అప్పుడు తార ” లక్ష్మణా! ఎందుకయ్యా అంత కోపంగా ఉన్నావు. నీకు ఇంత కోపం తెప్పించడానికి సాహసించిన వాళ్ళు ఎవరు. ఎండిపోయిన చెట్లతో కూడిన వనాన్ని దావాగ్ని దహించేస్తుంటే, దానికి ఎదురు వెళ్ళగల మొనగాడు ఎవడయ్యా ” అనింది.
అప్పుడు లక్ష్మణుడు ” నీ భర్త యొక్క ప్రవర్తన ఆయన భార్యవైన నీకు తెలియడం లేదా. నీ భర్త ధర్మాన్ని పక్కన పెట్టేసి కేవలం కామమునందే కాలాన్ని గడుపుతున్నాడు. ( మనకి ధర్మ, అర్ధ, కామ, మోక్షాలు అని 4 పురుషార్ధాలు ఉంటాయి. ధర్మబద్ధమైన అర్ధము{ కష్టపడి సంపాదించినది}, ధర్మబద్ధమైన కామము{ కేవలం తన భార్య అందే కామసుఖాన్ని అనుభవించడం} వలన మోక్షం వైపు అడుగులు వేస్తాము. ధర్మాన్ని పక్కన పెట్టి మనం ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని సుఖాలు అనుభవించినా ప్రమాదమే వస్తుంది ). మిత్రుడికి ఇచ్చిన మాట తప్పాడు. 4 నెలల సమయం గడిచిపోయింది.
న చింతయతి రాజ్యార్థం సః అస్మాన్ శోక పరాయణాన్ |
స అమాత్య పరిషత్ తారే కామం ఏవ ఉపసేవతే ||
రాజన్నవాడు అనుభవించాల్సింది కేవలం కామము ఒక్కటే కాదు. రాజు మొట్టమొదట మంత్రి పరిషత్తుతో కూడి సమాలోచన చేసి రాజ్యకార్య నిర్వహణ చెయ్యాలి. ఇవన్నీ నీ భర్త చేస్తున్నాడా?. వర్షాకాలంలో వెతకడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ నాలుగు నెలలు సుఖములను అనుభవించి నాలుగు నెలల తరువాత స్నేహితుడికి ఇచ్చిన మాట ప్రకారం సహాయం చెయ్యమంటే, ఇచ్చిన సమయం గడిచిపోయినా ఇంకా కామసుఖాలని అనుభవిస్తూ ఉన్న సుగ్రీవుడిది దోషం కాదా?. ఇవ్వాళ నీ భర్త నిరంతర మధ్యపానం చేస్తుండడంవలన ఆయన బుద్ధియందు వైక్లవ్యం ఏర్పడింది. అందుచేత ఆ మధ్యపానమునందు రమిస్తున్న సుగ్రీవుడు పురుషార్ధములయందు చెడిపోయాడు ” అన్నాడు.
అప్పుడు తార ” నాయనా! ఇది కోపగించవలసిన కాలం కాదయ్యా. ఎవరో బయటివాళ్ళు చెడిపోతే నువ్వు కోపంతో గట్టిగా కేకలు వెయ్యచ్చు, నిగ్రహించచ్చు, చంపచ్చు. కాని ఇవ్వాళ నీ అన్నతో సమానమైన సుగ్రీవుడు కామానికి బానిస అయ్యాడు. అటువంటి సుగ్రీవుడి మీద నీకు ఇంత కోపం తగదయ్యా. ‘సుగ్రీవుడిది దోషము’ అని నువ్వు చెప్పినది పరమ యదార్ధము. నువ్వు గుణములు ఉన్నవాడివి కనుక సుగ్రీవుడిని క్షమించవయ్య. లక్ష్మణా! నువ్వు చాలా గుణాలు ఉన్నవాడివి, అందుకే నీకు ఇంత శాస్త్ర మర్యాద తెలుసు. నా భర్త చాలా అల్పమైన గుణములు ఉన్నవాడు, అందుకని కామమునకు లొంగిపోయాడు. మరి నువ్వు కోపమునకు లొంగిపోతున్నావేమయ్యా?
