అలా రామలక్ష్మణులని సుగ్రీవుడు ఉన్న ప్రాంతానికి తీసుకొచ్చేటప్పుడు హనుమంతుడు తన కపి రూపాన్ని వదిలి భిక్షు రూపాన్ని పొందాడు. అప్పుడు హనుమంతుడు సుగ్రీవుడితో
అయం రామో మహాప్రాజ్ఞ సంప్రాప్తో దృఢ విక్రమః |
లక్ష్మణేన సహ భ్రాత్రా రామోయం సత్య విక్రమః ||
” సుగ్రీవా! వచ్చినటువంటివాడు మహా ప్రాజ్ఞుడైన, ధృడమైన విక్రమము ఉన్న రామచంద్రమూర్తి మరియు ఆయన తమ్ముడు లక్ష్మణుడు. రాముడిని దశరథ మహారాజు అరణ్యవాసానికి పంపిస్తే అరణ్యాలకి వచ్చాడు తప్ప, ధర్మబధమైన నడువడిలేక రాజ్యాన్ని పోగొట్టుకున్నవాడు కాదు. ఈయన తన భార్య అయిన సీతమ్మతో, లక్ష్మణుడితో అరణ్యవాసానికి వస్తే, ఆయన భార్యని ఎవడో ఒక రాక్షసుడు అపహరించాడు. అందుకని ఆ సీతమ్మని అన్వేషిస్తూ ఈ ప్రాంతానికి చేరుకున్నారు. నిన్ను శరణాగతి చేస్తున్నాడు, నీతో స్నేహం చెయ్యాలనుకుంటున్నాడు. అందుకని సుగ్రీవా, ఈయనతో స్నేహం చెయ్యవలసింది ” అన్నాడు.
అప్పుడు సుగ్రీవుడు ” రామ! మీ దెగ్గర గొప్ప తపస్సు ఉంది, అనేకమైన గుణములు, విశేషమైన ప్రేమ ఉంది. ఇన్ని గుణములు కలిగిన వ్యక్తి నాకు స్నేహితుడిగా లభించడం నా అదృష్టం. ఇటువంటి వ్యక్తి స్నేహితుడిగా లభిస్తే ఈ ప్రపంచంలో దేనినైన పొందవచ్చు. అందుచేత ఇది నాకు దేవతలు ఇచ్చిన వరము అని అనుకుంటున్నాను. రామ! నీకు తెలియని విషయం కాదు, స్నేహం చేసేటటువంటివాడికి ఒక ధర్మం ఉంది. భర్త ఎలాగైతే తన కుడి చేతిని భార్య కుడి చేతితో బాగా రాశి పట్టుకుంటాడో, అలా స్నేహం చేసేవాళ్ళు కూడా పట్టుకోవాలి. అందుకని నువ్వు నాతో స్నేహమును ఇచ్చగించిన వాడివైతే, నా బాహువుని చాపుతున్నాను, నీ బాహువుని నా బాహువుతో కలుపు ” అన్నాడు.
వెంటనే హనుమంతుడు తన సన్యాసి రూపాన్ని విడిచిపెట్టి కపి రూపానికి వచ్చేసి గబగబా వెళ్ళి నాలుగు ఎండిపోయిన కట్టెలని తెచ్చి, కర్రతో కర్రని రాపాడించి అగ్నిహోత్రాన్ని పుట్టించాడు. అప్పుడు రాముడు, సుగ్రీవుడు ఆ అగ్నిహోత్రానికి ప్రదక్షిణ చేసి, ఇద్దరూ తమ చేతులు కలుపుకున్నారు.
అప్పుడు రాముడు ” మనిద్దరమూ స్నేహం చేసుకున్నాము కదా, ఇకనుంచి ఇద్దరి కష్టసుఖాలు ఇద్దరివీ ” అన్నాడు.
సుగ్రీవుడు వెంటనే వెళ్ళి పుష్పించి ఉన్న పెద్ద సాలవృక్షము కొమ్మని విరిచి రాముడికి ఆసనంగా వేసి కుర్చోమన్నాడు. అలాగే హనుమంతుడు ఒక గంధపు చెట్టు కొమ్మని తీసుకొచ్చి లక్ష్మణుడిని కుర్చోమన్నాడు. రామలక్ష్మణులిద్దరు కూర్చున్న తరువాత సుగ్రీవుడు ” రామ! నన్ను నా అన్నగారైన వాలి రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు. నా భార్యని తన భార్యగా అనుభవిస్తున్నాడు. దిక్కులేనివాడినై ఈ కొండమీద మీద జీవితాన్ని గడుపుతున్నాను ” అన్నాడు.
