోజూ ఇన్ని ప్రగల్భాలు చెప్తావు. రెండు వరాలు నేను అడిగితే ఇంత బాధపడుతున్నావు, మాట తప్పుతున్నది నువ్వు కాదా ” అని అడిగింది.
అలా ఆ రాత్రి దశరథుడు ఎంత బతిమాలీనా కైకేయ ఒప్పుకోవడంలేదు. ఏడ్చి ఏడ్చి ఆయన కళ్ళన్నీ ఉబ్బిపోయాయి. జుట్టు చెరిగిపోయింది. నీరసం వచ్చింది. అప్పుడాయన……..
” ఓ రాత్రి!, నాకు నువ్వన్నా ఒక వరం ఇవ్వు. ఈ రాత్రిని ఇలాగె ఉండని, తెలవారనివ్వమాకు. తెల్లవారితే రాముడితో నేను ఏమి మాట్లాడను, అందుకని నువ్వు ఇలాగె ఉండిపో. వద్దులే నువ్వు తొందరగా వెళ్ళిపో, ఎందుకంటే ఇలా చీకటిగానే ఉంటె నేను ఇక్కడే ఉండాల్సివస్తుంది, నేను అంతసేపు ఈ కైకేయని చూస్తూ ఉండలేను, కాబట్టి నువు తొందరగా తెలవారిపో ” అంటూ తాను ఏమి మాట్లాడుతున్నాడో తెలియని ఉన్మాద స్థితికి వెళ్ళిపోయాడు.
మెల్లగా తెల్లవారుతోంది……………………..
అప్పుడు కైకేయ ” ఇప్పుడు తెల్లవారుతోంది, రాముడు నీ ఆశీర్వాదం కోసం వస్తాడు. రాముడిని చూసిన తరువాత పుత్రవాత్సల్యంతో మాట మార్చినా, భరతుడికి రాజ్యం ఇవ్వకపోయినా, రాముడిని అరణ్యాలకి పంపకపోయినా విషం తాగి ఇదే గదిలో చనిపోతాను ” అని అనింది.
అప్పుడు దశరథుడు………….
యః తే మంత్ర క్ఋతః పాణిర్ అగ్నౌ పాపే మయా ధ్ఋతః |
తం త్యజామి స్వజం చైవ తవ పుత్రం సహ త్వయా ||
” నువ్వు నన్ను ఇంత బాధపెట్టావు కాబట్టి, ఏ రాముడిని చూసి చనిపోతాను అంటె ఆ వరం కూడా ఇవ్వలేదు కనుక, మంత్రపూర్వకంగా ఏ అగ్ని సమక్షంలో నీ పాణిగ్రహణం చేశానో, అటువంటి నిన్ను ఇప్పుడే విడిచిపెడుతున్నాను. ఇక నువ్వు నాకు భార్యవి కావు. నువ్వు నీ కొడుకు కలిసి రాజ్యం ఏలుకొండి. ఎవడికోసమైతే నువ్వు ఇంత దారుణానికి దిగాజారవో ఆ కొడుకుని కూడా వదిలేస్తున్నాను. భరతుడు నా శరీరాన్ని ముట్టుకోకూడదు ” అన్నాడు.
అలా తెల్లవారగానే పట్టాభిషేకానికి చెయ్యాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు, బ్రాహ్మణులూ, జానపదులు, సామంతరాజులు మొదలైన వాళ్ళందరూ రాజు కోసం ఎదురుచూస్తున్నారు. అప్పుడు సుమంత్రుడు దశరథ మహారాజుని కలుద్దామని లోపలికి వెళ్ళి, మాతలి ఇంద్రుడిని ఎలా నిద్రలేపుతాడో, సూర్యుడు సమస్త లోకాలని ఎలా తన కిరణముల చేత నిద్రలేపుతాడో నేను నిన్ను అలా నిద్రలేపుతున్నాను, కాబట్టి ఓ మహారాజ నిద్రలేచి బయటకి రా అని అన్నాడు. యువరాజ పట్టాభిషేకం కోసం అందరూ బయట వేచి ఉన్నారు, ఏమి చెయ్యమంటారు అని సుమంత్రుడు దశరథుడిని అడుగగా, దశరథుడు మాట్లాడలేక, కన్నుల నుంచి నీటి ధారలు పడిపోతుండగా మరోసారి స్పృహ తప్పి పడిపోయాడు. రాజు ఇలా పడిపోయాడు ఎమిటని సుమంత్రుడు కైకేయని అడుగగా………….