లక్ష్మణా! నువ్వు ప్రత్యేకించి ఇక్కడికి వచ్చి అరుస్తున్నావు కాని, రాముడు బాణం వేస్తే ఆ ప్రభావం ఎలా వుంటుందో నాకు తెలుసు, సుగ్రీవుడు ఎంత విలువైన కాలాన్ని చేజార్చుకున్నాడో నాకు తెలుసు, దానివల్ల రాముడు ఎంత బాధపడుతున్నాడో నాకు తెలుసు. ఈ మూడు తప్పులు జెరిగాయి కనుక మీకు ఉపకారం ఎలా చెయ్యాలో కూడా నాకు తెలుసు. మన్మధుడి బాణాలు ఎంత తీవ్రంగా ఉంటాయో, ఆ బాణాల దెబ్బకి కామానికి ఎంత తొందరగా పడిపోతారో నాకు తెలుసు. ఏ కాముని బాణాల దెబ్బకి సుగ్రీవుడు ఇలా ఉన్నాడో నాకు తెలుసు, ఆ సుగ్రీవుడు ఎవరి పొందుయందు సంతోషంగా ఉన్నాడో నాకు తెలుసు. శత్రువులని చంపే ఓ లక్ష్మణా! ఇవ్వాళ సుగ్రీవుడు తన ఇంద్రియాలకి లొంగిపోయాడు. అంతేకాని ఆయనకి రాముడి మీద ఎటువంటి ద్వేషభావము లేదు, అందుకని నువ్వు ఆయనని క్షమించి తీరాలి.
మహర్షయో ధర్మ తపోభిరామాః కామా అనుకామాః ప్రతి బద్ధ మోహాః |
అయం ప్రకృత్యా చపలః కపిః తు కథం న సజ్జేత సుఖేషు రాజా ||
ఏమయ్యా లక్ష్మణా, నేను కొత్తగా చెప్పాల, నీకు తెలీదా, సంసారాన్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళి తపస్సు చేసుకునే మహర్షులు ఇంద్రుడు పంపిన అప్సరసలని చూసి కామానికి లొంగి తమ తపస్సులను భ్రష్టు పట్టించుకున్నవారు చాలామంది ఉన్నారు. అంత గొప్ప మహర్షులే కామానికి లొంగిపోయినప్పుడు, చపలబుద్ధి కలిగిన వానరుడు కామంతో చెయ్యవలసిన పనిని కొన్ని రోజులు మరిచిపోవడం పెద్ద విషయమా. సుగ్రీవుడు ఇంతగా కామానికి లొంగిపోయినప్పటికీ కూడా, మీకు ఇచ్చిన మాటని నెరవేర్చడానికి ఎప్పుడో ప్రయత్నాలు ప్రారంభించాడు.
లక్ష్మణా! ఇక్కడే నిలబడి ఉన్నావు, నువ్వు అంతఃపురంలోకి రాకూడదా, నువ్వేమన్నా పరాయివాడివా. సుగ్రీవుడు పడుకున్న మందిరంలోకి వస్తే అంతఃపుర కాంతలు కనిపిస్తారని సందేహిస్తున్నావా. మిత్రుడైన వాడు, అన్యభావన లేకుండా మిత్రుడితో మాట్లాడేవాడు, చారిత్రం ఉన్నవాడు, నడువడి ఉన్నవాడు అంతఃపురంలోకి రావచ్చయ్యా. ఏమి దోషంలేదు, లోపలికి రా ” అనింది.
బంగారు కన్నుతో మెరిసిపోతున్న సుగ్రీవుడు, తన తొడ మీద రుమని కూర్చోపెట్టుకొని గట్టిగా కౌగలించుకొని ఉన్నాడు. తెర తీసుకొని లక్ష్మణుడు లోపలికి రాగానే సుగ్రీవుడికి తన దోషం జ్ఞాపకం వచ్చి గబ్బుక్కున ఎగిరి లక్ష్మణుడి దెగ్గర వాలి, శిరస్సు వంచి అంజలి ఘటించాడు.
కాని సుగ్రీవుడి చూడగానే లక్ష్మణుడికి కోపం వచ్చి ” సుగ్రీవా! రాజన్నవాడు ఉత్తమమైన అభిజనంతో కూడి ఉండాలి, జాలికలిగినవాడై ఉండాలి, ఇంద్రియములను గెలిచినవాడై ఉండాలి, చేసిన ఉపకారాన్ని మరిచిపోనివాడై ఉండాలి, మాట తప్పనివాడై ఉండాలి. అటువంటివాడిని ఈలోకం రాజని గౌరవిస్తుంది. మిత్రుడి దెగ్గర సహాయం పొంది, ఆ మిత్రుడికి తిరిగి ఉపకారం చెయ్యనివాడిని ఈ లోకం క్రూరుడు అని పిలుస్తుంది.
శతం అశ్వ అనృతే హంతి సహస్రం తు గవ అనృతే |
ఆత్మానం స్వ జనం హంతి పురుషః పురుష అనృతే ||
ఎవడైనా గుర్రం విషయంలో అసత్యం చెబితే ( అంటె ఎవరికన్నా గుర్రం ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఉండడం), నూరు గుర్రాలని చంపిన పాపం వస్తుంది. ఆవు విషయంలో అసత్యం చెబితే, వెయ్యి ఆవుల్ని చంపిన పాపం వస్తుంది. అలాగే, ఉపకారం చేస్తానని చెప్పి ఆ మాటకి కట్టుబడనివాడు తన బందువులందరిని చంపి, వారిని తినేసి, తననితాను చంపుకున్నవాడితో సమానమవుతాడయ్య సుగ్రీవా. ఒకరిదెగ్గరికి వెళ్ళి ‘ అయ్యా మీరు నాకు ఉపకారం చెయ్యండి, నేను మీకు ప్రత్యుపకారం చేస్తాను ‘ అని మాట పుచ్చుకొని, వారి దెగ్గరినుండి ఉపకారం పొందేసి, దాని ఫలితాన్ని అనుభవిస్తూ, తాను ఇచ్చిన మాట మరిచిపోయినవాడిని లోకం అంతా కలిసి చంపేస్తుంది.
