కబంధుడు చెప్పిన విధంగా రామలక్ష్మణులు బయలుదేరి పంపా సరస్సుకి చేరుకున్నారు. ఆ పంపా నదిలో అరవిసిరిన పద్మాలు, పైకి ఎగిరి నీళ్ళల్లో పడుతున్న చేపలని చూసి రాముడు బాధపడ్డాడు. ఆయనకి వాటిని చూడగానే సీతమ్మ ముఖము, కన్నులు గుర్తుకొచ్చి భోరున విలపించాడు. అప్పుడాయన లక్ష్మణుడితో ” చూశావ లక్ష్మణా! ఈ ప్రాంతం ఎంత బాగుందో, ఈ చెట్లకి విశేషంగా పువ్వులు ఉన్నాయి, ఆ పువ్వులు కిందకి పడుతున్నాయి, ఎక్కడ చూసినా పుష్పముల యొక్క గుత్తులు గాలికి అటు ఇటూ కదులుతూ ఉన్నాయి. అలా కిందకి పడుతున్న పువ్వులని, కదులుతున్న గుత్తులని చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే, వాయుదేవుడు ఎవ్వరికీ కనపడకుండా వచ్చి ఈ పూల గుత్తులతో ఆడుకుంటున్నాడా! అనిపిస్తుంది. ఈ చెట్లకి అల్లుకున్న తీగలు పైకి వెళ్ళి పెద్ద పెద్ద పువ్వులని పుష్పించాయి. ఇవన్నీ చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో. నాకు ఇవన్నీ చూస్తుంటే, సీత నా పక్కన లేదు అన్న విషయం జ్ఞాపకానికి వచ్చి నేను నా స్వస్థతని కోల్పోతున్నాను.
ఎవరూ అడక్కుండానే మేఘాలు ఆకాశంలో వర్షాన్ని వర్షిస్తాయి. అలాగే ఈ చెట్లు కూడా పుష్పాలని వర్షిస్తున్నాయి. ఇవి చెట్లా, లేకపోతె పుష్పాలని వర్షించే మేఘాల? అని నాకు అనుమానం వస్తుంది. ఈ ప్రాంతం అంతా పుష్పములతో నిండిపోయి ఉంది.
మత్త కోకిల సన్నాదైః నర్తయన్ ఇవ పాదపాన్ |
శైల కందర నిష్క్రాంతః ప్రగీత ఇవ చ అనిలః ||
ఇక్కడ గాలి ఒక విచిత్రమైన ధ్వని చేస్తూ చెట్లని కదుపుతూ వీస్తుంది, అలాగే ఇక్కడ కోకిల పాట పాడుతుంది. ఇవన్నీ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే, వాయువు పాట పాడుతున్నాడు, చెట్లన్నీ నాట్యం చేస్తున్నాయి, కోకిల చెట్టు మీద కూర్చొని పక్కవాయిద్యాలు కూస్తుంది. నేను ఏదన్నా నృత్య కార్యక్రమానికి వచ్చానా? అనిపిస్తుంది. ఈ సమయంలో సీత నా పక్కన ఉంటె ఎంత బావుండేదో. సీత పక్కన లేకపోవడం వలన నేను ప్రాణములతో ఉండలేనేమో అనిపిస్తుంది.
లక్ష్మణా! అలా చూడు, ఆ కొండ మీద మగ నెమలి పురి విప్పి నాట్యం చేస్తుంటే, ఆడ నెమలి దాని చుట్టూ పరమ సంతోషంగా ఎలా తిరుగుతుందో చూడు. అవునులే, ఎందుకు ఆడవు. ఆ మగ నెమలి భార్య అయిన ఆడ నెమలిని, ఎవరూ ఎత్తుకుపోలేదు కదా? ఎన్ని ఆటలన్నా ఆడతాయి. నా మనస్సు సీత దెగ్గర ఉంటుంది, సీత మనస్సు నా దెగ్గర ఉంటుంది. అందుకని మా ఇద్దరికీ ఉన్నది ఒకటే మనస్సు. ఆ ఒక్క మనస్సు ఆనందించాలంటే, ఒకరి పక్కన ఒకరం ఉండాలి. అలా లేకపోవడం చేత ఇవ్వాళ నా మనస్సు ఆనందపడడం లేదు. ఇది చైత్ర మాసం కనుక సీత కూడా ఇలాంటి దృశ్యాలనే చూస్తూ ఉంటుంది. మగవాడిని నేనే ఇంత బాధ పడుతున్నానంటే, సీత ఇంకెంత బాధ పడుతుందో లక్ష్మణా.