ఉపకార ఫలం మిత్రం విదితం మే మహాకపే |
వాలినం తం వధిష్యామి తవ భార్య అపహారిణం ||
అప్పుడు రాముడు ” ఉపకారము చేసినవాడు స్నేహితుడు కాబట్టి, నువ్వు కష్టంలో ఉన్నావు కాబట్టి, నేను నీ స్నేహితుడిని కాబట్టి నీకు ఉపకారము చెయ్యాలి. నువ్వు బతికి ఉండగా నీ భార్యని తన భార్యగా అనుభవిస్తున్నాడు వాలి, ఈ ఒక్కమాట చాలు ధర్మం తప్పిన వాలిని చంపడానికి. అందుకని వాలిని చంపేస్తాను ” అన్నాడు.
ఈ మాటలు విన్న సుగ్రీవుడు, సుగ్రీవుడి మంత్రులు పొంగిపోయారు. ఒకరిని ఒకరు చూపులతో తాగుతున్నార! అన్నట్టుగా చూసుకున్నారు. అలా రాముడు, సుగ్రీవుడు ఒకళ్ళ చేతిలో ఒకరు చెయ్యి వేసుకుని సంతోషంగా మాట్లాడుతుంటే, ముగ్గురికి ఎడమ కళ్ళు అదిరాయి. పద్మంలాంటి కన్నులున్న సీతమ్మ ఎడమ కన్ను, బంగారంలాంటి పచ్చటి కన్నులున్న వాలి ఎడమ కన్ను, ఎర్రటి కన్నులున్న రావణాసురుడి ఎడమ కన్ను అదిరాయి.
తరువాత సుగ్రీవుడు ” కనపడకుండా పోయిన వేదాన్ని మళ్ళి తీసుకొచ్చి ఇచ్చినట్టు, నీకు నేను సీతమ్మని తీసుకొచ్చి ఇస్తాను. సీతమ్మని పాతాళలోకంలో కాని, స్వర్గలోకంలో కాని దాయని, నేను సీతమ్మని వెతికి తీసుకొస్తాను ” అన్నాడు.
సుగ్రీవుడి మాటలు విన్న రాముడికి సీతమ్మ గుర్తుకువచ్చి భోరున రోదించాడు.
అప్పుడు సుగ్రీవుడు ” రామ శోకించకు. నీకు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన గురించి చెబుతాను. ఒకనాడు నేను ఈ పర్వత శిఖరాల మీద మంత్రులతో కలిసి కూర్చొని ఉన్నాను. అప్పుడు ఆకాశంలో ఎర్రటి నేత్రములు కలిగిన రాక్షసుడు పచ్చటి వస్త్రములు కట్టుకున్న ఒక స్త్రీని తీసుకుపోతున్నాడు. అప్పుడు ఆ తల్లి తన చీర కొంగుని చింపి, అందులో తన ఆభరణములను కొన్నిటిని మూటకట్టి పైనుండి కిందకి జారవిడిచింది. బహుశా ఆ స్త్రీ సీతమ్మ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. నేను వెళ్ళి ఆ ఆభరణములు తీసుకొస్తాను, అవి సీతమ్మ ఆభారణాలేమో చూడు ” అన్నాడు.
కొంతసేపటికి సుగ్రీవుడు ఆ ఆభరణాలని తీసుకొచ్చాడు. ఆ ఆభరణాలని చూసేసరికి, ఒక్కసారి శోకం తన్నుకొచ్చినవాడై రాముడు మూర్ఛపోయి నేలమీద పడిపోయాడు. తరువాత ఆయన తేరుకొని ఆ ఆభరణాలని చూద్దాము అంటె కళ్ళనిండా నీరు ఉండడం చేత, ఎన్నిసార్లు తుడుచుకున్నా ఆ కన్నీరు ఆగడంలేదు కనుక ఆయన లక్ష్మణుడిని పిలిచి ” లక్ష్మణా! ఈ ఆభారణాలని ఒక్కసారి చూడు. ఇవి విరిగిపోయి ముక్కలు అవ్వలేదు, సీత ఈ ఆభరణాలని విడిచిపెట్టినప్పుడు ఇవి గడ్డి మీద పడిఉంటాయి. నువ్వు వీటిని ఒకసారి చూడు ” అన్నాడు.