బ్రహ్మఘ్నే చ ఏవ సురాపే చ చౌరే భగ్న వ్రతే తథా |
నిష్కృతిర్ విహితా సద్భిః కృతఘ్నే న అస్తి నిష్కృతిః ||
బ్రహ్మహత్య చేసినవాడికి, మధ్యపానం చేసినవాడికి, దొంగతనం చేసినవాడికి, ఒక వ్రతం చేస్తాను అని చెయ్యడం మానేసినవాడికి ప్రాయశ్చిత్తం ఉండచ్చు, కాని క్రుతఘ్నుడికి ప్రాయశ్చిత్తం లేదు. నువ్వు రాముడికి ఉపకార్తం చేస్తానని ఒప్పుకున్నావు, కాని ప్రత్యుపకారం చెయ్యలేదు. నీ ప్రవర్తన చూసి మా అన్నయ్య నిన్ను మంచివాడు అనుకున్నాడు, కాని నువ్వు కప్పలా అరుస్తున్న పామువని మా అన్నయ్య కనిపెట్టలేకపోయాడయ్యా. నువ్వు మా అన్నయ్యకి చేసిన దోషానికి నిన్ను ఇప్పుడే చంపేస్తాను. నీ మాట మీద నువ్వు నిలబడు, లేకపోతె వాలి వెళ్ళిన దారిలో వెళ్ళిపోవలసి ఉంటుంది ” అని లక్ష్మణుడు అన్నాడు.
లక్ష్మణుడు మాట్లాడుతున్నంతసేపు నక్షత్రముల మధ్యలో ఉన్న చంద్రుడిలా సుగ్రీవుడు తన భార్యల మధ్యలో చేతులుకట్టుకొని నిలబడిపోయి ఉన్నాడు.
అప్పుడు తార ” లక్ష్మణా! నీ నోటి వెంట సుగ్రీవుడి గురించి ఇటువంటి మాటలు రాకూడదు. సుగ్రీవుడు కుటిలుడు కాదు, అసత్యవాది కాదు, ఇంద్రియనిగ్రహం లేనివాడు కాదు, శఠుడు కాదు. రాముడు చేసిన ఉపకారాన్ని సుగ్రీవుడు ఎన్నడూ మరిచిపోలేదు. రాముడు చేసిన ఉపకారం వల్లనే సుగ్రీవుడు ఈనాడు ఇంత గొప్ప రాజ్యాన్ని, ఐశ్వర్యాన్ని, రుమని, నన్ను పొందగలిగాడు. చాలా కాలం సుఖాలకి దూరంగా ఉండడం వలన సుగ్రీవుడు ఈనాడు సమయాన్ని మరిచిపోయాడు. ఏమయ్యా, నా భర్తేన అలా మరిచిపోయినవాడు? విశ్వామిత్రుడంతటివాడు కూడా కామానికి లొంగి సమయాన్ని మరిచిపోయాడు కదా. ఏ రుమయందు, ఏ రాజ్యమునందు, నా యందు ఆనందముతో సుగ్రీవుడు ఈనాడు సమయాన్ని మరిచిపోయాడో, అదే సుగ్రీవుడు రామకార్యం కోసం అవసరమైతే నన్ను, రుమని, రాజ్యాన్ని వదిలేస్తాడు. రావణుడు యుద్ధంలో నిహతుడవుతాడు. చంద్రుడితో రోహిణి కలిసినట్టు, కొద్దికాలంలోనే సీతమ్మ రాముడితో కలవడం సుగ్రీవుడు చూస్తాడు.
శత కోటి సహస్రాణి లంకాయాం కిల రక్షసాం |
అయుతాని చ షట్ త్రింశత్ సహస్రాణి శతాని చ ||
నాయనా! లంకలో నూరు వేల కోట్ల రాక్షసులు(1 ట్రిలియన్), మరియు 36 వేల సంఖ్యలో( ఒక్కొక్క సంఖ్యలో 100 మంది సైనికులు) బలగాలు ఉన్నాయి. వాలి బతికి ఉన్నప్పుడు ఈ విషయాలని నాకు చెప్పాడు, కాని నాకు పూర్తిగా తెలియదు. అంతమంది రాక్షసులని మట్టుపెట్టడానికి మనకి కూడా కొన్ని కోట్ల కోట్ల వానర సైన్యం అవసరముంది. అందుకని సుగ్రీవుడు వానర సైన్యం కోసం కబురుపెట్టాడు. నువ్వు పద్దాక బాణ ప్రయోగం చేస్తాను అంటుంటే, ఆనాడు రాముడి బాణానికి వాలి పడిపోయిన సంఘటన గుర్తుకువచ్చి ఇక్కడున్నటువంటి స్త్రీలందరూ భయపడుతున్నారు. నువ్వు ఇలా ప్రవర్తించకూడదు, నీ కోపాన్ని విడిచిపెట్టు ” అనింది.
