రాముడు ఖర దూషణులని సంహరించడాన్ని అకంపనుడు అనే రాక్షసుడు చూసి లంకా పట్టణానికి చేరుకున్నాడు. అక్కడాయన రావణుడి పాదముల మీద పడి, రాముడు ఖర దూషణులను ఎలా సంహరించాడో వివరించాడు. ఆగ్రహించిన రావణుడు ” అసలు ఆ రాముడు ఎవరు, దండకారణ్యంలో ఎందుకున్నాడు, వారితో ఉన్న ఆ స్త్రీ పేరేమి, అసలు 14,000 రాక్షసులని రాముడు ఒక్కడే ఎందుకు సంహరించాడు. నాకు కారణం చెప్పు ” అన్నాడు.
అప్పుడు అకంపనుడు ” రాముడు సామాన్యమైన వ్యక్తి కాదు, దశరథుడి కుమారుడు, విశేషమైన తేజస్సు కలిగినవాడు. ఆయన తమ్ముడు లక్ష్మణుడు, రాముడికి బహిప్రాణంగా సంచరిస్తూ ఉంటాడు, ఆయన రాముడికి కుడిభుజం లాంటివాడు, సర్వకాలములయందు రాముడిని కాపాడుకోవడమే తన కర్తవ్యంగా పెట్టుకున్నాడు. రాముడు తన ధర్మపత్ని అయిన సీతతో కలిసి 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యడానికి దండకారణ్యానికి ప్రవేశించాడు. తాపసులైన ఋషులు రాక్షసుల చేత తాము పొందుతున్న బాధలని రాముడికి చెప్పుకుంటె, మీకు శత్రువులైన రాక్షసులు నాకూ శత్రువులే కనుక వారిని సంహరిస్తాను అని ఆ ఋషులకి మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం రాక్షస సంహారం చేసి దండకారణ్యంలో ఎక్కడా రాక్షసులు లేనటువంటి పరిస్థితిని కల్పించాడు. ఆ రాముడు తన బాణముల చేత ఈ భూమిని కృంగేటట్టు చెయ్యగలడు, కృంగిపోతున్న భూమిని నిలబడేటట్టు చెయ్యగలడు, సముద్రాలని క్షోభింప చెయ్యగలడు, పర్వతాలని కదపగలడు ” అని అకంపనుడు విశేషంగా రాముడి పరాక్రమాన్ని వర్ణించాడు.
” అయితే నేను ఇప్పుడే వెళ్ళి ఆ రామలక్ష్మణులని సంహరిస్తాను ” అని రావణాసురుడు అన్నాడు.
అప్పుడు అకంపనుడు ” మీరు తొందరపడి వెళ్ళవద్దు, ఎందుకంటే విశేషమైన వేగం కలిగిన ప్రవాహంలోకి ప్రవేశించడం మంచిది కాదు. ఆయన ముందు మీరు నిలబడలేరు. రాముడిని సంహరించాలంటే ఒక్కటే ఒక్క మార్గం ఉంది, రాముడి భార్య అయిన సీత చాలా అందంగా ఉంటుంది. ఆ సీతతో అందంలో సమానమైన వాళ్ళు గంధర్వలులలో కాని, యక్షులలో కాని, కిన్నెరులలో కాని, రాక్షసులలో కాని, మనుష్యులలో కాని లేరు. అందుకని రాముడు లేని సమయం చూసి సీతని అపహరించి తీసుకొచ్చి నీ భార్యని చేసుకో. సీత పక్కన లేకపోతే రాముడు జీవించలేడు. సీతని పోగొట్టుకున్న రాముడు తనంతటతానుగా ప్రాణములను విడిచిపెడతాడు. అందుచేత నువ్వు ఈ కపటోపాయంతో రామవధకి పూనుకో ” అన్నాడు.
రావణుడు వెంటనే బయలుదేరి మారీచ ఆశ్రమానికి వెళ్ళి” నాకు ఒక ముఖ్యమైన పని పడింది, నువ్వు మాయలు తెలిసినవాడివి. అందుకని సీతాపహరణంలో నాకు ఉపకారం చెయ్యి ” అని అడిగాడు.