పూర్వం చైత్ర మాసంలో ఇటువంటి గాలి వీస్తుంటే నేను ఎంతో సంతోషించేవాడిని, ఇవ్వాళ అదే గాలి వీస్తుంటే నాకు దుఃఖంగా ఉంది. ఈ అరవిసిరిన తామర పువ్వులని దెగ్గరగా చూస్తుంటే, ఆ పువ్వులలోని గాలి నా ముఖానికి తగులుతుంటే ఎలా ఉందో తెలుసా లక్ష్మణా, సీత ముఖం నా ముఖానికి దెగ్గరగా ఉన్నప్పుడు, సీత ముక్కునుండి విడిచిపెట్టిన నిశ్వాస వాయువు నా బుగ్గలకి తగిలిన అనుభూతి కలుగుతుంది. అక్కడ ఆ తుమ్మెదలు పువ్వుల మీద వాలి, అందులోని మకరందాన్ని తాగి ఎలా వెళ్ళిపోతున్నాయో చూడు, ఎంత అందంగా ఉంది ఆ సన్నివేశం. కాని నా మనసుకి ఎందుకనో ఆనందం కలగడం లేదు. ఇలాంటప్పుడు సీత నా పక్కన ఉండి, అప్పుడప్పుడు హాస్యం ఆడుతూ, అప్పుడప్పుడు హితమైన మాటలు మాట్లాడుతూ ఉంటె, ఆమె నోటి వెంట వచ్చే ఆ మధురమైన మాటలతో కూడిన ఈ సన్నివేశాన్ని చూస్తేనే నాకు సంతోషంగా ఉంటుంది.
సీతని చూడకుండా నేను ఉండలేను, నా శరీరం పడిపోతుంది, అందుకని నువ్వు అయోధ్యకి వెళ్ళి భరతుడిని పట్టాభిషేకం చేసేసుకోమను ” అని రాముడు అన్నాడు.
ఉత్సాహో బలవాన్ ఆర్య నాస్తి ఉత్సాహాత్ పరం బలం |
సః ఉత్సాహస్య హి లోకేషు న కించిత్ అపి దుర్లభం ||
అప్పుడు లక్ష్మణుడు ” అన్నయ్యా! స్నేహము, ప్రేమ ఉండవలసిందే. కాని, మరీ ఇంత పిచ్చి ప్రేమ అయితే భరించడం కష్టం. నువ్వు గుర్తుపెట్టుకో అన్నయ్యా, నీకు ఇంత దుఃఖానికి కారణమైన రావణాసురుడు స్వర్గలోకానికే వెళ్ళని, పాతాళలోకానికే వెళ్ళి దాక్కొనని, మళ్ళి తన తల్లి కడుపులోకి దూరిపోనీ, వాడిని మాత్రం వదలను, చంపితీరుతాను. నువ్వు ఈ దుఃఖాన్ని విడిచిపెట్టు. దుఃఖం పొందితే ఉత్సాహం నశిస్తుంది. ఉత్సాహం ఉంటె ప్రపంచంలో సాధించలేనిది అన్నది ఏది లేదు. కాని ఉత్సాహం పోతే, తనలో ఎంత శక్తి ఉన్నా అదంతా భయం చేత, దుఃఖం చేత పనికిరాకుండా పోతుంది. అందుకని అన్నయ్యా ఉత్సాహాన్ని పొందు ” అని అన్నాడు.
లక్ష్మణుడి మాటలకి రాముడు సంతోషపడినవాడై ఉపశాంతిని పొందాడు. అప్పుడా రామలక్ష్మణులు ఇద్దరూ ఋష్యమూక పర్వతం వైపునకు బయలుదేరారు.
అలా వస్తున్న రామలక్ష్మణులను ఋష్యమూక పర్వత శిఖరముల మీద నుండి సుగ్రీవుడు చూసి భయంతో గడ్డ కట్టుకుపోయాడు. నార చీరలు కట్టుకొని, కోదండాలు పట్టుకుని, అరణ్యంలోని చెట్ల వైపు చూస్తూ వస్తున్న రామలక్ష్మణులని చూసి, వాలి తనని చంపడానికని వీళ్ళని పంపాడేమోనని సుగ్రీవుడు భయపడి తన 4 వానర మంత్రుల దెగ్గరికి వెళ్ళి ” చూశార, ఎవరో ఇద్దరు నార చీరలు కట్టుకున్న వీరులు వచ్చేస్తున్నారు. వాళ్ళు నన్ను చంపడానికే వస్తున్నారు. రండి పారిపోదాము ” అని ఆ నలుగురు వానరములతో కలిసి ఒక శిఖరం మీదనుండి మరొక శిఖరం మీదకి దూకాడు. వాళ్ళు వచ్చేస్తున్నారేమో అన్న భయంతో అలా ఒక్కో శిఖరాన్ని దాటాడు. వాళ్ళు అలా గెంతుతుంటే, చెట్లు విరిగిపోయాయి, ఏనుగులు, పులులు దిక్కులు పట్టి పారిపోయాయి. అలా కొంతసేపు గెంతి గెంతి, తన మంత్రులతో కలిసి ఒక చోట కూర్చున్నాడు. ( సుగ్రీవుడి మంత్రులలో హనుమంతుడు ఒకడు ).