అప్పుడు లక్ష్మణుడు ” అమ్మా! నువ్వు చెప్పిన మాట యదార్ధమే, నేను అంగీకరిస్తున్నాను. ఇక నేను కోపంగా మాట్లాడను, నేను ప్రసన్నుడను అయ్యాను ” అన్నాడు.
లక్ష్మణుడి మాటలు విన్న సుగ్రీవుడు ఆనందంతో తన మెడలో ఉన్న పుష్పహారాలని పీకేసి ” లక్ష్మణా! నేను రాజ్యాన్ని, భార్యని పోగొట్టుకున్నాను. మళ్ళి రాముడి అనుగ్రహంతో వాటిని పొందాను. కేవలం తన చూపు చేత, బాణ ప్రయోగం చేత రాముడు లంకని కాల్చేయగలడు, అటువంటి రాముడికి సహాయం చెయ్యడానికి నేను ఎంతటి వాడిని. ‘ నా రాముడే కదా ‘ అని ప్రేమ చేత కాలాన్ని మరిచిపోయానో, లేకపోతె ‘ వానర సైన్యానికి కబురు పంపించాను కదా ‘ అన్న విశ్వాసంతో మరిచిపోయానో, నేను కాలాన్ని మరిచిపోయిన మాట యదార్ధమే లక్ష్మణా. ప్రపంచంలో పొరపాటు చెయ్యనివాడు అంటూ ఉండడు కదా, అందుకని నన్ను క్షమించు ” అన్నాడు.
అప్పుడు లక్ష్మణుడు ” నువ్వు మా అన్నయ్యకి నాథుడిగా ఉన్నావు. నీవంటి వాడి నీడలో ఉన్న రాముడి పని జెరిగి తీరుతుంది. అపారమైన శక్తి ఉండికూడా, తిరగబడకుండా, తప్పు జెరిగితే ఇలా చేతులు కట్టుకొని క్షమించమని అడగగలిగే ధార్మికమైన బుద్ధి మా అన్న రాముడి దెగ్గర ఉంది, సుగ్రీవ నీ దెగ్గర ఉంది. ఆ ప్రస్రవణ పర్వత గుహలో బాధపడుతున్న నీ స్నేహితుడిని ఓదార్చు. మా అన్నయ్య బాధాపడుతున్నాడన్న బాధతో కోపానికి లొంగి నిన్ను అనకూడని మాటలు ఏమైనా నేను అని ఉంటె, సుగ్రీవా! నన్ను క్షమించు ” అన్నాడు.
తరువాత సుగ్రీవుడు హనుమంతుడిని పిలిచి ” ఈ భూమండలంలో ఎక్కడెక్కడ ఉన్న వానరాలు ఇక్కడికి రావాలని చెప్పాను. వాళ్ళని కేవలం 10 రోజులలో రమ్మని చెప్పండి. మలయ, హిమాలయ, మహేంద్ర, వింధ్య మొదలైన పర్వతాల మీద ఉన్నవాళ్లు ఇక్కడికి వచ్చెయ్యాలి. కాటుక రంగులో ఉన్నవారు, బంగారు రంగులో ఉన్నవారు, వెయ్యి ఏనుగుల బలం కలిగినవారు, పది ఏనుగుల బలం కలిగినవారు, నీటిమీద నడిచేవారు, నీళ్ళల్లో ఉండేవారు, పర్వతాల మీద ఉండేవారు, చెట్ల మీద ఉండేవారు మొదలైన వానరాలన్నిటికి కబురు చెయ్యండి ” అని చెప్పాడు.
సుగ్రీవుడి ఆజ్ఞ ప్రకారం మంత్రులు మొదలైనవారు వానరాలని తీసుకురావడానికి వెళ్ళారు. అలా వెళ్ళినవారు అన్ని ప్రాంతాలలోని వానరాలని కూడగట్టుకొని కిష్కిందకి పయనమయ్యారు.