న అహం జానామి కేయూరే న అహం జానామి కుండలే |
నూపురే తు అభిజనామి నిత్యం పాద అభివందనాత్ ||
అప్పుడు లక్ష్మణుడు ” అన్నయ్యా! ఈ కేయూరాలు వదిన పెట్టుకుందో లేదో నాకు తెలీదు, ఈ కుండలాలు వదిన పెట్టుకుందో లేదో నాకు తెలీదు. అన్నయ్యా! ఈ నూపురాలు మాత్రం వదినవే. నేను ప్రతిరోజు వదిన కాళ్ళకి నమస్కారం పెట్టేవాడిని, అప్పుడు ఈ నూపురాలని వదిన పాదాలకి చూశాను ” అన్నాడు.
అప్పుడు సుగ్రీవుడి రాముడితో ” అయ్యయ్యో, అలా ఏడవకు రామ. నేను కూడా నీలాగే కష్టపడుతున్నాను. నువ్వే ఆలోచించు, నేను నీలా ఏడుస్తున్నాన? నీలాగే నా భార్య కూడా అపహరింపబడింది. నీకు చెప్పగలిగేంత సమర్దుడిని కాదు, కాని ఒక్కసారి నీకు జ్ఞాపకం చేద్దామని స్నేహ లక్షణంతో చెప్పాను. నీ యొక్క దుఃఖాన్ని ఉపశమింప చేసుకో, నాయందు ఉన్న స్నేహాన్ని జ్ఞాపకం చేసుకో ” అన్నాడు.
వెంటనే రాముడు స్వస్థతని పొంది ” ఉత్తమమైన మిత్రుడు ఎటువంటి మాట చెప్పాలో అటువంటి మాట చెప్పావయ్య సుగ్రీవా. కాని నాకు ఒక విషయం చెప్పు. ఈ రాక్షసుడు ఎక్కడ ఉంటాడో నాకు చెప్పు, నేను వెంటనే వెళ్ళి రాక్షస సంహారం చేస్తాను ” అన్నాడు.
అప్పుడు సుగ్రీవుడు ” నేను సత్యం చెబుతున్నాను, నా మాట నమ్ము. నీ భార్యని తీసుకొచ్చే పూచి నాది. కాని నీ భార్యని అపహరించిన రాక్షసుడి పేరు నాకు తెలీదు. ఎక్కడుంటాడో నాకు తెలీదు. నువ్వు బెంగ పెట్టుకోవద్దు, ముందు నా కార్యానికి సహాయం చెయ్యి ” అన్నాడు.
అప్పుడు రాముడు ” ఆ వాలి ఎక్కడ ఉంటాడో చెప్పు, నేను వెంటనే సంహరిస్తాను. ఇంతకముందెన్నడు నేను అసత్యం పలకలేదు, ఇక ముందు కూడా అసత్యం పలకను. నీకు మాట ఇచ్చిన ప్రకారం వాలిని సంహరిస్తాను ” అన్నాడు.
ఈ మాటలు విన్న సుగ్రీవుడు ” నువ్వు ఇంత మాట అన్నావు, నాకు ఇంకేమి కావాలి. నీలాంటి స్నేహితుడు లభిస్తే స్వర్గలోకమే లభిస్తుంది, ఇక వానర రాజ్యం లభించడం గొప్ప విషయమా ” అన్నాడు.
అప్పుడు రాముడు ” అసలు ఏమి జెరిగిందో నాకు చెప్పు, నువ్వు ఈ కొండ మీద బతకవలసిన అవసరం ఎందుకు ఏర్పడింది. నాకు అన్నీ వివరంగా చెప్పు ” అన్నాడు.