సంభ్రమః త్యజతాం ఏష సర్వైః వాలి కృతే మహాన్ |
మలయోఽయం గిరివరో భయం న ఇహ అస్తి వాలినః ||
అప్పుడు వాక్య కోవిదుడైన హనుమంతుడు సుగ్రీవుడితో ” సుగ్రీవా! ఎందుకయ్యా ఇలా శిఖరముల మీద ఎగురుతున్నావు, ఇక్కడికి వాలి రాడు కదా. వాలికి ఉన్న శాపం వలన ఈ పర్వతం మీదకి వస్తే మరణిస్తాడు. నీకు కనపడినవాడు వాలి కాదు, మరి ఎందుకీ గెంతులు. నువ్వు మహారాజుగా ఉండవలసిన వాడివి, ఎవరో ఇద్దరిని చూసి నిన్ను చంపడానికే వచ్చారని అనుకొని గెంతులు వేశావు. ఏమిటయ్యా ఈ చపలత్వం. నడక చేత, అవయవముల కదలిక చేత, మాట చేత, అవతలివారు ఎటువంటి స్థితిలో ఉన్నారో, ఎందుకు వచ్చారో, వారి మనస్సులలో ఏ భావన ఉన్నదో కనిపెట్టి, దానికి అనుగుణంగా నడిచి, తనని, తన ప్రజలని రక్షించుకోగల సమర్ధత ఎవడికి ఉన్నదో వాడు రాజు. అంతేకాని కనపడ్డ ప్రతివాడిని చూసి ఇలా పారిపోతే, నువ్వు రేపు రాచపదివి ఎలా నిర్వహిస్తావు సుగ్రీవా ” అని అడిగాడు.
అప్పుడు సుగ్రీవుడు ” హనుమా! నేను ఎందుకు భయపడుతున్నానో తెలుసా. రాజులైనవారు చాలా రహస్యంగ ప్రవర్తిస్తారు. వాలికి నేను శత్రువుని కనుక, నన్ను రాజ్యం నుండి బయటకి పంపాడు కనుక, తాను ఈ కొండమీదకి రాలేడు కనుక, నన్ను సంహరించడం కోసమని తనతో సమానమైన, బలవంతులైన ఇద్దరు క్షత్రియులని ముని కుమారులలా ఇక్కడికి పంపిస్తున్నాడు. అందుకే వాళ్ళు నిర్భయంగా చెట్ల వంక చూస్తూ వస్తున్నారు. వాళ్ళ చేతుల్లో కొదండాలు ఉన్నాయి, అందుకని నేను భయపడుతున్నాను. అంతగా చెబుతున్నావు కాబట్టి, హనుమా! నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు ఈ రూపాన్ని విడిచిపెట్టి వేరొక రూపాన్ని పొందు. ఆ రూపంతో ఆ ఇద్దరి దెగ్గరికి వెళ్ళు, నా వైపుకి తిరిగి మాట్లాడు. వాళ్ళు నాయందు ప్రేమతో వస్తున్నారా, శత్రుత్వంతో వస్తున్నారా అన్న విషయాన్ని బాగా కనిపెట్టు. ప్రేమతో వస్తున్నవారైతే వాళ్ళని తీసుకురా, లేకపోతె మనం వేరె మార్గాన్ని ఆలోచిద్దాము. అందుకని నువ్వు తొందరగా వెళ్ళు ” అని సుగ్రీవుడు అన్నాడు.