తరువాత సుగ్రీవుడు పల్లకిలో తనతోపాటు లక్ష్మణుడిని ఎక్కించుకొని ప్రస్రవణ పర్వతానికి చేరుకున్నాడు. ఇంతకాలానికి ప్రభువు బయటకి వచ్చాడని అక్కడున్న వానరాలు కూడా బయటకి వచ్చాయి. అప్పుడాయన రాముడి దెగ్గరికి వెళ్ళి, తన శిరస్సు రాముడి పాదాలకి తగిలేటట్టు పాదాభివందనం చేశాడు. అప్పుడు రాముడు సుగ్రీవుడిని కౌగలించుకొని ” ధర్మము, అర్థము, కామము వీటికోసం కాలాన్ని విడదీసుకోవడంలోనే ఎవరిదైనా ప్రాజ్ఞత ఉందయ్యా. కేవలం కామమునందే జీవితాన్ని నిక్షిప్తం చేసుకున్నవాడు, చెట్టు చివ్వరి కొమ్మమీద నిద్రపోతున్నవాడితో సమానం ” అన్నాడు.
అప్పుడు సుగ్రీవుడు ” రామ! నువ్వు ఇచ్చినదే ఈ రాజ్యం, ఈ భార్య, కాని నేను కృతఘ్నుడను కానయ్యా. కొన్ని కోట్ల వానరాలు, భల్లూకాలు మొదలైనవి వచ్చేస్తున్నాయి. వీటన్నిటితో ఏ కార్యము చెయ్యాలో నన్ను శాసించు ” అన్నాడు.
రాముడన్నాడు ” నీవంటి మిత్రుడు దొరకడం నా అదృష్టం సుగ్రీవ. సీత ఈ భూమండలం మీద ఎక్కడ ఉంది? ప్రాణములతో ఉన్నదా, ప్రాణములు తీయబడినదా. అసలు ఏ పరిస్థితులలో ఉన్నదో అన్న జాడ ముందు కనిపెట్టాలి. అందుకోసం వానరాలని అన్నిదిక్కులకి పంపించి అన్వేషణ జెరిగేటట్టు చూడు ” అన్నాడు.
ఇంతలో అక్కడికి కోట్ల కోట్ల వానరములు వచ్చాయి. అవి రావడం వలన ఆ ప్రాంతమంతా దుమ్ము, ధూళితో నిండిపోయింది. అంతా గోలగోలగా ఉంది. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు, కొంతమంది నమస్కారాలు చేస్తున్నారు, కొంతమంది చెట్లమీద ఉన్నారు, కొంతమంది నీళల్లో ఉన్నారు, కొంతమంది పర్వతాలమీద ఉన్నారు.
అప్పుడు వానర రాజైన సుగ్రీవుడు అందరినీ సరిగ్గా నిలబడమన్నాడు. అప్పుడా వానరాలు తమని ఎవరెవరు తీసుకొచ్చారో వాళ్ళ దెగ్గరికి వెళ్ళి నిలబడ్డాయి. ” ఎవరు ఎంతమందిని తెచ్చారో నాకు చెప్పండి ” అని సుగ్రీవుడు ఆదేశించాడు.
అప్పుడు వాళ్ళు అన్నారు ” సూర్యాస్తమయ పర్వతం నుండి 10 కోట్ల వానరాలు వచ్చాయి, శతబలి అనే వానరుడు 10 వేల కోట్ల వానరములతో వచ్చాడు. సుషేణుడు లెక్కపెట్టలేనన్ని వానరాలతో వచ్చాడు. రుమ తండ్రి కొన్ని వేల కోట్ల వానరాలతో వచ్చాడు. హనుమంతుడి తండ్రి అయిన కేసరి కొన్ని వేల కోట్ల వానరములతో వచ్చాడు. గవాక్షుడు 1000 కోట్ల కొండముచ్చులతో వచ్చాడు. ధూమ్రుడు 2000 కోట్ల భల్లూకములతో వచ్చాడు, పనసుడు 3 కోట్ల వానరాలతో వచ్చాడు, నీలుడు 10 కోట్ల నల్లటి దేహం కలిగిన వానరాలతో వచ్చాడు, గవయుడు 5 కోట్ల వానరాలతో వచ్చాడు, దరీముఖుడు 1000 కోట్ల వానరాలతో వచ్చాడు, మైంద-ద్వివిదులు అశ్విని దేవతల్లా 1000 కోట్ల వానరాలని తెచ్చారు, గజుడు 3 కోట్ల వానరాలని తెచ్చాడు, జాంబవంతుడు 10 కోట్ల భల్లూకాలని తెచ్చాడు, రుమణుడు 100 కోట్ల వానరాలని తెచ్చాడు, గంధమాదనుడు 10 వేల కోట్ల వానరములతో వచ్చాడు, ఆయన వెనకాల లక్ష కోట్ల వానరాలు వస్తున్నాయి, అంగదుడు 1000 పద్మ వానరాలని, 100 శంకు వానరాలని తీసుకొచ్చాడు, తారుడు 5 కోట్ల వానరాలని తీసుకొచ్చాడు, ఇంద్రజానువు 11 కోట్ల వానరాలని తెచ్చాడు, రంభుడు 1100 ఆయుత వానరాలని తెచ్చాడు, దుర్ముఖుడు 2 కోట్ల వానరాలని తెచ్చాడు, హనుమంతుడు కైలాశ శిఖరాల్లా ఎత్తుగావున్న 1000 కోట్ల వానరాలని తెచ్చాడు, నలుడు 100 కోట్ల 1000 మంది 100 వానరాలతో వచ్చాడు, దధిముఖుడు 10 కోట్ల వానరాలతో వచ్చాడు.