అప్పుడు సుగ్రీవుడు జెరిగిన కథని సంగ్రహంగా రాముడికి వివరించాడు. సుగ్రీవుడు చెప్పిన కథ విన్న రాముడు ” అసలు నీకు, నీ అన్న అయిన వాలికి ఎందుకు శత్రుత్వం ఏర్పడింది. నువ్వు నాకు ఆ విషయాన్ని పూర్తిగా చెపితే, నేను మీ ఇద్దరి బలాబలాలని అంచనా వేస్తాను. అప్పుడు మనం వెంటనే వెళ్ళవచ్చు ” అన్నాడు.
అప్పుడు సుగ్రీవుడు అసలు కథని వివరంగా ఇలా చెప్పాడు ” రామ! ఒకానొకప్పుడు మా తండ్రి అయిన ఋక్షరజస్సు ఈ వానర రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ ఋక్షరజస్సుకి ఇంద్రుడి అనుగ్రహంగా వాలి ఔరసపుత్రుడిగా జన్మించాడు, సూర్యుడి అనుగ్రహంగా నేను ఔరసపుత్రుడిగా జన్మించాను. పెద్ద కుమారుడైన వాలి తండ్రి యొక్క ప్రీతిని పొందాడు. నేను కూడా చాలాకాలం వాలిని ప్రీతితో అనుగమించాను. కొంతకాలానికి ఋక్షరజస్సు శరీరాన్ని విడిచిపెట్టాక, పెద్ద కుమారుడు కనుక వాలికి పట్టాభిషేకం చేశారు. నేను వాలియందు వినయవిధేయలతో, భయభక్తులతో ఉండేవాడిని.
దుందుభి అనే రాక్షసుడి అన్న అయిన మయుడికి ఒక కుమారుడు ఉన్నాడు, వాడి పేరు మాయావి. ఆ మాయవికి, వాలికి ఒక స్త్రీ సంబంధంగా వైరం వచ్చింది. ఆ కారణం చేత మాయావి ఒకరోజు రాత్రి కిష్కిందా ద్వారం దెగ్గరికి వచ్చి గట్టిగా కేకలు వేసి ‘ వాలి బయటకి రా, మనిద్దరమూ యుద్ధం చేద్దాము. ఈరోజుతో నిన్ను సంహరిస్తాను ‘ అన్నాడు. అప్పటివరకూ తన భార్యలతో సంతోషంగా కాలం గడుపుతున్న వాలి గబగబా బయటకి వచ్చాడు. అప్పుడు నేను కూడా బయటకి వచ్చాను. ఆ మాయావి మా ఇద్దరినీ చూసి భయపడి పారిపోయాడు. అక్కడున్న స్త్రీలు ‘ ఎలాగు వాడు పారిపోతున్నాడు కాదా, ఇంక విడిచిపెట్టు ‘ అన్నారు. కాని, శత్రువుని విడిచిపెట్టనని వాలి వాడి వెనకాల పరిగెత్తాడు. అప్పుడు నేను కూడా వాలి వెనకాల వెళ్ళాను.
పరిగెత్తి పరిగెత్తి, తృణముల చేత కప్పబడిన ఒక పెద్ద బిలంలోకి ఆ మాయావి దూరిపోయాడు. అక్కడికి వెళ్ళి నేను, వాలి నిలబడ్డాము. అప్పుడు వాలి నాతో ‘ సుగ్రీవా! నువ్వు ఈ బిల ద్వారం దెగ్గర కాపలాగా ఉండు, నేను ఇందులోకి వెళ్ళి ఆ రాక్షసుడిని సంహరించి వస్తాను. నువ్వు నా తమ్ముడివి, చిన్నవాడివి నా పాదముల మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను, నువ్వు ఇక్కడే ఉండు ‘ అని చెప్పి వాలి గుహలోపలికి వెళ్ళాడు.
వాలి లోపలికి వెళ్ళి ఒక సంవత్సర కాలం గడిచిపోయింది. నేను బయట అలాగే నిలబడ్డాను. అలా చాలాకాలం తరువాత లోపలినుండి రాక్షసుల కేకలు వినపడ్డాయి. ఆ ద్వారం దెగ్గర నురగతో కూడిన నెత్తురు ప్రవహిస్తూ బయటకి వచ్చింది. ఎక్కడా వాలి మాట కాని, వాలి అలికిడి కాని వినపడలేదు. బహుశా మా అన్నగారైన వాలిని ఈ రాక్షసులు సంహరించి ఉంటారు అనుకొని, ఈ రాక్షసులు బయటకి వస్తే ప్రమాదము అని, నేను ఒక పెద్ద శిలని తీసుకొచ్చి ఆ బిలానికి అడ్డుగా పెట్టాను. అప్పుడు నేను చనిపోయాడనుకున్న వాలికి అక్కడే ఉదకక్రియ నిర్వహించి తర్పణలు విడిచిపెట్టాను.