” ఏమిలేదయ్య సుమంత్ర! రాముడికి పట్టాభిషేకం అన్న సంతోషంలో ఆయనకి రాత్రి నిద్రపట్టలేదు, ఇప్పుడే నిద్రపట్టింది. అందుకని అలా పడిపోయాడు. నువ్వు గబగబా వెళ్ళి రాజు పిలుస్తున్నాడని చెప్పి రాముడిని తీసుకురా ” అనింది కైకేయ.
అక్కడే ఉన్న వశిష్ఠుడు మరియు ఇతర సామంతరాజులు దశరథ మహారాజు ఇంకా బయటకి ఎందుకు రావడం లేదు మాకు దర్శనం ఎందుకు ఇవ్వడం లేదని అడుగగా సుమంత్రుడు మళ్ళి లోపలికి వెళ్ళి దశరథుడిని స్తోత్రం చేయ్యబోగా, ” రాముడిని తీసుకు రమ్మన్నానుగా, తొందరగా వెళ్ళి రాముడిని తీసుకురా ” అని దశరథుడు అన్నాడు. వెంటనే సుమంత్రుడు రాముడిని తీసుకురావడాని బయలుదేరాడు.
ఆ రాముడి అంతఃపురం ప్రజలందరితో నిండిపోయి ఎంతో శోభాయమానంగా ఉంది. రాముడు స్నేహితులతో, బ్రాహ్మణులతో, జానపదులతో ఆ ప్రదేశం కళకళలాడుతోంది. సీతమ్మ చేత అలంకారం చెయ్యబడ్డ రాముడు ఎంతో చక్కగా ఉన్నాడు. సుమంత్రుడు వచ్చి దశరథ మహారాజు మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పగా రాముడు సుమంత్రుడితో కలిసి బయలేదేరాడు. రాముడితో పాటు లక్ష్మణుడు బయలుదేరాడు, వాళ్ళతో మిగతా జనసమూహం అంతా బయలుదేరింది. దశరథుడి అంతఃపురానికి చేరుకోగానే మిగతావారందరూ బయటనే ఉండిపోయారు, రాముడు లక్ష్మణుడు లోపలికి వెళ్ళారు. జీవచ్చవంలా ఉన్న తన తండ్రిని చూసి రాముడు ఆశ్చర్యపోయాడు. రాముడిని చూడగానే దశరథుడు మూర్చపోయాడు. అప్పుడు రాముడు ఇలా అన్నాడు………
” అమ్మ! నేను నాన్నగారిని ఎప్పుడు అలా చూడలేదు, ఎందుకమ్మా నాన్నగారు ఇలా ఉన్నారు. నావల్ల ఎమన్నా పొరపాటు జెరిగుంటే చెప్పమ్మా దిద్దుకుంటాను, ఒక్క నిమిషం నా వల్ల నాన్నగారు బాధ పడినా, ఆ జీవితం నాకు వద్దు. నాకు నిజం చెప్పవా, కౌసల్యని కాని, సుమిత్రకి కాని ఏదన్నా సుస్తీ చేసిందా, నాకు సత్యం చెప్పు తల్లి ” అన్నాడు.
అప్పుడు కైకేయ ” ఎంచేస్తే మీ నాన్నకి ఈ శోకం పోతుందో చెప్తాను. తీరా చెప్పాక ఇది నాకు కష్టం అని నువ్వు అనకూడదు. అది నీకు కష్టమే అయినా నువ్వు ఆ పని చేస్తే మాత్రం మీ నాన్న మళ్ళి సంతోషంగా ఉంటాడు. అలా నాకు మాట ఇవ్వు రామ, నీకు చెప్తాను ” అనింది.
ఈ మాట రాముడితో కైకేయ చెప్తుంటే విన్న దశరథుడు “ఛి” అని తలవంచుకున్నాడు.
అప్పుడు రాముడు…..
తత్ బ్రూహి వచనం దేవి రాజ్ఞో యద్ అభికాంక్షితం |
కరిష్యే ప్రతిజానే చ రామః ద్విర్ న అభిభాషతే ||
” అమ్మా! రాముడికి రెండు మాటలు చేతకావమ్మా, రాముడు ఎప్పుడూ ఒకే మాట చెప్తాడు. నువ్వు అడిగినది కష్టమైనా సుఖమైనా చేసేస్తాను ” అన్నాడు.
అప్పుడు కైకేయ ” ఏమిలేదు రామ, మీ నాన్న సత్యవంతుడు అని పూర్వం రెండు వరాలు ఇచ్చాడు కదా అని పధ్నాలుగు సంవత్సరాలు నువ్వు నారచీరలు కట్టుకొని, జటలు కట్టుకున్న తలతో ఒక తపస్వి ఎలా ఉంటాడో అలా నువ్వు అరణ్యావాసం చెయ్యాలని, అదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలని అడిగాను, అప్పటినుంచి మీ నాన్న ఇలా పడిపోయి ఉన్నాడు. అందుకని రామ, ఈ రెండు కోరికలు నువ్వు తీరుస్తే మీ నాన్న సంతోషిస్తాడు. కాని నువ్వు ఆ కోరికలు తీరుస్తావో తీర్చవో అని మీ నాన్న బెంగాపెట్టుకొని అలా ఉన్నాడు ” అనింది.