కపి రూపం పరిత్యజ్య హనుమాన్ మారుతాత్మజః |
భిక్షు రూపం తతో భేజే శఠబుద్ధితయా కపిః ||
అప్పుడు హనుమంతుడు తన కపి రూపాన్ని విడిచిపెట్టి, భిక్షు రూపాన్ని( సన్యాసి రూపాన్ని) పొంది, శఠ బుద్ధితో బయలుదేరి రాముడి దెగ్గరికి వెళ్ళాడు. సన్యాసి రూపంలో ఉన్న హనుమంతుడు రాముడి దెగ్గరికి వెళ్ళి నమస్కరించి ” మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు రాజర్షుల లాగ, తాపసుల లాగ ఉన్నారు. విశేషమైన కాంతితో ఉన్నారు. మీరు నడిచి వస్తుంటే, మిమ్మల్ని చూసి మృగాలన్నీ పారిపోతున్నాయి. మిమ్మల్ని చూసి ఇక్కడున్న సర్వ భూతములు భయపడుతున్నాయి. మీ యొక్క కాంతి చేత ఇక్కడున్న నదులలోని జలములు శోభిస్తున్నాయి. మీరు నడుస్తుంటే, సింహాలు నడుస్తున్నాయా? అన్నట్టుగా ఉంది. సింహాల యొక్క బలాన్ని అధిగమించిన స్వరూపంతో ఉన్నారు. మీ చేతులలో కొదండాలు, బాణాలు ఉన్నాయి. మిమ్మల్ని చూస్తుంటే ఎటువంటి శత్రువునైనా సంహరించగలిగిన పరాక్రమము చేత విరాజిల్లుతున్న వారిలా కనపడుతున్నారు. ఠీవిగా నడిచే ఎద్దుల్లా నడుస్తున్నారు. నడుస్తున్న పర్వతాల్లా ఉన్నారు. పద్మములవంటి కన్నులతో ఉన్నారు, జటామండలాలు కట్టుకొని ఉన్నారు. ఈ రూపములు ఒకదానితో ఒకటి సరిపోవడం లేదు. మీరు సూర్య-చంద్రుల్లా ఉన్నారు, విశాలమైన వక్షస్థలంతో ఉన్నారు. మనుష్యరూపంలో ఉన్న దేవతల్లా ఉన్నారు. పెద్ద భుజాలతో ఉన్నారు. మీ బాహువుల చేత ఈ సమస్త పృధ్వీ మండలాన్ని రక్షించగలిగిన వారిలా కనపడుతున్నారు. అటువంటి మీరు ఇలా ఎందుకు నడిచి వస్తున్నారు. దీనికి కారణం ఏమిటి. మీ మొలలకి చాలా పెద్ద కత్తులు కట్టి ఉన్నాయి. ఆ కత్తుల్ని చూస్తే భయం వేస్తుంది.
నేను సుగ్రీవుడి యొక్క సచివుడిని, నన్ను హనుమ అంటారు. అన్నగారైన వాలి చేత తరమబడినటువంటి మా రాజైన సుగ్రీవుడు రాజ్యాన్ని విడిచిపెట్టి ఋష్యమూక పర్వత శిఖరముల మీద నలుగురు మంత్రులతో కలిసి ఉంటున్నాడు. ఆయన ధర్మాత్ముడు, మీతో స్నేహం చెయ్యాలని అనుకుంటున్నాడు. అందుకని మీరు మా ప్రభువుతో ఎందుకు స్నేహం చెయ్యకూడదు! నేను ఎన్నో విషయాలు మాట్లాడుతున్నాను, మీరు నాతో మాట్లాడడంలేదు. మీరు మాట్లాడితే వినాలని ఉంది. మీరు మాట్లాడండి ” అని చెప్పి హనుమ నిలబడిపోయాడు.
రాముడిని చూడగానే సన్యాసి రూపంలో ఉన్న హనుమంతుడు ఆ సన్యాసి రూపాన్ని విడిచిపెట్టేసి తన నిజ స్వరూపానికి వచ్చేశాడు. ఎందుకంటే, ఆయనకి రాముడు శ్రీ మహా విష్ణువుగా దర్శనమిచ్చారు.