తరువాత నేను రాజ్యానికి వచ్చి, ఎవ్వరికీ తెలియకుండా శాస్త్రం ప్రకారం వాలికి చేయవలసిన కార్యములను చేశాను. నేను అంత జాగ్రత్తగా ఎవరికి తెలియకుండా చేసినప్పటికీ, మంత్రులు విషయాన్ని కనిపెట్టి, రాజు లేకుండా రాజ్యం ఉండకూడదు కనుక నన్ను బలవంతంగా సింహాసనం మీద కూర్చోపెట్టి పట్టాభిషేకం చేశారు. నేను చాలా ధర్మబద్ధంగా వానర రాజ్యాన్ని పరిపాలిస్తూ కాలం గడుపుతున్నాను.
ఒకనాడు అకస్మాత్తుగా మా అన్న వాలి తిరిగివచ్చాడు. అప్పుడాయన ఎర్రనైన కళ్ళతో నావంక చూశాడు. నా మంత్రులని, స్నేహితులని బంధించి కారాగారంలో వేశాడు. ఆ సమయంలో నేను ప్రభువుగా ఉన్నాను కనుక, నాకున్న బలం చేత, నేను వాలి బంధించి కారాగారంలో పెట్టగలను, కాని నేను అలా చెయ్యలేదు. ఆయన నాకు అన్నగారు, ఆయనని నేను గౌరవించాలి అందుకని నేను ఆయనని నిగ్రహించలేదు.
దిష్ట్యా అసి కుశలీ ప్రాప్తో నిహతః చ త్వయా రిపుః |
అనాథస్య హి మే నాథః త్వం ఏకో అనాథ నందనః ||
అప్పుడు నేను ఆయన దెగ్గరికి వెళ్ళి నా రెండు చేతులని జోడించి, శిరస్సు వంచి ‘ అన్నయ్యా! నువ్వు లేక నేను అనాథనయ్యాను. నువ్వు తిరిగి రావడం వలన ఇవ్వాళ నేను నాథుడున్న వాడిని అయ్యాను. నాకు ఎంతో సంతోషంగా ఉంది. అన్నయ్యా! నూరు తీగలున్న ఈ తెల్లటి ఛత్రాన్ని నీ శిరస్సుకి పెడతాను, నీకు చామరం వేస్తాను. నువ్వు మళ్ళి సింహాసనం మీద కూర్చొని పూర్వం ఎలా పరిపాలించేవాడివో అలా పరిపాలించు. నేనెప్పుడూ పట్టాభిషేకం చేసుకుందామని అనుకోలేదు. బలవంతంగా మంత్రులు, పౌరులు నాకు పట్టాభిషేకం చేశారు. నేను నీకు శిరస్సు వంచి అంజలి ఘటిస్తున్నాను, ఎప్పటికీ నువ్వే వానర రాజ్యానికి రాజువి. అందుకని రాజ్యాన్ని స్వీకరించు ‘ అన్నాను.