అప్పుడు రాముడు ” నాన్నగారు అడగడం నేను చెయ్యకపోవడమా, తప్పకుండా చేసేస్తాను. నేను పధ్నాలుగు సంవత్సరాలు అడవులకి వెళ్ళడానికి, భరతుడికి పట్టాభిషేకం చెయ్యడానికి నాన్నగారు ఇంత బెంగ పెట్టుకోవాలా,
అహం హి సీతాం రాజ్యం చ ప్రాణాన్ ఇష్టాన్ ధనాని చ |
హ్ఋష్టః భ్రాత్రే స్వయం దద్యాం భరతాయ అప్రచోదితః ||
భరతుడికి కావాలంటే రాజ్యం ఏమిటి, సీతని ఇస్తాను, నా ప్రాణాలు ఇస్తాను, ధనమంతా ఇస్తాను. భరతుడికి యువరాజు కావాలన్న కోరిక ఉందని నాకు తెలియక నేను యువరాజు పట్టాభిషేకానికి సిద్ధపడ్డాను. తమ్ముడికి పట్టాభిషేకం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. తప్పకుండా తమ్ముడికి పట్టాభిషేకం చేసెయ్యండి. ఈ విషయం చెప్పడానికి నాన్నగారు అంత బాధ పడ్డారని తెలిసి నేను బాధపడుతున్నాను. ఆయన నన్ను అగ్నిలో దూకమన్నా దుకేస్తాను ” అన్నాడు.
అప్పుడు కైకేయ ” రామ! మీ నాన్న ఒక శపధం చేశాడు, అదేంటంటే నువ్వు ఈ అయోధ్యా నగరం నుంచి వెళ్ళేదాకా స్నానం చెయ్యను, భోజనం చెయ్యను అని అన్నాడు. కాబట్టి మీ నాన్నగారు సంతోషంగా ఉండాలంటే నువ్వు వెంటనే వెళ్లిపోవాలి ” అనింది.
అప్పుడు రాముడు….
న అహం అర్థ పరః దేవి లోకం ఆవస్తుం ఉత్సహే |
విద్ధి మాం ఋషిభిస్ తుల్యం కేవలం ధర్మం ఆస్థితం ||
” అమ్మా! రాముడు ధనం కోసం, రాజ్యం కోసం ప్రాకులాడేవాడు కాదు, నేను ఋషిలాంటివాడిని, నాకుపితృవాక్యపరిపాలనం తప్ప ఇంకేమి వద్దు. అయినా నువ్వు నన్ను పిలిచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోయేవాడిని కదా, ఇంత చిన్నవిషయానికి రెండు వరాలు అడిగావ అమ్మ, మీరు బెంగపెట్టుకోకండి, నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. కాని ఒక్కసారి నాన్నగారి పాదాలకి, మీ పదాలకి నమస్కారం చేసి వెళ్ళిపోతాను ” అన్నాడు.
ఇలా తండ్రి మాటని దాటనటువంటి కొడుకు పుట్టినందుకు ఇప్పుడు నాకు బాధగా ఉందని దశరథుడు మరోసారి స్పృహతప్పి పడిపోయాడు. తాను వెళితే తప్ప తండ్రి భోజనం చెయ్యడని రాముడు వెంటనే దశరథుడికి కైకేయకి పాదాభివందనం చేసి అక్కడినుంచి వెళ్ళిపోయాడు. రాముడి వెనకాల తోక తొక్కిన నల్లత్రాచు వెళ్లినట్టు లక్ష్మణుడు ఆగ్రహంగా వెళ్ళాడు. ఇంత జెరిగినా రాముడి కాంతి తగ్గలేదు, ఆయన మనసులో ఎటువంటి వికారము లేదు, రాజ్యం పోయిందన్న బాధ లేదు, తండ్రి తొందరగా అన్నం తిని స్వస్తత పొందాలనుకొని గబగబా కౌసల్య మందిరానికి ఆశీర్వాదం కోసం వెళ్ళాడు.
కౌసల్య దేవి రాత్రంతా శ్రీమహావిష్ణువుని పూజించినదై ధ్యానం చేసుకుంటూ ఉండగా చూసిన రాముడు తడబడుతున్న అడుగులతో లోపలికి ప్రవేశించాడు.