10,000 కోట్లయితే ఒక ఆయుతం, లక్ష కోట్లయితే ఒక సంకువు, 1000 సంకువులయితే ఒక అద్భుదం, 10 అద్భుదములయితే ఒక మధ్యం, 10 మధ్యములయితే ఒక అంత్యం, 20 అంత్యములయితే ఒక సముద్రం, 30 సముద్రములయితే ఒక పరార్థం, అలాంటి పరార్థాలు కొన్ని వేలు ఉన్నాయి ఇక్కడ ” అని అన్నారు.
అప్పుడు సుగ్రీవుడు వినతుడు అనే వానరాన్ని పిలిచి ” వినతా! నువ్వు లక్షమంది వానరాలతో బయలుదేరి తూర్పు దిక్కుకి వెళ్ళు. నీకు నెల రోజుల సమయం ఇస్తున్నాను, నెల రోజులలో సీతమ్మ తల్లి జాడ కనిపెట్టాలి. మీరు ఇక్కడినుండి తూర్పు దిక్కుకి బయలుదేరి గంగ, సరయు, కౌశికి, యమున, సరస్వతి, సింధు మొదలైన నదులని, వాటి తీరములలో ఉన్న ప్రాంతాలని అన్వేషించండి. బ్రహ్మమాల, విదేహ, మాలవ, కాశి, కోసల, మాగధ, పుణ్డ్ర, అంగ దేశములలో ఉండే పట్టణాలని, జనపదాలని వెతకండి. వెండి గనులు కలిగిన ప్రదేశాలు అక్కడ ఉన్నాయి, ఆ ప్రదేశాలన్నీ వెతకండి. సముద్రాలలో గల పర్వతాలు, వాటి మధ్యలో గల ద్వీపాలు, అందులో ఉన్న నగరాలు, మందరాచల శిఖరము మీద కలిగినటువంటి గ్రామాలలో నివసిస్తున్న జనుల యొక్క ఇళ్ళు, అక్కడ కొంతమందికి చెవులు ఉండవు, కొంతమందికి పెదవులు చెవుల వరకూ వ్యాపించి ఉంటాయి, కొంతమంది జుట్టు చెవుల వరకూ పడి ఉంటుంది. వాళ్ళందరూ చాలా భయంకరమైన నరభక్షకులు, వాళ్ళు నీళ్ళల్లో ఉంటారు. మీరందరూ ప్రతి చోట సీతమ్మని వెతకండి. అలా కొంతదూరం వెళితే యవద్వీపం కనపడుతుంది, అది రత్నములతో నిండి ఉంటుంది, మీరు అక్కడ వెతకండి. తరువాత సువర్ణ ద్వీపము, రూప్యక ద్వీపము ఉంటాయి. అవి బంగారము, వెండి గనులకు నిలయమైనటువంటివి. అది దాటితే శిశిరం అనే పర్వతం కనపడుతుంది, ఆ పర్వతం అంతా వెతకండి.
కొంతదూరం వెళ్ళాక శోణానది కనపడుతుంది. ఆ నది చాలా లోతుగా, ఎర్రటి నీటితో ఉంటుంది. ఆ ప్రదేశంలో సిద్ధులు, చారులు విహరిస్తూ ఉంటారు. అక్కడున్న ఆశ్రమాలలో, తపోవనాలలో సీతమ్మని ఉంచాడేమో వెతకండి. తరువాత ఇక్షు సముద్రం వస్తుంది, అందులో మహాకాయులైన అసురులు ఉంటారు. వాళ్ళు ఆకలిని తీర్చుకోడానికి ప్రాణుల నీడని పట్టి బక్షిస్తుంటారు. అది దాటాక లోహితము అనే మధు సముద్ర తీరాన్ని చేరుకుంటారు. అక్కడ బూరుగు వృక్షములు చాలా సంఖ్యలో పెరిగి ఉంటాయి, అందుకని ఆ ద్వీపాన్ని శాల్మలీ ద్వీపం అంటారు. అక్కడున్న గిరి శిఖరాలకి మందేహులు అనే రాక్షసులు తలక్రిందులుగా వేలాడుతూ ఉంటారు. వాళ్ళు సూర్యుడు ఉదయించే సమయంలో, సూర్యుడు ఉదయించకుండా ఆయనని గ్రసించే ప్రయత్నం చేస్తుంటారు. అప్పుడు అక్కడున్న బ్రాహ్మణులు సంధ్యావందనం చేసి అర్ఘ్యం విడిచిపెడితే, ఆ జలముల యొక్క శక్తి చేత, సూర్యుడి శక్తి చేత ఆ మందేహులు అనే రాక్షసులు సముద్రంలో పడిపోతుంటారు. అప్పుడు వాళ్ళు మళ్ళి లేచి ఆ పర్వతానికి తలక్రిందులుగా వేలాడుతూ ఉంటారు. ఆ సముద్ర మధ్యలో ఋషభము అనే పెద్ద పర్వతం ఉంటుంది. ఆ పర్వతం మీద సుదర్శనము అనే పేరుగల గొప్ప సరోవరం వెండి కాంతులతో విరాజిల్లుతూ ఉంటుంది. దానిని దాటితే క్షీర సముద్రం వస్తుంది, దానిని కూడా దాటితే మధుర జలములు కలిగిన మహా సముద్రం వస్తుంది. అందులో ఔర్వుడు అనే మహాముని యొక్క కోపం బడబాగ్నిగా పుట్టి సముద్రంలో ప్రవేశించింది, దానికి హయముఖము అని పేరు.