అప్పుడు వాలి ‘ చి ఛి, పరమ దుష్టుడా నేను లేని సమయం చూసి నువ్వు పట్టాభిషేకం చేసుకున్నావు. నువ్వు పరమ దుర్మార్గుడివి ‘ అన్నాడు. మరునాడు జానపదులను, మంత్రులను, ఇతరమైన వానరములను పిలిచి ఒక పెద్ద సభ తీర్చాడు. అప్పుడు నేను వాలి పక్కన నిలబడ్డాను. అప్పుడాయన నన్ను చూసి ‘ నేను దురాత్ముడైన మాయవిని చంపడం కోసమని ఒక రాత్రి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. ఈ మహాపాపి అయిన నా తమ్ముడు నన్ను అనుగమించి వచ్చాడు. నేను రాక్షసులని చంపి వెనక్కి వస్తాను, నువ్వు బిల ద్వారం దెగ్గర కాపలాగా ఉండు అన్నాను. కాని పాపపు ఆలోచన కలిగిన సుగ్రీవుడు నేను లోపలికి వెళ్ళగానే శిలా ద్వారాన్ని అడ్డు పెట్టాడు. నేను లోపల మరణిస్తాను అని తిరిగొచ్చి పట్టాభిషేకం చేసుకున్నాడు. కాని నేను లోపలికి వెళ్ళాక మాయావి నాకు కనపడలేదు. ఒక సంవత్సర కాలం వెతికాక ఆ మాయావి తన బంధువులతో, స్నేహితులతో కనపడ్డాడు. నేను వాళ్ళందరినీ సంహరించాను. ఆ గుహ అంతా నెత్తురుతో నిండిపోయింది. నేను బయటకి వద్దాము అనుకున్నాను, కాని వీడు శిలని అడ్డుపెట్టాడు. నేను ఎంతో కష్టంతో ఆ శిలని పక్కకి తోసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చేసరికి వీడు రాజ్యాన్ని పరిపాలిస్తూ సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. కావాలనే నన్ను గుహలో పెట్టి రాజ్యాన్ని తీసుకున్నాడు. వీడిని ఎట్టి పరిస్థితులలోను ఆదరించకూడదు. రాజ్యం కోసమని అన్నని హత్య చెయ్యాలని ప్రయత్నం చేసినవాడు ‘ అన్నడు.
అప్పుడు వాలి నన్ను కట్టుబట్టతో బయటకి తరిమేశాడు. అప్పుడు నేను భయపడుతూ బయటకి వచ్చాను. కాని వాలి నన్ను వదిలిపెట్టకుండా చంపుతాను అని ఈ భూమండలం అంతా తరిమాడు. నేను ఈ భూమండలం అంతా పరిగెత్తాను. ఈ కొండమీదకి వాలి రాలేడు కనుక, చిట్టచివరికి నేను ఈ కొండ మీద కూర్చున్నాను. నాకు అత్యంత ప్రియమైన భార్య అయిన రుమని, నేను బ్రతికి ఉండగా వాలి తన భార్యగా అనుభవిస్తున్నాడు. నేను చెయ్యని పాపానికి నన్ను కట్టుబట్టలతో బయటకి తోసేశాడు. నేను ఎంత చెప్పినా వినలేదు, పైగా నా భార్యని తన భార్యగా చేసుకున్నాడు. ఇంత కష్టంలో ఉన్నాను రామ………….” అని సుగ్రీవుడు ఏడిచాడు.
ఈ మాటలు విన్న రాముడు ” గ్రద్దల యొక్క ఈకలు కట్టినటువంటి, ఒంపులు లేనటువంటి బంగారు బాణములు నా అమ్ములపొదిలో ఉన్నాయి. నడువడి తెలియక పాపాత్ముడైన వాలి ఎంతకాలం నా కంటికి కనపడడో, అంతకాలమే బతికి ఉంటాడు. వాలి నాకు కనపడగానే మరణిస్తాడు. నువ్వు బెంగ పెట్టుకోకు, వాలిని ఇప్పుడే సంహరిస్తాను. వాలి ఎక్కడ ఉంటాడో నాకు చూపించు ” అన్నాడు.