ఈ మాటలు విన్న మారీచుడు ” నీకు అసలు ఎవడు చెప్పాడు సీతాపహరణం చెయ్యమని. బహుశా నిన్ను సంహరించడం కోసమని నీ శత్రువు ఎవడో నీకు సలహాలు చెప్పేవాడిగా మాటువేసి ఉన్నాడు. వాడు నిన్నే కాదు సమస్త దానవ కులాన్ని నాశనం చెయ్యాలని ప్రతిజ్ఞ చేశాడు, ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి వాడు నీకు రాముడితో వైరం పెట్టాడు. రాముడితో వైరం పెట్టుకున్నవాడు ఎవడూ జీవించడు, రాముడి శక్తి సామర్ధ్యాలు ఏమిటో నాకు తెలుసు. నా మాట విని సీతాపహరణం చెయ్యకు ” అన్నాడు.
” నువ్వు ఇంతగా చెప్తున్నావు కనుక నేను సీతాపహరణం చెయ్యను ” అని రావణుడు వెనక్కి వెళ్ళిపోయాడు.
( పైన జెరిగిన కథ గురించి పెద్దలలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. దీన్ని నిజంగా వాల్మీకి మహర్షి రచించార, లేక ఎవరన్నా రచించి రామాయణంలోకి చొప్పించార? ప్రధాన పాత్ర ప్రవేశించినప్పుడు వాల్మీకి మహర్షి ఆ పాత్ర గురించి తగినంత పరిచయము, వివరణ ఇస్తారు. కాని ఇక్కడ రావణ పాత్ర గురించి ఎలాంటి పరిచయము లేకుండానే కథ సాగిపోయింది. అలాగే మారీచుడు చెప్పగానే అంత బేలగా రావణుడు తిరిగి వచ్చేస్తాడ? కేవలం ఒక రాక్షసుడు చెప్పిన కథనాన్ని విని రావణుడు సీతాపహరణం చెయ్యడానికి వెళతాడ? శూర్పణఖ ఆకాశమార్గంలో లంకకి వెళితే, అకంపనుడు భూమార్గంలో వెళ్ళాడు. దీని ప్రకారం శూర్పణఖ ముందు వెళ్ళాలి, కాని అకంపనుడే ముందు వెళ్ళాడు. ఇవన్నీ వాల్మీకి రచనాశైలితో విభేదిస్తున్నట్టు కనబడడం చేత కొంతమంది పెద్దలు వీటిని అంగీకరించలేదు. ఈ సర్గలు బహుశా రామాయణంలోనివి కాకపోవచ్చు అన్నారు. కనుక వీటిని వివాదాస్పద సర్గలుగా ప్రకటించారు. అవునా, కాదా అన్నది ఆ పరమేశ్వరుడికే తెలియాలి.) ఇక కథ ప్రకారంగా చూస్తే………………..
అకంపనుడు వెళ్ళిపోయిన తరువాత శూర్పణఖ లంకా పట్టణంలోకి ప్రవేశించింది. ఇంద్రుడి చుట్టూ దేవతలు సభలో కూర్చున్నట్టు, ఆ రావణుడి చుట్టూ మంత్రులు కూర్చొని ఉన్నారు. ఆ రావణుడు దేవతల చేత, గంధర్వుల చేత, యక్షుల చేత, కింపురుషుల చేత సంహరింపబడడు. ఆ సభలో నోరు తెరుచుకొని ఉన్న రావణాసురుడిని చూస్తే, నోరు తెరిచి మీదకి వస్తున్న యమధర్మరాజు జ్ఞాపకంవస్తాడు.