అప్పుడు రాముడు లక్ష్మణుడితో ఇలా అన్నాడు ” చూశావ లక్ష్మణ, హనుమ ఎలా మాట్లాడాడో. ఆయన మాటలు విన్నావ. ఇలాగ మాట్లాడేవాడు మంత్రిగా దొరికితే కార్యాలు ఎందుకు నెరవేరవు! ఇలా మాట్లాడేవాడు ఎదురుగా వచ్చి నిలబడితే, కత్తి పట్టి ప్రాణం తీసేద్దాము అనుకున్న వ్యక్తి కూడా కత్తిని ఒరలో పెట్టేస్తాడు. ఇటువంటి వ్యక్తి మంత్రిగా కలిగిన ఆ రాజు ఎంత అదృష్టవంతుడు. ఈయన మాట్లాడిన విధానాన్ని చూస్తే, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం తెలియకపోతే ఇలా మాట్లాడలేడు. అన్నిటినీ మించి ఈయన వ్యాకరణాన్ని చాలాసార్లు చదువుకున్నాడు. ఈయనికి ఉపనిషత్తుల అర్ధం పూర్తిగా తెలుసు. అందుకనే ఈయన మాట్లాడేటప్పుడు కనుబొమ్మలు నిష్కారణంగా కదలడంలేదు, లలాటము కదలడం లేదు. వాక్యము లోపలినుంచి పైకి వచ్చేటప్పుడు గొణుగుతున్నటు లేదు, గట్టిగా లేదు. ఈయన మాటలు ప్రారంభించిన దెగ్గరి నుంచి చివరి వరకూ ఒకే స్వరంతో పూర్తి చేస్తున్నారు. కాళ్ళు, చేతులు, శరీరాన్ని కదపడం లేదు. ఏ శబ్దాన్ని ఎలా ఉచ్చరించాలో, ఎంతవరకు ఉచ్చరించాలో అలా పలుకుతున్నారు. ఇటువంటి వ్యక్తి సుగ్రీవుడికి సచివుడిగా దొరికి, మన దెగ్గరికి వచ్చి సుగ్రీవుడితో స్నేహం కలపాలని కోరుకుంటున్నాడు కనుక, మనం అనుకున్నటువంటి కోరిక సిద్ధించినట్లే. మనం ఎవరిమో, ఈ అరణ్యానికి ఎందుకు వచ్చామో హనుమకి చెప్పు లక్ష్మణా ” అన్నాడు.
అప్పుడు లక్ష్మణుడు ” అయ్యా హనుమా! ఈయన దశరథుడి కుమారుడైన రాముడు. ఆ దశరథుడు పరమ ధర్మాత్ముడై రాజ్యాన్ని పరిపాలించాడు. ఆయన ఉన్నప్పుడు ఎవరూ ఆయనని ద్వేషించలేదు, ఆయనా ఎవరినీ ద్వేషించలేదు. చతుర్ముఖ బ్రహ్మగారు ఎలా అయితే అందరి చేత గౌరవింపబడతారో, అలా దశరథుడు లోకులందరి చేత గౌరవింపబడినవాడు. అటువంటి తండ్రి మాటకి కట్టుబడి రాముడు అరణ్యానికి వచ్చాడు. అప్పుడు ఎవరో ఒక రాక్షసుడు రాముడి భార్య అయిన సీతమ్మని అపహరించాడు. సీతమ్మని వెతికే ప్రయత్నంలో ఉండగా, మాకు కబంధుడనే రాక్షసుడు కనపడ్డాడు. ఆయనని సంహరించి, శరీరాన్ని దహిస్తే, ఆయన మళ్ళి ధనువు అనే శరీరాన్ని పొంది మమ్మల్ని సుగ్రీవుడితో స్నేహం చెయ్యమని చెప్పాడు. అందుకని మేము ఇక్కడికి వచ్చాము. నేను లక్ష్మణుడిని, రాముడి తమ్ముడు అని లోకం అంటుంది, కాని రాముడి గుణములచేత తృప్తి పొందినవాడనై, ఆ గుణములచేత విశేషమైన ఆనందమును పొందినవాడనై రాముడికి దాసుడిని అనుకుంటాను. లోకంలో కష్టంలో ఉన్నవారందరూ రాముడికి శరణాగతి చేశారు, అటువంటి రాముడు ఈనాడు సుగ్రీవుడికి శరణాగతి చేస్తున్నాడు. అందుకని మేము సుగ్రీవుడిని మిత్రుడిగా పొందాలని అనుకుంటున్నాము ” అన్నాడు.
ఈదృశా బుద్ధి సంపన్నా జితక్రోధా జితేఇంద్రియాః |
ద్రష్టవ్యా వానరేఇంద్రేణ దిష్ట్యా దర్శనం ఆగతాః ||
అప్పుడు హనుమంతుడు ” జితేంద్రియులై, ధర్మాత్ములైన రామలక్ష్మణులని చూడడం మా సుగ్రీవుడికి కూడా చాలా సంతోషంగా ఉంటుంది. రండయ్యా మిమ్మల్ని తీసుకెళతాను ” అని చెప్పి, రామలక్ష్మణులనిద్దరిని తన వీపు మీద కూర్చోబెట్టుకుని ఆ ఋష్యమూక పర్వత శిఖరముల మీదకి ఎక్కాడు.