దానిని దాటి ముందుకి ఒక 13 యోజనముల దూరం వెళితే ఒక బంగారు పర్వతం కనపడుతుంది. దానికి జాతరూప శిలము అని పేరు. దానిమీద సర్పాకృతి కలిగిన అనంతుడు నల్లటి బట్టలు ధరించి కూర్చొని ఉంటాడు, ఆయనే ఆదిశేషుడు. ఆయన పక్కనే తాటి చెట్టు ఆకారంలో ధ్వజం పెట్టబడి ఉంది. దాని పక్కనే ఒక వేదిక ఉంది, దానిని దేవతలు నిర్మించారు. మీరు ఆ ఆదిశేషుడిని దర్శించి ముందుకి వెళితే బంగారు పర్వతమైన ఉదయాద్రి కనపడుతుంది. ఆ పర్వతం 100 యోజనముల వరకూ విస్తరిస్తూ ఆకాశాన్ని తాకుతూ ఉంటుంది. దానిని దాటి వెళితే సౌమనసం అనే ధృడమైన బంగారు శిఖరము ఉంటుంది. అక్కడే బ్రహ్మగారు భూమండలానికి ద్వారాన్ని ఏర్పాటు చేశారు. అక్కడే సూర్యుడి మొదటి కిరణ ప్రసారం ప్రారంభమవుతుంది. అది దాటి వెళితే కటిక చీకటి. ఇక్కడిదాక అంగుళం విడిచిపెట్టకుండా సీతమ్మ జాడ వెతకండి. కాబట్టి తూర్పు దిక్కుకి వెళ్ళే వానరాలు సిద్ధం కండి ” అన్నాడు.
తరువాత సుగ్రీవుడు ” నీలుడు, హనుమంతుడు, జాంబవంతుడు, సుహోత, శరారి, శరగుల్ముడు, గజుడు, గవాక్షుడు, గవయుడు, మైందుడు, ద్వివిదుడు, గంధమాదనుడు, ఉల్కాముఖుడు, అనంగుడు, హుతాశరుడు మొదలైనవారందరికి నాయకుడిగా యువరాజైన అంగదుడు బయలుదేరి దక్షిణ దిక్కుకి వెళ్ళండి. మీతో పాటు కొన్ని లక్షల వానరాలని తీసుకువెళ్ళండి. వెయ్యి శిఖరములు కలిగిన వింధ్య పర్వతానికి వెళ్ళి ఆ పర్వతం అంతా వెతకండి. గోదావరి నది, కృష్ణవేణి నదిలలో వెతకండి, తరవాత వరదా నదిలో వెతకండి. తరువాత మేఖల దేశము, ఉత్కల దేశము, దశార్ణ నగరము, అబ్రవంతీ, అవంతీ నగరాలని వెతకండి.