సముద్రాత్ పశ్చిమాత్ పూర్వం దక్షిణాద్ అపి చ ఉత్తరం |
క్రామతి అనుదితే సూర్యే వాలీ వ్యపగత క్లమః ||
అప్పుడు సుగ్రీవుడు ” రామ తొందరపడకు, నీకు ఒక విషయం చెబుతాను విను. సూర్యోదయానికి ముందరే వాలి నిద్రలేస్తాడు. అప్పుడు తన అంతఃపురం నుంచి ఒక్కసారి ఎగిరి తూర్పు సముద్రతీరం దెగ్గర దిగుతాడు. అక్కడ సంధ్యావందనం చేసి ఒకే దూకులో పశ్చిమ సముద్రతీరం దెగ్గర దిగుతాడు. మళ్ళి అక్కడ సంధ్యావందనం చేసి ఒకే దూకులో ఉత్తర సముద్రతీరం దెగ్గర దిగుతాడు. మళ్ళి అక్కడ సంధ్యావందనం చేసి ఒకే దూకులో దక్షిణ దిక్కుకి దూకుతాడు. ఇలా నాలుగు సముద్రాల దెగ్గర సూర్యుడు ఉదయించేలోపు సంధ్యావందనం చేస్తాడు. దానితో పాటు నీకు ఇంకొక విషయం చెబుతాను రామ ” అని రాముడిని తీసుకువెళ్ళి ఒక పర్వతాన్ని చూపించి, ” చూశావ ఈ పర్వతాలు. వాటికి ఎంత పెద్ద శిఖరాలు ఉన్నాయో చూశావ. వాలి సంధ్యావందనం చేశాక ఇంటికి వెళ్ళి కొన్ని పాలు తాగి మళ్ళి ఈ అరణ్యానికి వస్తాడు. ఇక్కడ ఉన్న ఈ పర్వత శిఖరాలని ఊపి విరగ్గొడతాడు. అప్పుడు వాటిని గాలిలోకి విసిరి బంతులు పట్టుకున్నట్టు పట్టుకుంటాడు ” అని చెప్పి, రాముడిని మరొక్క ప్రదేశానికి తీసుకువెళ్ళి,
” పూర్వం దుందుభి అని ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడికి ఒంట్లో బలం ఉందన్న పొగరు చేత ఒకరోజు సముద్రుడి దెగ్గరికి వెళ్ళి తనతో యుద్ధం చెయ్యమన్నాడు. నీతో నాకు యుద్ధం ఏమిటి, నీ బలం ఎక్కడ నా బలం ఎక్కడ. నేను నీతో యుద్ధ చెయ్యలేను అని సముద్రుడు అన్నాడు. అప్పుడా దుందుభి ‘ నువ్వు నాతో యుద్ధం చెయ్యలేనంటె నేను నిన్ను వదలను, నాతో యుద్ధం చెయ్యగలిగిన వాడిని నాకు చూపించు ‘ అన్నాడు. అప్పుడా సముద్రుడు ‘ హిమవంతుడని ఉత్తర భారతదేశంలో ఒక పెద్ద పర్వతం ఉంది, అది మంచు పర్వతం. ఆయన కూతురు పార్వతీ దేవి, ఆ పార్వతీ దేవిని పరమశివుడికి ఇచ్చి వివాహం చేశారు. ఆయన మీద గొప్ప గొప్ప అరణ్యాలు, గుహలు ఉన్నాయి. నువ్వు ఆ హిమవంతుడితో యుద్ధం చెయ్యి ‘ అన్నాడు.
అప్పుడా దుందుభి హిమవంత పర్వతం దెగ్గరికి వెళ్ళి ఆ పర్వత శిఖరాలని పీకేసి ముక్కలు చేస్తున్నాడు. దుందుభి చేస్తున్న అల్లరికి హిమవంతుడు పరుగు పరుగున వచ్చాడు. అప్పుడా దుందుభి హిమవంతుడిని యుద్ధానికి రమ్మన్నాడు, నాకు ఎవరితోనూ యుద్ధం చెయ్యాలని లేదు, నేను యుద్ధం చెయ్యను అని హిమవంతుడు అన్నాడు. అప్పుడా దుందుభి ‘ నువ్వు కూడా ఇలాగంటే ఎలా. సముద్రుడు కూడా నీలాగే యుద్ధం చెయ్యనన్నాడు. పోనీ నాతో యుద్ధం చేసేవాడి పేరు చెప్పు ‘ అన్నాడు. అప్పుడు హిమవంతుడు ‘ నీ ఒంటి తీట తీర్చగలిగినవాడు ఒకడున్నాడు. కిష్కిందా రాజ్యాన్ని ఏలే వాలి ఉన్నాడు. మంచి బలవంతుడు. ఆయన నీతో యుద్ధం చేస్తాడు ‘ అని చెప్పాడు.