దేవ అసుర విమర్దేషు వజ్ర అశని కృత వ్రణం |
ఐరావత విషాణ అగ్రైః ఉత్కృష్ట కిణ వక్షసం ||
వింశత్ భుజం దశ గ్రీవం దర్శనీయ పరిచ్ఛదం |
విశాల వక్షసం వీరం రాజ లక్ష్మణ లక్షితం ||
దేవతలతో అనేకసార్లు యుద్ధాలు చెయ్యడం వలన, ఆయన గుండెల మీద ఇంద్రుడి వజ్రాయుధపు దెబ్బలు ఉన్నాయి. అలాగే ఐరావతం తన దంతాల చేత కుమ్మినప్పుడు తగిలిన గాయాలు కూడా కనబడుతున్నాయి. ఆ రావణాసురుడు 20 చేతులతో, 10 తలకాయలతో, విశాలమైన వక్షస్థలంతో ఉన్న మహావీరుడైన ఆ రావణుడు రాజులకి ఉండవలసిన లక్షణాలతో శోభిస్తున్నాడు. బాగా కాల్చిన బంగారపు కుండలములు పెట్టుకున్నాడు, విశాలమైన భుజాలతో ఉన్నాడు, తెల్లటి పళ్ళతో, పర్వతమంటి నోటితో ఉన్నాడు. శ్రీమహా విష్ణువు యొక్క చక్రము చేత కొట్టబడ్డప్పుడు తగిలిన దెబ్బలు ఆయన శరీరం మీద ఉన్నాయి, అలాగే మిగిలిన దేవతల ఆయుధముల దెబ్బలు వాడి ఒంటి మీద ఉన్నాయి. అంతమంది దేవతల యొక్క దెబ్బలు తిన్నా ఆయన ఎప్పుడూ క్షోభించలేదు. ఆయన అప్పుడప్పుడు సముద్రాలని కలయతిప్పుతూ ఉంటాడు. ఆయన పర్వతాలని విసురుతూ వ్యాయామం చేసేవాడు. కావాలని వెళ్ళి దేవతలతో యుద్ధం చేసేవాడు. ఎక్కడన్నా ఎవరైనా ధర్మ మార్గంలో ఉంటె, వాళ్ళని హింసిస్తాడు. ఇతరుల భార్యలని బలవంతంగా తీసుకొచ్చి అనుభవించడం ఆయనకి చాలా ఇష్టం.
అలాగే ఆయనకి అనేక రకములైన అస్త్రములను ప్రయోగించడం తెలుసు, ఆ అస్త్రములను ఉపసంహరించడం కూడా తెలుసు. ఎవరన్నా యజ్ఞాలు చేస్తుంటే, తనకున్న శక్తితో ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేసేవాడు. ఒకసారి పాతాళంలో ఉన్న వాసుకిని ఓడించాడు, అలాగే తక్షకుడి భార్యని తీసుకొచ్చి తన భార్యగా పెట్టుకున్నాడు. కైలాసంలో కుబేరుడితో యుద్ధం చేసి ఆయన దెగ్గర ఉన్న పుష్పక విమానాన్ని తెచ్చుకున్నాడు( కుబేరుడు స్వయంగా రావణుడికి అన్నయ్య. కాకపోతే కుబేరుడు మొదటి భార్య కొడుకు, రావణుడు రెండవ భార్య కొడుకు). ఉత్తర భారతంలో చైత్రరథం అనే అందమైన వనం ఉందని ఎవరో చెబితే, రావణుడు అక్కడికి వెళ్ళి, ఇంత అందమైన వనం నాకు లేనప్పుడు ఎవరికీ ఉండకూడదని ఆ వనాన్ని నాశనం చేశాడు. అలాగే స్వర్గలోకంలోని నందన వనాన్ని నాశనం చేశాడు. అప్పుడప్పుడు ఆకాశంలో నిలబడి సూర్యచంద్రుల గమనాన్ని ఆపుతాడు.
రావణుడు బ్రహ్మదేవుడి కోసం 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అన్ని సంవత్సరాలు తపస్సు చేసినా బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవ్వకపోయేసరికి తన పది తలకాయలు నరికి అగ్నిలో వేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రసన్నమై ఏమి కావాలి అని అడుగగా……..