నదీం గోదావరీం చైవ సర్వం ఏవ అనుపశ్యత |
తథైవ ఆంధ్రాన్ చ పుణ్డ్రాన్ చ చోలాన్ పాణ్డ్యాన్ కేరలాన్ ||
విదర్భ, ఋష్టిక, మాహి, కళింగ, కౌశిక, ఆంధ్ర, పుణ్డ్ర, చోళ, పాండ్య, కేరళ మొదలైన రాజ్యాలన్నీ వెతకండి. కావేరి నదిని దాటండి. మలయ పర్వత శిఖరం మీద అగస్త్యుడికి విశ్వకర్మ నిర్మించిన గృహం ఉంటుంది, ఆ ప్రాంతాన్ని వెతకండి. తరువాత మొసళ్ళతో ఉన్న తామ్రపర్ణీ నదిలో వెతకండి. ఆ తరువాత సముద్రం వస్తుంది, ఆ సముద్రంలోకి చొచ్చుకుపోయిన శిఖరములతో మహేంద్రగిరి పర్వతం కనపడుతుంది. ఆ సముద్రానికి 100 యోజనముల అవతల ఒక ద్వీపం ఉంది, దానిని కాంచనలంక అంటారు. ఆ లంకా పట్టణాన్ని రావణాసురుడనే పది తలల రాక్షసుడు పరిపాలిస్తున్నాడు. అక్కడ మీరు చాలా జాగ్రత్తగా వెతకాలి. ఆ తరువాత సముద్రాన్ని దాటితే పుష్పితము అనే పర్వతము కనపడుతుంది. అది దాటితే సూర్యవత్, వైద్యుతం అనే పర్వతాలు కనపడతాయి. ఆ పర్వతాల మీద ఉండే చెట్లకి కాచిన పళ్ళు చాలా బాగుంటాయి, అవి తినండి. ఆ తరువాత కుంజరం అనే పర్వతం కనపడుతుంది, దాని మీద విశ్వకర్మ అగస్త్యుడికి బ్రహ్మాండమైన భవనం నిర్మించాడు. అలా ముందుకి వెళితే భోగవతి అనే నగరం వస్తుంది, అందులో విషంతో కూడుకున్న పాములు ఉంటాయి. అక్కడే సర్పాలకి రాజైన వాసుకి ఉంటాడు. ఆ తరువాత ఎద్దు ఆకారంలో ఉన్న వృషభ పర్వతం కనబడుతుంది. దానిమీద గోశీర్షకము, పద్మకము, హరిశ్యామము అనే మూడు రకాల చందనం కనపడుతుంది. ఇవి కాకుండా అగ్నితుల్యము అనే చందనం కూడా ఉంటుంది, కాని మీరు పొరపాటున కూడా ఆ చందనాన్ని ముట్టుకోకండి. అక్కడ శైలూషుడు, గ్రామణి, శిక్షుడు, శకుడు, బభ్రువు అనే 5 గంధర్వ రాజులు పరిపాలన చేస్తుంటారు. మీరు వారికి నమస్కారం చేసి ముందుకి వెళితే, పృద్వికి చివరన పుణ్యం చేసుకున్నవారు స్వర్గానికి వెళ్ళేవారు కనపడతారు. అదికూడా దాటిపోతే పితృలోకం వస్తుంది. ఇక అది దాటితే యమధర్మరాజు యొక్క సామ్రాజ్యం ఉంటుంది, అక్కడ పాపులు ఉంటారు. మీరు అది దాటి వెళ్ళలేరు. దక్షిణ దిక్కున అక్కడిదాకా వెళ్ళి వెతికిరండి ” అన్నాడు.
తరువాత సుగ్రీవుడు సుషేణుడిని పిలిచి, ఆయనకి నమస్కరించి ” మీతో పాటు మరీచి మహర్షి యొక్క కుమారుడైన అర్చిష్మంతుడు, అర్చిర్మాల్యుడు మొదలైన వానరాలని తీసుకొని పడమర దిక్కుకి వెళ్ళండి. అప్పుడు మీరు సౌరాష్ట్ర, బాహ్లిక, చంద్ర, చిత్ర, కురు, పాంచాల, కోసల, అంగ, మగధ, అవంతి, గాంధార, కాంభోజ మొదలైన రాజ్యాలు, పట్టణాలు, గ్రామాలు వెతకండి. అలాగే మురచిపురం, జటాపురం కనపడతాయి, వాటిని కూడా వెతకండి. సిందు-సాగర సంగమ స్థానంలో, 100 శిఖరాలతో, పెద్ద చెట్లతో సోమగిరి అనే పర్వతం కనపడుతుంది. మీకు ఆ పర్వతం మీద రెక్కలున్న సింహాలు కనపడతాయి, అవి ఏనుగుల్ని ఎత్తుకుపోతుంటాయి, సముద్రంలోని తిమింగలాలని ఎత్తుకుపోతుంటాయి. అక్కడ సముద్రంలో పారియాత్రం అనే పర్వతం ఉంది, అది 100 యోజనాల విస్తీర్ణంలో ఉంటుంది. దానిమీద 24 కోట్ల గంధర్వులు ఉంటారు, వాళ్ళకి నమస్కారం చేసి ముందుకి వెళ్ళండి. అప్పుడు మీకు 100 యోజనాల ఎత్తయిన వజ్ర పర్వతం కనపడుతుంది. సముద్రంలో నాలుగోవంతు భాగంలో చక్రవంతం అనే పర్వతం ఉంటుంది, దానిమీద విశ్వకర్మ వెయ్యి అంచుల చక్రాన్ని నిర్మించాడు. ఆ చక్రాన్ని ఎవరూ తీసుకోకుండా చేస్తున్న హయగ్రీవుడు అనే రాక్షసుడిని శ్రీ మహావిష్ణువు చంపి ఆ చక్రాన్ని తీసుకున్నారు, అలాగే పంచజనుడు అనే మరొక రాక్షసుడిని చంపి శంఖాన్ని తీసుకున్నారు.