అప్పుడా దుందుభి సంతోషంగా కిష్కిందకి వెళ్ళి, అక్కడున్న చెట్లని విరిచి, ఆ కిష్కింద ద్వారాన్ని పగులగొట్టి పెద్ద అల్లరి చేశాడు. భార్యలతో కామమోహితుడై రమిస్తున్న వాలి ఈ అల్లరికి బయటకి వచ్చాడు. ఆ దుందుభి వాలిని చూసి ‘ ఛి, భార్యలతో కామం అనుభవిస్తున్నావా. నా కోపాన్ని రేపటిదాకా ఆపుకుంటాను. పో, నీ భార్యలతో కామం అనుభవించు. నువ్వు ఈ రాత్రి నీ భార్యలతో హాయిగా భోగం అనుభవించు, నీకు స్నేహితులైన వారిని పిలిచి వారికి కానుకలు ఇవ్వు, నీతో సమానమైన వాడికి పట్టాభిషేకం చేసెయ్యి. తాగి ఉన్నవాడిని, కామం అనుభవిస్తున్న వాడిని, అప్రమత్తంగా లేనివాడిని, యుద్ధం నుంచి పారిపోతున్నవాడిని, ఆయుధం లేనివాడిని చంపితే పసిపిల్లాడిని చంపిన పాపం వస్తుంది, అందుకని నేను నిన్ను వదిలేస్తున్నాను. ఎలాగోలా ఈ రాత్రికి ఇక్కడ కూర్చొని ఉంటాను. రేపు పొద్దున్న రా, నిన్ను చంపి అవతల పడేస్తాను ‘ అన్నాడు.
అప్పుడా వాలి ‘ నువ్వు నా గురించి అంతగా బెంగ పెట్టుకోమాకు. నేను తాగి ఉన్నా కూడా, అది వీరరసం తాగినవాడితో సమానం, రా యుద్ధానికి ‘ అని, అడ్డువచ్చిన భార్యలని పక్కకు తోసేసి దుందుభి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఇంద్రుడు ఇచ్చిన మాలని వాలి తన మెడలో వేసుకుని దుందుభి తల మీద ఒక్క గుద్దు గుద్దాడు. ఆ దెబ్బకి దుందుభి ముక్కు నుండి, చెవుల నుండి నెత్తురు కారి కిందపడిపోయాడు. ఆ హొరాహొరి యుద్ధంలో వాలి దుందుభిని సంహరించాడు. అప్పుడాయన ఆ దుందుభి శరీరాన్ని గిరగిర తిప్పుతూ విసిరేశాడు. అప్పుడది గాలిలో యోజన దూరం ఎగురుకుంటూ వెళ్ళి మతంగ మహర్షి ఆశ్రమం దెగ్గర పడింది. అలా పడిపోవడంలో ఆశ్రమం అంతా నెత్తురితో తడిసిపోయింది. అప్పుడా మతంగ మహర్షి బయటకి వచ్చి దివ్య దృష్టితో చూసి ‘ ఎవడురా ఒళ్ళు కొవ్వెక్కి దుందుభి కళేబరాన్ని ఇటు విసిరినవాడు, ఈ శరీరాన్ని విసిరిన దౌర్భాగ్యుడు ఇక్కడికి వస్తే వాడి తల వెయ్యి వ్రక్కలయ్యి మరణిస్తాడు ‘ అని చెప్పి, ‘ ఇక్కడ మీరందరూ మీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. వాలికి సంబంధించినవాడు ఎవడైనా సరే ఇక్కడి చెట్లని పాడుచేస్తూ తిరిగితే, రేపటి తరువాత వాళ్ళు మరణిస్తారని శపిస్తాను. నేను శపించే లోపల మీ అంతట మీరు ఇక్కడి నుండి వెళ్ళిపొండి ‘ అన్నాడు.
అప్పుడు అక్కడున్నటువంటి వానరాలు ఆ పర్వతాన్ని ఖాళీ చేసి వాలి దెగ్గరికి పారిపోయి మతంగ మహర్షి యొక్క శాపం గురించి వివరించారు. అందుకని వాలి ఈ పర్వతం వైపు కనీసం చూడను కూడా చూడడు. నేను బతకాలంటే ఈ బ్రహ్మాండంలో వాలి రాని ప్రదేశం ఇదే, అందుకని నేను ఇక్కడ ఉంటున్నాను. ఇంతకీ నేను నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకోచ్చానో తెలుసా, అదిగో అక్కడ ఎదురుగుండా కనపడుతుందే పెద్ద తెల్లటి పర్వతంలాంటిది, అదే దుందుభి యొక్క కాయం. ఆ అస్థిపంజరం ఇప్పుడు పర్వతంలా అయిపోయింది ” అన్నాడు.