దేవ దానవ గధర్వ పిశాచ పతగ ఉరగైః |
అభయం యస్య సంగ్రామే మృత్యుతో మానుషాద్ ఋతే ||
” నేను పాముల చేత, యక్షుల చేత, గంధర్వుల చేత, కిన్నెరుల చేత, కింపురుషుల చేత, ఎవ్వరి చేత నాకు మరణం కలగకూడదు ” అని అడిగాడు, కాని రావణుడు మనుషుల చేత మరణించకూడదని అడగలేదు. యజ్ఞములలో దేవతలకి సమర్పించే సోమరసాన్ని ఆయన అపహరించేవాడు. ఎక్కడన్నా యజ్ఞం పూర్తవబోతుంది అనగా, అక్కడికి వచ్చి ఆ యజ్ఞాన్ని ధ్వంసం చెయ్యడం రావణుడికి బాగా ఇష్టం. సర్వకాలములయందు దుష్ట ప్రవర్తనతోనే ఉంటాడు. ( ఒకసారి రావణుడు కైలాశ పర్వతాన్ని లేపాలని చూస్తే, పరమశివుడు తన బొటను వేలితో ఆ పర్వతాన్ని కిందకి తొక్కాడు. అప్పుడు రావణుడి రెండు చేతులూ ఆ పర్వతం కిందనే ఉండడంచేత రావణుడు గట్టిగా అరిచాడు. ముల్లోకాలని భయకంపితులని చేసేవిధంగా అరిచాడు కనుక(రవం చేశాడు కనుక) ఆయనని రావణ అని పిలిచారు.)
రావణం సర్వ భూతానాం సర్వ లోక భయావహం | రాక్షసీ భ్రాతరం క్రూరం సా దదర్శ మహాబలం ||
రావణాసురుడు సర్వ లోకములకు, సర్వ ప్రాణులకు భయంకరుడు. అలాంటి రావణుడు మంత్రుల చేత పరివేష్టితుడై ఉండగా, శూర్పణఖ భయపడుతూ ఆయన దెగ్గరికి వెళ్ళి “నువ్వు ఎప్పుడూ గ్రామ్యమైన భోగములని అనుభవిస్తూ ఉంటావు. కామమునకు క్రోధమునకు వశపడిపోయావు. నీకు రాజ్యపాలనం మీద ఇష్టం లేదు, సరైన గూఢచారులని నియమించుకోలేదు. నీ రాజ్యంలో ఏమి జెరుగుతుందో నీకు తెలియడం లేదు. స్మశానంలో ఉన్న అగ్నిని ఎవరూ ముట్టుకోనట్టు, సింహాసనం మీద కూర్చున్న నీలాంటి వాడిని చూసి ప్రజలు దెగ్గరకి రారు. నీ గూఢచారులు ఎక్కడ ఏమి జెరుగుతుందో తెలుసుకోరా?, తెలుసుకున్నా నీకు వచ్చి చెప్పరా?, చెప్పినా నువ్వు బాధపడవా?. రోజురోజుకి నీ శత్రువులు పెరిగిపోతున్నారు, నువ్వు మాత్రం కామంతో కళ్ళు మూసుకుని ఉండిపోయావు. ఒకసారి కాని నువ్వు రాజ్యభ్రష్టుడివి అయ్యావంటే, అవకాసం దొరికిందని ప్రజలు నిన్ను కొట్టి చంపుతారు. నీ కీర్తి అంతా సముద్రంలో ఉన్న పర్వతంలా, ప్రకాశించడం మానేస్తుంది.
నువ్వు దండకారణ్యంలో మునులని హింసించమని 14,000 మంది రాక్షసులని పెట్టావు. కాని, ఒక్క రాముడు భూమి మీద నిలబడి ఇంతమందిని చంపేశాడు. ఇవన్నీ తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తిస్తున్నావు, కొద్దికాలంలోనే నీ పతనం ప్రారంభమవుతుంది ” అనింది.
శూర్పణఖ మాటలు విన్న రావణుడు ” అసలు ఆ రాముడు ఎవరు? అరణ్యానికి ఎందుకొచ్చాడు? ఆయన దెగ్గర ఉండేటటువంటి ఆయుధములు ఏమిటి? రాక్షసులని ఎందుకు చంపాడు? నీ ముక్కు చెవులను ఎవరు కోశారు? నువ్వు చూసింది చూసినట్టు నాకు చెప్పు ” అన్నాడు.
దీర్ఘబాహుః విశాలాక్షః చీర కృష్ణ అజిన అంబరః |
కందర్ప సమ రూపః చ రామో దశరథ ఆత్మజః ||
అప్పుడా శూర్పణఖ ” రాముడు పెద్ద పెద్ద చేతులతో, విశాలమైన కన్నులతో, మునులలాగ నార చీర, కృష్ణాజినం వేసుకొని, మన్మధుడిలా అందమైన రూపంతో ఉంటాడు. ఆయన దశరథ మహారాజు పెద్ద కుమారుడు. దేవేంద్రుడు పట్టుకున్నట్టు ధనుస్సుని పట్టుకొని, నారాచ బాణములను సంధిస్తే, అవి నోరు తెరుచుకొని విషం కక్కుతూ వస్తున్న మహా సర్పాలలాగ ఉంటాయి. రాముడు 14,000 మంది రాక్షసులని చంపుతున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. చంపినవాడు రాముడని నాకు తెలుసు, కాని రాముడు బాణం ఎప్పుడు తీశాడో, వింటినారికి ఎప్పుడు తొడిగాడో, ఎప్పుడు గురిచూసి వదిలాడో నేను చూడలేదు. కాని రాక్షసుల తలకాయలు టకటక తెగిపోవడం నేను చూశాను. రాముడు అంత తీవ్రమైన వేగంతో బాణ ప్రయోగం చేస్తాడు. రాముడితో గుణములయందు, తేజస్సుయందు సమానమైనవాడు ఆయన తమ్ముడు లక్ష్మణుడు ఉన్నాడు.
రామస్య దక్షిణే బాహుః నిత్యం ప్రాణో బహిః చరః |
ఆ లక్ష్మణుడు రాముడికి కుడి భుజంలా, బయట తిరుగుతున్న ప్రాణంలా సర్వకాలములయందు రాముడిని రక్షిస్తూ ఉంటాడు. రాముడి భార్య పేరు సీత, ఆమె పూర్ణ చంద్రబింబంలా ఉంటుంది. విశాలమైన నేత్రములు కలిగి ఉంటుంది. నిరంతరం రాముడిని అపారమైన ప్రేమతో సేవిస్తూ ఉంటుంది. ఆమె నల్లటి జుట్టుతో ఉంటుంది, అందమైన ముక్కుతో, అందమైన స్వరూపంతో ఉంటుంది, ఎంతో కాంతివంతంగా ఉంటుంది, ఆవిడ సాక్షాత్తు ఇంకొక శ్రీలక్ష్మిలా ఉంటుంది. కాల్చి తీసిన బంగారంలా ఆవిడ శరీరం ఉంటుంది, ఎర్రటి రక్తం లోపలినుంచి కనబడుతున్నటువంటి తెల్లటి గోళ్ళతో ఉంటుంది, పద్మంలాంటి ముఖంతో, సన్నటి నడుముతో ఉంటుంది. ఆవిడ గంధర్వులకి, యక్షులకి, కిన్నెరులకి, దానవులకి చెందినదికాదు, ఆమె నరకాంత. కాని ఈ భూమండలంలో నేను ఇప్పటివరకూ అటువంటి సౌందర్యరాశిని చూడలేదు. సీత ఎవరిని గాఢలింగనం చేసుకుంటుందో, ఎవడు సీతకి భర్త అని అనిపించుకుంటాడో, వాడే మూడు లోకములలో ఉన్న ఐశ్వర్యాన్ని పొందినవాడు, వాడు ఇంద్రుడితో సమానమైన కీర్తిని గడించినవాడు.
నాకు ఆ సీతని చూడగానే, ఈమె మా అన్నయ్యకి భార్య అయితే ఎంత బాగుంటుందో అనిపించింది. అందుకని నేను సీతని తేవడానికి ప్రయత్నిస్తే, ఆ లక్ష్మణుడు నా ముక్కు చెవులు కోసేశాడు అన్నయ్యా. నువ్వు కాని సీతని చూస్తే, మన్మధ బాణాలకి వసుడవయిపోతావు. నిజంగా నీకు సీతని భార్యని చేసుకోవాలని ఉంటె, ఇంక ఆలోచించకుండ వెంటనే బయలుదేరు. నువ్వు సీతని నీదిగా అనుభవించు, అడ్డొచ్చిన రాముడిని సంహరించు ” అనింది.
శూర్పణఖ మాటలు విన్న రావణుడు తన చుట్టూ కూర్చున్న మంత్రుల వంక చూసి ” ఇక మీరు బయలుదేరండి ” అన్నాడు.